Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఒక్కచుక్కనూ వదులుకోం

-కృష్ణా, గోదావరిలో మనవాటాను కాపాడుకొనితీరాలి
-అపెక్స్‌ కౌన్సిల్‌ ఆగస్టు 5న సాధ్యంకాదు.. 20 తర్వాతే
-నీటివాటాల పంపిణీలో కేంద్రం పూర్తిగా విఫలం
-తెలుగు రాష్ర్టాల మధ్య ఘర్షణ ఎవరికీ మంచిదికాదు
-నీటిపారుదలపై సీఎం కేసీఆర్‌ సమీక్షలో నిపుణులు

జల వివాదాల పరిష్కారంలో కేంద్రం నిష్క్రియాపరత్వం దుర్మార్గం. ఈ వైఖరిని ఇకనైనా విడనాడాలి. కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఇరు రాష్ర్టాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. ఇరు రాష్ర్టాల మధ్య ఉన్న కేసులు, ట్రిబ్యునల్‌ వివాదాలు న్యాయబద్ధంగా పరిష్కారం కావాలి. నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదు.

‘కృష్ణా, గోదావరి జలాల్లో మనహక్కు, వాటాను కాపాడుకొని తీరాలి. ఉమ్మడిరాష్ట్రంలో అనేక కష్టనష్టాలకు గురైన తెలంగాణ.. ఇప్పుడు చుక్కనీటినీ వదులుకొనే ప్రసక్తేలేదు. ఇందుకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. తెలుగురాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి ఆగస్టు 5న అపెక్స్‌కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుపై అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి యూపీసింగ్‌ లేఖరాశారు ఈ నేపథ్యంలో గురువారం ప్రగతిభవన్‌లో నీటిపారుదలశాఖ నిపుణులు, అధికారుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. నీటి వివాదాల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు.

కేంద్రం బాధ్యతారాహిత్యంతో నష్టం

అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఆగస్టు 5న నిర్వహించడం అసౌకర్యంగా ఉంటుందని, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఆ తేదీని వాయిదావేయాలని సమావేశం అభిప్రాయపడింది. స్వాతంత్య్ర దినోత్సవం పూర్తయ్యాక ఆగస్టు 20 తరువాత సమావేశం ఉండేలా తేదీని నిర్ణయించాలని కోరుతూ కేంద్ర జలవనరులశాఖకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శిలేఖ రాయాలని సూచించింది. రెండురాష్ర్టాల జలవివాదాల పరిష్కారంలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ వ్యవహరిస్తున్నతీరు హాస్యాస్పదంగా ఉన్నదని అసంతృప్తి వ్యక్తంచేసింది.

కొత్తరాష్ర్టాలు ఏర్పడినపుడు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నీటివాటాల పంపిణీ సవ్యంగా జరిగేలా చూసే సంప్రదాయం ఉన్నదని, ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీలో కేంద్రం పూర్తిగా విఫలమైందని పలువురు అభిప్రాయపడ్డారు. ‘ఇరురాష్ర్టాల మధ్య నదీజలాల విషయంలో వివాదాలు లేకుంటే కేంద్రమంత్రి ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరుగాలి. ఏవైనా వివాదాలు ఉంటే పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలి. తెలంగాణ, ఏపీ మధ్య ముందునుంచీ వివాదాలు నెలకొని ఉన్న నేపథ్యంలో పునర్విభజన చట్టం సెక్షన్‌ -13ను అనుసరించి వీటిని పరిష్కరించే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదట్నుంచీ కోరుతూ వచ్చింది. కానీ, తెలంగాణ విజ్ఞప్తిని కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ పెడచెవిన పెట్టింది’అని సమావేశం అభిప్రాయపడింది.

ఈ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ఈ వైఖరిని విడనాడాలని నీటిపారుదలశాఖ నిపుణులు సూచించారు. కేంద్రం బాధ్యతారాహిత్యంతో ఇరురాష్ర్టాలు నష్టపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇరురాష్ర్టాల మధ్య ఉన్న కేసులు, ట్రిబ్యునల్‌ వివాదాలు న్యాయబద్ధంగా పరిష్కారం కావాలని, ఘర్షణ వాతావరణం ఎవరికీ మంచిదికాదని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

మనవాటా సమగ్ర వినియోగం

మహబూబ్‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను అధిక ప్రాధాన్యమిచ్చి పూర్తిచేయాలని, ఎన్నిఅవాంతరాలు వచ్చినా లెక్క చేయకుండా ముందుకుసాగాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. గోదావరి, కృష్ణా జలాల్లో మనవాటాను సమగ్రంగా, సమర్థంగా వినియోగించుకోవాలని, ఇందుకోసం రాజీలేని వైఖరిని అనుసరించాలని, ప్రాజెక్టుల నిర్మాణ పనులు శరవేగంగా ముందుకుసాగాలని అభిప్రాయపడింది.

సమావేశంలో రాష్ట్రప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, నీటిపారుదలశాఖ సలహాదారు ఎస్కేజోషి, సీఎంవో ఉన్నతాధికారులు నర్సింగ్‌రావు, స్మితాసబర్వాల్‌, నీటి పారుదలశాఖముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, రిటైర్డ్‌ ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు మేరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, వెంకటరామారావు, రామకృష్ణారెడ్డి, దామోదర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, సీఈలు నాగేందర్‌రావు, నరసింహ, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.