Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఫలించిన ఎంపీల కృషి

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పట్టుదల.. టీఆర్‌ఎస్ ఎంపీల కృషికి ఫలితాలు లభించాయి. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులపై సంతృప్తికరస్థాయిలో ప్రకటనలు.. నిధుల కేటాయింపుతోపాటు అనేక ప్రాజెక్టులు మంజూరయ్యాయి.

TRS-MP's-press-meet-on-Railway-Budget

-రైల్వే బడ్జెట్‌లో సంతృప్తికరంగా నిధులు -ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం.. సొంత రాష్ట్రంలో సాకారం -రాష్ర్టానికి పలు ప్రాజెక్టులు, కేటాయించిన రైల్వే మంత్రి -కేసీఆర్ పట్టుదల, ఎంపీల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వంలో కదలిక నాలుగైదు దశాబ్దాలుగా సాగుతున్న రైల్వే ప్రాజెక్టులు, లైన్ల నిర్మాణం, సర్వేలు, ఆర్వోబీలకు నిధులు కేటాయించడం వెనుక టీఆర్‌ఎస్ ఎంపీల ఉద్యమస్ఫూర్తి కన్పించింది. అందరూ ఏకతాటిపైకి వస్తే కావాల్సినవి ఎలా సాధించవచ్చో మరోసారి స్పష్టమయింది. సొంత రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేసేలా ఇటు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, అటు రాష్ట్రంనుంచి ఎంపికైన ఎంపీలందరూ కలిసికట్టుగా మెదిలి, కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించగలిగారు.

సమైక్యవాదుల పరిపాలనలో దశాబ్దాలుగా అరకొర నిధుల కేటాయింపులతో నత్తతో పోటీపడుతున్న రైల్వే ప్రాజెక్టులకు ఎట్టకేలకు సొంత రాష్ట్రంలో పూర్తిచేసుకునేలా నిధులను సాధించడంపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతున్నది. సీమాంధ్రులపాలనలో జరిగిన నిర్లక్ష్యాన్ని స్వంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతవరకైనా సాధించుకున్నామనే సంతృప్తి కలుగుతున్నది. కేంద్ర రైల్వే ప్రాజెక్టులు పూర్తవుతాయనే నమ్మకం ఏర్పడింది.

దశాబ్దాలుగా అరకొర కేటాయింపులే.. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు.. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, ఎంపీల అలుపెరుగని పోరాటంతో ఇప్పుడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వేగంతో పోటీపడనున్నాయి. గత రెండు దశాబ్దాలుగా కనీసం రైల్వే రోడ్డు బ్రిడ్జిని కూడా పొందలేని సీమాంధ్ర పాలన స్థానంలో ఇప్పుడు కీలకమైన రైల్వే ప్రాజెక్టులను సాధించుకోగలిగాం. మొదటి నుంచి తెలంగాణ సమగ్ర అభివృద్ధిపై స్పష్టమైన, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టుల్లో చలనం కలిగేలా కేంద్రంతో మాట్లాడారు.

తెలంగాణలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల గురించి మూడుసార్లు ప్రధానితో చర్చించి, విజ్ఞాపన పత్రాలను ఇచ్చారు. టీఆర్‌ఎస్ ఎంపీలు పలుమార్లు అప్పటి రైల్వే మంత్రి సదానందగౌడతోనూ, ప్రస్తుత మంత్రి సురేశ్ ప్రభుతోనూ చర్చించి వినతిపత్రాలను అందజేశారు. వీరికి తోడు రైల్వే బోర్డు అధికారులతోనూ పలుమార్లు భేటీ అయ్యి ఈ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఎట్టకేలకు సమిష్టి కృషి ద్వారా ఈ మేరకైనా ప్రాజెక్టులకు మోక్షం కలిగింది. దీనికితోడు తమ నియోజకవర్గాల పరిధిలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధుల కోసం పట్టుబట్టారు. దీనితో ఫలితం వచ్చింది.

రైల్వే బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పనుల్లో వేగం పుంజుకునేలా చేయగలిగారు. అయితే.. ఇప్పుడు సాధించింది కొంతేనని, ఇంకా సాధించాల్సింది చాలా ఉందని టీఆర్‌ఎస్ ఎంపీలు వ్యాఖ్యానించడం రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయాలనే లక్ష్యానికి వారెంత కంకణబద్ధులై ఉన్నారో చెప్పకనే చెబుతున్నది.

21 ప్రాజెక్టుల్లో.. 11 మనకే.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 21 కొత్త లైన్లలో 11 తెలంగాణకే దక్కాయంటే ముఖ్యమంత్రి, ఎంపీలు కేంద్రంపై ఎంత వత్తిడి తీసుకొచ్చారో అర్థం చేసుకోవచ్చు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 21 కొత్త లైన్లకోసం మొత్తం రూ.1162.60 కోట్లను కేటాయిస్తే ఇందులో తెలంగాణలో సుమారు రూ. 509 కోట్ల ఖర్చుతో కూడిన 11 ప్రాజెక్టులకు అనుమతి లభించింది. అంటే దాదాపు సగం నిధులు తెలంగాణకే దక్కాయి. ఇంకా చాలా ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో అనుమతి లభించలేదు కాబట్టి వాటి గురించి కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని టీఆర్‌ఎస్ ఎంపీలు చెప్పారు. సాధించాల్సిన ప్రాజెక్టుల్లో చాలా వరకు బడ్జెట్‌తో సంబంధం లేకుండా రైల్వే బోర్డు అనుమతి తర్వాత విడిగా పొందే అవకాశం ఉండటం గమనార్హం.

కేటాయింపులు.. సికింద్రాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు ఇప్పటివరకు కేవలం ఒక లైన్ మాత్రమే ఉండగా, రెండవ లైన్ నిర్మాణం కోసం బడ్జెట్‌లో రూ.1200 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పేర్కొని రూ. 27.44 కోట్లను కేటాయించనున్నట్లు మంత్రి ప్రభు పేర్కొన్నారు. సుమారు 110 కి.మీ. మేర ఈ మార్గాన్ని డబ్లింగ్ చేయాలనే డిమాండ్ దీర్ఘకాలంగా ఉంది. నిత్యం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం చేసే ప్రజలతో పాటు కర్ణాటక రాష్ర్టానికి వెళ్ళే ప్రయాణికులకు కూడా సౌకర్యం కలుగుతుంది.

దీని వెనుక సీఎంతోపాటు మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి కృషి ఉంది. అలాగే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్‌కు రూ.141 కోట్లు కేటాయించడం వెనుక కరీంనగర్ ఎంపీ బీ వినోద్‌కుమార్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితల ఒత్తిడి ఉంది. ఇలాచూస్తే రాష్ట్రంనుంచి ఉన్న మొత్తం ఎంపీల పట్టుదల కన్పిస్తుంది. వారి నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు గడిచిన సంవత్సరాల్లో ఎన్నడూ కేటాయించనన్ని నిధులు ఇప్పుడు కేటాయించడం వెనుక వారి కృషి, పట్టుదల, కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి ఉందనేది అందరూ ఒప్పుకునే అంశమే.

రాష్ట్రంలో మొత్తం 14 చోట్ల రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు కూడా ఈ బడ్జెట్‌లో కేంద్ర మంత్రి విడిగా నిధుల కేటాయింపులు చేశారు. ఇవి కాకుండా ట్రాక్ రెన్యూవల్స్, ప్రధాన స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాట్లు, మౌలిక సౌకర్యాలను మెరుగుపర్చడం తదితర పనులకు కూడా అనుమతులు ఇచ్చిన రైల్వే శాఖ ఈ బడ్జెట్‌లోనే నిధులను కేటాయించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ర్టానికి మంజూరైన రైల్వే ప్రాజెక్టులు సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ (110 కి.మీ.) : రూ. 27.44 కోట్లు(మొత్తం వ్యయం అంచనా రూ.1200 కోట్లు) రాఘవపురం-మందమర్రి డబ్లింగ్ (24.47 కి.మీ.) : రూ.24.90 కోట్లు కాజీపేట – బల్లార్షా (202 కి.మీ.) మూడో లైన్ నిర్మాణం : రూ. 46.19 కోట్లు (మొత్తం వ్యయం అంచనా రూ.2,020 కోట్లు) కాజీపేట – విజయవాడ బైపాస్ లైన్ నిర్మాణం (15 కి.మీ.) : రూ. 267.61 కోట్లు (ఇన్‌స్టిట్యూషనల్ ఫండ్ ద్వారా)

పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ (177.49 కి.మీ.) : రూ. 141 కోట్లు మునీరాబాద్-మహబూబ్‌నగర్ (246 కి.మీ.) : రూ. 185 కోట్లు (ఇందులో రూ.135 కోట్లు పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో) మాచర్ల – నల్లగొండ (92 కి.మీ.) : రూ. 1 కోటి (మిగిలినది ఎక్స్‌ట్రా బడ్జెటరీ వనరుల నుంచి) మనోహరాబాద్ – కొత్తపల్లి ( 148.9 కి.మీ.) : రూ. 20 కోట్లు గద్వాల-రాయచూర్ (60 కి.మీ.) : రూ.7 కోట్లు

విష్ణుపురం – జానపాడు (11 కి.మీ.) : రూ. 5 కోట్లు భద్రాచలం – సత్తుపల్లి (56.25 కి.మీ.) : కేటాయించాల్సి ఉంది భద్రాచలం – కొవ్వూరు (ప.గో. జిల్లా) (151 కి.మీ.) : రూ.26 కోట్లు (ఇందులో రూ. 25 కోట్లు ఇన్‌స్టిట్యూషనల్ ఫండ్ ద్వారా) కొండపల్లి – కొత్తగూడెం (125 కి.మీ.) : కేటాయించాల్సి ఉంది. మంచిర్యాల – పెద్దంపేట (4.37 కి.మీ.) : రూ.117 కోట్లు (ఇందులో రూ.59 కోట్లు ఇన్‌స్టిట్యూషనల్ ఫండ్ నుంచి)

విష్ణుపురం – జానపాడు (11 కి.మీ.) : రూ. 5 కోట్లు జగ్గయ్యపేట- మిర్యాలగూడ లైను సర్వే : రూ.9.88 లక్షలు మహబూబ్‌నగర్-గుత్తి (240 కి.మీ) లైను సర్వే : రూ.63.74 లక్షలు హైదరాబాద్- శ్రీశైలం (170 కి.మీ) లైను సర్వే : రూ. 25.5 లక్షలు మణుగూరు-రామగుండం (200 కి.మీ.) సర్వే : రూ. 50 లక్షలు

గేజ్ మార్పిడి పనుల్లో భాగంగా ముద్‌ఖేడ్-ఆదిలాబాద్ మధ్య సుమారు 167 కి.మీ. మేర పనులకు రూ. 356.67 కోట్ల మేరకు ఖర్చవుతుందని అంచనా వేయగా గత సంవత్సరం మార్చి నాటికి రూ. 98.92 కోట్లు ఖర్చు జరిగింది. ఈ బడ్జెట్‌లో కేవలం కోటి రూపాయల కేటాయింపు మాత్రమే జరిగింది. రూ. 234 కోట్లు క్యాపిటల్ ఫండ్, రూ.4.24 కోట్లు డిప్రిసియేషన్ రిజర్వు ఫండ్ నుంచి రైల్వే శాఖ కేటాయించనుంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.