Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పిల్లలతో చెలగాటాలా?

-ఇంటర్ బోర్డులో 4.35 కోట్ల టెండరుకు 10వేల కోట్ల లంచమా?
-మీవి ఇంగితజ్ఞానంలేని ఆరోపణలు
-పద్ధతి మార్చుకోకపోతే పరువునష్టం దావావేస్తా
-రాహుల్ కూడా క్షమాపణ చెప్పిండు
-మీరూ అదే పరిస్థితి తెచ్చుకోవద్దు
-కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఫైర్
-పిల్లలు చనిపోతే ఎంత బాధ ఉంటదో ఒక తండ్రిగా నాకు తెలుసు
-విద్యార్థులు తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దు
-మాటల్లోకాదు చేతల్లో కార్మిక పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్
-పెంచిన సంపదను ప్రజలకు పంచాలనే ఆశయంతో పనిచేస్తున్నారు
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
-తెలంగాణభవన్‌లో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం

రాజకీయాల కోసం పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు. రాజకీయ అంశాలుంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని, ఎప్పుడంటే అప్పుడు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి టెండర్ విలువే రూ.4.35 కోట్లయితే.. పదివేల కోట్లు లంచం పుచ్చుకున్నారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు చిల్లరమల్లర మాటలు ఆపకుంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. రెండ్రోజుల క్రితం రాహుల్‌గాంధీ ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇక్కడి కాంగ్రెస్ నేతలు కూడా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. తెలంగాణ భవన్‌లో బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం (టీఆర్‌ఎస్కేవీ) ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్కేవీ జెండాను ఎగురవేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ సంపద పెంచాలని, పెంచిన సంపదను ప్రజలకు పంచాలనే అద్భుతమైన సోషలిస్టు నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ నిజమైన కార్మిక పక్షపాతి అన్నారు. కేటీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..ప్రతిపక్షాలకు అంశాలు లేకే బురద జల్లుతున్నాయి రాష్ట్రంలో మంచి పనులు జరుగుతుంటే కొందరికి మనసున పడటంలేదు. టీఆర్‌ఎస్కేవీ జోరువల్ల ఎర్రజెండా పార్టీలకు ఉనికి లేకుండాపోయింది. ఈరోజు ప్రతిపక్షాలకు అంశాలు దొరుకడంలేదు. అందుకే రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వారం పదిరోజులుగా ఇంటర్మీడియట్ అంశం అందరినీ కలవరపెడుతున్నది. ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు, తప్పులకు బాధ్యులు ఎవరైనా తప్పకుండా చర్యలు తీసుకోవాలని నేను కూడా ప్రభుత్వానికి చెప్పాను. తప్పులు సరిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నేను కూడా ఒక తండ్రిని. నాకు కూడా పిల్లలున్నారు. పిల్లలు చనిపోతే ఎంత బాధ ఉంటదో తెలుసు. చేతులు జోడించి వేడుకుంటున్నా. దయచేసి విద్యార్థులు ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఉచితంగా చేయిస్తున్నాం. ఆందోళన పడకండి.. అని సీఎం కేసీఆర్ చెప్పారు.

పిల్లలు నిశ్చితంగా ఉండాలని, బాధపడొద్దని వారికి ధైర్యంచెప్పే ప్రయత్నం ప్రభు త్వం చేస్తున్నది. కానీ ప్రతిపక్షాలకు వేరే అంశాల్లేవు. ఇంటర్ విషయంలో ప్రభుత్వం ఏదో డిఫెన్స్‌లో పడిందని, కాబట్టి బురదజల్లుదామని, చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ఒకాయన 10వేల కోట్ల కుంభకోణం అంటుండు! ఇంటర్ బోర్డులో ఒక సాఫ్ట్‌వేర్ కావాలంటే టెండరు పిలిచారు. రూ.4.35 కోట్లు టెండరు. టెండరు అయిపోయాక విద్యాశాఖ, కార్యదర్శి ఆమోదం తీసుకుంటారు. ఐటీశాఖకు సంబంధమే ఉండదు. అయితే నాకు ఎవరో పది వేల కోట్లు లంచమిచ్చారని మాట్లాడుతాండు. మాట్లాడేటప్పుడు నోటికి హద్దు పద్దు ఉండొద్దా? ఇంగితజ్ఞానం ఉండొద్దా? ఏం మాట్లాడుతున్నమన్న సోయి లేకుంటే ఎట్ల! ఒకవైపు పిల్లల ప్రాణాలు పోకుండా కాపాడాలి.. ధైర్యం చెప్పాలి. కానీ దీనిని కూడా రావణకాష్టంలా రగిలించాలని, ప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాం చేయాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తున్నది. ఉన్నదాన్ని లేనట్లు, లేనిదాన్ని ఉన్నట్లుగా, లేని సంస్థలకు నాకు సంబంధం అంటగడుతున్నారు. ఆయన ఎవడో తెలియదు.. ఈయన ఎవడో తెలియదు. అధికారంలో ఉన్న పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడిని కాబట్టి.. బట్ట కాల్చి మీద ఏద్దాం.. కడుక్కునే బాధ్యత ఆయనది అన్నట్టు మాట్లాడుతున్నరు. రాజకీయంగా తలపడాలనుకుంటే, కేసీఆర్‌ను ఢీకొట్టాలనుకుంటే, టీఆర్‌ఎస్‌ను బద్నాం చేయాలనుకుంటే ఇంకా చాలా అంశాలున్నా యి. కానీ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడటం ఎవరికైనా మంచిదికాదు. మేము సంయమనం పాటిస్తు న్నాం. నోరు లేక కాదు, మాట్లాడలేక కాదు. ఇంకో బఫూన్ ఉంటడు.. నీవు పెద్దమ్మ గుడికి రా.. ప్రమాణం చేయి, చేయకపోతే నేనన్నదే కరెక్టు అంటడు.. ఇది ఎక్కడి లాజిక్?

చిల్లరదందా ఆపకపోతే పరువు నష్టం దావా
కాంగ్రెస్ మిత్రులకు ఒకటే విజ్ఞప్తి. తేల్చుకోవాలనుకుంటే రాజకీయంగా చాలా అంశాలున్నాయి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. మీరు ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉన్నాం. కానీ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడవద్దు. ఇది మంచి పద్ధతి కాదు. మీడియా కూడా సంయమనం పాటించాలి. ఉద్విగ్న వాతావరణం ఇంకా రెచ్చగొడితే పిల్లలు ఆందోళనచెందే అవకాశముంది. ప్రభుత్వం ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కొంత ఓపిక, సంయమనం అవసరం. హైకోర్టులో కూడా కేసు విచారణ జరుగుతున్నది. కోర్టు దోషులను తేలిస్తే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా. లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేసే కార్యక్రమం చేయవద్దని, పిల్లలను ఆగం చేయవద్దని చేతులు జోడించి కాంగ్రెస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇదేరకంగా వ్యవహరిస్తామంటే.. మీ చిల్లరదందా ఇట్లనే ఉంటదంటే.. నిన్ననే చూశాం.. రాహుల్‌గాంధీ కూడా అనకూడని మాటలు అన్నడు. కోర్టు దగ్గరికి పోయి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పిండు. మీకు కూడా ఆ పరిస్థితి వస్తుంది. నేను కూడా కోర్టుకు పోయి పరువునష్టం దావా వేయాల్సివస్తుంది. ఏది పడితే అది మాట్లాడుతం.. వేల కోట్ల కుంభకోణం అంటే ఊరుకునే సమస్యలేదు. మీరు మర్యాదగా వ్యవహరిస్తే, మర్యాదగా తప్పు దిద్దుకుంటే మంచిది. లేనిపక్షంలో దావాలకు సిద్ధంగా ఉండాలి. రాష్ట్రంలో పరిస్థితులు బాగుంటే కొందరికి మనసున పడుతలేదు. పొలాలు పచ్చబడుతుంటే వాళ్ల కండ్లు ఎర్రబడుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు తిన్నది అరగక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నయి. ప్రాణం పోతే మళ్లీరాదు.. చదువే జీవితం కాదుఇంటర్ విద్యార్థులందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న. తొందరపడి ప్రాణాలు తీసుకుంటే మళ్లీ ప్రాణం రాదు. చదువే జీవితం కాదు. ప్రభుత్వం రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఉచితంగా చేయిస్తున్నది. వాటి ఫలితాలు నాలుగైదు రోజుల్లో వస్తాయి. తొందరపాటు నిర్ణయాలతో తల్లిదండ్రులను బాధపెట్టొద్దు.

కేసీఆర్‌తోనే సాధ్యమయ్యాయి..
మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణలో భాగంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. వచ్చిన వాటిల్లో సింహభాగం అవకాశాలు స్థానికులకు ఇవ్వడం ఒకటి అయితే వారికి కనీస వేతనం అమలయ్యేలా చూసుకొని పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహిస్తూనే కార్మికులకు ఎలాంటి నష్టం జరుగకుండా చూసుకోవాల్సిన అవసరమున్నదని సీఎం కేసీఆర్ అనేకమార్లు చెప్పారు. కేసీఆర్ మాటల్లోకాదు చేతల్లో కార్మిక పక్షపాతిగా రుజు వు చేసుకున్నారు. కొన్ని ఎర్రజెండా పార్టీలు కార్మికుల శ్రమను వాడుకొని, పార్టీలను నిలబెట్టుకొని ఉద్యమాల్లో ఉంచారు. న్యాయం చేయలేదు. వేతనాలు పెంచాలని అడిగిన అంగన్‌వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన చరిత్ర ప్రతిపక్షాలది అయితే అదే అంగన్‌వాడీ వర్కర్లను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని భోజనం పెట్టి, వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించిన చరిత్ర కేసీఆర్‌ది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించిన నాయకుడు కేసీఆర్. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, సిర్పూర్ పేపర్‌మిల్లు, బిల్ట్ వంటి మూతపడిన పరిశ్రమలను తెరిపించడం కేసీఆర్ ఆశీర్వాదంతోనే సాధ్యమైంది.

సోషలిస్ట్ నినాదంతో సీఎం కేసీఆర్
పారిశ్రామీకరణ పెరుగాలి.. వ్యవసాయ ఉత్పత్తి పెరుగాలి.. నీళ్లు రావాలి.. అప్పుడే రాష్ట్ర సంపద పెరుగుతుంది.. పెరిగిన ఆదాయాన్ని, సంపదను పేదలకు పంచాలనే అద్భుతమైన సోషలిస్ట్ నినాదంతో పనిచేస్తున్న నాయకుడు కేసీఆర్. పరిశ్రమల సమీపంలో కార్మికులు ఇండ్లు కట్టుకునేవిధంగా భూమి కేటాయిస్తామని గతంలోనే కేసీఆర్ చెప్పారు. అసంఘటితరంగంలో కార్మికులు అసంఖ్యాకంగా ఉన్నారు. ప్రస్తుత కేంద్రప్రభుత్వం కార్మిక పక్షపాత ప్రభుత్వం కాదు. మే 23 తరువాత ఏర్పడే ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ నిర్ణయాత్మక పాత్రలో ఉంటే కేంద్రం నుంచి కార్మికులకు అందే ప్రయోజనాలను తీసుకుందాం.

భారీగా వేతనాలు పెంపు..
గడిచిన ఐదేండ్లలో అంగన్‌వాడీలకు రూ.4500 నుంచి రూ.10,500కు వేతనాలు పెంచాం. దేశంలో ఎక్కడా అంగన్‌వాడీలకు ఈస్థాయిలో వేతనాలు ఇవ్వడంలేదు. మినీ అంగన్‌వాడీలకు, ఆయాలకు రూ.2200 నుంచి రూ.6వేలకు, ఆశ వర్కర్లకు రూ.7500, వీఆర్‌ఏలకు రూ.6700 నుంచి రూ.10 వేలకు, వీవోవోలకు రూ.2వేల నుంచి రూ.5వేలకు వేతనాలు పెంచుకున్నాం. జీహెచ్‌ఎంసీ సఫాయీ కార్మికుల జీతాన్ని రూ.8వేల నుంచి రూ.14వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌ది. 28 వేలమంది విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను సంస్థలో విలీనంచేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.8వేల నుంచి రూ.10, 500లకు వేతనం, హోంగార్డులకు రూ.9వేల నుంచి రూ.21వేలకు పెంచుకున్నాం. ఆర్టీసీ కార్మికులకు 44% పీఆర్సీ, ప్రభుత్వ ఉద్యోగులకు 43% పీఆర్సీ, సింగరేణిలో బోనస్ ఇచ్చాం. వేతనాల పెంపుతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని అనడంలేదు. కొన్ని పరిష్కరించాల్సి ఉంది.

అన్ని జిల్లాల్లో ఈఎస్‌ఐ దవాఖానలకు కృషి: మంత్రి మల్లారెడ్డి
కార్మికుల పిల్లలకు, కార్మికుడి కుటుంబానికి విద్య, వైద్యం అందించే అంశంపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని కార్మికమంత్రి మల్లారెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈఎస్‌ఐ దవాఖానలు ఉండేలా పనిచేస్తామన్నారు. కనీసవేతనాలు అమలయ్యేలా చూస్తామన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, వాటితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అనేకరకాల కార్మికుల సమస్యలను కేసీఆర్ పరిష్కరించారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేద్దామనుకుంటే కాంగ్రెస్ అడ్డుపడిందన్నారు. కార్మికులు కేసీఆర్‌ను భగవంతుడి రూపంగా చూసుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను కమ్యూనిస్టులకే కమ్యూనిస్టుగా పల్లా అభివర్ణించారు. టీఆర్‌ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం కేసీఆర్ కార్మికుల సమస్యలను అడుగకుండానే పరిష్కరించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీసాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు, టీఆర్‌ఎస్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, ఆటో యూనియన్ నాయకులు మారయ్య, బీడీఎల్ నాయకులు వీ దానకర్ణచారి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.