-70% ఉద్యోగాలు స్థానికులకిస్తే రాయితీలు -పంటలకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు -ఫుడ్ మ్యాప్ ఆఫ్ తెలంగాణను సిద్ధంచేశాం -16 వేల ఎస్‌హెచ్‌జీలకు మైక్రో యూనిట్లు -పారిశ్రామీకరణకు కేంద్రం ప్రోత్సాహం ఏది? -రాష్ట్రానికి ఆరేండ్లలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు -శాసనసభలో ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్

ఏ జిల్లాలో ఏ పంట పండుతుందో అందుకుఅనుగుణంగా అక్కడ సంబంధిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహిస్తాం. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగింది. దేశం మొత్తానికి ధాన్యాగారంగా మారింది. ఈ నేపథ్యంలో రైస్ మిల్లుల సంఖ్య పెంచేందుకు సీఎం స్వయం గా రైస్‌మిల్లర్లతో చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు పెట్టాలనే ఉద్దేశంతో మహబూబాబాద్‌లో మిర్చి పంటకు సంబంధించిన ల్యాన్ క్లిప్‌డ్ సంస్థను ఏర్పాటుచేశాం. -మంత్రి కేటీఆర్
తెలంగాణలో పారిశ్రామీకరణ వేగంగా విస్తరిస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల వికేంద్రీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలనే ఎజెండాతో ముందుకుపోతున్నామన్నారు. మంగళవారం శాసనసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ తూర్పు హైదరాబాద్ ఆదిబట్లలో పరిమితమైందని, ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే పారిశ్రామికరంగం వికేంద్రీకరణపై దృష్టిసారించామని తెలిపారు. 70% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చే కంపెనీలకు అదనపు రాయితీలు కల్పిస్తామని పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్‌లో వచ్చే రాయితీలకు అదనంగా క్యాపిటల్ సబ్సిడీలో 5%, పవర్ రిబేట్‌లో 5%, ఎస్‌జీఎస్టీలో 10% అదనంగా రాయితీ కల్పిస్తున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో ఇటు నీటిపారుదల, అటు వ్యవసాయం అభివృద్ధి సాధించాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటును సీఎం ప్రతిపాదించినట్టు గుర్తుచేశారు. తెలంగాణ నలువైపులా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు, ఆహారోత్పత్తులు భారీగా పెరుగబోతున్నాయని, వీటిని సవ్యంగా వినియోగించుకోవడానికి ఆగ్రో ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై దృష్టి పెట్టకపోతే పెద్ద నష్టం జరుగుతుందని గతంలో సీఎం కేసీఆర్ చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మూడేండ్ల కిత్రమే క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీ ఇప్పటికే ‘ఫుడ్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ’ను రూపొందించిందని చెప్పారు. ఏ జిల్లాలో ఏ పంట పండుతుందో అందుకు అనుగుణంగా అక్కడ సంబంధిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిందని, దేశం మొత్తానికి ధాన్యాగారంగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలో రైస్ మిల్లుల సంఖ్య పెంచేందుకు సీఎం స్వయంగా రైస్‌మిల్లర్లతో రెండు దఫాలుగా చర్చించినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు పెట్టాలనే ఉద్దేశంతో నర్సంపేట పక్కనే ఉన్న మహబూబాబాద్‌లో మిర్చి పంటకు సంబంధించిన ల్యాన్ క్లిప్‌డ్ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు.
రైతులను సంఘటితం చేసిన సీఎం కేసీఆర్ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో రైతులను సంఘటితంచేసేందుకు సీఎం కేసీఆర్ మాదిరిగా ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుబంధు సమితులను ప్రతి గ్రామంలో ఏర్పాటుచేసి వాటినే ఎఫ్‌పీవో (ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్)లుగా రూపాంతరం చెందించేలా సీఎం కేసీఆర్ తమకు మార్గదర్శనం చేస్తున్నారని చెప్పారు. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కోసం 16 వేల మహిళా సంఘాలను గుర్తించినట్లు తెలిపారు. ఎఫ్‌సీవోలను, ఎస్‌హెచ్‌జీలను కలుపుకొని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను విజయవంతం చేస్తామని చెప్పారు.
2 లక్షల కోట్ల పెట్టుబడులు గత ఆరేండ్లలో టీఎస్‌ఐపాస్ ద్వారా 15,326 పరిశ్రమలు అనుమతులు పొందినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో 11,954 పరిశ్రమలు ఇప్పటికే కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. టీఎస్ ఐపాస్ కింద రూ.2,13,431 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, ఇందులో రూ.97,405 కోట్లతో ఏర్పాటైన పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. ఈ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15,52,677 మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేశామని, ఇప్పటివరకు 7,67,729 మందితో ఆయా పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు.
కేంద్రంనుంచి ప్రోత్సాహంలేదు ఆరేండ్లలో తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం నుంచి నయాపైసా ప్రోత్సాహకంగా లభించలేదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలివ్వాలని విభజన చట్టంలో ఉన్నా కేంద్రం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. దీనిపై చాలాసార్లు అప్పీళ్లుచేశామని, నివేదికలిచ్చామని గుర్తుచేశారు. ఆత్మనిర్భర్ భారత్‌లో ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో, ఎటుపోయిందో తెలియదని ఎద్దేవాచేశారు.