Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పల్లెలు మెరవాలి

-30 రోజుల ప్రణాళికతో ముఖచిత్రం మారాలి
-పరిశుభ్రమైన వాతావరణంలో దసరా పండుగ
-ఇతర రాష్ర్టాలు వచ్చి నేర్చుకునేలా పల్లెలు తయారవ్వాలి
-ప్రణాళిక అమలు తర్వాత ఆకస్మిక తనిఖీలు
-లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు
-అజాగ్రత్త, అలసత్వం ప్రదర్శించినవారిపై చర్యలు
-30 రోజుల ప్రణాళిక సక్సెస్ చేయాలని చేతులెత్తి ప్రార్థిస్తున్న
-నాటిన మొక్కల్లో 85 శాతం చెట్లనన్నా రక్షించాలి.. లేకుంటే గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శిపై చర్యలు
-నీళ్లు పోసేందుకు, చెత్త ఎత్తేందుకు ట్రాక్టర్ సమకూర్చుకోవాలి
-కార్యాచరణ అమలు రాష్ట్ర సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్

CM KCR Holds Meeting with Panchayati Raj Officials over Development of Rural Areas in Telangana

తెలంగాణ పల్లెసీమలు దేశంలోని ఇతర రాష్ర్ర్టాలు వచ్చి నేర్చుకునే ఆదర్శగ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే ప్రధాన లక్ష్యంతో చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విస్తృత ప్రజాభాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ముఫ్ఫైరోజుల తర్వాత కచ్చితంగా గ్రామాల ముఖచిత్రం మారితీరాలని, దసరా పండుగను ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై మంగళవారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (టీఎస్‌ఐఆర్డీ) ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్రసదస్సులో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశంచేశారు. గ్రామాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే బృహత్తర ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గ్రామపంచాయతీలకు కావాల్సిన అధికారాలు, విధులు, నిధులను అందించిందని పేర్కొన్నారు. గ్రామపంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్తులకు కూడా అధికారాలు, బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని, నియంత్రిత పద్ధతిలో విస్తృత ప్రజాభాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి జరుగాలని సీఎం నిర్దేశించారు.

ప్రత్యేక ప్రణాళిక పక్కాగా అమలుచేయాలి
పల్లెల ప్రగతికి మంచిమార్గం వేయడానికి అమలుచేసే 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతంచేసే బాధ్యత ప్రజల మీదే ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై, ఏ ఊరి ప్రజలు ఆ ఊరి కథానాయకులై తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని, అవసరమైనచోట ప్రజలే శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు నిబద్ధతతో పనిచేసి, తెలంగాణ గ్రామాలను ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దుతారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా చేయడం, నిధుల సద్వినియోగం, ప్రజాభాగస్వామ్యంతో అభివృద్ధి పనుల నిర్వహణ నిరంతరం సాగాలని, దీనికోసం 30 రోజుల ప్రణాళికతో మంచి ఒరవడి ప్రారంభంకావాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని అన్నారు. దీనికి కలెక్టర్లు నాయకత్వం వహించాలని, పంచాయతీరాజ్ అధికారులు నిబద్ధతతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ బాధ్యతలు పంచుకునేందుకు ముఖ్యశాఖలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, డిప్యూటీ కలెక్టర్ లేదా మరో హాదా కల్పిస్తామని, వారిలో ఒకరిని పంచాయతీరాజ్ శాఖకు కేటాయిస్తామని వివరించారు. సీఎం అంటే రాష్ర్టానికి ముఖ్య సేవకుడు అనే భావనతోనే తానుంటానని, అధికారులు కూడా అలాగే ప్రజాసేవకులం అనుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయని సీఎం అన్నారు.

జవాబుదారీతనం పెంచేలా కొత్త చట్టం
ప్రభుత్వం భారీ పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చిందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కొత్తగా జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటుచేసింది. తండాలు, గూడేలు, శివారుపల్లెలు ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. గ్రామపంచాయతీల సంఖ్య 8,690 నుంచి 12,751కు పెరిగింది. 3,146 మంది ఎస్టీలు సర్పంచ్‌లు అయ్యే అవకాశం కలిగింది. గ్రామీణ పరిపాలనా విభాగాలు పరిపాలనకు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు అనువుగా ఉన్నాయి. పరిపాలనా సంస్కరణకు కొనసాగింపుగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారాలు, విధు లు, నిధుల వినియోగంలో సంపూర్ణ స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. ఎస్కే డే కృషివల్ల ఒకనాడు ఉద్యమంగా కొనసాగిన పంచాయతీరాజ్ వ్యవస్థకు పునర్వైభవం తేవటం, గ్రామవికాసంలో విస్తృత ప్రజాభాగస్వామ్యం కల్పించటం, గ్రామాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి బాటలువేయటం, పచ్చని, పరిశుభ్రమైన పల్లెసీమల నిర్మాణం, ప్రణాళికాబద్ధంగా నిధులు వినియోగించటం, అజాగ్రత్త, అలసత్వానికి ఆస్కారంలేని పాలన అందించటం, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం పెంచటానికి ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది అని సీఎం కేసీఆర్ వివరించారు.

పంచాయతీలు ఏకీకృతంగా ఉండరాదు
గ్రామపంచాయతీలు నేలవిడిచి సాముచేయవద్దని, ఏకీకృతంగా కాకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో వ్యవస్థీకృతంగా గ్రామాల రూపురేఖలు మార్చాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రభుత్వమే చాలా పనులు నిర్వహిస్తున్నది. మిషన్ భగీరథ ద్వారా మంచినీరు, విద్యుత్‌శాఖ ద్వారా నిరంతర విద్యుత్ అందిస్తున్నది. వ్యవసాయశాఖ ద్వారా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలుచేస్తున్నది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించింది. గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ఆర్థికప్రేరణను ప్రభుత్వమే అందిస్తున్నది. పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నది. రేషన్‌షాపుల ద్వారా బియ్యం, ఇతర సరుకులు అందిస్తున్నది. ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి లబ్ధి ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే జరుగుతున్నది. రహదారులు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం తదితర పనులన్నీ ప్రభుత్వమే గ్రామపంచాయతీలపై ఎలాంటి భారం పడకుండా నిర్వహిస్తున్నది అని సీఎం వివరించారు.

పంచాయతీరాజ్‌లో ఖాళీలన్నీ భర్తీచేస్తున్నం
30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలులో గ్రామస్థాయిలో ఎవరి బాధ్యత ఏమిటో చెప్పడానికిముందే ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చి ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చింది. పంచాయతీరాజ్‌శాఖలో అన్ని ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీచేస్తున్నది. ఆర్థికసంఘం నిధులకు రాష్ట్రప్రభుత్వ నిధులుకూడా కలిపి.. గ్రామపంచాయతీలకు నెలకు రూ.339 కోట్ల చొప్పున విడుదలచేస్తున్నది. ఒక ఏడాది ఖర్చుచేయగా మిగిలిన నిధులను వచ్చే ఏడాది బదిలీచేసేలా చట్టంలో నిబంధన పెట్టింది. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36వేల మంది సఫాయీ కర్మచారుల జీవనస్థితిగతులను పరిగణనలోకి తీసుకుని, వారికి నెలకు రూ.8,500 వేతనం చెల్లించాలని నిర్ణయించింది. చెత్త సేకరణ, చెట్లకు నీళ్లుపోయడానికి ట్రాక్టర్లు కొనుగోలుచేసే వెసులుబాటు గ్రామపంచాయతీలకు కల్పించింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచ్‌లపై కలెక్టర్లు చర్యతీసుకుంటే, స్టే ఇచ్చే అధికారం మంత్రులకు లేకుండా చట్టంలోనే నిబంధనలున్నాయి. సర్పంచ్‌లు, అధికారుల అధికారాలు, బాధ్యతలు, విధులను స్పష్టంగా పేర్కొన్నది అని సీఎం వివరించారు. ప్రసంగం అనంతరం అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు, లేవనెత్తిన సందేహాలకు సీఎం సమాధానాలు ఇచ్చారు.

విద్యుత్ పంపిణీలో మెరుగ్గా ఉన్నాం
దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో అన్నిరంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరాచేస్తున్నామని, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థల్లో ఎంతో మెరుగ్గా ఉన్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిననాడు అధ్వాన్నంగా ఉన్న విద్యుత్ విషయంలో నేడు అగ్రగామిగా ఉన్నాం. ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, డిస్కమ్‌ల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు, విద్యుత్ సిబ్బంది ఎంతో కష్టపడి విద్యుత్‌రంగాన్ని తీర్చిదిద్దారు. అదేస్ఫూర్తితో వారు గ్రామాల్లో విద్యుత్ సమస్యలన్నీ పరిష్కరించడానికి ముందుకు వస్తున్నారు అని సీఎం చెప్పారు. ఈ సదస్సులో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీనియర్ అధికారులు, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల కలెక్టర్లు, డీపీవోలు, డీఎఫ్‌వోలు, సీఈవోలు, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, విద్యుత్ డిస్కమ్‌ల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావుతోపాటు ఎస్‌ఈలు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షం
ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితిని ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు 60 లేదా 61 సంవత్సరాలకు పెంచుతామన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయంపై తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి హర్షం వ్యక్తంచేశారు. ఉద్యోగులను పరుష పదజాలంతో దూషించడాన్ని ఇకపై ప్రభుత్వం సహించదని, అలాంటివారిపై చర్యలు తీసుకుంటామనడాన్ని ఆయన స్వాగతించారు. ఉద్యోగుల పదోన్నతులకు చార్ట్ ప్రిపేర్‌చేయడం గొప్ప నిర్ణయమని పద్మాచారి అన్నారు. అర్హులైన అందరికీ పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉద్యమస్ఫూర్తి అవసరం
ప్రజలు తలుచుకుంటే, ఉద్యమస్ఫూర్తితో పనిచేస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయని, దీనికి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎస్కే డే.. గ్రామీణాభివృద్ధికోసం పంచాయతీరాజ్ వ్యవస్థకు పురుడుపోశారు. కూసం రాజమౌళి అనే వ్యక్తి కృషి ఫలితంగా వరంగల్ జిల్లా గంగదేవిపల్లి ఆదర్శగ్రామమైంది. గంగదేవిపల్లిలో 26 గ్రామకమిటీలున్నాయి. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం.. అభివృద్ధికి, గ్రామస్థుల, ముఖ్యంగా మహిళల సాధికారితకు సాక్ష్యంగా నిలిచింది. మొరార్జీదేశాయ్ కృషివల్ల నాటి బొంబాయి నగరంలో ట్రాఫిక్ నియంత్రణ సాధ్యమైంది అని సీఎం సోదాహరణంగా చెప్పారు.

పంచాయతీలపై గురుతర బాధ్యత
గ్రామపంచాయతీలపై కొన్ని నిర్దిష్ట, ముఖ్యమైన పనులు నిర్వహించే బాధ్యత ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొందించటం, పచ్చదనం పెంచి, పరిశుభ్రతను కాపాడటం, వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించటం, వాటికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించటం, నియంత్రిత పద్ధతిలో నిధుల వినియోగం, క్రమంతప్పకుండా పన్నుల వసూలు, విద్యుత్ బిల్లులవంటివి చెల్లించటం, వీధిలైట్లను సరిగ్గా నిర్వహించటంవంటివి గ్రామస్థాయిలో పంచాయతీల ముఖ్యమైన విధులు అని సీఎం కేసీఆర్ చెప్పారు.

CMKCR1

ఇదీ కార్యాచరణ
30 రోజుల ప్రత్యేక కార్యాచరణపై మంగళవారంనాటి సదస్సులో విస్తృతంగా చర్చ జరిగింది. 30 రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక కార్యాచరణలో భాగంగా పారిశుద్ధ్యం కాపాడే విధులు, పచ్చదనం పెంచే విధులు, నిధులు సద్వినియోగం చేసే విధులు, పరిపాలనా విధులు, విద్యుత్ సంబంధ కర్తవ్యాలను సీఎం విడివిడిగా విడమరిచి చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటించిన కార్యాచరణ ఈ విధంగా ఉన్నది. -సెప్టెంబర్ 6 నుంచి నెలపాటు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలి. -సెప్టెంబర్ 4న కలెక్టర్లు జిల్లాస్థాయి సదస్సు నిర్వహించి, ప్రత్యేక కార్యాచరణ అమలుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధంచేయాలి. -ప్రతి గ్రామానికి ఒక మండలస్థాయి అధికారిని పర్యవేక్షకుడిగా నియమించాలి. -జిల్లాస్థాయిలో కలెక్టర్, మండలస్థాయిలో మండల పంచాయతీ అధికారి, గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. -ప్రజలను చైతన్యపరచడానికి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతపై నినాదాలు రాయాలి. -మొదటిరోజు గ్రామసభ నిర్వహించాలి. గ్రామసభలో సీఎం కేసీఆర్ సందేశాన్ని చదివి వినిపించాలి. కార్యక్రమ ఉద్దేశాలను ప్రజలకు వివరించాలి. -రెండోరోజు కో ఆప్షన్ సభ్యులను ఎంపికచేయాలి. స్టాండింగ్ కమిటీలను నియమించాలి. -సర్పంచ్‌ల కుటుంబసభ్యులను కోఆప్షన్ సభ్యులుగా నియమించవద్దని ప్రభుత్వం నిబంధన పెట్టింది. కోఆప్షన్, స్టాండింగ్‌కమిటీ సభ్యులుగా ఎంపిక విషయంలో చట్టంలో నిబంధనలను, ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి. -స్టాండింగ్‌కమిటీల్లో సగంమంది మహిళలుండాలి. -సర్పంచ్, గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రత్యేకాధికారి, గ్రామపంచాయతీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, స్టాండింగ్‌కమిటీ సభ్యులు గ్రామంలో పాదయాత్ర నిర్వహించాలి. -ఏయేపనులు చేయాలో రాసుకోవాలి. దానిప్రకారం గ్రామప్రణాళిక తయారుచేయాలి. గ్రామప్రణాళిక రూపకల్పనలో ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించాలి. వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారుచేయాలి. ప్రతీ గ్రామప్రణాళిక మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారుల వద్ద ఉండాలి. -30 రోజుల్లో ఒకరోజు పూర్తిగా మహిళలకు కేటాయించాలి. మహిళాసంఘాల ఆధ్వర్యంలో మహిళలు గ్రామంలో పచ్చదనం, పారిశుద్ధ్యం కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి

పారిశుద్ధ్య విధులు :
-గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ గ్రామపంచాయతీలపై ఉన్న ప్రధాన బాధ్యత. -కూలిపోయిన ఇండ్లు, పాడుబడిన పశువుల కొట్టాల శిథిలాలు తొలిగించాలి. -సర్కారుతుమ్మ, జిల్లేడు, వయ్యారిభామ లాంటి పిచ్చిచెట్లను తొలిగించాలి. -పాడుబడిన బావులను, వాడకంలోలేని బోర్లను, లోతట్టు ప్రాంతాల్లోని నీటిగుంతలను పూడ్చివేయాలి. -ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునేలా, వాటిని ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలి. -దోమల మందు పిచికారీచేయాలి. -డ్రైనేజీలను శుభ్రంచేయాలి. మురికికాల్వల్లో ఇరుక్కుపోయిన చెత్తాచెదారం తొలిగించాలి. -రోడ్లపై గుంతలను పూడ్చాలి. -పాఠశాలలు, దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు గ్రామపంచాయతీ చేయాలి. -సంతలు, మార్కెట్ ప్రదేశాలను శుభ్రపరచాలి. -ప్రతీ ఇంట్లో చెత్తబుట్ట ఉండేలా ప్రజలను ప్రోత్సహించాలి. -చెత్తను ఎత్తి, డంపింగ్ యార్డులో వేసి, ఆ చెత్తను కంపోస్టు ఎరువుగా వినియోగించేలా బాధ్యత తీసుకోవాలి. -అవకాశం ఉన్నచోట బందెలదొడ్డి ఏర్పాటుచేయాలి. -సఫాయీ కర్మచారులకు జీతాలు పెంచినందున, వారిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. -ఎవరైనా రోడ్డుపై చెత్తవేస్తే రూ.500 జరిమానా విధించే నిబంధన కూడా చట్టంలో ఉన్నది. దీన్ని గ్రామపంచాయతీలు వినియోగించుకుని, ప్రజల్లో చైతన్యం కలిగించి, గ్రామాలను అద్దంలా తీర్చిదిద్దాలి. -దహనవాటికలు, ఖననవాటికలు (వైకుంఠధామం), డంపింగ్ యార్డులకు కావాల్సిన స్థలం ఎంపికచేయాలి. -దహనవాటికలకు ప్రభుత్వస్థలం లేకుంటే గ్రామపంచాయతీ నిధులతో స్థలం కొనుగోలుచేయాలి. దాతల విరాళాలద్వారా కూడా స్థలం కొనుగోలుకు ప్రయత్నించాలి.

విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి పవర్‌వీక్ నిర్వహించాలి
-గ్రామంలో పవర్ వీక్ నిర్వహించాలి. విద్యుత్‌శాఖ సిబ్బంది గ్రామంలోనే ఉండి సహకరిస్తారు. -వేలాడుతున్న, వదులుగా ఉండే కరంట్ వైర్లు, విద్యుత్ స్తంభాలను సరిచేయాలి. -వంగిన స్తంభాలను సరిచేయాలి. తుప్పుపట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటుచేయాలి. -ఎల్‌ఈడీ లైట్లను అమర్చాలి. -వీధిదీపాల సమర్థ నిర్వహణకు థర్డ్‌వైర్, సపరేట్ మీటర్, స్విచ్చులు బిగించాలి. -పగలు వీధిలైట్లు వెలుగకుండా చూడాలి. చలికాలంలో సాయంత్రం 6 గంటలనుంచి ఉదయం 6.30 వరకు, ఇతర సమయాల్లో సాయంత్రం 7 గంటలనుంచి ఉదయం 5.30 వరకు వీధి లైట్లు వేయాలి.

ఆర్థికపరమైన విధులు
-వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించాలి. వాటికి గ్రామసభ ఆమోదం తీసుకోవాలి. -ఈ ప్రణాళికలకు అనుగుణంగానే బడ్జెట్ రూపొందించాలి. -అప్పులు, జీతాల చెల్లింపు, కరంట్ బిల్లుల చెల్లింపు తదితర ఖర్చులను తప్పనిసరిగా చేయాల్సిన వ్యయం (చార్జ్‌డ్‌అకౌంట్)లో చేర్చాలి. -ప్రతీ ఇంటికీ, ప్రతీ ఆస్తికి సరైన విలువ కట్టాలి. క్రమంతప్పకుండా ఆస్తుల విలువ మదింపుచేయాలి. -పన్నులు క్రమంతప్పకుండా వసూలుచేయాలి. పన్నులు వందశాతం వసూలుచేయని గ్రామ కార్యదర్శిపై చర్యలుంటాయి. -మొక్కలు నాటడం, శ్మశానవాటిక నిర్మాణం, డంపు యార్డు నిర్మాణం తదితర పనులకు నరేగా నిధులు వినియోగించాలి.

నిధుల సమీకరణ మార్గాలు
-రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు వస్తాయి. -ఫైనాన్స్ కమిషన్ నిధులు సమకూరుతాయి. -నరేగా నిధులు వస్తాయి. -గ్రామ పంచాయతీ సాధారణ నిధులు అందుబాటులో ఉంటాయి. -ప్రజల శ్రమదానంతో పనులు నిర్వహించాలి. -సీఎస్సార్ నిధులను సమకూర్చుకోవాలి. -దాతల నుంచి విరాళాలు సేకరించాలి.

రాష్ట్రవ్యాప్తంగా 100 ఫ్లయింగ్ స్క్వాడ్లు
-ప్రభుత్వం సీనియర్ అధికారుల నేతృత్వంలో 100 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేస్తుంది. -30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు తర్వాత ఈ బృందాలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాయి. -లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు అందుతాయి. -అజాగ్రత్త, అలసత్వం ప్రదర్శించినవారిపై చర్యలుంటాయి.

పచ్చదనం పెంచే విధులు
-ఇంటి దగ్గర నాటడానికి అవసరమైన మొక్కల ఇండెంట్‌ను గ్రామపంచాయతీ సేకరించాలి. ప్రతీ ఇంటికి వేపమొక్క సహా ఆరు మొక్కలు పంపిణీచేయాలి. -వ్యవసాయ భూములు, వ్యవసాయ బావుల వద్ద పెంచడానికి అనువైన మొక్కలను రైతులకు అందివ్వాలి. మండల వ్యవసాయాధికారి సహకారంతో రైతుల నుంచి ఇండెంట్లు తీసుకోవాలి. చింత, అల్లనేరేడు, ఇతర మొక్కలు పంపిణీచేయాలి. -ఇండెంట్ కన్నా ఎక్కువ మొక్కలను అందుబాటులో ఉంచుకోవాలి. చనిపోయిన మొక్కలస్థానంలో కొత్త మొక్కలు నాటాలి. -గ్రామ విస్తీర్ణానికి అనుగుణంగా, శాస్త్రీయంగా అంచనావేసి అవసరమైన మొక్కలను సిద్ధంచేయడానికి గ్రామపంచాయతీల ఆధ్వర్యంలోనే నర్సరీలు ఏర్పాటుచేయాలి. శాశ్వత ప్రాతిపదికన నర్సరీలు నిర్వహించడానికి అనువైన స్థలం ఎంపికచేయాలి. -నర్సరీలను పెంచడానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి గ్రామపంచాయతీలకు సాంకేతిక సహకారం అందించాలి. -గ్రామపంచాయతీ లోపల నాటడానికి అందుబాటులో ఉన్న భూములను, పంచాయతీ సరిహద్దుల్లో ఉన్న భూములు, రహదారులను కూడా గ్రామపంచాయతీ గుర్తించాలి. -ఊరు బయట అడవులు, కంచెలు, గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా పండ్ల మొక్కలు పెంచడంద్వారా కోతుల బెడదను తీర్చవచ్చు. -గ్రామ గ్రీన్‌ప్లాన్ (హరిత ప్రణాళిక)ను సిద్ధంచేయాలి. అన్ని గ్రామాల గ్రీన్‌ప్లాన్‌కు అనుగుణంగా జిల్లా గ్రీన్‌కమిటీ ఆధ్వర్యంలో జిల్లా గ్రీన్‌ప్లాన్ తయారుచేయాలి. -మొక్కల రక్షణకు గ్రామపంచాయతీ ఏర్పాట్లు చేయాలి. -గ్రామ బడ్జెట్లో 10 శాతం నిధులు పచ్చదనం పెంచడానికి వినియోగించాలి. -ప్రతి గ్రామపంచాయతీ విధిగా ట్రాక్టర్ సమకూర్చుకోవాలి. -చెత్త సేకరణకు, చెట్లకు నీళ్లు పోయడానికి ట్రాక్టర్ వినియోగించాలి. -నాటిన మొక్కల్లో 85 శాతం చెట్లనన్నా రక్షించకుంటే, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శిపై చర్యలుంటాయి.

పదవీ విరమణ వయస్సును పెంచితీరుతం
-పదోన్నతులపై వేసిన కేసులను ఉద్యోగులు ఉపసంహరించుకోవాలి -ఉద్యోగులను దూషించేవారిపై చర్యలు తీసుకుంటాం -వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలుపుతూ వెంటనే ఉత్తర్వుల జారీకి సీఎం ఆదేశం

ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితిని 60 లేదా 61 సంవత్సరాలకు పెంచుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. అన్నిశాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్ చార్ట్ రూపొందించాలని, తమకు ఏ తేదీన ప్రమోషన్ వస్తుందో సదరు ఉద్యోగికి ముందే తెలిసిఉండాలని, పదోన్నతులకోసం పైరవీలుచేసే దుస్థితి పోవాలని అన్నారు. ఉద్యోగులు కూడా పదోన్నతుల విషయంలో వేసుకున్న కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. అందరికీ పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను కూడా సృష్టిస్తామని సీఎం వెల్లడించారు.

ఉద్యోగులను దూషిస్తే సహించం
మండల, జిల్లాపరిషత్ సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను పరుషపదజాలంలో దూషించడాన్ని ఇకపై ప్రభుత్వం సహించబోదని, అలాంటివారిపై చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలుపుతూ వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.