-కంటివెలుగు @ 6 లక్షలు
-ప్రజలకు అందుబాటులో కంటిపరీక్షలు
-వైద్యశిబిరాలపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి
-కంటి వెలుగు భేష్: బ్రిటిష్ అధికారుల ప్రశంస
-పరీక్షలు చేయించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్
-దృష్టి లోపాలు ఉండొద్దనే కంటివెలుగు: స్పీకర్
-శిబిరంలో పరీక్షలు చేయించుకున్న మధుసూదనాచారి
-గురువారం లక్షా 16 వేల మందికి..
-20852 మందికి కండ్లద్దాల అందజేత
-695 మందికి కాటరాక్ట్ ఆపరేషన్ల నిర్వహణ..
-వైద్యశిబిరాలపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి
ప్రజలకు దృష్టిలోపాలుండకూడదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో సంకల్పించిన కంటివెలుగు కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రమంతటా వెలుగులు ప్రసరింపజేస్తున్నది. పట్టణ ప్రాంతాలతోపాటు ప్రత్యేకించి గ్రామీణ ప్రజల్లో అంతులేని ఆనందాన్ని కలుగజేస్తున్నది. ఇంతకాలం పలు రకాల కారణాలతో కంటి పరీక్షలు చేయించుకోని గ్రామీణ ప్రాంతవాసులు ఇప్పుడు తమ ఇంటికి దగ్గరే అన్నీ ఉచితంగా అందజేస్తున్న తీరుకు సంబురపడిపోతున్నారు. పట్నాలకు పోవడం కష్టమైన పని అనుకున్నవారు.. తమ దగ్గరే పైస ఖర్చు లేకుండా పరీక్షలు చేస్తుండటంతో మురిసిపోతున్నారు. దృష్టిలోపంపై ప్రభుత్వం సమరం ప్రారంభించగా పేదల కండ్లల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో ఊరూరా భారీ స్పందన వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతున్నదని అన్ని వర్గాల నుంచి అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 15న ప్రారంభించిన కంటివెలుగు శిబిరాల్లో ఇప్పటివరకు దాదాపు ఆరు లక్షల మంది (5,92,166 మంది) కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో సేవలందిస్తున్నారు. గురువారం 820 కంటి వైద్య శిబిరాల్లో 116550 మందికి పరీక్షలు చేశారు. 20852 మందికి కండ్లద్దాలు అందజేశారు. గురువారం 695 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేశారు.
దృష్టిలోపంపై సమరం.. పేదల కండ్లల్ల సంతోషం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతున్నదని అన్ని వర్గాలవారు ప్రశంసిస్తున్నారు. కార్యక్రమం ప్రారంభమైన ఆగస్టు 15 నాటినుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన వైద్యశిబిరాల్లో ఇప్పటివరకు 5,92,166 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. పౌరులెవరూ కంటిచూపు కోల్పోవద్దన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాలపై ప్రజల్లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతున్నది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 820 కంటి వైద్య శిబిరాలలో 116550 మందికి పరీక్షలు చేశారు. ఇందులో పురుషులు 50666 మంది, మహిళలు 65878 మంది, ట్రాన్స్‌జెండర్స్ ఆరుగురు ఉన్నారు. 20852 మందికి కంటి అద్దాలను అందజేశారు. కంటి అద్దాలు పొందినవారిలో 40 ఏండ్ల లోపువారు 3824 మంది, 40 ఏండ్ల పైబడినవారు 17028 మంది ఉన్నారు. వివిధ కంటి సమస్యలు ఉన్న 11250 మందికి ఇతర పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ప్రత్యేక కంటి సమస్య ఉన్న 28027 మందికి అద్దాల కోసం ఇండెంట్ పంపారు. గురువారం 10861 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు అవసర మని భావించగా.. 695 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేశారు. 39058 మందికి ఎటువంటి కంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించారు.
కండ్లలో కొత్త కాంతులు -ఆదిలాబాద్‌లో భారీ స్పందన -17 గ్రామాల్లో 12,100 మందికి పరీక్షలు -2456 మందికి అద్దాల పంపిణీ
ఆదిలాబాద్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి భారీ స్పందన వస్తున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 17 గ్రామాల్లో 12,100 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రతి గ్రామంలో రోజుకు 200 నుంచి 250 మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన అద్దాలను పంపిణీ చేస్తున్నారు. ఆపరేషన్ల కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్, ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాలలకు రెఫర్ చేస్తున్నారు. జిల్లాలో మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు కంటి పరీక్షల కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం జిల్లా ప్రజల పాలిట వరంగా మారింది. వైద్యబృందాలు గ్రామాల్లోకి వచ్చి ఆధునిక యంత్రాలతో కంటి పరీక్షలు నిర్వహిస్తుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఇంతకాలం కంటిచూపు సరిగాలేక, దేన్నీ సరిగా గుర్తించలేకపోయామని, కంటివెలుగు కార్యక్రమం ద్వారా తమ జీవితాల్లో కొత్త కాంతులు నిండాయని సంబురపడుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన కంటివెలుగు వైద్యశిబిరాల్లో దూరదృష్టి సరిగా లేకపోవడం, కంటి శుక్లాలు, కంటిపొర, గ్ల్లకోమా లాంటి సమస్యలను గుర్తించారు. ఇప్పటి వరకు 2456 మందికి అద్దాలను పంపిణీ చేశారు. 1882 మందిని ప్రాథమికంగా ఆపరేషన్ల కోసం రెఫర్ చేశారు. వీరిలో కంటిశుక్లాలు ఉన్నవారు 1500, గతంలో ఆపరేషన్లు చేయించుకున్న శుక్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉన్నవారు 131 మంది, కంటిపొర సమస్యలున్న 143 మంది, గ్లకోమా (కండ్లల్లోనరాల ఒత్తిడి) సమస్యలున్న 108 మందిని గుర్తించారు. వీరికి ఆదిలాబాద్ రిమ్స్, ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాలల్లో మరోసారి వైద్యనిపుణులతో పరీక్షలు అవసరమైన ఆపరేషన్లు చేయనున్నారు. శిబిరాల్లో గుర్తించినవారికి కంటి ఆపరేషన్ల కోసం ఒక్కొక్కరికి రూ.25 వేల వరకు ఖర్చవుతుందని వైద్యశాఖ అధికారులు అంటున్నారు.
దృష్టిలోపంపై సమరం
ప్రజలందరికీ కంటి పరీక్షలను ఉచితంగా చేయాలని ముఖ్యమంత్రి చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి కామారెడ్డి జిల్లాలో ఊరూరా భారీ స్పందన వస్తున్నది. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో 22 బృందాలు ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాయి. ఒక్కో బృందం కనీసం 200 నుంచి 250 మందిని పరీక్షిస్తుండగా ఇప్పటివరకు దాదాపు 18వేల మందికి పరీక్షలు నిర్వహించారు. సుమారు వెయ్యిమందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. 1850 మందికి కంటిపరీక్షల్లో తేలిన లోపాల ఆధారంగా నాణ్యమైన కండ్లద్లాల కోసం హైదరాబాద్‌కు ఆర్డర్ ఇచ్చారు. 2200 మందికి శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉంది. వీరికి మూడువారాల్లోగా హైదరాబాద్‌లోని సరోజినిదేవి కంటి దవాఖానా, ఎల్వీ ప్రసాద్ ఐ
హాస్పిటల్‌లో చికిత్సలు, సేవలందనున్నాయి.
16వేల మందికి పరీక్షలు -కంటి వెలుగుకు వికారాబాద్ జిల్లాలో విశేష స్పందన -శుక్లాల సమస్య అధికం.. ఒత్తిడితో చిన్నపిల్లలకు ఇబ్బందులు అంధత్వరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకుగాను రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 16,510 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. దగ్గరచూపు సమస్య ఉన్నవారికి వైద్యశిబిరంలోనే కండ్లద్దాలను పంపిణీ చేస్తున్నారు. దూరపు చూపు కనిపించనివారికి 15 రోజుల్లో కండ్లద్దాలు ఇంటింటికి వెళ్లి అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు జిల్లాలో 1877 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. శస్త్రచికిత్సల నిమిత్తం హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో కంటిచూపు సమస్యలకు సంబంధించి శుక్లాల సమస్యతో బాధపడుతున్నవారే అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ శుక్లాల సమస్య అన్ని వయస్సులవారిని ఇబ్బందిపెడుతున్నది. చిన్నపిల్లల్లో ఒత్తిడితోనే కంటి చూపు సమస్య వస్తున్నట్లు చెప్తున్నారు. సరిగ్గా తినకపోవడం, మొబైల్స్ వాడకంతో రేడియేషన్ ప్రభావం, ఏ విటమిన్ సమస్యతో చిన్నపిల్లల్లో కంటిచూపు సమస్య ఉత్పన్నమవుతుందంటున్నారు. తీవ్ర ఒత్తిడి ప్రభావంతో ఇంటర్, డిగ్రీ విద్యార్థినుల్లో చాలావరకు కంటిచూపు సమస్య కనిపించిందని జిల్లా అంధత్వ నివారణ ఇంచార్జ్ అధికారి తెలిపారు. ఏడాదికి ఒకసారి కంటిపరీక్షలు చేయించుకుంటే దృష్టి లోపం సమస్యలను చాలావరకు నిరోధించవచ్చని సూచించారు.
కరీంనగర్‌లో విజయవంతంగా
-21,253 మందికి పరీక్షలు
-6,283 మందికి కండ్లద్దాల పంపిణీ
కరీంనగర్ జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 21,253 మందిని వైద్యులు పరీక్షించారు. ఇందులో 6,283 మందికి అద్దాలు పంపిణీ చేయగా.. 3,158 మందిని శస్త్రచికిత్సల కోసం వివిధ దవాఖానలకు రెఫర్ చేశారు. జిల్లాలో 24 బృందాలు పనిచేస్తుండగా ఇప్పటివరకు 8 కేంద్రాల్లో పరీక్షలు పూర్తిచేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జీ సుజాత తెలిపారు. జిల్లాలోని రేకుర్తి కంటి దవాఖానలో రోజుకు 20, కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన, ప్రతిమ, చలిమెడ వైద్యకళాశాలల్లో రోజుకు 10 మంది చొప్పున శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. మరిన్ని ప్రైవేట్ దవాఖానల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు.
అభివృద్ధి ఫలాలను చూడాలనే..
శిబిరంలో పరీక్షలు చేయించుకున్న స్పీకర్ మధుసూదనాచారి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను ప్రజలంతా చూడాలనే కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టినట్లు శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో కంటివెలుగు శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం పలువురికి కంటి అద్దాలను పంపిణీ చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వ్యంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతీ ఒక్కరు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూడాలని.. దృష్టి లోపం ఎవరికీ ఉండొద్దన్న లక్ష్యంతో కంటి వెలుగు అమలు చేస్తున్నామన్నారు. ఉచితంగా గ్రామాల్లో కంటిపరీక్షలు చేయడంతోపాటు అద్దాలు, మందులను అందిస్తున్నందున పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో అనురాధ, డీఐవో మధుసూదన్, డెమో అధికారి స్వరూపారాణి, వైద్యాధికారి నాగశశికాంత్, తహసీల్దార్ వెంకట్‌భాస్కర్, రైతు సమితి మండల కన్వీనర్ కర్ర ఆదిరెడ్డి పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌లో పదివేల మందికి.. కుమ్రంభీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కంటివెలుగు వైద్యశిబిరాలకు భారీ స్పందన వస్తున్నది. ఆగస్టు 15న ప్రారంభమైన శిబిరాల్లో ఇప్పటివరకు పదివేల 44 మంది కంటిపరీక్షలు చేయించుకున్నారు. 3139 మందికి అప్పటికప్పుడే కంటి అద్దాలను అందించగా.. మరో 1028 మందికి తెప్పించనున్నారు. ఆపరేషన్లకోసం 757 మందిని రెఫర్ చేశారు. 2738 మందికి వివిధ రకాల మందులను అందజేశారు. పిల్లల్లో ప్రస్తుతం వెలుగుచూస్తున్న దృష్టిలోపాలు సమస్యాత్మకమైనవి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తూ వదిలేస్తే పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. జిల్లాలో 206 మంది పిల్లల్లో దృష్టిలోపాలను గుర్తించిన వైద్యులు వారికి అవసరమైన మందులు అందించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో లక్ష మందికి పరీక్షలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం వరకు లక్షమందికిపైగా ప్రజలు కంటివెలుగు కార్యక్రమంలో పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో దాదాపు సగం మందికి అధికారులు ఉచితంగా కండ్లద్దాలు అందజేశారు. కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. గురువారం వరకు మొత్తం 1,04,505 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. డివిజన్లవారీగా కమ్యూనిటీ హాళ్లు, ఇతర ప్రభుత్వ భవనాల్లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గ్రామీణ ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. చాలాకాలంగా ఇండ్ల నుంచి దూరంవెళ్లి కంటిచికిత్సలు చేయించుకోనివారు ఇప్పుడు సమీపంలోనే ఆ సదుపాయం పొందుతున్నారు. కంటి సమస్యలు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడానికి, కంటిచూపును కాపాడుకోవటానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. -డాక్టర్ మాన్‌సింగ్, వికారాబాద్ జిల్లా అంధత్వ నివారణ అధికారి
పరీక్షలు మంచిగా చేస్తుండ్రు మనకు కండ్లు సక్కగా కనపడకపోతే ఏ పనీ చేయలేం. సర్కారు కంటి పరీక్షలు చేయడం చాలా మంచిది. మా ఉళ్లో డాక్టర్లు, సిబ్బంది అందరికీ మంచిగా కంటి పరీక్షలు చేస్తుండ్రు. అవసరమైనోళ్లకు అద్దాలు ఇస్తుండ్రు. ఆపరేషన్లు కూడా చేస్తామని చెప్తుండ్రు. – కజ్జనార్ అన్నపూర్ణ, బట్టిసవర్‌గాం, ఆదిలాబాద్ మండలం
ఉచితంగా అద్దాలు ఇచ్చిండ్రు.. నాకు కొన్ని రోజులుగా కండ్ల సమస్య ఉంది. దూరం వస్తువులు సరిగా కనపడవు. ఇంద్రవెల్లిలో జరిగిన కంటివెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకున్నా. డాక్టర్లు నాకు అద్దాలు ఇచ్చిండ్రు. సర్కారు చేస్తున్న ఈ పని చాలా మంచిగుంది. పేదలకు చాలా సౌలత్ చేస్తున్నారు. – సోన్ కాంబ్లే కుషవర్తబాయి. సట్వాజిగూడ, ఇంద్రవెల్లి మండలం
చిన్నక్షరాలూ ఇక కనబడుతై.. నేను 5వ తరగతి చదువుతున్న. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. అమ్మమ్మవాళ్ల ఇంటి వద్ద ఉంటున్నం. నాకు చిన్న చిన్న అక్షరాలు కనబడుతలేవు. తప్పులు చదివితే టీచర్లు కోపం చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి తలనొస్తున్నది. మా తాత తాటిచెట్లు ఎక్కుతడు. మాకు డబ్బులు లేక హాస్పిటల్‌కు పోలేదు. మా ఊరికి వచ్చిన కండ్ల డాక్టర్లు నాకు పరీక్షలు చేసి సైట్ ఉందని చెప్పిన్రు. రెండుమూడు రోజులల్ల కండ్లద్దాలు ఇస్తమని చెప్పిన్రు. -నీల ఆకాంక్ష, ఐదో తరగతి విద్యార్థిని, వీణవంక, కరీంనగర్ జిల్లా
పట్నాలకు పోవడం కష్టమైన పని గ్రామీణ ప్రాంతంలో ఉచిత కంటివైద్య శిబిరాన్ని ఏర్పాటుచేయడం అభినంద నీయం. పట్టణ ప్రాంతాలకు వెళ్లి కంటివైద్య పరీక్షలు చేయించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం గ్రామీణ ప్రజల కోసం ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించడం చాలా ఉపయోగకరంగా ఉంది. ఉచితంగా పరీక్షలు చేసి కండ్లద్దాలు ఇవ్వడం, అవసరమైనవారికి ఆపరేషన్లు చేయడం సంతోషం. – సొప్పరి మల్లయ్య, రామయ్యగూడెం, వికారాబాద్