-వచ్చే జూన్‌నాటికి 6.30లక్షల ఎకరాలు సాగులోకి.. -నక్కలగండి, డిండి ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ -పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సర్వే పూర్తికి ఆదేశం -నీటిపారుదలరంగంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

పాలమూరు జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది. బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో ఈ విషయమై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, జలరంగ నిపుణుడు శ్యాంప్రసాద్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పాలమూరులో సత్వరం పూర్తయ్యే ప్రాజెక్టులు నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా, కల్వకుర్తి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి వచ్చే జూన్‌నాటికి సాగునీరు అందేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. భూసేకరణ జరిగి పూర్తిస్థాయిలో ప్రాజెక్టులు వినియోగంలోకి వస్తే ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే దాదాపు 6.30లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని నిపుణులు వెల్లడించారు.
నక్కలగండి, డిండికి సర్కారు గ్రీన్‌సిగ్నల్ నల్గొండ-మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య నిర్మించతలపెట్టిన నక్కల గండి, డిండి ఎత్తిపోతల పథకాలను వెంటనే చేపట్టడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అంగీకరించారు. డిండి ప్రాజెక్టు నిర్మిస్తే చాలా గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత తాగునీటి సరఫరా చేసే అవకాశం ఉందని జలరంగనిపుణుడు శ్యాంప్రసాద్‌రెడ్డి సూచించగా సీఎం సానుకూలంగా స్పందించారు. కరీంనగర్‌లోని ఎస్సారెస్పీ కింద ఉన్న మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పెన్‌గంగ బ్యారేజీ నిర్మాణానికి చట్టపరంగా, న్యాయపరంగా ఉన్న అడ్డంకులను తొలగిపోయేలా చూడాలని సూచించారు.
చిన్ననీటిపారుదల వ్యవస్థను పటిష్ఠం చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్ ప్రాజెక్టుల స్థితిగతులపైనా సమీక్షించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌పై ప్రధానంగా దృష్టి పెట్టి పూర్తి చేయాలని, రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథకంపై సర్వే పూర్తిచేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డుపై సుప్రీంకోర్టులో విచారణ నడుస్తున్నందున విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఇంప్లీడ్ పిటీషన్ వేయాలని నిర్ణయించారు. సమావేశంలో సాగునీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవిందరెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు మురళీధర్, నారాయణ్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు రామకృష్ణ ప్రకాశ్, కృష్ణారావు, హరిరావు, గోవర్ధనాచారి పాల్గొన్నారు.
పోలవరంపై త్వరలో అఖిలపక్షం పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయించే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని, రాష్ట్రపతిని కలుద్దామని ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే అఖిలపక్షాన్ని తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించాలని కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అపాయింట్‌మెంట్ ఖరారైన వెంటనే అన్ని పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి పోలవరం ఆర్డినెన్స్‌పై తమ అభ్యంతరాలను ప్రధానికి వివరించి రద్దు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు.