Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ప్రాంతీయ పార్టీలే ఆత్మగౌరవ బావుటాలు

-తెలంగాణ మనోభావాలను దెబ్బతీస్తే సహించం.. తెలంగాణ ఎవరి మెహర్బానీ వల్ల రాలేదు
-మోదీ, షా తమ వైఖరి మార్చుకోవాలి.. బీజేపీది నిష్క్రియాపరత్వం.. అసమర్థ పాలన..
-సమాఖ్యస్ఫూర్తికి గండికొడుతున్నారు.. రాష్ర్టాల హక్కులను కబళిస్తున్నారు
-దేశంలో సర్వ అక్రమాలకు బ్రీడింగ్ సెంటర్ కాంగ్రెస్: సీఎం కేసీఆర్
-ఆర్థికమాంద్యం వల్ల కేంద్రం వాటా తగ్గుతున్నది
-కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుతో రూ.1400 కోట్లు తగ్గుదల
-మాంద్యం ఉన్నా సంక్షేమం బాట వీడేదిలేదు
-రుణమాఫీని నేరుగా రైతులకే ఇస్తాం
-సర్పంచ్‌ల జాయింట్ చెక్‌పవర్ తొలగించబోము
-25న కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలు
-ఒకేసారి 18 వేల పోలీసు పోస్టుల భర్తీ
-దేశమే అబ్బురపడేవిధంగా రెవెన్యూచట్టాన్ని తీసుకొస్తాం
-వీఆర్వోలను తొలగిస్తామని చెప్పలేదు
-మైనార్టీ రిజర్వేషన్లపై అవసరమైతే మరోసారి తీర్మానం
-హైదరాబాద్ పాతబస్తీలో త్వరలో మెట్రో పనులు ప్రారంభం
-అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్

CM KCR Powerful Speech In Telangana Assembly

దేశంలో ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడగలిగేవి ఆయా రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీలేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ విషయంలో తమ వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు.. తెలంగాణ ఎవరి మెహర్బానీ వల్ల రాలేదని.. అరవై ఏండ్లు కొట్లాడి తెచ్చుకొన్నామని తెలిపారు. దేశంలో సర్వ అక్రమాలకు బ్రీడింగ్ సెంటర్ కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టంచేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాల హక్కులను కేంద్ర ప్రభుత్వాలు కబళిస్తున్నాయని పేర్కొన్నారు. ఆదివారం శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరిగిన సందర్భంగా సీఎం కేసీఆర్ అనేక అంశాలపై సవివరంగా మాట్లాడారు. దేశంలో ఆర్థికమాంద్యం ఉండటం వల్ల రాష్ర్టానికి వచ్చే వాటా తగ్గుతుందని, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు ప్రభావం కూడా పడుతుందని పేర్కొన్నారు. అయినప్పటికీ సంక్షేమాన్ని విడిచిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. రుణమాఫీ మొత్తా న్ని రైతులకు నేరుగా అందజేస్తామన్నారు. దేశమే అబ్బురపడే విధంగా కొత్త రెవెన్యూచట్టాన్ని తీసుకొస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

తెలంగాణను అపహాస్యం చేస్తే ఖబడ్దార్
తెలంగాణను అపహాస్యం చేసేలా కాంగ్రెస్, బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తుండటం పట్ల సీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. తెలంగాణ ఇచ్చి తప్పు చేశామేమో అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి అంటడు, ఎక్కువ తక్కువ మాట్లాడితే తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలుపుతమని కేంద్ర మాజీమంత్రి బల్‌రాం నాయక్ అంటడు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవిష్యత్‌లో తెలంగాణను ఆంధ్రలో కలిపే అవకాశమున్నదని మరో కేంద్ర మాజీ మంత్రి అంటడు. వీళ్లు (రాష్ట్ర కాంగ్రెస్ నేతలు) దానిపై ఒక్క మాట మాట్లాడరు. గజ్జున వణుకుతరు. ఇక బడాభాయ్.. బడాభాయ్.. చోటా భాయ్ సుభానల్లా అన్నట్లు వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు. వీళ్లకు ఏతులెక్కువ చేతలు తక్కువ. తెలంగాణ పట్ల వాళ్లు తమ వైఖరిని మార్చుకోవాలని సభాముఖంగా కోరుతున్నా ను. తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని మోదీ అంటరు. తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను ప్రధానిని కోరుతున్న.. ఈ మాటలు బంద్ చేసుకోవాలె. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ వచ్చినరోజును చీకటిరోజు అని అంటడు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా మాట్లాడితే బాగుండదు. నేను ఆయనకు సభాముఖంగా చెప్తున్నా.. change your attitude we are not going tolerate these comments. this is matter of self respect (మీ వైఖరిని మార్చుకోండి.. ఈ వ్యాఖ్యలను సహించబోం. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం). అరవై ఏండ్లు కొట్లాడి తెలంగాణను తెచ్చుకొన్నం. ఎవరి మెహర్బానీ కాదు అని సీఎం స్పష్టంచేశారు.

ప్రాంతీయపార్టీలే ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతాయి
దేశంలో ప్రాంతీయపార్టీలే ఆయా రాష్ర్టాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడగలుగుతాయని సీఎం స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నులను పెంచినప్పుడు కాంగ్రెస్ నేతలు పల్లెత్తు మాట్లాడలేదని, తెలంగాణ రాష్ట్రమే పన్నులను తగ్గించాలని ఒత్తిడి తెచ్చి పోరాటం ద్వారా తగ్గించగలిగామని చెప్పా రు. ఈ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కదిలించగలిగామని పేర్కొన్నారు. ఇప్పటికీ గ్రానైట్, నాపరాళ్లు, బీడీ ఆకులపై తగ్గించాలని ఒత్తిడి తెస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ పార్టీలు ప్రశ్నించవని, వాళ్లు ఇక్కడ (రాష్ట్రంలో) మాట్లాడరని, వారికి గొంతు లేదని చెప్పారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేవి ప్రాంతీయ పార్టీలేనని గుర్తుంచుకోవాలన్నారు. ప్రాంతీయ పార్టీలే కేంద్రాన్ని ప్రశ్నించగలుగుతాయని, సమర్థపాలనను అందించగలుగుతాయని చెప్పారు. కొందరు కొన్ని సీట్లు గెలవగానే హిమాలయాలకు పోయి ఆకుపసరు తాగినట్లు హంగామాచేస్తున్నారని సీఎం ఎద్దేవాచేశారు.

కొత్తగా మతం పుచ్చుకున్నవారికే నామాలెక్కువ అన్నట్లు తయారైంది బీజేపీ పరిస్థితి. తప్పిదారి బీజేపీ వస్తే ఏమవుతది.. ఆరోగ్యశ్రీ ఆగమైతది. ఆయుష్మాన్‌భవ వస్తది. రైతుబంధు పోయి కిసాన్ సమ్మాన్ వస్తది. రైతుబంధు పథకం కింద మా ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు ఇస్తుంటే.. కేంద్రం ఎన్ని ఎకరాలున్నా ఆరువేల రూపాయలే ఇస్తున్నది. బీజేపీ వస్తే రైతు బీమా పోతుంది. ప్రజలకు ఒరిగేదేముంది? బీజేపీ రాష్ర్టానికి చేసిందేమీలేదు. శుష్కప్రియాలు, శూన్యహస్తాలు తప్ప. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు పైసా ఇవ్వలేదు. జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని కోరాం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావాలని కోరాం. కానీ ఇవ్వలేదు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే రూ.450 కోట్లను కూడా ఒక సంవత్సరం ఎగవేసింది. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. మిషన్ కాకతీయ, భగీరథ.. మంచి కార్యక్రమాలని.. వాటికి రూ.24వేల కోట్లివ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా చిల్లిగవ్వ ఇవ్వలేదు అని సీఎం తీవ్రంగా విమర్శించారు.

ప్రాజెక్టులపై అడ్డగోలు వాదన
కాంగ్రెస్ నాయకులకు శాస్త్రీయ దృక్పథంలేదని. భౌగోళిక అంశాలు, నీటి లభ్యతపై అవగాహనలేదని సీఎం కేసీఆర్ ఎద్దేవాచేశారు. నీరులేని చోట ప్రాజెక్టులను కట్టాలంటారని తెలిపారు. వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి జూరాల వద్ద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పెట్టాలంటారు. అసలు జూరాలలో ఉండేది 6 టీఎంసీలే. ప్రతిపాదిత నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ఏమికావాలి. నీటి లభ్యత లేని జూరాల కాడ పెట్టమనడం సబ బా? తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత 40 నుంచి 44 టీఎంసీలు లేకపోయినా అక్కడ ప్రాజెక్టు కట్టాలంటారు. 284 టీఎంసీల నీరున్న మేడిగడ్డ దగ్గర వద్దంటారు. సెంట్రల్ వాటర్ కమిషన్ సిఫారసు మేరకే మేం రీడిజైన్ చేశాం.. ప్రాజెక్టులపై అడ్డగోలు వాదనలు చేస్తారు. అప్పులుచేసి కడుతున్నారంటారు. కాంగ్రెస్ హయాంలో నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్‌లను అప్పులుచేసే కట్టారు. అప్పుడు చేసిన రూ.3వేల కోట్లు అలాగే ఉన్నాయి. అప్పట్లో బ్యాంకులు, ఆర్థికసంస్థలు ఉండేవి కావు. కేంద్రమే అప్పు ఇచ్చేది అని సీఎం అన్నారు.

ప్రమాదంలో ఉన్నది కాంగ్రెస్ పార్టే..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడుతున్నదంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడటంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ప్రమాదంలో పడింది ప్రజలు.. ప్రభుత్వం కాదని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే ప్రమాదంలో పడిందని చురక అంటించారు. కాంగ్రెస్ పార్టీని చూస్తే జాలేస్తున్నదని.. వారికి ఓ వ్యూహం అంటూ ఉండదని.. కసరత్తు కూ డా చేసి రారంటూ ఎద్దేవాచేశారు. పోయిన టర్మ్‌లో కూడా ఇదే మాట్లాడారని.. కాకపోతే అప్పుడు జానారెడ్డి.. ఇప్పుడు భట్టి.. అంతే తేడా అన్నారు. అప్పులు తెచ్చామని బాజాప్తా తామే కుండబద్దలు కొట్టి చెప్పామని.. అధికారికంగానే అప్పులు తెచ్చామని.. అవసరమైతే ఇంకా అప్పులు తెస్తామని, అయితే తెచ్చిన అప్పులు దేనిమీద ఖర్చుచేశామన్నదే ప్రధానమని సీఎం తెలిపారు.

ఇది సామాన్యుడి నాడి
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సామాన్య ప్రజలెవరిని అడిగినా గత కాంగ్రెస్ పాలనకంటే టీఆర్‌ఎస్ పాలన బాగున్నదంటున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. నిరుపేదలు, రైతులు.. అన్ని వర్గాలవారు సంతృప్తిగా ఉన్నారన్నారు. గత టర్మ్‌లో కాంగ్రెస్‌కు 21 సీట్లుంటే.. ఇప్పుడు 19 మాత్రమే వచ్చాయని.. బీజేపీ ఐదు నుంచి ఒకటికి చేరుకున్నదని.. టీఆర్‌ఎస్ బలం మాత్రం 63 నుంచి 88 సీట్లకు పెరిగిందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో పార్టీల పనితీరును బట్టి ప్రజలు తీర్పునిస్తరని.. ఆరేడు నెలల కిందట ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ గౌరవించకుండా కాదనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు గెలిచామని, స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని పేర్కొన్నారు.

హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
కాంగ్రెస్‌పార్టీ మారి బీజేపీ వచ్చినప్పుడు పథకాల పేర్లు మారడం తప్ప పరిస్థితిలో మార్పులేదని సీఎం అన్నారు. కాంగ్రెస్ గరీబీ హఠావో అంటే బీజేపీ బేటీ పడావ్.. బేటీ బచావ్ అన్న నినాదాన్ని తెరమీదకు తెచ్చిందని.. కాంగ్రెస్, బీజేపీ కేంద్రంలో గుత్త పెత్తనంతో రాజకీయాలను చెలాయిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. మన పక్కనే ఉన్న చైనా అభివృద్ధిలో ఎక్కడుంది. మనమెక్కడున్నాం. జపాన్‌లో నాగసాకి, హిరోషిమాలో అణుబాంబులు పడినా వేగంగా అభివృద్ధి చెందింది. అర్ధశతాబ్దంపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ రాష్ర్టాల హక్కులను హరించింది. విద్య, వైద్యం, అడవులు, పర్యావరణం, పట్టణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమంవంటి చాలా అంశాలను కాంకరెంట్ జాబితాలో చేర్చి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛలేకుండా చేస్తున్నాయి. 1974లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాల హక్కును కబళించింది. అధికారంలోకి వచ్చిన బీజేపీ అంతకంటే ఎక్కువ అధికారాలను కేంద్రీకృతం చేస్తున్నది. ఎంతో వైవిధ్యం ఉన్న భారతదేశంలో అన్నింటికి ఒకేవిధానం వర్తింపచేయడం సరికాదు అని సీఎం పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి విధానాలను అమలుపరుచడానికి రాష్ర్టాలకు స్వేచ్ఛ ఉండాలని స్పష్టంచేశారు. రిజర్వేషన్ల అంశం కూడా రాష్ర్టాల పరిధిలో ఉండాలన్నారు. ఎస్సీ వర్గీకరణ, ముస్లిం మైనార్టీలు, గిరిజనుల రిజర్వేషన్ శాతాలను పెంచి తీర్మానం చేసి పంపిస్తే దానికి కేంద్రం అడ్డుపడుతున్నదని ఇది సరికాదని అన్నారు.

త్యాగాల పునాదులపై పుట్టిన పార్టీ మాది
తాము ప్రజలను నమ్ముకొని ధైర్యంతో ముందుకుపోతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆరుమాసాలుండగానే ప్రభుత్వాన్ని రద్దుచేసుకొని ఎన్నికలకు వెళ్లామని.. తాము ప్రజలకు తాయిలాలిచ్చి గెలువాలనుకోలేదని, నాలుగున్నరేండ్ల తమ ఆచరణను నమ్ముకొని ఎన్నికలకు వెళ్లామని తెలిపారు. పక్క రాష్ట్రంలో దుర్మార్గంగా పసుపు కుంకుమ అంటూ తాయిలాలిచ్చారని.. తాము మాత్రం అలాంటి పిచ్చి ప్రయత్నాలేవీ చేయలేదని స్పష్టంచేశారు. ఎన్నికల సమయంలో తాను ఏ ఒక్క జిల్లా కలెక్టర్, ఎస్పీతో కానీ, డీజీపీతో కానీ మాట్లాడిన సందర్భం లేదన్నారు. ఒకే ఒక సందర్భంలో డీజీపీకి ఫోన్‌చేసి సీఈవో రజత్‌కుమార్ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని చెప్పానని సీఎం తెలిపారు. ప్రగతిభవన్‌లో తన నివాస సముదాయం నుంచి పక్కనే ఉన్న సీఎంవో కార్యాలయానికి కూడా పోలేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి స్పష్టత, ధైర్యం ఉన్నదని.. అసలు తమ పార్టీ పుట్టిందే సాహసం, త్యాగం పునాదుల మీద అని సీఎం చెప్పారు. పార్టీ వ్యవస్థాపక దినం రోజునే పదవులను త్యజించామని, ఒకటా.. రెండా.. కేంద్రమంత్రి, డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు.. ఇలా అంతులేని రాజీనామాలు చేశామని గుర్తుచేశారు. దేశ చరిత్రలో ఇన్ని రాజీనామాలు ఏ పార్టీ వాళ్లు కూడా చేయలేదని సీఎం స్పష్టంచేశారు. నేను లేకపోతే జెండా ఎగురవేయకపోతే చరిత్ర చెప్పేవారెవరు అని ప్రశ్నించారు.

ఏదీ దాచేదిలేదు
దేశవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఉన్నదని అందరికీ తెలిసినా.. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు తెలియకపోవడం బాధాకరమన్నారు. అనేక రాష్ర్టాల కంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగున్నదని స్పష్టంచేశారు. కేంద్రం కార్పొరేట్ పన్నును దాదాపు పదిశాతం తగ్గించినందువల్ల కేంద్రానికే కాకుండా రాష్ర్టాలకూ ఆదాయం తగ్గుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణకు రూ.1400 కోట్ల మేర ఆదాయం తగ్గుతుందని తెలిపారు. ఉన్నదాంట్లోనే అన్నీ సర్దుబాటుచేస్తామని సీఎం వెల్లడించారు. బడ్జెట్‌లో రూ.పదివేల కోట్లను భూముల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంగా చూపామన్న సీఎం.. ఇందుకు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసులు గెలుస్తున్నామన్నారు. ఈ క్రమంలో కోకాపేటలో వందెకరాలు, పుప్పాలగూడలో మరో 50 ఎకరాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. వీటిని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌గా బడ్జెట్‌లో చూపామని తెలిపారు. ఆర్థికమాంద్యం ప్రభావంతోపాటు కేంద్రం నుంచి వచ్చే వాటాలో కొంత తగ్గే అవకాశం ఉన్నందున ఏయే శాఖలో తక్కువ పడుతాయో అక్కడ రూ.500-1000 కోట్లు సర్దుబాటుచేయాలని చూస్తున్నామని సీఎం వివరించారు. రాబడిపై విలువ ఆధారపడి ఉంటుందని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కలిసిరావాలని సీఎల్పీ నేత భట్టిని కోరారు. దేశంలో ఆర్థిక మాంద్యానికి కూడా టీఆర్‌ఎస్ కారణమన్నట్టు వ్యవహరించడం సరికాదన్నారు. సబ్‌ప్లాన్ నిధులు డైవర్షన్ చేశామనడం అవాస్తవమని, పూర్తివివరాలు ఉంటే తనకు నేరుగా పంపిస్తే విచారించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు.

కేంద్రం ఇవ్వకున్నా జీతాలు చెల్లించినం
కేంద్రం నుంచి నిధులు రావడం లేదనే విషయాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సమగ్రంగా వివరించారు. ఓ రోజున కేంద్రం నుంచి తెల్లవారంగానే లేఖ వచ్చింది. రాష్ట్రంనుంచి పన్నుల వాటా వచ్చినప్పుడు వాటిని కేంద్ర పథకాలు, కేంద్ర వాటాగా విడుదల చేస్తామని నిర్ణయం తీసుకుంటూ అప్పటి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నుంచి లేఖ అందింది. ఆ సమయంలో నేను కూడా ఢిల్లీలోనే ఉన్న. అప్పుడు పంజాబ్ సీఎం కూడా నాతోని చెప్పిండు. కేంద్ర నిధులు రాకపోవడంతో పంజాబ్‌లో ఉద్యోగుల వేతనాలు ఆలస్యం చేస్తున్నమని. ప్రతినెలా ఒకటోతేదీ వరకు కేంద్రం నుంచి మనకు గతంలో వాటా నిధులు వచ్చేవి. వాటితో ప్రభుత్వ ఉద్యోగులకు 1 నుంచి 3వ తేదీలోగా వేతనాలను ఇచ్చేవాళ్లం. కానీ కేంద్రం నుంచి నిధులు రాకున్నా.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో వేతనాలు ఆపలేదు. రాష్ట్రంలో అక్కడక్కడ నుంచి నిధులను జమచేసి వేతనాలు, పెన్షన్లు ఇచ్చామే తప్ప ఆపలేదు అని స్పష్టంచేశారు.

ఏ రోటికాడ ఆ పాట
కాంగ్రెస్, బీజేపీ ఏ రోటికాడ ఆ పాట పాడుతాయని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని కలుపుకొన్నదని, కండువా కప్పుకొన్న సాయంత్రమే రాజ్యసభ సభ్యులు ప్రధానమంత్రిని కలిశారని గుర్తుచేశారు. గోవాలో పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విలీనంచేసుకున్నారని, నిన్న రాజస్థాన్‌లో బీఎస్పీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉంటే వారినందరినీ కాంగ్రెస్‌వారు కలిపేసుకొన్నారని అంటూ ఇది రాజ్యాంగబద్ధమా అని ప్రశ్నించారు. రాజ్యసభ.. గోవా.. రాజస్థాన్‌లకు ఒక రాజ్యాంగం.. తెలంగాణకు మరో రాజ్యాంగమా? అని అన్నారు. వాస్తవంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతామని వస్తే తాము చేర్చుకోలేదని, రాజ్యాంగబద్ధంగా విలీనం కావాలని సూచించామని చెప్పారు.

కొత్త చట్టాలు తీసుకొస్తం
ప్రజాసంక్షేమం కోసం కొత్త చట్టాలను తీసుకొస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇప్పటికే కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమలుచేస్తున్నామని, కొత్త మున్సిపల్ చట్టాన్ని అమలుచేస్తామని తెలిపారు. కొత్త చట్టాల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కచ్చితంగా ఉంటుందని దీనిపై రాద్ధాంతం అవసరంలేదన్నారు. సీఎం, పీఎం, మంత్రులు, ప్రధానికి కూడా చెక్‌పవర్ ఉండదని.. సర్పంచ్‌లకు మాత్రం ఉంటుందని తెలిపారు. గ్రామాలకు వెళ్లే ప్రతిపైసా సక్రమంగా ఖర్చుకావాలంటే.. జాయింట్ చెక్‌పవర్ అవసరమని చెప్పారు. రాష్ట్రంలో 90 శాతం మంది సర్పంచ్‌లు టీఆర్‌ఎస్ పార్టీవారే ఉన్నారని.. జాయింట్ చెక్‌పవర్ తొలగించబోమని వారికి మరోసారి చెప్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పంచాయతీల్లో అమలవుతున్న 30 రోజుల ప్రణాళికలో ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భాగస్వాములు కావాలని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఈ పల్లె ప్రణాళికలో పాల్గొనాలని లేకుంటే ప్రజలు సహించబోరన్నారు.

సర్పంచ్‌లు తప్పుచేస్తే తొలగించే అధికారం మంత్రికి లేకుండా కొత్త చట్టం రూపొందించాం. స్టే ఇచ్చే అధికారం కూడా ఉండదు. అంత నిక్కచ్చిగా పనిచేస్తున్నం. నిధుల విషయంలో కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయో.. రాష్ట్ర ప్రభుత్వం అంతేమొత్తంలో ఇస్తుంది. గతంలో ఎప్పుడైనా ఇలా ఇచ్చారా? నిధులు వినియోగించకుంటే.. ఆర్థిక సంవత్సరం తర్వాత ల్యాప్స్ చేసేవారు. ఇప్పుడు అది ఉండదు. ఒకవేళ ఈ సంవత్సరంలో వినియోగించుకోకుంటే.. వచ్చే ఏడాది నిధుల్లో కలుపుతం. కొద్దిరోజుల్లో 15వ ఆర్థికసంఘం నిధులు వస్తయి. వాటికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. ఆర్థికసంఘం ఆరునెలలకోసారి నిధులు ఇస్తుంది. మేం మాత్రం ప్రతి నెలా పంచాయతీలకు నిధులిస్తాం. 500 జనాభా ఉన్న పంచాయతీకి రూ.8లక్షలు తక్కువ కాకుండా ఇస్తం అని తెలిపారు.

మేం కొట్లాడుతుంటే ఒక్కరైనా వచ్చారా
తెలంగాణ కోసం పిడికెడు మందితో 15 ఏండ్ల కింద ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అవహేళన, అపహాస్యంచేశారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అయినా తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమబాట వీడలేదన్నారు. 15 ఏండ్లు చకోర పక్షుల్లా తిరిగి ప్రజలను మేలుకొల్పామని, రాజీనామాలు చేసి తెలంగాణ గొంతును వినిపించామని, ఆ సమయంలో సమైక్యవాదుల చంకలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోట్ల రూపాయలతో టీఆర్‌ఎస్ నేతలను ఓడించడానికి కుట్రలు చేసినా అన్నింటినీ సహించామన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తే నాటి ప్రభుత్వాలను నిలదీశామని, కానీ కాంగ్రెస్ నేతలు నవ్వుతూ ఎగతాళి చేశారన్నారు. పోరాడి తెలంగాణ సాధించుకున్నామే తప్ప.. ఎవరి దయాదాక్షిణ్యాలతో రాష్ట్రం రాలేదని చెప్పారు. తెలంగాణను ఎలా అభివృద్ది చేయాలో ప్రత్యేకమైన విజన్ ఉన్నదని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టంచేశారు.

రుణమాఫీ మొత్తం నేరుగా రైతులకే
తాము ఇచ్చిన మాటమేరకు రుణమాఫీ చేస్తామని.. విడుతలవారీగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులంతా తమ రుణాలను రెన్యువల్‌చేసుకోవాలని.. రుణమాఫీని రైతులకు నేరుగా ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి రైతు లెక్క ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నదని.. రుణాలకు సంబంధించి త్వరలోనే ప్రతి రైతుకు లేఖ ద్వారా వివరిస్తామని తెలిపారు. విపక్షాల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని, రుణమాఫీ కోసం బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు కేటాయించామని వివరించారు.

మాదంతా అధికారికమే
హెచ్‌ఎండీఏలో సాదాబైనామాలను అమలుచేయొద్దని అనధికారికంగా చెప్పినట్లు కాంగ్రెస్ విమర్శించిందని, కానీ తాము అధికారికంగానే చెప్పామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సాదాబైనామాలను అడ్డుపెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ వాటిని పరిశీలించిన తర్వాత నిజమైన అర్హులు ఉంటే చేయాలని అధికారికంగానే చెప్పినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు విజ్ఞప్తి చేసిన దరఖాస్తులను పరిశీలించాలని చెప్పామన్నారు. తెలంగాణ కోసం ఎవరేంచేశారో అందరికీ తెలుసని, అందుకే కాంగ్రెస్‌కు నూకలు పుడతలేవని మండిపడ్డారు.

సర్వ అక్రమాలకు బ్రీడింగ్ సెంటర్ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ దుష్ట, దుర్మార్గ, అసమర్థ పాలన వల్ల దేశం, రాష్ట్రం అధోగతి పాలైందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో అధికారం చెలాయించిన.. చెలాయిస్తున్న కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని తెలిపారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాల హక్కులను కబళించేలా కేంద్ర ప్రభుత్వం గుత్తాధిపత్య వైఖరిని అవలంబిస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, అసమర్థ విధానాల వల్లనే దేశంలో ఆర్థికమాంద్యం వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. సుదీర్ఘకాలంపాటు దేశాన్ని, రాష్ర్టాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ సర్వ అనర్థాలకు మూలంగా మారిందని చెప్పారు. సర్వ దుర్మార్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉత్పత్తి కేంద్రాలు (బ్రీడింగ్ సెంటర్స్) గా మారాయి. 51 ఏండ్లపాటు రాష్ర్టాన్ని.. 54 ఏండ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అభివృద్ధిని విస్మరించింది. కాంగ్రెస్ పార్టీ అసమర్థత, అక్రమాల వల్ల ప్రగతి చతికిలపడింది.

అస్తవ్యస్త విధానాల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతుల దుస్థితికి, వృత్తి పనులు కుంటుపడటానికి, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు ఎవరు కారణం? కాంగ్రెస్ కాదా? రైతుల ఆత్మహత్యలు, దళితుల నిరాశకు, మైనార్టీల నిస్పృహకు, బీసీల అసంతృప్తికి కారణం కాంగ్రెస్ పార్టీ కాకుం డా ఇంకెవరు? అడవులను కొల్లగొట్టింది, స్మగ్లర్లను సృష్టించింది కాంగ్రెస్ కాదా? భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా, గ్యాంగ్‌స్టర్‌లను, మానవ అక్రమరవాణాను కాంగ్రెస్ ప్రోత్సహించింది. నక్సలైట్లు అందుకే పుట్టుకొచ్చారు. ఇది వాస్తవ చరిత్ర. టీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రంలో శాంతి నెలకొంది. మతకలహాలు లేవు, కర్ఫ్యూలు లేవు ఇది చూసి కాంగ్రెస్ వాళ్లకు కండ్లు మండుతున్నయి. ఇప్పటికైనా కుట్రలు ఆపుతున్నరా అంటే అదీలేదు. కింద మంట పెడుతరు.. పైన చేయి పెడుతరు. అభివృద్ధి, అప్పుల గురించి కాంగ్రెస్ వాళ్లా మాట్లాడేది? అని సీఎం వ్యాఖ్యానించారు.

మైనార్టీ రిజర్వేషన్లపై అవసరమైతే మళ్లీ తీర్మానం
ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై గతంలోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంచేశామని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపగా నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టిందన్నారు. ఇదే కాకుండా అనేక అంశాలను కేంద్రం పెండింగ్‌లో ఉంచిందని.. వాస్తవంగా కేంద్రం ఇలా చేయకూడదని.. కానీ, యూపీఏ లెక్కనే బీజేపీ సర్కారు కూడా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. అవసరమైతే మైనార్టీ రిజర్వేషన్లపై మరోసారి అసెంబ్లీలో తీర్మానంచేసి.. అఖిలపక్ష ప్రతినిధులతో ప్రధానిని కలుద్దామని అన్నారు. రిజర్వేషన్ల అంశాన్ని వదిలేదిలేదని స్పష్టంచేశారు. పాతనగరంలో మెట్రోరైలు పనుల్ని త్వరలోనే ప్రారంభిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

మాంద్యం ఉన్నా సంక్షేమాన్ని ఆపేదిలేదు
కాంగ్రెస్ పార్టీ 1979లో మొదలుపెట్టిన ఎస్సెల్బీసీ ప్రాజెక్టు 40 ఏండ్లుగా ఇంకా గెంటుతూనే ఉన్నదని, కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఎందుకు పూర్తిచేయలేదని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు ఎస్సెల్బీసీ అనేది ఒక జోక్‌లా మారిందన్నారు. తాము అట్ల చేయడంలేదని, కాళేశ్వరం ప్రాజెక్టును రెండున్నర సంవత్సరాల్లో పూర్తిచేసి ప్రారంభించామని.. దీనిద్వారా 40-45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన పెట్టుబడి కేవలం రెండు పంటల్లోనే వెళ్లిపోతుందన్నారు. ఆర్థికమాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపేదిలేదని, అదేసమయంలో సంక్షేమాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని పునరుద్ఘాటించారు.

25 న కానిస్టేబుళ్ల ఫలితాలు
ఈ నెల 25న పోలీస్ కానిస్టేబుళ్ల ఫలితాలు విడుదలచేసే అవకాశాలున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏనాడూ జరుగని విధంగా ఒకేసారి 18వేల మంది పోలీసులను రిక్రూట్ చేస్తున్నామని పేర్కొన్నారు. వీరిలో 16వేల మంది కానిస్టేబుళ్లున్నారన్నారు. ఎంపికైన అభ్యర్థుల శిక్షణకు అవసరమైన స్థలం అందుబాటులో లేదని.. ఇక్కడ 12వేల మందికి శిక్షణ ఇచ్చే సౌకర్యం ఉన్నదని.. మిగిలిన 4వేల మందికి ఏపీలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం ఏపీ సీఎం జగన్‌కు విజ్ఞప్తిచేశామని.. ఆయన దానికి అంగీకరించారని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.