Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పేదలకు కడుపు నిండుగా …

-హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో సంపూర్ణభోజనం -గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం -నిరుపేదలకు ఒక్కొక్కరికీ ఆరు కిలోల బియ్యం పంపిణీ -రాష్ట్రవ్యాప్తంగా పేదల ఆకలితీర్చే మూడు పథకాలు ప్రారంభం

Harish-Rao-launches-food-security-programme

దశాబ్దాల తరబడి దొడ్డుబియ్యం తినలేక అర్ధాకలితో పస్తులుంటున్న హాస్టల్ విద్యార్థులు స్వరాష్ట్రంలో కొత్త ఏడాదిలో తొలిసారిగా సన్నబియ్యం తో సంతృప్తిగా భోజనం చేశారు. పలుచని పప్పు, నీళ్లచారుతో ముద్ద మింగలేకపోయిన విద్యార్థులు రుచికరమైన కూరలు, గుడ్డుతో తనవితీరా తిన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు గుడ్డు, పాలతో ఒక పూట పౌష్టికాహారాన్ని భుజించారు. ఇకపై రోజూ సంతృప్తిగా ఒక పూట భోజనం చేయనున్నారు. అర్హులైన కార్డుదారుల్లో ఒక్కోవ్యక్తికి ఆరు కిలోలు చొప్పున బియ్యం అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఏడాది తొలిరోజున నిరుపేదల కండ్లల్లో వెలుగులు విరజిమ్మాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ మూడు పథకాలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో పథకాలను ప్రారంభించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. విద్యార్థులకు, గర్భిణులకు నాణ్యమైన సన్నబియ్యంతోపాటు పాలు, గుడ్డుతో కూడిన పౌష్టికాహారాన్ని అందించారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని నేతలు పేర్కొన్నారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా అర్హులందరికీ ఆరుకిలోల బియ్యం ఇస్తామన్నారు. గతంలో కన్నా ప్రభుత్వంపై భారం పెరిగినా పేద వర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

సంక్షేమానికి రూ.7వేల కోట్లు:ఆర్థిక మంత్రి ఈటల దేశంలోనే రికార్డుస్థాయిలో సంక్షేమానికి ఏటా రూ.7 వేల కోట్లు వెచ్చించిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే కిటాయించాయని గుర్తు చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, చెల్పూర్, పెద్దపాపయ్యపల్లి, హుజూరాబాద్‌లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యాన్ని హాస్టళ్లల్లో, మధ్యాహ్న, భోజన పథకం కింద, ఆహార భద్రత కింద ఒక్కొక్కరికీ ఆరు కిలోల బియ్యం పంపిణీ పథకాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జనాభాలో 83శాతం మందికి ఆహార భద్రతాకార్డులను ఇస్తున్నామని వెల్లడించారు. గతంలో 9.76 లక్షల కార్డులు ఉంటే, ప్రస్తుతం 10.33లక్షల కార్డులు అందిస్తున్నామని, ఇంతకుముందు కేవలం ఒక్కొక్కరికి 4కిలోల చొప్పున కుటుంబానికి 20కిలోలు మించకుండా బియ్యాన్ని ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు.

కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యాన్ని కుటుంబంలో ఎంత మంది ఉన్నా ఇస్తున్నామని చెప్పారు. అంగన్‌వాడీ సెంటర్లో గర్భిణులకు, పిల్లలకు నెలకు 16 గుడ్లు మాత్రమే ఇచ్చేవారని, ప్రస్తుతం 32 గుడ్లను ఇవ్వనున్నామన్నారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి ఎంపీ బాల్క సుమన్ సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజవకర్గంలోని రఘునాథపల్లిలో డిప్యూటీ సీఎం రాజయ్య, ములుగు నియోజకవర్గం జగ్గన్నపేటలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్, రేగొండలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పథకాలను ప్రారంభించారు. మెదక్ జిల్లా సిద్దిపేట, గజ్వేల్, సంగారెడ్డి, సదాశివపేటలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొని పథకాలను ప్రారంభించారు. ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. మెదక్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నిజామాబాద్ బాలికల హాస్టల్‌లో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి భోజనం వడ్డించారు. ఆదిలాబాద్ జిల్లాలో అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఎంపీ నగేశ్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, జెడ్పీ చైర్‌పర్సన్ శోభారాణితో కలిసి ఈ పథకాలను ప్రారంభించారు.

హైదరాబాద్ మహేంద్రాహిల్స్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఒక పూట సంపూర్ణ భోజన పథకాన్ని వాణిజ్య,పన్నులు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, భోలక్‌పూర్‌లోని బాలికల హాస్టల్‌లో మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యే కే లక్ష్మణ్, రంగారెడ్డి జిల్లాలో రవాణశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి పథకాలను ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని ఎస్సీ బాలికల వసతిగృహంలో మంత్రి సీ లకా్ష్మరెడ్డి, కల్వకుర్తిలో పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో సంక్షేమ హాస్టలో పథకాన్ని ప్రారంభించిన రోడ్డు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని 27వ రేషన్ దుకాణంలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి మంత్రి జగదీశ్‌రెడ్డి, దేవరకొండ మండలం కే బీమనపల్లిలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.