Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పెండింగ్ ప్రాజెక్టులకు ఇక దశ దిశ

-అంతర్రాష్ట్ర నదీ జలాలపై సాంకేతిక సలహా కమిటీ ఏర్పాటు – సాకారంకానున్న ఇచ్చంపల్లి, లెండి, లోయర్ పెన్‌గంగ – ఆల్మట్టి నుంచి గ్రావిటీ నీటికోసం కర్ణాటకతో సంప్రదింపులు – కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనతో చిగురించిన ఆశలు – త్వరలో మరోసారి మహారాష్ట్ర అధికారులతో భేటీ – పొరుగు రాష్ర్టాలకు ముఖ్యమంత్రి స్నేహహస్తం

KCR

సీమాంధ్రుల వలస పాలనలో దిక్కుమొక్కూలేకుండాపోయిన తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులకు మహర్దశ ప్రారంభమైంది. వీటికి కొత్త దశ, దిశ నిర్దేశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. శివరాత్రి పర్వదినాన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన చర్చలు ఇందుకు బలమైన పునాదులు వేశాయి. కొద్ది రోజుల్లోనే తెలంగాణ సరిహద్దులోని అన్ని రాష్ర్టాలతో సుహృద్భావ వాతావరణం పెంపొందించేందుకు.. తెలంగాణ బీడు భూముల్లోకి గంగమ్మను ప్రవహింపజేసేందుకు కేసీఆర్ ఆలోచనలు కార్యాచరణలోకి మారుతున్నాయి. కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన విజయవంతం కావడంతో, ఇతర పొరుగు రాష్ర్టాలతోనూ సంబంధాలు మెరుగుపర్చుకుంటూ రాష్ట్రంలోని ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే అంతర్రాష్ట్ర నదీ జలాల వ్యవహారంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించేందుకు ముగ్గురు సభ్యులతో సాంకేతిక సలహా కమిటీని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పొరుగు రాష్ర్టాలతో ఉన్న సమస్యలను ప్రాజెక్టులవారీగా పరిశీలించనున్న ఈ కమిటీ.. వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఈ కమిటీకి రిటైర్డు ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎన్ గోపాల్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించనుండగా, రిటైర్డు చీఫ్ ఇంజినీర్లు మహ్మద్ అబ్దుల్ రవూఫ్, కే వేణుగోపాల్‌రావు సభ్యులుగా వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులు రాష్ట్రంలో పనిచేసిన సమయంలో రోజుకు రూ.8 వేలు, పక్క రాష్ర్టాలకు వెళ్లితే రోజుకు రూ.12 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నట్లు నీటిపారుదలశాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇచ్చంపల్లి, ప్రాణహిత-చేవెళ్ల, లెండి, లోయర్ పెన్‌గంగా తదితర ప్రాజెక్టులకు సంబంధించి ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకవంటి రాష్ర్టాల సహకారం అవసరం.

గతంలో ఆంధ్రప్రదేశ్ పాలకులు పొరుగు రాష్ర్టాలపట్ల వ్యవహరించిన ఘర్షణపూరిత వాతావరణంలో కాకుండా, సామరస్యపూర్వకంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు రాష్ట్ర నీటిపారుదల నిపుణులు చెప్పారు. గోదావరి నదిపై నిర్మించనున్న ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు రాష్ట్రంలోని మిగిలిన ప్రాజెక్టులపై ఆశలు చిగురింపజేశాయి. దీంతో పొరుగు రాష్ర్టాలతో ఏర్పడ్డ సాంకేతిక ఇబ్బందులను,త్వరతగతిన పరిష్కరించుకోవాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఆల్మట్టి నుంచి గ్రావిటీ ద్వారా ఆల్మట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీరు తీసుకోవడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఆల్మట్టినుంచి కోయల్‌కొండ (పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మొదటి రిజర్వాయర్) రిజర్వాయర్‌కు ఎంతమేర నీటిని గ్రావిటీద్వారా తీసుకోవచ్చనే విషయంపై నీటిపారుదల శాఖ అధికారులు కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఆల్మట్టి 519 అడుగుల సామర్థ్యంతో ఉంది. దీనిని 524 అడుగుల వరకూ నిర్మించుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.అయితే ఆల్మట్టి 520 లెవల్ నుంచి రెండు ప్రత్యామ్నాయాల ద్వారా నీళ్లు తీసుకునే అంశంపై ప్రభుత్వ కృషి చేస్తున్నది.

49 వేల ఎకరాలకు సాగునీరు.. లెండి ప్రాజెక్టుపై గత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేశాయి. అయితే దీనికి కొన్ని చిన్నచిన్న సమస్యలున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడంద్వారా తెలంగాణకు 2.43 టీఎంసీలతో 22 వేల ఎకరాలకు, మహారాష్ట్రకు 3.93 టీఎంసీలతో 27,170 ఎకరాలకు మొత్తంగా 49,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు. 2016 ఖరీఫ్‌నాటికి రెండు రాష్ర్టాల్లో ఆయకట్టు నీరు సరఫరా అయ్యేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచనకు మహారాష్ట్రనుంచి సానుకూల స్పందన లభించినట్లు సమాచారం.

ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని లోయర్‌పెన్‌గంగ ప్రాజెక్టువల్ల మహారాష్ట్రకే అధిక లాభం. ఈ ప్రాజెక్టుకింద వినియోగించుకునే నీటిలో మహారాష్ట్ర వాటా 37.55 టీఎంసీలు కాగా, తెలంగాణకు 5.12 టీఎంసీలు ఉంది. మహారాష్ట్ర ఆయకట్టు 3,47,962 ఎకరాలు కాగా, తెలంగాణలో ఆయకట్టు 47,523 ఎకరాలు. ఈ ప్రాజెక్టుకు నీటి లభ్యత, వినియోగం, బ్యారేజీల నిర్మాణాన్ని రెండు రాష్ర్టాలు సంయుక్తంగా చేపట్టాలని 2012లోనే నిర్ణయించారు. దీని ప్రకారం రెండు బ్యారేజీల నిర్మాణాన్ని మహారాష్ట్ర, ఒక బ్యారేజీ నిర్మాణాన్ని తెలంగాణ చేపట్టాయి. అయితే భూసేకరణ, పునరావాస పనులు ఆటంకంగా ఉన్నాయి.

త్వరలో నిపుణుల పరిశీలన… ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజీ ఎత్తు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. 160 టీఎంసీల నీటి మళ్లింపు లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకోసం ఆదిలాబాద్ జిల్లా తుమ్మడిహట్టి వద్ద ప్రాణహితపై బ్యారేజీ నిర్మించాల్సి ఉంది. దీనివల్ల మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాల్లో కొన్ని గ్రామాలు ముంపునకు గురి కానున్నాయి. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 152 మీటర్లు. దీనివల్ల 6,140 ఎకరాలు ముంపునకు గురవుతుంది. ఇందులో 5,247 ఎకరాలు మహారాష్ట్రలో ఉంది. నది ప్రాంతాన్ని మినహాయిస్తే ముంపునకు గురయ్యేది 1,852 ఎకరాలు మాత్రమే. ముంపును తగ్గించడానికి బ్యారేజీ ఎత్తును తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. త్వరలోనే ఇంజినీర్ల బృందం బ్యారేజీ నిర్మాణ ప్రాంతానికి వెళ్లి పరిశీలన చేయనుంది.

త్వరలో ఛత్తీస్‌గఢ్ పర్యటన ఇచ్ఛంపల్లి నిర్మాణ విషయానికి సంబంధించి త్వరలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతోనూ చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలంలోని ఇచ్ఛంపల్లివద్ద ఇంద్రావతి, గోదావరి నదులు కలిసే ప్రాంతానికి 12 కి.మీ దిగువన ప్రాజెక్టు నిర్మాణానికి 1978లోనే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మధ్య ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 112.77 మీటర్లతో చేపట్టాలని మొదట ప్రతిపాదించారు.

దీనివల్ల 3.3 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకావడంతోపాటు 975 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. అయితే గిరిజనులు అధిక సంఖ్యలో నిర్వాసితులయ్యే అవకాశం ఉండడంతో, ఎత్తు తగ్గించాలని సూచిస్తూ కేంద్ర జలసంఘం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సూచించిన 95 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించింది. కానీ ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం చెప్పింది. దీనిపై ఛత్తీస్‌గఢ్‌తో చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

మిత్రలాభంపై సీఎం కేసీఆర్ దృష్టి రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నకాలమంతా పొరుగు రాష్ర్టాలతో నీటి వివాదాలకే అధిక సమయం వెచ్చించాల్సి వచ్చేది. దీంతో అనేక సాగునీటి ప్రాజెక్టులు, ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో నిలిచిపోయాయి. ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉభయులకూ లాభం కలిగేలా పరస్పర సహాయ సహకారాలతో ప్రాజెక్టులు చేపట్టాలని భావిస్తున్నారు. ప్రాణహిత-చేవెళ్ళ, లెండి, లోయర్ పెన్‌గంగ, ఇచ్ఛంపల్లి.. ఇలా తెలంగాణను సస్యశ్యామలం చేసే అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై గత ప్రభుత్వాల ధోరణి సరిగా లేకపోవడం.. పైపెచ్చు ఇతర రాష్ర్టాలతో ఘర్షణపూరిత ధోరణికి దిగడంతో తెలంగాణకు అన్యాయమే జరిగింది.

గడిచిన పదేండ్లలో అటు కేంద్రంలో, ఇటు మహారాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆనాడు చేయలేని పనిని ఇప్పుడు కేసీఆర్ సాధిస్తున్నారు. తన పుట్టిన రోజునుకూడా సొంత రాష్ట్రంలో జరుపుకోకుండా.. తెలంగాణ అభివృద్ధి అజెండాగా మహారాష్ట్ర వెళ్ళిన కేసీఆర్ చాచిన స్నేహహస్తానికి సానుకూల సంకేతాలు వచ్చాయి. మహారాష్ట్రకు జరిగే నష్టం వీలైనంత వరకు తగ్గించేందుకు సిద్ధమనే సంకేతాలు పంపించడం ద్వారా మహారాష్ట్ర సీఎంవద్ద తెలంగాణకు అనుకూలమైన వాతావరణాన్ని కేసీఆర్ సృష్టించగలిగారు.

అనుకున్నదే తడవుగా టెక్నికల్ కమిటీనికూడా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. త్వరలోనే మహారాష్ట్రకూడా కమిటీని నియమించే అవకాశం ఉంది. ఇతర రాష్ర్టాలతోనూ ఇదే తరహా ఇచ్చిపుచ్చుకునే ధోరణికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దశాబ్దాలుగా కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు తెలుగు నేలనుంచి లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వాములు వెళుతున్నారు. కానీ అక్కడ తెలుగు భక్తులకోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేవు.

ఈ విషయంపై గత ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏనాడూ కేరళతో మాట్లాడలేదు. కానీ కేసీఆర్ కేరళ సీఎంకు ప్రత్యేకంగా లేఖ రాశారు. గత నెలలో కేరళకు వెళ్ళిన సీఎం ఆ రాష్ట్ర సీఎం ఉమెన్‌చాందీతో సమావేశమయ్యారు. శబరిమలలో 5 ఎకరాల స్థలం కేటాయిస్తే.. తెలంగాణనుంచి వచ్చే అయ్యప్పస్వాములకు అతిథిగృహం నిర్మిస్తామని, భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. కేరళ సీఎంకూడా స్పందించారు. కొద్ది రోజుల్లోనే 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అక్కడ అతిథి గృహం నిర్మాణానికి కేసీఆర్ వెంటనే రూ.5కోట్లు విడుదల చేశారు. రాజస్థాన్ ప్రభుత్వంతోనూ ఇదే తరహా స్నేహపూర్వక ధోరణితో వ్యవహరించిన కేసీఆర్.. అజ్మీర్ దర్గా వద్ద అతిథి గృహం నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు ఆ రాష్ట్ర సీఎం వసుంధర రాజెనుంచి సానుకూల స్పందన పొందగలిగారు.

ఇక తెలంగాణతో ఏపీకి చాలా విషయాల్లో విబేధాలున్నప్పటికీ.. ఆ రాష్ట్రంతో కేసీఆర్ మిత్రత్వాన్నే కోరుతున్నారు. విద్యుత్, సాగునీరు, శాఖల విభజన, అధికారులు, సిబ్బంది, ఆస్తుల విభజనలో ఏపీ అనేక కొర్రీలు పెడుతున్నా.. కేసీఆర్ మాత్రం తాను ఎన్నటికీ మిత్రుడినే అనే సంకేతాలను పంపిస్తున్నారు. తాజాగా సాగర్ జలాల విషయంలో.. ఆ రాష్ట్రం కేటాయింపులకు మించి వాడుకున్నా.. అక్కడి రైతుల పంటలు ఎండిపోకూడదన్న ఉద్దేశంతో కుడి కాలువకు నీళ్ళు వదలాలని నిర్ణయించడం విశేషం. ఈ ప్రయత్నాలు ఇతర రాష్ర్టాలతో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందింపచేస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.