రాష్ట్రంలోని పేదలు, సామాన్యుల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. నిరుపేదల క్షేమమే ఎజెండాగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం అధ్యక్షుడు కుతాడి రాములు, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు ఆధ్వర్యంలో సంఘం పది జిల్లాల బాధ్యులు, కార్యకర్తలు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

-కేసీఆర్ నాలుగు గోడల మధ్య ఉండే సీఎం కాదు -భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు -టీఆర్‌ఎస్‌లోకి ఎరుకల సంఘం అధ్యక్షుడు రాములు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం కార్యవర్గం, అన్ని జిల్లాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయాలనేది సీఎం ఆశయమని, అందులో భాగంగా ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలైతే ఎరుకుల యువతీ, యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయన్నారు. సీఎం అంటే సచివాలయంలో ఉండేవారు.. నాలుగు గోడల మధ్యనే కూర్చుంటారని ఇప్పటివరకు జనం అనుకున్నారు.
కానీ కేసీఆర్ మాత్రం అట్టడుగువర్గాల ప్రజల మధ్య, వారుండే మురికివాడల్లో, ఇరుకైన సందుల్లోకి వెళుతున్నారు. వరంగల్, మహబూబ్‌నగర్‌లో ప్రతి పేదల బస్తీ తిరిగారు. గజ్వేల్, కరీంనగర్, ఆ తర్వాత ఖమ్మం జిల్లాల్లోనూ పర్యటిస్తారు అని తెలిపారు. ఎరుకలు కేవలం పందుల పెంపకంతో బతికే పరిస్థితులు ఇప్పుడులేవన్నారు. ప్రభుత్వం ఇప్పటికే దళితులకు మూడెకరాల భూ పంపిణీ మొదలుపెట్టిందని, త్వరలో ఎస్టీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయనున్నందున భూమిలేని నిరుపేద ఎరుకలు దీని కింద లబ్ధిపొందుతారని చెప్పారు.
ఎస్టీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు కన్సెంట్ లేకుండానే నేరుగా రుణాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని, దీని ద్వారా లబ్ధిదారులకు 75% సబ్సిడీతో రుణాలు అందుతాయన్నారు. ఎరుకలను ఏకలవ్యులు అని పిలవాలనే డిమాండు వస్తున్నదని.. పేరులోనే కాకుండా బతుకుతెరువులోనూ మార్పు రావాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం కేసీఆర్ నాయకత్వంలో ఎరుకల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
ఎరుకల సంఘం నేతలను తీసుకువెళ్లి సీఎంతో మాట్లాడి హైదరాబాద్‌లో ఏకలవ్యభవన్ నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోపాటు నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎరుకులకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ 60 ఏండ్లలో నష్టపోయిన తెలంగాణను పునర్నిర్మించుకొనేందుకు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు.