Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పల్లె, పట్నం పచ్చల హారం

-తెలంగాణ పల్లె మాట ప్రగతి బాట
-పండుగలా పల్లె, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం ప్రారంభం
-హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు

జననం నుంచి మరణం దాకా మనిషికి తోడు ఉండేది చెట్టే. నీడనిచ్చేది పల్లె. మననుంచి కాసింత ప్రేమను తప్ప మరేమీ ఆశించకుండా ఆదరించేది పల్లె. అలాంటి ఊరు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉసూరుమన్నది. నీళ్లు లేక, కరెంటు లేక, పరిశుభ్రత లేక, సౌకర్యాలు లేక, చివరికి చనిపోతే కాల్చే స్థలం కూడా లేక సతమతమైంది.

ఎడారిలా మారిన పల్లెకు తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంత కళ వచ్చింది. కొత్త కళ వచ్చింది. ఇప్పుడు ప్రతి ఊళ్లో ఏరోజుకారోజు చెత్త సేకరించే ట్రాక్టరు ఉన్నది. ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీళ్ల నల్లా ఉన్నది. షాకులు కొట్టే ఇనుప కరెంటు స్తంభాల బదులు సిమెంటు పోల్స్‌ వెలిశాయి. ఎల్‌ఈడీ లైట్లు వెలిగాయి. దేశంలోనే మరేరాష్ట్రంలోనూ లేని రీతిలో ఊరి అవసరాలు తీర్చడానికి ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నది. పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు దేశంలోనే మొట్టమొదటిసారిగా అదనపు కలెక్టర్లను బాధ్యులుగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. మన ఊరిని, పట్టణాన్ని మరింత బాగు చేసుకునేందుకు గురువారం నుంచి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. అనేక చోట్ల మంత్రులు, నేతలు వీటిలో పాల్గొన్నారు.

పల్లె, పట్నం పచ్చల హారం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నట్టు ఏ ఊరికి ఆ ఊరివారే కథానాయకులు. ప్రజలు, మేధావులు, గ్రామ పెద్దలు, స్థానిక నేతలు, సీనియర్‌ సిటిజన్లు ఊరిని బాగుచేసే ఈ మహాయజ్ఞంలో పాల్గొనాలి. పల్లెకు ఊతమిస్తున్న ప్రభుత్వాన్ని తమ చేతలతో, చేతులతో బలపర్చాలి. తమ పల్లెల ప్రగతికోసం, తమ నేలల పచ్చదనం కోసం చేతులు కలపాలి. కలిసి నడవాలి.

ఊరూ, వాడా, పల్లె, పట్నం ‘ప్రగతి’ కోసం కదిలాయి. తెలంగాణను పచ్చనిహారాలుగా మలుచుకునేందుకు నడుంబిగించాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం తెలంగాణకు హరితహారంతోపాటు నాలుగో విడత పల్లె ప్రగతి, మూడోవిడత పట్టణ ప్రగతి కార్యక్రమాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. మంత్రులు మొదలు వార్డు సభ్యుల దాకా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు పాల్గొన్న ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా ఉత్సాహంగా భాగస్వాములయ్యారు.

చిన్నా, పెద్దా.. పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా అంతా హాజరయ్యారు. పల్లె ప్రగతిలో భాగంగా మొదటిరోజు గురువారం రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. పల్లె ప్రగతి కార్యక్రమ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. గ్రామ పంచాయతీ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలనుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటారు. పట్టణ ప్రగతిలో భాగంగా 1,511 దళిత బస్తీల్లో వివిధ శాఖల అధికారులు పర్యటించారు. మౌలిక సదుపాయాలను పరిశీలించి.. ఇంకా చేపట్టాల్సిన ప్రగతి పనుల వివరాలను సేకరించారు.

పల్లె, పట్నం పచ్చల హారం
పట్టణ ప్రగతిలో..
పట్టణ స్థానిక సంస్థల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు 30,377 మొక్కలను నాటారు. ఇంటింటికీ పంపిణీలో భాగంగా 77,503 మొక్కలను పంచారు. 2,314 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా, రోడ్డు మధ్యలో 5,481 మీటర్ల పొడవునా మొక్కలు నాటారు. మున్సిపాలిటీల్లో 128 విద్యుత్తు మీటర్లను మార్చారు. 1,732 మీటర్ల మేర వేలాడుతున్న విద్యుత్తు వైర్లను సరిచేశారు. 168 పార్కులను, 1,338 కిలోమీటర్ల పరిధిలో మురుగు కాలువలను శుభ్రం చేశారు. 1,566 కిలోమీటర్ల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పొదలు, పిచ్చి మొక్కలను తొలగించారు. 169 నీటి ట్యాంకులను, 326 ప్రజా మరుగుదొడ్లను శుభ్రం చేశారు. 2,581 టన్నుల చెత్త, 876 టన్నుల వ్యర్థాలు, శిథిలాలను తొలగించారు.

పల్లె, పట్నం పచ్చల హారం
పల్లె ప్రగతిలో..
పల్లెప్రగతిలో భాగంగా గురువారం 3,687 వైకుంఠధామాలకు, 4,110 డంపింగ్‌ యార్డులకు బయోఫెన్సింగ్‌ ఏర్పాటుచేశారు. ఇంటింటికీ ఆరుచొప్పున 5.55 లక్షల కుటుంబాలకు 28.26 లక్షల మొక్కలను పంపిణీ చేశారు. గతంలో నాటిన మొక్కల్లో చనిపోయిన వాటిస్థానంలో 5.21 లక్షలు కొత్తగా నాటారు. రోడ్లకు ఇరువైపులా 898 కిలోమీటర్ల మేర మొక్కల పెట్టారు. 2,135 తుప్పు పట్టిన, వంగిన విద్యుత్తు స్తంభాలను మార్చారు. కొత్తగా 2,831 విద్యుత్తు మీటర్లను బిగించారు. 47,556 రోడ్లను శుభ్రపరిచారు. 26,043 మురుగు కాలువలను శుభ్రంచేశారు. 3,793 నీరు నిల్వ ఉండే ప్రాంతాలను మొరంతో పూడ్చారు. 23,183 ప్రభుత్వ సంస్థల పరిధిలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

‘ప్రగతి’తో సర్వతోముఖాభివృద్ధి
వేల్పూర్‌/భీమ్‌గల్‌: పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నాయని ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో పల్లె ప్రగతిని, భీమ్‌గల్‌లో పట్టణ ప్రగతిని ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోని ప్రతి పంచాయతీకి కేంద్ర నిధులతో సమానంగా రాష్ట్ర నిధులు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. భీమ్‌గల్‌లో మొక్క నాటారు. వేల్పూర్‌లో సమస్యలను తెలుసుకున్నారు.

పట్టణాల రూపురేఖల్లో మార్పు
జగిత్యాల అర్బన్‌: పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టిందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఉద్ఘాటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి సర్కారు సంకల్పాన్ని నెరవేర్చాలని ఆదేశించారు. గురువారం జగిత్యాల పట్టణంలోని 11వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతతో కలిసి మొక్కలు నాటారు.

పల్లె, పట్నం పచ్చల హారం
దేశానికే ఆదర్శం
బాన్సువాడ రూరల్‌: సీఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారాయని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. పల్లెప్రగతిలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సంగోజీపేట్‌, కోనాపూర్‌, పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్‌ పరిధిలోని కొయ్యగుట్ట తండాలో ఆయన పాల్గొన్నారు. కోనాపూర్‌లో నిర్మించిన 30 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించి.. ఈ పథకం పేదలకు వరంగా మారిందని చెప్పారు. సంగోజిపేట్‌లో పోచారం మొక్క నాటారు.

అభివృద్ధిలో దూకుడు
మహేశ్వరం: పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రూ.50 లక్షలతో నిర్మించిన బస్సు టెర్మినల్‌ను, సిరిగిరిపురంలో పల్లె ప్రగతి పనులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాకు వెయ్యికోట్లు వెచ్చించి పల్లె ప్రగతి పనులను చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ అనితాహరినాథ్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పల్లెల అభివృద్ధి దిశగా..
శామీర్‌పేట: గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరిచే దిశగా ప్రభుత్వం పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం మురహర్‌పల్లి, తుర్కపల్లి గ్రామాల్లో ఆయన మొక్క లు నాటారు. ప్రతి ఒక్కరూ పల్లె ప్రగతిలో పాల్గొనాలని కోరారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, జడ్పీటీసీ అనితలాలయ్య, వైస్‌ ఎంపీపీ సుజాత పాల్గొన్నారు.

ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటాలి
మహబూబ్‌నగర్‌టౌన్‌/హన్వాడ: పట్టణ, పల్లె ప్రగతి నిరంతరం కొనసాగుతాయని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని పాలకొండ 9వ వార్డులో పట్టణ ప్రగతి, హన్వాడలో పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించారు. హన్వాడలో సీసీరోడ్లు, పల్లె ప్రకృతి వనం, బుద్ధారంలో రైతువేదిక, కారంతండాలో బ్రిడ్జిని ప్రారంభించారు. 9వ వార్డులో మొక్కలు నాటారు. ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని స్పష్టంచేశారు.

పల్లె, పట్నం పచ్చల హారం
-మహాత్ముని బాటలో పల్లెల పురోగతి
కొండపాక: పల్లె ప్రగతితో రాష్ట్రంలోని ప్రతి పల్లె పురోగతి సాధిస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి, తిప్పారం, ముద్దాపూర్‌ గ్రామాల్లో హరీశ్‌రావు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కుకునూరుపల్లిలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీ మాటలను నిజంచేస్తూ సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కుకునూరుపల్లి సర్పంచ్‌ జయంతి నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

పచ్చదనం కనువిందు
తిరుమలగిరి: సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గుణాత్మక మార్పు సాధ్యమైందని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ దండిగా నిధులు విడుదల చేస్తుండటంతో ఎటుచూసినా పచ్చదనం కనువిందు చేస్తున్నదని చెప్పారు. గురువారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని 13వ వార్డులో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.

సుందరంగా పట్టణాలు.. ఖైరతాబాద్‌: పట్టణ ప్రగతితో నగరాలు, పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుకొని తెలంగాణ కీర్తి పతాకను ప్రపంచస్థాయికి చాటాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ దుర్గానగర్‌ కాలనీపార్కులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి.. ఎమ్మెల్యే దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, కార్పొరేటర్‌ విజయారెడ్డి, జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్యతో కలిసి మొక్కలు నాటారు.

గ్రామసభల్లో తీర్మానం
వనపర్తి/వనపర్తిరూరల్‌: రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతులను మూడు విడతల పల్లె ప్రగతిలో కల్పించామని, నాల్గో విడతలో భాగంగా గ్రామానికి ఏం కావాలో మీరే నిర్ణయించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మండలంలోని కడుకుంట్లలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్‌ చట్టంలో చేసిన మార్పులతో పల్లెల అభివృద్ధి కోసం గ్రామసభలను నిర్వహించి వసతుల కల్పనకు తీర్మానం చేసుకోవచ్చని చెప్పారు. గ్రామపంచాయతీ ఆవరణలో మొక్క నాటారు. వనపర్తిలోని 5వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పల్లె, పట్నం పచ్చల హారం
50 కోట్లతో పనులు..
మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ ము న్సిపాలిటీలో రూ.50 కోట్లతో అభివృద్ధి పను లు చేపట్టామని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. గురువారం మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో పట్టణ ప్రగతి పనులపై సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణ రూపురేఖలు మారేలా దళితవాడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. దళితుల అభివృద్ధికి ప్రభుత్వం దళితక్రాంతి పథకం ప్రవేశపెట్టినట్టు చెప్పారు.

మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌
పల్లె, పట్టణ ప్రగతిపై ఆరా
సీఎం కేసీఆర్‌ గురువారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఫోన్‌చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జిల్లాలో ప్రారంభమయ్యాయని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామసభలు నిర్వహిస్తున్నామని, పారిశుద్ధ్య నిర్వహణ, హరితహారం, పల్లె ప్రకృతి వనాల పరిశీలన వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పువ్వాడ సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొనే విషయమై చర్చ జరిగినట్టు సమాచారం. మంత్రి పువ్వాడ ఖమ్మం జిల్లా రఘునాథలెం మండలం కోయచెలకలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.