Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఉస్మానియా తరలింపు

-హెరిటేజ్ అని రోగులను చంపుకొంటామా.. పాత భవనం స్థానంలో కొత్త దవాఖాన నిర్మాణం -బిల్డింగ్ చాలా ప్రమాదకరంగా ఉంది -పేషెంట్లు, వైద్యులు, ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యం -హెరిటేజ్ చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉన్నది -గవర్నర్, చీఫ్ జస్టిస్‌ను పిలిచి చూపిస్తాం -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టీకరణ -ఉస్మానియా దవాఖానను సందర్శించిన సీఎం బృందం -వారంలో వేర్వేరు దవాఖానాలకు రోగుల తరలిస్తాం

KCR visit to osmania general hospital

వారంలోగా ఉస్మానియా హాస్పిటల్‌ను తరలిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. 110 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ భవనం పూర్తిగా శిథిలమై పోయిందని, రోగులు, వైద్యుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ భవనం ఇక నిలువదని జేఎన్టీయూ ఇంజినీర్లు కూడా చెప్పారని తెలిపారు. అందువల్ల దీన్ని తొలగించి, ఇదే స్థలంలో నూతన భవనం నిర్మిస్తామని అన్నారు. హెరిటేజ్ అంటూ ప్రాణాలను బలిపెట్టలేమని కేసీఆర్ స్పష్టంచేశారు. భవనం శిథిలమై గదుల్లో పై పెచ్చులు ఊడిపడుతుండటంతో డాక్టర్లు, పేషెంట్లు ఆందోళన చెందుతున్నారన్న వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్ గురువారం ఉస్మానియా దవాఖానను సందర్శించారు. అక్కడి భవనాలను స్వయంగా పరిశీలించారు. డాక్టర్లు, రోగులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్ బిల్డింగ్ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని అన్నారు. పేషెంట్లు, వైద్యుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని వారంలో దవాఖానను అనువైన ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. ఇతర వైద్యశాలలతోపాటు అవసరాన్ని బట్టి ప్రైవేటు భవనాల్లోకి కూడా కొన్ని విభాగాలను తరలిస్తామన్నారు. ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలతో నూతన భవనం నిర్మిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ఉస్మానియా దవాఖాన బిల్డింగ్ పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నదని తెలిసి నేను, ఆరోగ్య శాఖమంత్రి, చీఫ్ సెక్రటరీ, హెల్త్‌సెక్రటరీ, అందరం కలిసి హాస్పిటల్‌ను సందర్శించాం. ఎప్పుడో 110 ఏండ్ల క్రితం కట్టిన దవాఖాన ఇది. కారణాలు ఏవైనప్పటికీ ఇప్పుడు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. అసలు ఏ క్షణంలో కూలిపోతుందో తెలియని ఒక భయోత్పాత పరిస్థితి ఉన్నది. అనేక సందర్భాలలో సెకండ్ ఫ్లోర్‌లో, థర్డ్‌ఫ్లోర్‌లో పెచ్చులూడటం, డాక్టర్ల తలలు పగలడం, పేషెంట్లపై పడటం జరిగాయి. సత్వర నిర్ణయం జరుగకుంటే ప్రమాదం చోటుచేసుకుని వందలమంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని హెల్త్ మినిస్టర్ నాతో చెప్పడం జరిగింది. భవనం పటిష్ఠతను పరిశీలించాలని ఈ మధ్య చీఫ్ సెక్రటరీ జేఎన్‌టీయూకు బాధ్యతలిస్తే ఇంజినీరింగ్ ఎక్స్‌పర్ట్స్ భవనం పటిష్ఠతను పరిశీలించారు. ఎంత రిపేర్ చేసినా.. ఏం చేసినా మూడు, నాలుగు సంవత్సరాల కంటే నిలవదని చెప్పడం జరిగింది. ఈ రోజు నేను చూశాను.. నాతో పాటు మీరూ చూశారు. చాలా భయంకర పరిస్థితి ఉంది. భవనంలో పటిష్ఠత పోయింది. వర్షాకాలం.. ఏ క్షణంలో ఎక్కడ కూలిపడుతుందో తెలియని పరిస్థితి ఉంది. అందువల్ల పేషెంట్లు, డాక్టర్లు, నర్సింగ్ పిల్లల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో వారంలో ఉస్మానియా హాస్పిటల్‌ను షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడకు షిఫ్ట్ చేయాలి? అనే విషయంపై మంత్రి లక్ష్మారెడ్డి, హెల్త్ సెక్రటరీ, హాస్పిటల్ సూపరింటెండెంట్ అందరూ మాట్లాడుకుని నిర్ణయం తీసుకోమన్నాం. అందుబాటులో ఉన్న ప్రభుత్వ దవాఖానల్లోకి తరలించడం, అవసరమైతే కొన్ని విభాగాల కోసం ప్రైవేట్ భవనాలు తీసుకోవడం జరుగుతుంది

హెరిటేజ్ చట్టాల్లో మార్పులు రావాలి.. చారిత్రక కట్టడం.. హెరిటేజ్ అని చెప్పి వందల ప్రాణాలు బలి పెట్టలేం కదా! అది తెలివి తక్కువతనం అవుతుంది. ఈ ప్రాంగణంలో ఏ ఒక్క బిల్డింగ్ సక్రమంగా లేదు. బట్టలు ఉతికే గదికి వెళ్లి చూస్తే అది ప్రమాదకరంగా ఉన్నది. నర్సింగ్ కాలేజ్‌కు, హాస్టల్‌కు వెళ్లి చూస్తే అదీ భయంకరంగా ఉన్నది. అన్నీ ఎనభై-వందేండ్ల క్రితం నిర్మించిన భవనాలు. ఒకప్పుడు ప్రపంచంలోనే పేరుమోసిన ఉస్మానియా ఈ స్థితికి చేరుకోవడం చాలా బాధగా అనిపిస్తున్నది. దీనికి అనేక కారణాలు.. వాటిలోకి పోదల్చుకోలేదు. హెరిటేజ్ చట్టంతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. దానిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. నేనే స్వయంగా రాష్ట్ర గవర్నర్‌ను, చీఫ్ జస్టిస్‌ను కలిసి దవాఖాన పరిస్థితి చూడాలని కోరుతాను. భవనం చూసినవారు ఎవరూ కొనసాగించాలని అనలేరు. నాపాటికి నేనే బాధపడుతున్నా.. అసలు ఎప్పుడో రావాల్సి ఉండే.. లేట్ అయ్యిందని ఫీల్ అవుతున్నా. పరిస్థితి విషమిస్తున్నదని తెలిసి పర్సనల్‌గా రావడం జరిగింది.

కాలేజీ సీట్లకు ఇబ్బందులు రానివ్వ.. తెలంగాణ పది జిల్లాలతో పాటు గుల్బర్గా, మహారాష్ట్ర ప్రజలు కూడా దశాబ్దాలనుంచి వైద్యంకోసం ఉస్మానియాకు వస్తున్నారు. చాలా ఫేమస్ దవాఖాన. అందుకే భవిష్యత్తులో కూడా ఈ దవాఖాన ఇక్కడే ఉండాలి. తరలింపువల్ల మెడికల్ కాలేజ్, సీట్లు ఇబ్బందులు అంటున్నారు. ఈ విషయం ఎంసీఐ అధికారులతో చర్చిస్తా. కాలేజ్ సీట్ల సమస్య లేకుండా చూస్తా. కావాలంటే హెల్త్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ ఢిల్లీకి వెళ్లి ఎంసీఐ అధికారులకు విషయం వివరిస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.

ఐదు హాస్పిటళ్లలో సర్దుబాటు ఉస్మానియా హాస్పిటల్ తరలింపులో భాగంగా అందులోని వివిధ విభాగాలను, చికిత్స పొందుతున్న రోగులను నగరంలోని ఐదు హాస్పిటల్స్‌కు తరలించి సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు ప్రణాళిక రూపొందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంమేరకు వారంలో ఈ పని పూర్తి చేయాలని నిర్ణయించారు. ముందుగా రోగుల తరలింపు అంశాన్ని చేపట్టనున్నారు. ఏయే విభాగాలకు సంబంధించిన వారిని ఎక్కడెక్కడకు మార్చాలనే దానిపై స్పష్టతకు వచ్చారు. మొత్తం ఉస్మానియాలో 857 బెడ్లు ఉన్నాయి. వీటన్నింటినీ ఐదు హాస్పిటల్స్‌కు మార్చాలని అధికారులు ప్రతిపాదించారు. రోనాల్డ్‌రాస్ ఇన్‌స్టిట్యూట్ ఫీవర్ హాస్పిటల్, నిలోఫర్, కింగ్‌కోఠి, గాంధీ హాస్పిటల్‌కు వీటిని విభజించారు. నర్సింగ్ స్కూల్‌ను వెంగళరావునగర్‌లోని కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించాలని నిర్ణయించారు. డెంటల్ కాలేజీని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. రోగులను, బెడ్లను తరలించడం కష్టమేమీ కాదని, అయితే ఎక్విప్‌మెంట్‌ను తరలించడమే కొద్దిగా ఇబ్బందిగా మారుతుందని అధికారులు చెప్తున్నారు.

హాస్పిటల్స్‌ను తనిఖీ చేస్తున్న మంత్రి సీఎం ఉస్మానియా దవాఖానను సందర్శించిన అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్‌కు వెళ్లి అక్కడున్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం కూడా అన్ని దవాఖానలను తనిఖీ చేసి ఉస్మానియా రోగుల బెడ్లను సర్దేపనిలో ఉంటారని అధికారులు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.