-ఎంజీఎల్‌ఐ మునక బాధ్యులపై చర్యలు -విచారణకు సాంకేతిక నిపుణులతో కమిటీ -లిఫ్టులను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు

ఎంజీఎల్‌ఐ పంప్‌హౌస్ నీట మునగడంతో నిలిచిపోయిన పంపింగ్ వ్యవస్థను 15 రోజుల్లోగా పునరుద్ధరిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని ఎల్లూరు రిజర్వాయర్ వద్ద గల మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్‌హౌస్‌ను, ఈ పథకంలోని మూడు లిఫ్ట్‌ల పనితీరును మంత్రితోపాటు ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, మర్రి జనార్దన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, టీఆర్‌ఎస్ నాయకులు నిరంజన్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, జక్క రఘునందన్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. పంప్‌హౌస్ అడుగు భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ నిర్వాహకులు, ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పంప్‌హౌస్ మునిగిన తీరును, కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఎంజీఎల్‌ఐ పథకంలోని ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు లిఫ్ట్‌లను సందర్శించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ పంప్‌హౌస్ మునకకు కారణాలేమిటి, బాధ్యులెవరు అనే విషయాన్ని తేల్చడానికి సాంకేతిక నిపుణులతో కమిటీ వేస్తామని చెప్పారు. కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై, కారకులపై తగినచర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. జరిగిన నష్టానికి కాంట్రాక్టు సంస్థ కారణమని తేలినపక్షంలో ఆ మేరకు నష్టాన్ని సదరు సంస్థే భరించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. భవిష్యత్‌లో జిల్లాలోని ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని మరే ప్రాజెక్టులోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయకట్టు రైతులకు ఇబ్బందుల్లేకుండా 15-20 రోజుల్లో పంప్‌లను పునరుద్ధరించి పంపింగ్ వ్యవస్థ మళ్లీ మొదలయ్యేలా చూస్తామని, పంటలను కాపాడుతామన్నారు.
జిల్లాలో వచ్చే ఖరీఫ్‌కు 3 లక్షల ఎకరాలకు నీళ్లు పాలమూరు జిల్లాలో రూ.670 కోట్లు వెచ్చించి నిర్మాణ దశలో ఉన్న నెట్టెంపాడు, జూరాల, కోయిల్‌సాగర్, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల తదితర ప్రాజెక్టులన్నింటినీ త్వరలో పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. వచ్చే ఖరీఫ్‌నాటికి 3 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. చిన్ననీటి పారుదల కోసం చెరువులను తవ్వించేందుకు వీలుగా జిల్లాలో ప్రత్యేకంగా సర్కిల్ ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వచ్చే జూన్‌కు ఎంజీఎల్‌ఐ 3వ లిఫ్ట్‌లో రెండు మోటార్ల ద్వారా నీరు విడుదలయ్యేలా చూడాలని కాం ట్రాక్టు సంస్థ నిర్వాహకులను,అధికారులను ఆదేశించారు.