Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నిజాంసాగర్‌కు ప్రాణహిత జలాలు..

-తరలింపునకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నం -నిజామాబాద్ జిల్లా సమీక్షలో మంత్రి హరీశ్‌రావు వెల్లడి -రోడ్డు వంతెనల దగ్గర కచ్చితంగా చెక్‌డ్యాంలు నిర్మించాలని ఆదేశం -మిషన్ కాకతీయతో ఖమ్మం జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో వరి నాట్లు -పాలమూరు పథకంలో భూసేకరణ వేగంపై అధికారులకు అభినందన -ఒకేరోజు మూడు జిల్లాల ప్రాజెక్టులపై నీటిపారుదల మంత్రి సమీక్ష

నిజాంసాగర్‌కు ప్రాణహిత జలాల్ని తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు. ప్రస్తుతం లైడార్ సర్వే జరుగుతున్నదని.. ఆ తర్వాత జరిగే రీ డిజైనింగ్‌ను ముఖ్యమంత్రి ఖరారు చేస్తారని అధికారులతో అన్నట్లు తెలిసింది. సోమవారం జలసౌధలో మంత్రి హరీశ్‌రావు ఒకేరోజు మూడు జిల్లాల సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌తో కలిసి తొలుత నిజామాబాద్ జిల్లా సమీక్ష నిర్వహించారు.

Irrigation-Minister-T-Harish-Rao-held-a-meeting-with-officials

ఇందులో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, రవీందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ప్రశాంత్‌రెడ్డి, ఎంఏ షకీల్, హన్మంతు షిండే, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీ గౌడ్ పాల్గొన్నారు. నిజాంసాగర్‌కు గత వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఆధునీకరణ పనులు చేపట్టిందని హరీశ్‌రావు చెప్పారు. రూ.742 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో ఇప్పటివరకు రూ.490 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. అయితే ప్రతి ఏటా ఖరీఫ్ తర్వాత ఒక నెల, రబీ తర్వాత ఒకటిన్నర నెల సమయంలో పనులు నిర్వహించేవారు. అయితే ఈ సీజన్‌లో వర్షాభావం కారణంగా సమయం ఎక్కువ లభించింది.

దీంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్‌లోగా ఆధునీకరణ పూర్తి కావాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతి ఎకరాకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ స్థితిగతులతో పాటు పోచారం ప్రాజెక్టు, రామడుగు, కౌలాస్ నాలా, లెండి ప్రాజెక్టు, గుత్పా, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలతో చౌట్‌పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకాలపై మంత్రి సమీక్షించారు.

లెండి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రతో ఉన్న ఇబ్బందులపై ఆ రాష్ట్రంతో సంప్రదింపులు జరపాలని మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కాలువలపై ఉన్న అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై రాజీలేకుండా వ్యవహరించాలని మంత్రులు అధికారులకు స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు అవసరమైతే రెవెన్యూ శాఖతో కలిసి సంయుక్తంగా సర్వే నిర్వహించి, 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పారు. అనంతరం కార్యాచరణ రూపొందిద్దామని అన్నారు.

ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి పని చేయండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌తో కలిసి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలతో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో సాగుతున్న బ్యారేజీలు, బ్రిడ్జీల నిర్మాణాల్లో చెక్‌డ్యాంలను కచ్చితంగా నిర్మించాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలోని మిషన్ కాకతీయ పనులపైనా సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతమైందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లాలో వర్షాలు సరిగా పడితే పరిస్థితి వేరే విధంగా ఉండేదని, అయినా ఇంజినీరింగ్ అధికారులు మంచిగా పని చేశారని ఆయన అభినందించారు. కాగా రెండో విడత మిషన్ కాకతీయకు సిద్ధం కావాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు ఈ పనులను నిత్యం సమీక్షించాలని కోరారు. అనంతరం నియోజకవర్గాల వారీగా మిషన్ కాకతీయ పనులను సమీక్షించారు. జిల్లాలో మినీ ట్యాంక్‌బండ్ ప్రతిపాదనల్ని యుద్ధప్రాతిపదికన పంపించాలని మంత్రి ఆదేశించారు. ప్రతి ఊరిలో ఒక్క చెరువును ఎంపిక చేసి బతుకమ్మ మెట్లు నిర్మించాలని మంత్రి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయాల్లో అధికారులు వారం రోజులకు మించి ఏ ఫైలును ఉంచుకోవద్దని, ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని చెప్పారు.

తుడి డిజైన్‌పై ముఖ్యమంత్రి నిర్ణయం ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌రావుతో పాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సమీక్షలో పాల్గొన్నారు. ఎన్‌ఎస్‌పీ పీడీ మల్సూర్, ఐడీసీ ఎండీ శ్రీదేవి సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో కీలకమైన దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకాల రీ డిజైనింగ్‌పై చర్చించారు. అయితే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తుడి డిజైన్‌పై ఆయనే నిర్ణయం తీసుకుంటారని మంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే అటవీశాఖకు సంబంధించి 1,640 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని, తొలుత వారి నుంచి క్లియరెన్స్ తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. అదేవిధంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణపై ప్యాకేజీలవారీగా సమావేశంలో సమీక్షించారు. ఎన్‌ఎస్‌పీలో అవసరమైన లిఫ్టుల కోసం టెండర్లు పిలవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వచ్చే సీజన్ వరకు వాటిని పూర్తి చేయాలన్నారు. మిషన్ కాకతీయ వల్ల జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో రైతులు నాట్లు వేసుకున్నారని అధికారులు చెప్పడంతో మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు.

పాలమూరు లిఫ్టు పథకం భూసేకరణ భేష్ మంత్రి హరీశ్‌రావు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులపై జిల్లా కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కావాల్సిన భూమిని సేకరించే ప్రక్రియను వేగంగా నిర్వహిస్తున్నారని అంటూ కలెక్టర్, సంబంధిత సిబ్బందిని మంత్రి అభినందించారు. కల్వకుర్తి ప్రాజెక్టు స్టేజ్-2,3 పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై ప్రతి వారం సమీక్ష చేపట్టాలని ఈ సందర్భంగా లిఫ్టు ఇరిగేషన్ అడ్వయిజరీ పెంటారెడ్డికి మంత్రి సూచించారు. కల్వకుర్తి ప్రాజెక్టులోని ప్యాకేజీ-29 పరిధిలో వచ్చే సంవత్సరం జూన్ వరకు లక్ష ఎకరాలకు నీరు అందించేవిధంగా పక్కా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కోయిల్‌సాగర్‌లో పెండింగ్ పనులను, కాల్వ పొడగింపు పనులు, వరద కాల్వ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులు దగ్గర ఉండి పనులు చేయించాలని అన్నారు.

నెట్టెంపాడు ప్యాకేజీ-99 పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనుల కోసం వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌ఆర్‌లో భాగంగా ఐఏవై హౌసింగ్ బిల్లుల విషయాన్ని కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే హౌసింగ్ కార్యదర్శి దానకిషోర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాగా జిల్లాలోని పెండింగు ప్రాజెక్టుల్లో 96 శాతం భూసేకరణ పూర్తయిందని, మిగతా భూసేకరణకు భూ కొనుగోలు విధానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.