– ఐటీఐఆర్‌తో పుంజుకోనున్న పరిశ్రమ – త్వరలో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు – ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు

తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్వరూపం ప్యాకేజీ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రపంచంలో 550 బిలియన్ డాలర్లు, దేశంలో 24బిలియన్ డాలర్ల వ్యాపారం ప్యాకేజీ ఇండస్ట్రీతో జరుగుతుందని చెప్పారు. నగరంలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో గురువారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ సంస్థ ప్యాకింగ్ ఫర్ టుమారో అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థ తయారుచేసిన వివిధ నమూనాలను పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ప్యాకేజీ రంగంలో మనదేశం ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెద్దఎత్తున హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయని, ఇవి ప్యాకేజీ రంగం అభివృద్ధికి దోహదపడుతాయని చెప్పారు.
రాబోయే రోజుల్లో భారతదేశం రిటైల్‌రంగంలో మూడు, నాలుగోస్థానానికి ఎగబాకడం ఖాయమని అన్నారు. స్వీడన్ దేశానికి చెందిన ఐకియా ఫర్నిచర్ కంపెనీ హైదరాబాద్‌లో సంస్థ ఏర్పాటుకు ముందుకురావడం సంతోషకరమని పేర్కొన్నారు. తెలంగాణకు వచ్చే పెట్టుబడులన్నీ రిటైల్‌రంగానికి అనుసంధానమైనవే వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పాటుతో రిటైల్, ప్యాకేజీ ఇండస్ట్రీ విస్తరణకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. ఐటీసీ సంస్థ త్వరలోనే హైదరాబాద్ సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు మంత్రి తెలిపారు. ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు చెప్పారు. ఐటీసీ యూనిట్‌ను గజ్వేల్ నియోజకవర్గంలో గానీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్‌తో హైదరాబాద్‌లో ప్యాకేజీ ఇండస్ట్రీ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఐటీసీ ఖమ్మం జిల్లా భద్రాచలంలో రూ.3వేల కోట్లతో పేపర్ మిల్ విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్యాకేజీ ఇండస్ట్రీకి మాత్రమే దోహదం చేసే వనరులు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా, దేశంలో వాడిన వస్తువుల రీసైక్లింగ్ పద్ధతులపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. రీసైక్లింగ్ పద్ధతులతో వ్యర్థపదార్థాల నుంచి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక బాధ్యతగా, కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వంతో కలిసి రీసైక్లింగ్ చేసేందుకు ముందుకు రావాలని కేటీఆర్ సూచించారు.
ప్యాకేజీ రంగానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని తారకరామారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐపీ డైరెక్టర్ డాక్టర్ ఎన్సీ షా మాట్లాడుతూ నిరంతరం వినూత్నంగా మార్కెట్ అవసరాలకు సరిపడేలా అత్యంత నాణ్యమైన పద్ధతులతో ప్యాకేజింగ్ వ్యాపారాలను ఐఐపీ నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ కే సతీశ్‌రెడ్డి, ఏవీపీఎస్ చక్రవర్తి, సంజీవ్‌జగ్గి పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో 100శాతం వైఫై సేవలు అందిస్తాం త్వరలో హైదరాబాద్‌లో 100శాతం వైఫై సేవలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే నగరంలో 8కిలోమీటర్ల పరిధిలో వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వైఫై సేవలను అందించేందుకు టెలికాం కంపెనీల మధ్య పోటీ నెలకొందని తెలిపారు. పోటీ ప్రపంచంలో చెప్పడం వేరు-చేయడం వేరని పేర్కొన్న కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నదానికంటే ఎక్కువే చేస్తుందన్నారు. మంచి చేసినా చెప్పుకునే సామర్థ్యం రాజకీయ పార్టీలకు ముఖ్యమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.