Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పార్టీ.. ప్రభుత్వం పరుగుతీయాలి

తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘను లు, బాధ్యులు టీఆర్‌ఎస్ కార్యకర్తలే. 14-15 ఏండ్లు నిరంతరంగా సాగిన ఉద్యమంలో ఆకలితో పని చేసినమో.. అటుకులు తిని పనిచేసినమో! అన్నింటిని తట్టుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినరు. కాబట్టే ఈ రోజు ఖమ్మం గడ్డ మీద స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఆత్మగౌరవంతో సంభ్రమంగా ప్లీనరీ నిర్వహించుకోగలుగుతున్నం. టీఆర్‌ఎస్ కార్యకర్తల చరిత్ర.. తెలంగాణ ఉద్యమ సాధనలో, బంగారు తెలంగాణ నిర్మాణంలో సువర్ణాక్షరాలతో శాశ్వతంగా లిఖించి ఉంటది. – కేసీఆర్

CM-KCR-addressing-the-gathering-in-TRS-Public-meeting-in-Khammam

-అభివృద్ధి దిశగా సమాంతరంగా పయనిస్తాం -బాలారిష్టాలు దాటి..హిమాలయాల ఎత్తుకు టీఆర్‌ఎస్ -2019-20 నాటికి 2లక్షల కోట్ల బడ్జెట్ -బీసీల్లోని చేతిపనివారల ఎజెండాపై త్వరలో కసరత్తు -టీఆర్‌ఎస్ ప్లీనరీలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -హిమాలయాలంత ఎత్తుకు టీఆర్‌ఎస్ -నెల, నెలన్నరలో 4 వేల నామినేటెడ్ పదవులు -పేదరికాన్ని పారదోలేందుకు కార్యాచరణ -బీసీల్లోని చేతి పనివారల ఎజెండా చేపడుతాం -ఈ నెలలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసులకు శంకుస్థాపన: సీఎం కేసీఆర్

అభివృద్ధి దిశగా సమాంతరంగా పయనిస్తాం.. తెలంగాణ సాధన ఘనత లక్షల మంది కార్యకర్తలదే టీఆర్‌ఎస్ ప్లీనరీలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

సమయం వచ్చింది. మనం స్థిరపడినం. బలమైన శక్తిగా, రాజకీయ సుస్థిరత ఉన్న పార్టీగా రాష్ట్రంలో ఎదిగినం. ఇన్నాళ్లూ పరిపాలనలో సీనియర్లం బిజీగా ఉన్నం. ఇప్పుడు పార్టీ-ప్రభుత్వం.. రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకుపోతం. జోడు గుర్రాల పరుగుతో గమ్యాన్ని చేరుకుంటం అని టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కేంద్రంలోని చెరుకూరి గార్డెన్స్‌లో బుధవారం జరిగిన పార్టీ ప్లీనరీలో కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు. తెలంగాణ సాధన ఘనత కార్యకర్తలదేనన్న ఆయన.. బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ కీలకపాత్ర పోషించాలని చెప్పారు. నాలుగువేల మంది నేతలు, కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు రాబోతున్నాయని తీపి కబురు అందించారు. 2019-20నాటికి రూ.2లక్షల కోట్లుగా పెరిగే తెలంగాణ బడ్జెట్‌ను ఏం చేయాలనే దానిపై విజన్ అవసరమని చెప్పారు. గతం, వర్తమానం, భవిష్యత్తుపై దాదాపు ముప్పావుగంటకుపైగా సాగిన ప్రసంగంలో పార్టీ, ప్రభుత్వ లక్ష్యాలను ప్రతినిధుల ముందుంచారు. ఆ దిశగా లోతైన చర్చ జరగాలని కోరారు. ప్రతినిధుల సూచనల్ని కేంద్రకమిటీ పరిగణనలోనికి తీసుకుంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రసంగం సాగిందిలా..

ప్రపంచం అబ్బురపడింది.. రాష్ట్ర సాధనలో ఉద్యమం ప్రారంభం కాగానే.. మఖలో పుట్టింది, పుబలో పోతది అన్నరు. కానీ సుదీర్ఘ ఉద్యమాన్ని అహింసాయుతంగా, ప్రపంచం అబ్బురపడేలా కొనసాగించినం. పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో రాష్ట్రపతి నోటి వెంట తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తామనే తియ్యటి వాక్యాన్ని వినగలిగినం. ఆ తర్వాత అనేక అవరోధాలెదురైనా పోరాటం చేసినం కాబట్టి తెలంగాణ సాధించుకోగలిగినం. ఆ ఘనత, గౌరవం మీకే దక్కుతుంది.

అందనంత ఎత్తుకు టీఆర్‌ఎస్… 2014లో తెలంగాణ ఆవిర్భావం.. ఒక సందిగ్ధ పరిస్థితి. చాలామంది మీరు ఉద్యమం చేసినరు.. మీ వంతు ఉద్యమమే.. మీరు పక్కకు జరిగిపోండి.. తెలంగాణ పాలన బాధ్యత మేం తీసుకుంటమన్నరు. కానీ అనేక వర్గాలు, ఉద్యోగులు, ప్రజలు మాత్రం టీఆర్‌ఎస్‌కు ఉన్నంత అధ్యయన శీలత, లోతైన అవగాహన ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీకీ లేదు కాబట్టి.. కచ్చితంగా తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పినరు. ఆ మేరకు ఉద్యమ స్ఫూర్తితో ఎన్నికల్లో పాల్గొన్నం. ప్రజలు మనకు పట్టం కట్టినరు. ఆ తదనంతరం కూడా చాలామంది.. ఈ జిల్లాకు సంబంధించిన నాయకుడు ఒకరు కూడా ఈ ప్రభుత్వం పదిరోజుల్లో కూలిపోతదన్నరు. పక్కరాష్ట్రం వారు కరెంటు ఇయ్యకుండా ఇబ్బంది పెట్టినరు. బాలారిష్టాలు, కష్టాలు తట్టుకొని ధైర్యంగా నిలబడి టీఆర్‌ఎస్, ప్రభుత్వం తెలంగాణ రాజకీయ యవనిక మీద ఎవరూ అందుకోలేనంతగా హిమాలయం అంత ఎత్తుకు ఎదిగింది.

అకుంఠిత దీక్షతో లక్ష్యంవైపు.. ఇటీవల మెదక్ పార్లమెంటు ఉపఎన్నిక మొదలుకుని, స్థానిక, మున్సిపల్ ఎన్నికల వరకు ఫలితాలు చూసినం. వరంగల్ ఎంపీగా ఎన్నికైన పసునూరి దయాకర్ సాధారణ కార్యకర్త. ఆయనకు డబ్బుల్లేవు. అధికారాలు లేవు. కానీ ప్రజానీకం 4.60 లక్షల మెజార్టీతో గెలిపించడం అద్భుత ఘట్టం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలతో చరిత్రలో ఎన్నడూలేని అద్భుత విజయాన్ని మనకు అందించినరు. అనేక ఒడిదుడుకులు, కష్టాలు, ఎత్తుపల్లాలు చూసినం. అవమానాలు సహించిన వాళ్లం. లక్ష్యాన్ని చేరుకున్న వాళ్లం. మనకు ఇంకో లక్ష్యం ఉంది. మనకు ఎవరూ బాసులు లేరు. మనకు బాసులు తెలంగాణ ప్రజలే. ఇక్కడున్న పేదరికం, గోసలు, తాగు, సాగునీటి బాధలు పోవాలంటే అకుంఠిత దీక్షతో ముందుకు సాగాలి. ఈ ప్లీనరీలో చర్చ ఆ దిశగా నిర్దేశం చేయాలి. సమస్యల పరిష్కార బాధ్యత మన భుజస్కంధాలపై ఇదే ఖమ్మం జిల్లా బిడ్డ రావెళ్ల వెంకట్రామారావు 80ఏండ్ల కిందట ఒక గీతం రాసినరు. భూగర్భమున గనులు, పొంగిపారే నదులు, శృంగార వనసతుల సింగారముల పంట.. నా తల్లి తెలంగాణరా.. వెలలేని నందనోద్యానవనమురా.. అన్నరు. గోదావరి, కిన్నెరసాని, మున్నేరు, శబరి ఇన్ని నదులు ఖమ్మం జిల్లా భూభాగాన్ని ఒరుసుకొని పారుతయి. కానీ జిల్లాలో కరువు పరిస్థితులు, తాగునీటి సమస్యలెందుకు ఉన్నయి? అరవయ్యేండ్ల స్వాతంత్య్రం ఏం తెచ్చి పెట్టింది? 58 ఏండ్ల సమైక్యపాలనలో చాలా సులభంగా పరిష్కారం అయ్యే సమస్యలు పరిష్కారం కాలేదు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం, తెలంగాణ నాయకుల నిష్క్రియాపరత్వంవల్ల తెలంగాణకు ఈ సమస్యలన్నీ సంక్రమించినయి. వీటిని దీటుగా పరిష్కరించే బాధ్యతను ప్రజలు మన భుజస్కంధాలపై ఉంచినరు.

పార్టీ.. ప్రభుత్వం జోడు గుర్రాలు.. జిల్లా, రాష్ట్ర కమిటీలు సంపూర్ణంగా వేసుకోవాలి. మనం బలమైన శక్తిగా ఎదిగినం. ఇప్పుడు పార్టీ.. ప్రభుత్వం.. రెండింటినీ సమాంతరంగా తీసుకుపోవాలి. రెండూ జోడుగుర్రాల్లా పరుగెత్తి గమ్యాన్ని చేరుకోవాలి. గ్రామస్థాయినుంచి కమిటీలు వేసుకొని, అనతికాలంలోనే కార్యకర్తల శిక్షణ శిబిరాల్ని ఏర్పాటు చేసుకోబోతున్నం. రిలాక్స్ అయితే అంతే సంగతి! కొద్దిమంది మంత్రులో, ఎమ్మెల్యేలో, ముఖ్యమంత్రో పని చేస్తే కాదు.. కచ్చితంగా పార్టీ యంత్రాంగం మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలు ప్రబలంగా, విమర్శలకు దీటుగా ప్రజా క్షేత్రంలోకి తీసుకుపోవాలి. రాజకీయాల్లో విరామం, విశ్రాంతి ఉండరాదు. ఏ నాయకుడైతే రిలాక్స్ అవుతడో…ఆ రోజు నుంచే పతనం మొదలైతది.

మన విజయాలతో దేశమే నివ్వెరబోతున్నది పేదల సంక్షేమానికి ఏటా 35వేలకోట్లు వెచ్చిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. పాలేరు ఉప ఎన్నిక ఉంది. ఏ ఎన్నిక వచ్చినా మనం పద్ధతిగా, క్రమశిక్షణతో ముందుకుపోతున్నం. మన అసాధారణ విజయాలు దేశాన్ని అబ్బురపరుస్తున్నయి. ఇటీవల ప్రధానిని కలిసినపుడు వారు కూడా ఏకాంత సంభాషణలో మీరు గొప్పగా ముందుకుపోతున్నరు.. మీ ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నరు అని చెప్పినరు.

ఈసీ తీర్పును ఆహ్వానిస్తున్నం.. కాంగ్రెస్‌వాళ్లు ఢిల్లీకి పోయి ఈసీకి ఫిర్యాదు చేసినరు. ఖమ్మం జిల్లా కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారిని మార్చేయమన్నరు. ఈసీ తీర్పును స్వాగతిస్తున్న. నేతలు, ప్రజావిశ్వాసం ఉన్నవాళ్లు.. ప్రజల విశ్వాసంతో గెలవాలే తప్ప అధికార దుర్వినియోగంతో కాదని బలంగా నమ్మేవాళ్లలో టీఆర్‌ఎస్ కూడా ఉంది.

నిధులు, నియామకాలు ఓకే! ఇక నీళ్లపైనే.. తెలంగాణ సాధన ఉద్యమంలో మన ప్రధాన నినాదమే.. నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి మన బడ్జెట్ వంద శాతం మనకే ఖర్చవుతది. నియామకాలు చేసుకుంటున్నం. ఇక నీళ్లు. ఇన్ని నదుల మధ్య అలరారుతున్న ఖమ్మం జిల్లా ఎందుకు ఎడారిగా ఉంటది? అందుకే ఈ జిల్లాలో భక్త రామదాసు, సీతారామ ప్రాజెక్టు టేకప్ చేశాం. రెండున్నర, మూడేండ్లలో జిల్లాలోని ఇంచు భూమి కూడా వదలకుండా బ్రహ్మాండంగా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి వస్తది.

యువ నాయకత్వంలో లక్ష ఎకరాలకు సాగునీరు.. యువ నాయకుడు హరీశ్‌రావు నాయకత్వంలో రెండు కార్యక్రమాలు సమర్థంగా చేస్తున్నం. సమైక్య రాష్ట్రంలో గత పాలకులు శుష్క వాగ్దానాలతో పెట్టిన నీళ్లురాని ప్రాజెక్టులను నేను, హరీశ్,అధికారులు కసరత్తు చేసి.. రీడిజైన్ చేసుకున్నం. కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చే ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకున్నం. కాకతీయ రెడ్డి రాజుల కాలంలో తవ్వించిన 75వేల పైచిలుకు చెరువుల్లో పాతిక వేలు మటుమాయం అయినయి. మిగిలిన 46వేల చెరువులను.. మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించుకుంటున్నం. ఫలితాలు అద్భుతంగా వస్తున్నయి. ఇక్కడ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం, వివిధ ప్రపంచసంస్థలు ప్రశంసిస్తున్నయి.

కరువు బాధలకు మిషన్ భగీరథతో చెక్ ఈ సంవత్సరం భయంకరంగా కరువు వచ్చింది. పేపర్ల ఎక్కడ చూసినా ఎండిపోయిన బావులు, బిందెలు పట్టుకొని కిలోమీటర్ల కొద్దీ పోతున్న ప్రజల ఫొటోలు చూస్తున్నం. మన హృదయం బాధపడుతున్నది. దీనికి శాశ్వత పరిష్కారం మిషన్ భగీరథ. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడు అక్కడ మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసిన. ఈ రోజు యావత్ తెలంగాణ మంచినీటికోసం గోస పడుతున్నా సిద్దిపేట శాంతియుతంగ ఉంది. యావత్ తెలంగాణ కూడా కరువు, కాటకాలు వచ్చినా ఆ బాధల నుంచి పోవాలంటే దానికి సమాధానం మిషన్ భగీరథ.

మీరున్న ధైర్యంతోనే సవాల్… ఈ టర్మ్‌లోనే ప్రతి ఇంటిలో నల్లా పెట్టించి.. ప్రజల దాహార్తి తీర్చుతం.. లేకపోతే ఓట్లు అడగమని చెప్పిన దేశంలోనే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్. ఒక్క కేసీఆర్ భగీరథుడు అని మీరనుకుంటున్నరు. కానీ ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్త అపర భగీరథుడే. మిమ్మల్ని చూసుకొని ఆ ధైర్యంతోనే అట్ల చెప్పిన. ఏదైనా స్కీం పెడితే వెంటనే దాంట్ల బ్రోకర్లు, పైరవీకారులు తయారవుతరు. ఆ విధంగా కాకుండా టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎక్కడివాళ్లు అక్కడ కాపలాదారుల్లా ఉండాలి.

ఇక వెలుగుల తెలంగాణే తెలంగాణ వస్తే అంధకారమైతదని ఎవరైతే చెప్పినారో వాళ్ల నోళ్లు మూయించినం. వెలుగులు విరజిమ్మే, కరెంటు కోతల్లేని తెలంగాణ చూస్తున్నం. జైపూర్ ప్లాంట్ త్వరలో ప్రారంభం అవుతది. ఛత్తీస్‌గఢ్ నుంచి అక్టోబర్ నుంచి విద్యుత్ వస్తది.

ఈ ఏడాది 2.60 లక్షల డబుల్ బెడ్‌రూంలు డబుల్ బెడ్‌రూం ఇండ్లను యావత్ దేశం, ప్రపంచం ప్రశంసిస్తున్నది. పేదలు ఆత్మ గౌరవంతో బతికేందుకు ఆ పథకం తీసుకున్నం. 2.60 లక్షల ఇండ్లు ప్రజలకు ఇండ్లు అందించబోతున్నం.

పేదరికాన్ని తరిమికొట్టేలా కార్యాచరణ… రాబోయే 2-3 ఏండ్లలో ఇరిగేషన్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయపై పెట్టే పెట్టుబడి రెండు నుంచి రెండున్నర లక్షల కోట్లు. 2015-16లో మన వృద్ధి రేటు 15%గా ఉంది. దేశంలో అతి కొద్ది మిగులు బడ్జెట్ రాష్ర్టాల్లో మనది ఒకటి. 2019-20 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్ష కోట్లకు పోయినా ఆశ్చర్యం లేదు. ఇంత పెద్ద బడ్జెట్‌ను ఏం చేయబోతం? అనేది ఆలోచించాలి. ఇప్పటివరకు ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, విద్యుత్, రోడ్లపై కేంద్రీకరించాం. జలరాశిని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ మత్స్యకారులు కొన్ని వేల కోట్ల వ్యాపారం చేసేలా దృష్టిసారించబోతున్నం. నీటిపారుదల రంగంలో పెట్టుబడులు అయిపోతే తదనంతరం పేదరికాన్ని తరిమికొట్టేలా, పేదవర్గాలను పైకి తెచ్చేవిధంగా కార్యాచరణ ఉంటుంది.

కోటి ఎకరాలతో చిరునవ్వుల తెలంగాణ…. రాష్ట్రంలో బోనాలు, దసరా ఎట్ల జరుపుతున్నమో రంజాన్, క్రిస్మస్ అట్ల జరుపుతున్నం. గంగ జమునా తహజీబ్ సంస్కృతిని అమలు చేసి చూపిస్తున్నం. ముస్లిం సోదరులకు నేను ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తే కశ్మీర్‌లోగానీ, ఇతర రాష్ర్టాల్లోగానీ ఇంత గొప్పగ ఏర్పాటు చేయరని ముస్లిం సోదరులు చెప్పినరు. క్రిస్మస్ వేడుకలు జరిపితే తెలంగాణలో ఉండే బిషప్‌లు, పాస్టర్లు వేనోళ్ల కొనియాడినరు. దీవెనలు కూడా అందించినరు. ఇదే సంప్రదాయాన్ని, ఒరవడిని కొనసాగిస్తూ తెలంగాణ ప్రజానీకం చిరునవ్వుతో ఉండేలా, కోటి ఎకరాలతో అలరారే విధంగా అద్భుతంగా ముందుకుపోతున్నం.

ఇకముందూ ఇదే ఉధృతి టీఎస్‌ఐపాస్ తెచ్చుకున్నం. 1500 కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇచ్చుకున్నం. రూ.30వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించినం. ఇంకా వరదలా పెట్టుబడులు రానున్నాయి. ఐటీలో నంబర్‌వన్‌గా ఎదిగే సమయం సమీపంలోనే ఉంది. మిషన్ భగీరథను బీహార్, బెంగాల్, యూపీ కాపీ కొడుతున్నాయి. నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా అన్ని రాష్ర్టాలకు లేఖ రాసి మిషన్ భగీరథను అమలు చేయాలని చెప్పినరు. మిషన్ కాకతీయను టేకప్ చేయాలని కేంద్రమంత్రి ఉమాభారతి అన్ని రాష్ర్టాలకు లేఖ రాసినరు. ఇలా అనతి కాలంలోనే దేశ, అంతర్జాతీయ స్థాయిలో ప్రజల దీవెనలు, మన్ననలను పొందగలుగుతున్నాం. ఇదే ధృతితోని, ఉధృతితోని మరింత ముందుకుసాగిపోయి ప్రజలు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే రీతిలో మన చర్చలు, తీర్మానాలు ఉండాలి. మే నెలలోనే అన్ని జిల్లాల్లో జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపన చేయాలి.

పార్టీ కన్నతల్లిలాంటిది.. కొంతమందికి కొన్ని హోదాలు రావచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కావచ్చు. కానీ అందరం బంగారు తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞంలో కార్యకర్తలమని మర్చిపోవద్దు. నేను 1985లో ఎమ్మెల్యేగా గెలిచిన. నాకు మంత్రి పదవి రావడానికి 13 ఏండ్లు పట్టింది. కానీ ఎప్పుడూ సడలలేదు.. బెదరలేదు. సమయం వచ్చేవరకు ఓపిక పట్టిన. ఒక సందర్భంలో మంత్రి పదవి దానంతట అదే వెతుక్కుంటూ వచ్చింది. పదవులు వచ్చిన వారే గొప్పవారు కాదు. పదవులు రానంత మాత్రాన చిన్నవాళ్లు కాదు. కొందరికి వెంటనే పదవులు రాకపోవచ్చు. కానీ తెలివైన రాజకీయ నాయకుడు తన వంతుకోసం వేచి ఉండాలి. అదే నిజమైన పార్టీ విధేయత.

పార్టీ కన్నతల్లిలాంటిది. ఈ వృక్షం ఉంటేనే నీకు నాకు చోటు. అసెంబ్లీ సీట్లసంఖ్య పెంపుదలపై ఢిల్లీ నుంచి పాజిటివ్ వార్తలు వస్తున్నయి. మరో 34మంది ఎమ్మెల్యేలు, మరో పదిమంది ఎమ్మెల్సీలవుతారు. విద్యార్థి నాయకుడుగా ఉన్న బాల్క సుమన్ ఎంపీ అవుతరని ఎవరూ అనుకోలేదు. కానీ ఈ రోజు యువ ఎంపీగా తెలంగాణ గొంతును పార్లమెంటులో వినిపించే అవకాశం పార్టీ కల్పించింది. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఒకనాడు విద్యార్థి, యువజన విభాగం నాయకుడు.

ఆయన మేయర్ అవుతడని ఎవరూ ఆశించలె… ఊహించలె. దుబ్బాక స్థానం కావాలని కొత్త ప్రభాకర్‌రెడ్డి నా దగ్గరికి వచ్చి కోరినరు. ప్రభాకర్‌రెడ్డిగారూ మీరు వేచి ఉండండి అని చెప్తే, నా మాట గౌరవించి, నా నియోజకవర్గంలో ప్రచారబాధ్యత తీసుకున్నరు. ఆయన అడిగింది ఎమ్మెల్యే అయితే ఆయనను ఎంపీగా చేసుకున్నం. మార్కెట్ కమిటీ చైర్మన్లు, దేవాదాయ, రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు, జిల్లాల్లో గ్రంథాలయ చైర్మన్ వగైరా దాదాపు 3500-4000 మందికి అవకాశాలు వస్తయి. నెల, నెలన్నరలో వీటన్నింటినీ భర్తీ చేసుకుంటం.

మీ త్యాగం సువర్ణాక్షరాల లిఖితం (ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై.. అన్న పద్యాన్ని చెప్తూ) నీచ మానవులు ఏం జరుగుతుందనే భయంతో సత్కార్యాలను ప్రారంభించరు. ప్రజోపయోగకరమైన కార్యక్రమాలని తెలిసికూడా వాటిని ప్రారంభించరు. కొంతమంది ప్రారంభించి, మధ్యలో వదిలేసిపోతరు. ధీరులైనటువంటి వారు నాకేం అయితది, నాకేం వస్తదని ఆలోచించకుండా గమ్యంవైపు సాగిపోతుంటరు. కరెక్టుగా తెలంగాణ సాధనలో ధీరులుగా నిలబడి, విఘ్నాలు,అవరోధాల్ని అధిగమించి తెలంగాణ సాధించిన ఘనులు, బాధ్యులు మీరే (కార్యకర్తలు). టీఆర్‌ఎస్ అంటే ముందుగా గుర్తొచ్చేది కేసీఆర్.. ఆ తర్వాత కార్యకర్తలని ఈ రోజు చాలా పేపర్లు రాసినయి. 14-15 ఏండ్లు నిరంతరంగా సాగిన ఉద్యమంలో ఆకలితో పని చేసినమో.. అటుకులు తిని పనిచేసినమో! ఎన్నో అరెస్టులు, అవమానాలు తట్టుకొని ధీరోదాత్తులుగా నాయకత్వం వెంట నడిచినారు కాబట్టి.. ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినరు. కాబట్టే ఈ రోజు ఖమ్మం గడ్డ మీద స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఆత్మగౌరవంతో సంభ్రమంగా ప్లీనరీ నిర్వహించుకోగలుగుతున్నం. తెలంగాణ సాధనలో, బంగారు తెలంగాణ నిర్మాణంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల చరిత్ర.. సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటది.

మ్యానిఫెస్టో వంద శాతం అమలు ఈ మధ్య జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్ తదితర కార్పొరేషన్ కార్పొరేటర్లకు శిక్షణ తరగతులు నిర్వహించుకున్నం. ఎప్పుడూ గెలవని పద్ధతుల్లో.. 99 స్థానాల్లో గెలిచిన జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు.. ఇంత అసాధారణరీతిలో ఎందుకు గెలిచారో పరిశీలించుకోవాలని చెప్పిన. అనతికాలంలోనే వంద శాతం మ్యానిఫెస్టోను అమలు చేసినం కాబట్టి ప్రజల్లో మనకు ఈ ఆదరణ ఉందని చెప్పిన. అంబేద్కర్ జయంతి సందర్భంగా 250 గురుకుల పాఠశాలలు ప్రారంభించనమో ఆరోజు నుంచి కేజీ టు పీజీ పాక్షికంగా ప్రారంభమైంది. దాంతో వంద శాతం మ్యానిఫెస్టోను అమలుచేసిన పార్టీ వంద శాతం టీఆర్‌ఎస్ పార్టీనే. మనకు అసాధారణ విజయాలు ఊరికే రావడం లేదు. ప్రజలు నిశితంగా పరిశీలించిన తర్వాతనే ఓటు వేసినరు. 4.80 లక్షలమంది బీడీ కార్మికులకు వెయ్యి భృతి ఇస్తామని వాగ్దానం చేయలె. కళ్యాణలక్ష్మీ హామీ ఇయ్యలె. పేద పిల్లలకు సన్నబియ్యం పథకం ఎక్కడ చెప్పలె. కానీ.. మ్యానిఫెస్టోలో పెట్టనివి కూడా ప్రజలు, మేధావులనుంచి వచ్చిన సూచనలతో అమలు చేసుకుంటూ ముందుకుపోతున్నందునే ప్రజలు అసాధారణ మెజార్టీని కట్టబెడుతున్నరు.

జూన్‌కల్లా పెద్దఎత్తున మొక్కలు నాటాలి.. కెనడాలో ఒకరికి 8వేల చెట్లు ఉండగా, రష్యాలో 4వేలు, అమెరికాలో 600, చైనాలో 102 చెట్లు ఉన్నాయి. ఇండియాలో ఒకరికి కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల కిందట ఎండా కాలంలో 37-38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండేది. ఇప్పుడు 47-48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జీవవైవిధ్యం దెబ్బతిని, పశు పక్ష్యాదులు చనిపోతున్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లోని మంథని తదితర ప్రాంతాల్లో మాత్రమే ఇప్పటివరకు వర్షం కురిసింది. ఇక్కడ అడవులు ఎక్కువగా ఉండటంతోనే వర్షాలు పడ్డాయి. చెట్లులేని చోట వర్షాలే లేవు. తెలంగాణ హరితహారంతో 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అడవులున్న ఏరియాల్లో వంద కోట్లు, హెచ్‌ఎండీఏ పరిధిలో పది కోట్లు, మిగతా జిల్లాలవారీగా 120 కోట్ల మేర మొక్కలు నాటాలని నిర్ణయించాం. ఈ క్రమంలో ఏటా 40 కోట్ల మొక్కలు నాటాలి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తున్నది. దీనికి అనుగుణంగా జూన్‌కల్లా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి.

అందరు బాగుపడితేనే బంగారు తెలంగాణ రాబోయే కొద్దిరోజుల్లో బీసీల్లో వృత్తి పనులవారి ఎజెండాను తీసుకోబోతున్నం. ఈ రోజు కంసాలి, కుమ్మరి వృత్తులు పోయాయి. ఆ వర్గాల వారిని పిలిపించి, మాట్లాడి వాళ్ల సమస్యలన్నింటినీ అడ్రస్ చేసేలా ముందుకుపోతం. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాలు, కులాల ప్రజలు బాగుపడినపుడే అది బంగారు తెలంగాణ.

కేంద్రంపై ఒత్తిడి తేవాలి.. కేంద్రం అడిగిన స్థాయిలో కరువు సహాయక నిధులు ఇవ్వలేదు. కేంద్ర సర్కారు ఇచ్చిన రూ.780 కోట్లు మంచినీళ్లకే సరిపోవడం లేదు. ఇంకా నెల పదిహేను రోజులు కరువు ఉంది కాబట్టి.. ప్లీనరీలో ఉన్న ఎంపీలు కేంద్రం మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావాలి. పార్లమెంటరీ నేత కే కేశవరావు ఈ మేరకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాం.

నిర్వాహకులకు అభినందనలు.. పార్టీ ప్లీనరీకి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసిన వారికి సీఎం కేసీఆర్ కృతజ్ఙతలు తెలిపారు. వాస్తవంగా ఖమ్మంలో చాలా వేడి ఉంటుందనుకున్నాం. కానీ స్ప్రింక్లర్లు పెట్టి ఆ బాధ లేకుండా చేశారు. బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసిన జిల్లా పార్టీ, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బేగ్‌తో పాటు కేంద్ర కమిటీ నాయకుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. మంచి ఆతిథ్యం, రాత్రి బస, భోజనం ఏర్పాటుచేసి.. ఏ లోటు లేకుండా చూశారు.

ప్లీనరీలో భాగంగా సీనియర్ నాయకులు తీర్మానాలు ప్రవేశపెడుతున్న సమయంలో సీఎం పలుమార్లు మాట్లాడారు. ఆ వివరాలు..

తలసాని ప్రజా నాయకుడు.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు శాఖలు మార్చిన తర్వాత మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. వాస్తవంగా ఆయనకు ప్రాధాన్యం తగ్గించలేదు. పెంచాం. ఇప్పటివరకు ఆయన దగ్గర ఉన్నది ప్రభుత్వానికి ఆదాయం పెంచే శాఖ. ఇప్పుడు ఇచ్చినది ప్రజలతో సంబంధముండే శాఖ. తలసాని నిరంతరం ప్రజలతో సంబంధాలు కొనసాగించే నాయకుడు. శాఖలు మార్చే ఎనిమిది రోజుల ముందే తలసాని, నేను చర్చించుకున్నం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే శాఖ అయినందున వాణిజ్య పన్నుల శాఖను నా దగ్గర ఉంచుకున్నాను.

విరాళాలు ఇవ్వండి.. రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు విరాళాలు ఇవ్వాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కోరారు. పార్టీ నడపడానికి పార్టీకి నిధులు అవసరం. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులం ఒక నెల వేతనాన్ని పార్టీ విరాళంగా ఇచ్చాం. ప్రజలకు అప్పీలు చేసినం. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ నాలుగు కాలాలు ఉండాలనే కోరుకునేవారు రూ.100 మించి విరాళాలు ఇవ్వాలని కోరుతున్నా. నేడో, రేపో పార్టీ కేంద్ర కమిటీ మీడియా ద్వారా అప్పీలు చేయడంతోపాటు ఏ అకౌంట్ కు పంపాలో చెప్తారు. రాష్ట్ర, దేశవ్యాప్తంగా టీఆర్‌ఎస్ అభిమానులు పార్టీ నాలుగు కాలాలపాటు ఉండి, ఈ ప్రభుత్వం పనిచేసి బంగారు తెలంగాణ సాకారం అయ్యేందుకు సహకరించాలి అని అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.