-ప్రభుత్వ భాగస్వామ్యంతో మరిన్ని సేవలు
-సర్కారు దవాఖానల్లో అవయవమార్పిడి చికిత్సలు
-ప్రజారోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
-క్యాన్సర్ కేర్‌పై టాటాతో ప్రభుత్వం ఎంవోయూ రాష్ట్ర ప్రగతికి కేటీఆర్ కృషి.. ఆయనతో వేదిక పంచుకోవడం సంతోషకరం
-టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్‌టాటా
-క్లిష్టమైన క్యాన్సర్ కేసులకు ఎంఎన్‌జే, నిమ్స్‌లో చికిత్స
-మెడికల్ కాలేజీలు, జిల్లా దవాఖానల్లో వ్యాధి పరీక్షలు, డేకేర్ కీమోథెరపీలు
-ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి శ్రీ కే తారకరామారావు
ప్రజల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో మరింత సేవలందిస్తామని టాటా గ్రూప్ సంస్థల గౌరవ చైర్మన్ రతన్‌టాటా పేర్కొన్నారు. టాటా ట్రస్టుల ఆధ్వర్యంలో ఇదివరకే పలు విభాగాల్లో వైద్యసేవలు అందిస్తున్నామని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో టాటా ట్రస్ట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణంగా ఉందని చెప్పారు. కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ మేనేజ్‌మెంట్ కార్యక్రమం కింద టాటా ట్రస్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. శంషాబాద్ నోవాటెల్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మం త్రులు కే తారకరామారావు, లక్ష్మారెడ్డి, టాటా గ్రూప్ చైర్మన్ రతన్‌టాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పనితీరును రతన్‌టాటా కొనియాడారు. వినూత్న ఆలోచనలతో రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తున్నారని కేటీఆర్‌ను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. తాను స్వయంగా ఈ సమావేశంలో పాల్గొనడానికి పలు కారణాలున్నాయని, అందులో.. ఎప్పుడూ నిత్యనూతనంగా ఆలోచనలను ఆవిష్కరించే మంత్రి కేటీఆర్‌తో వేదికను పంచుకోవడం ఒకటని రతన్‌టాటా పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని సాకారం చేసేందుకు ప్రత్యేక చొరువ చూపించారంటూ కేటీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జంషెడ్‌పూర్ తర్వాత టాటా ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.
సర్కారు దవాఖానల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సర్కారు దవాఖానల్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఎన్నడూ లేనివిధంగా సర్కారు దవాఖానల్లో అరుదైన అవయమార్పిడి చికిత్సలు చేయగలుగుతున్నాం. గుండె, కాలేయ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించగలుగుతున్నాం అని కేటీఆర్ అన్నారు. ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఫలితంగా పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని చెప్పారు. సీఎం నాయకత్వంలో వైద్యరంగంలో చాలా మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, ఆ శాఖ అధికారులు చేస్తున్న కృషితో సత్ఫలితాలు సాధించగలుగుతున్నామని మంత్రి వివరించారు. టాటా గ్రూప్‌తో తెలంగాణకు ఎంతో అనుబంధం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. క్యాన్సర్ కేర్‌లో దేశం లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందన్నారు. గతం లో రాష్ట్రవ్యాప్తంగా ప్రసవాల్లో ప్రభుత్వ హాస్పిటళ్లలో 31 శాతం ఉండేవని, కేసీఆర్ కిట్లతో 50 శాతానికి పైగా పెరిగాయని వివరించారు.
మైక్రోసాఫ్ట్‌తో కలిసి ఐకేర్ చిన్న వయసులోనే కంటి చూపుకోల్పోయి, భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్న చిన్నారులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. మైక్రోసాఫ్ట్ సంస్థతో కలిసి రాష్ట్రంలోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ కారణంగా ఎవరూ మరణించకూడదన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రత్యేక విధానాలు అవలంబిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, టాటా ట్రస్టుల మేనేజింగ్ ట్రస్టీ ఆర్ వెంకటరమణన్, ట్రస్టు ప్రతినిధులు లక్ష్మణ్ సేతుర్మన్, గిరీశ్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ కిట్ అద్భుతం రతన్‌టాటా కితాబు
శంషాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు ప్రసవానంతరం అందజేస్తున్న కేసీఆర్ కిట్‌పై టాటా గ్రూప్ సంస్థల గౌరవ చైర్మన్ రతన్‌టాటా ఆసక్తికనబర్చారు. సర్కారు దవాఖానల్లో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, కేసీఆర్ కిట్లు అందజేయడం గురించి రతన్ టాటాకు మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్ వివరించిన సందర్భంగా ఆయన కేసీఆర్ కిట్‌ను వేదికపైకి తెప్పించుకుని పరిశీలించారు. కిట్‌లోని 16 వస్తువులను చూపిస్తూ, వివరించడంతో స్పందించిన రతన్‌టాటా.. ఇది చాలా అద్భుతంగా ఉందని, నిరుపేదలకు వరంలా పనికి వస్తుందని చెప్పారు.
రాష్ట్రమంతటా క్యాన్సర్‌కేర్ నెట్‌వర్క్ క్యాన్సర్ బాధితులకు మెరుగైన సేవలందించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం, టాటా ట్రస్ట్ సంతకాలు చేశాయి. మూడంచెల విధానంలో విద్య, పరిశోధన సామర్థ్యాలను పెంచడం ద్వారా అత్యంత నాణ్యమైన క్యాన్సర్ కేర్ అందిస్తారు. ఈ ఒప్పందంపై ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ శాంతికుమారి, టాటా ట్రస్టుల మేనేజింగ్ ట్రస్టీ ఆర్ వెంకటరమణన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్, నిమ్స్‌ను క్లిష్టమైన క్యాన్సర్ కేసులకు చికిత్స అందించేలా అభివృద్ధిచేస్తారు. క్యాన్సర్ వ్యాధి పరీక్షలు, చికిత్స విషయంలో ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ మెడికల్ కాలేజీలను బలోపేతంచేస్తారు. కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లా హాస్పిటళ్ల క్యాన్సర్ వ్యాధి పరీక్షలు, డేకేర్ కీమోథెరపీ సదుపాయాలు కల్పిస్తారు. తద్వారా రాష్ట్రమంతటా కేన్సర్‌కేర్ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతారు. తత్ఫలితంగా రోగులకు ప్రస్తుత ప్రజారోగ్య వ్యవస్థలోనే మెరుగైన చికిత్స లభిస్తుంది. క్యాన్సర్ రోగులు క్లిష్ట సమయాల్లో తప్ప.. ఇతర విషయాలకు హైదరాబాద్‌కు రావాల్సిన పరిస్థితి తప్పుతుంది.