నా పేరులోనే రాముడున్నాడు
యాదాద్రి తరహా భద్రాద్రి క్షేత్ర అభివృద్ధి
భద్రాచల వరద ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం కల్పిస్తాం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు హామీ
ప్రగతి కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని మంత్రి కేటీఆర్ పిలుపు
భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెంలో రోడ్‌షో
తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక సీఎం కేసీఆర్. ఆయన సారథ్యంలోనే తెలంగాణ సిద్ధించింది. ఆయన పాలనలోనే అద్భుత ప్రగతి సాధించింది. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌కు 11 సార్లు అవకాశం ఇస్తే ప్రజలకు ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు మళ్లీ ఏమరపాటుగా ఆ పార్టీకి అవకాశం ఇస్తే పంటికి అంటకుండానే మనల్ని మింగుతుంది. ఎన్నికల వేల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
-మంత్రి కేటీఆర్
భద్రాద్రి రామయ్య దివ్యాశీస్సులు బీఆర్‌ఎస్‌పైనే ఉన్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తమ కుటుంబం కంటే గొప్ప రామభక్తులు రాష్ట్రంలో ఎవరూ లేరని, తన పేరులోనే రాముడు ఉన్నాడని చెప్పారు. భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం అభర్థులు తెల్లం వెంకట్రావు, బానోత్ హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ ఆదివారం ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భద్రాచలంపై సీఎం కేసీఆర్‌కు అపారమైన ప్రేమ, సీతారాములపై భక్తి ఉన్నదని స్పష్టంచేశారు. ఈ కారణంతోనే కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రిగా నామకరణం చేశారని గుర్తుచేశారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే యాదాద్రి తరహాలో భద్రాద్రి ఆలయాన్ని సకల హంగులతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
భద్రాచలవాసులకు గోదావరి వరద ముప్పు తప్పించేందుకు శాశ్వత ప్రాతిపదికన కరకట్ట నిర్మిస్తామని తెలిపారు. కొత్తగూడేనికి విమానాశ్రయాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తుంటే కేంద్రంలోని మోదీ సర్కార్ అడ్డుపుల్ల వేసిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవకపోయినా అభివృద్ధి విషయంలో రాజీ పడలేదని చెప్పారు. మరింత అభివృద్ధి జరగాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
16 వేల మందికి పోడు పట్టాలు
భద్రాచలం నియోజకవర్గంలో 16 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కేటీఆర్ తెలిపారు. గిరిజనేతరుల కూ పోడు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉన్నదని, అందుకు బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతుందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎన్నికల్లో ఓడించి సాగనంపితేనే గిరిజనేతరులకు పోడు పట్టాల పంపిణీ సాధ్యమవుతుందని చెప్పారు.
సీతమ్మసాగర్ పనులు సాగకపోవడానికి కారణం, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కాంగ్రెస్ నేతలే కారణమని ధ్వజమెత్తారు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్.. ప్రజల బతుకులను మార్చలేదని నిప్పులు చెరిగారు. ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోవడం ఖాయమని హెచ్చరించారు. ఇప్పటికే కాంగ్రెసోళ్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డబ్బు సంచులతో తిరుగుతున్నారని, వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కేంద్రంలోని బీజేపీ సింగరేణిని మింగేయాలని చూస్తున్నది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంస్థను కాపాడుకుంటున్నది. తెలంగాణ వచ్చిన తర్వాతే కార్మికులకు లాభాల్లో వాటా, దసరా, దీపావళి బోనస్ పెరిగింది. సింగరేణి బతకాలంటే బీఆర్‌ఎస్ గెలవాలి. కార్మికులు ఉద్యమస్ఫూర్తిని చాటి గులాబీ జెండాఎగురవేయాలి.
-మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ 24 గంటల కరెంటు ఎందుకివ్వలేదు
రాష్ట్రాన్ని 55 ఏండ్లపాటు పాలించిన కాంగ్రెస్.. తమ పాలనలో 24 గంటల కరెంట్, తాగునీరు, సాగునీరు ఎందుకు ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి పథకాలను ఎందుకు అమలు చేయలేదని, పోడు పట్టాలు, సింగరేణి కార్మికులకు 34 శాతం బోనస్ ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కాములు చేయడం, రాష్ట్రాన్ని మింగడమే కాంగ్రెస్ విధానమని దుయ్యబట్టారు. తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ.. రాహుల్‌గాంధీకి, నరేంద్రమోదీకి ఇసుమంతైనా ఉండదని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తామని ప్రధాని మోదీ అంటుంటే రాహుల్‌గాంధీ ఎందుకు మట్లాడలేదని నిలదీశారు.
బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయకుండా మోదీ కాలయాపన చేసినా కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 3 తర్వాత గెలిచేది బీఆర్‌ఎస్ పార్టీనే అని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మ్యానిఫెస్టోను అమలు చేస్తామని అన్నారు. అశ్వారావుపేట ప్రాంతంలో ఆయిల్‌పాం సాగు విస్తరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయిల్‌పాం రైతులకు అవసరానికి అనుగుణంగా కొత్త ఫ్యాక్టరీలు నిర్మిస్తామని వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, మహబూబాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ అంగోత్ బిందు, ఖమ్మం, భద్రాద్రి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్, రేగా కాంతారావు తదితరులు పాల్గొన్నారు.