Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఒక ట్రాక్టర్‌.. ఊరినే మార్చేసింది

-ట్రాక్టర్‌.. ట్రాలీ.. ట్యాంకర్‌.. మూడు ‘టీ’లతో ముచ్చటేస్తున్న ఊళ్లు
-పల్లెల్లో పరిశుభ్రత బేఫికర్‌.. సాకారమవుతున్న గాంధీజీ గ్రామస్వరాజ్యం
-పచ్చదనం పరుచుకొంటున్న పల్లెటూళ్లు.. హరితహారంతో పల్లెతల్లికి పచ్చలహారం
-వైకుంఠధామాలు, వనాలు, డంపింగ్‌యార్డులు.. రహదారులు, సామూహిక భవనాలు..
-1200 కోట్లతో అన్ని పంచాయతీలకు పంపిణీ… చెత్త సేకరణతో అద్దంలా మెరుస్తున్న రోడ్లు
-పంచాయతీలకు ప్రతినెలా రూ.308 కోట్లు.. పల్లె ప్రగతితో మారిపోయిన పల్లె తెలంగాణ

మన పల్లెకు ప్రగతి అలుకు
సమస్యల కసువూడ్చి.. హరిత తోరణాలు కట్టి .. ఊరి బాగుకు ఉద్యమం.. పల్లె ప్రగతి విప్లవం
ఇది ఎన్నడూ ఊహించలేదు..
ప్రతి ఉదయాన్నీ పచ్చదనం పలుకరిస్తుందని.. రహదారులు ఆకసానికి అద్దంలా మారుతాయని..
ఇది ఎన్నడూ ఊహించలేదు..
ఒక ట్రాక్టర్‌ ప్రగతిరథంలా మారుతుందని.. పల్లెను అభివృద్ధి పథాన నడిపిస్తుందని..ఒక్క ఈల.. చెత్తను తరలించుకుపోతుందని..ఆ చెత్త సంపద సృష్టిస్తుందని..
ఇది ఎన్నడూ ఊహించలేదు..
ప్రకృతి వనాలు ఆహ్లాదంగా పలుకరిస్తాయని.. ఆ వనాలన్నీ పూల సంద్రాలవుతాయని..
ఇది ఎన్నడూ ఊహించలేదు..
ప్రశాంతంగా వైకుంఠధామాలు వీడ్కోలు చెప్తాయని.. అంత్యక్రియలకూ అన్ని సౌకర్యాలుంటాయని..ఇది ఎన్నడూ ఊహించలేదు తెలంగాణ పల్లెల్లో గ్రామ స్వరాజ్యం వెల్లివిరుస్తుందని.. దేశానికంతటికీ ఆదర్శమవుతుందని..

మన ఊరు బృందావనం!
-తెలంగాణ పల్లె ఇప్పుడు ప్రగతి బాటలో వికసిస్తున్న మల్లె!

తల్లికీ బిడ్డకూ ఉండే అనుబంధమే పల్లెదీ, మనిషిదీ కూడా! ఉపాధి కోసమో, ఉద్యోగం కోసం ఉన్న ఊరును వదలిపోయినా… కన్నతల్లిలా పల్లె ఏదో ఒక యాదిలో కలుస్తూనే ఉంటది.తల్లివేరును తాకేందుకు మనసు తలుస్తూనే ఉంటది.

నీళ్లకు బదులు కన్నీళ్లుపారి-కారి, మనుషుల్లేని ఇండ్లుమట్టి కుప్పలై, చెరువులు నెర్రలు బారి, పొలాలు పడావులై, చీకట్లో బతుకులు చితికి, ఊరి ఆత్మ పరితాపపడి ఉత్తగనే ఆగమైన ఉమ్మడి పాలనలో ‘పల్లె కన్నీరు పెట్టిందో’ అని పాటలు పాడుకున్న దుస్థితి మనది.

అంతలోనే ఎంత మార్పు! తెలంగాణ పల్లెల్లో ఇప్పుడునాటి దైన్యం లేదు. బేలతనపు దాస్యం లేదు. కూలిన గోడల్లేవు. కుప్పకూలే బతుకుల్లేవు. వీధుల్లో చెత్తలేదు. చీకటి పత్తాలేదు. ఎండిన చెరువు లేదు. కరువు లేదు. అప్పుల బరువు లేదు.

పంచాయతీలకు ప్రతినెలా 308 కోట్లు
-బాపూ కలలు సాకారం
-జాతికి ఆదర్శంగా నిలిచిన పల్లె ప్రగతిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాలు నేటినుంచి..

కానీ.. ఇది జరిగింది. ఇదే జరిగింది. తెలంగాణ పల్లె పులకించిపోతున్నది. ఇవాళ పరిశుభ్రమైన పల్లెలు ఎక్కడైనా ఉన్నాయంటే.. అన్ని చూపులూ.. తెలంగాణవైపే.. ఆరోగ్యకరమైన గ్రామాలు ఎక్కడున్నాయంటే.. అందరి వేళ్లూ తెలంగాణవైపే.. పచ్చని పల్లెలు ఎక్కడ ఉన్నాయని ఎవరైనా అడిగితే.. అందరిమాటా తెలంగాణ అనే. ఇవాళ తెలంగాణలో ఊరూ వాడా కొత్తకాంతులు విరజిమ్ముతున్నాయి. ఇది పల్లె ప్రగతి సాధించిన విజయం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలను సాకారం చేసిన సంబురం.

తెలంగాణ ప్రభుత్వం గ్రామస్వరాజ్యాన్ని సాధించే దిశగా వేసిన అడుగులు సత్ఫలితాలనిస్తున్నాయి. రెండు విడుతలు ప్రత్యేక డ్రైవ్‌గా.. ఆ తర్వాత నిరంతరంగా కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చింది.

గతంలో గ్రామాల్లో మురుగునీటి కాలువలను ఎప్పుడోకాని శుభ్రం చేసేవారు కాదు. ఒకవేళ చేసినా అందులోనుంచి మట్టి తీసి పక్కనపోసేవారు. రెండుమూడ్రోజులపాటు కంపుకొట్టిన అది మళ్లీ ఆ కాలువలోకే చేరేది. మరి నేడు.. ఒకే ఒక్క ట్రాక్టర్‌.. గ్రామ రూపురేఖలనే మార్చేసింది. పల్లెల్లో పచ్చదనం పెంపొందిస్తున్నది. చెత్త తరలింపుతో రోడ్లను అద్దంలా మెరిసేలా చేస్తున్నది. పల్లెపల్లెకూ ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్‌తో పరిశుభ్రత బేఫికర్‌గా మారింది. పల్లె ప్రగతికి రథచక్రంగా మారింది.

ఒక ట్రాక్టరే కాదు.. ఒకనాడు చెత్తాచెదారంతో అస్తవ్యస్తంగా ఉన్న పల్లెలు పల్లె ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలతో నేడు పరిశుభ్రతతో అద్దాల్లా మెరుస్తున్నయి. పాతగోడలు, పాడుబడిన బావులు పోయి సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు కనపడుతున్నయి. హరితహారం మొక్కలతో పచ్చలహారంగా మారిపోయాయి. వేలాడే విద్యుత్తు తీగల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లు మిరుమిట్లు గొలుపుతున్నయి. వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, రైతు వేదికలు, ఇంటింటికీ మిషన్‌భగీరథ నల్లాలు, ట్రాలీ-ట్యాంకర్‌తో కూడిన ట్రాక్టర్లు.. చిన్నది,పెద్దది అనేతేడా లేకుండా అన్నిగ్రామాల్లో దర్శనమిస్తున్నాయి. తెలంగాణలో చేపట్టిన పల్లెప్రగతికి పరచుకున్న పచ్చదనం, మెరుస్తున్న పరిశుభ్రత ప్రణమిల్లుతున్నాయి.

మన ఊరు బృందావనం
-సూపర్‌ ట్రాక్టర్‌

ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పల్లెలను పరిశుభ్రతకు చిరునామాలుగా మార్చింది. దాదాపు రూ. పది లక్షలతో ట్రాలీ, వాటర్‌ ట్యాంకర్‌తో కూడిన ట్రాక్టర్‌ను అందజేసింది. 12,769 గ్రామ పంచాయతీలకుగాను ఇందుకోసం రూ.1200 కోట్లు వెచ్చించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకొన్న నిర్ణయం గ్రామాల రూపురేఖలను సమూలంగా మార్చివేసింది. ట్రాక్టర్‌ వచ్చాక పల్లెల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్‌, వాటర్‌ ట్యాంకర్‌, ట్రాలీ ఉండాలని.. ఇందుకు అవసరమయ్యే నిధులను కూడా రాష్ట్రప్రభుత్వం నుంచి విడుదల చేస్తామని ప్రకటించి.. పంచాయతీలపై భారం పడకుండానే గ్రామ చెత్త సమస్యకు సీఎం కేసీఆర్‌ శాశ్వత పరిష్కారం చూపారు.

ట్రాక్టర్‌తో ప్రతి గ్రామం చెత్తచెదారం లేకుండా పరిశుభ్రంగా కళకళలాడుతున్నాయి. రహదారులు, పరిసరాలు అద్దంలా మెరుస్తున్నాయి. పల్లె ప్రగతిలో ప్రధానంగా పచ్చదనం – పరిశుభ్రత, పారిశుద్ధ్యం, గుంతలను పూడ్చటం, పిచ్చి చెట్లను కొట్టివేయడం, కూలిపోయే దశలో ఉన్న పాతఇండ్లు, పాడుబడ్డ బావులు, బొందలను పూడ్చటం, వేలాడుతూ ఉన్న కరెంటు తీగలను సరిచేయడం, రోడ్ల మధ్యలో ఉన్న కరెంటు స్తంభాలను మార్చడం, శిథిలమై, వంగిపోయిన స్తంభాలను మార్చడం వంటి పనులు దీనిద్వారా నిర్వహిస్తున్నారు.

గ్రామంలోని చెత్తతోపాటు వ్యర్థ్ధాలను ఊరి అవతలికి తరలించడానికి ట్రాక్టర్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఒక విధంగా గ్రామాభివృద్ధిలో ట్రాక్టర్‌ కీలకంగా మారింది. హరితహారంలో భాగంగా నాటిని మొక్కలకు, ఇప్పటికే పెరిగిన చెట్లకు నీళ్లు పోసేందుకు ట్రాక్టర్‌ ట్యాంకర్ల ద్వారా వీలు కలుగుతున్నది. దీంతో 85శాతం మొక్కలు బతకాలనే నిబంధన అమలవుతున్నది. ప్రతిరోజూ చెత్తను సేకరించడమే కాకుండా గ్రామంలోని చిన్న అవసరాలకు రవాణా చేయడానికి ట్రాక్టర్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నది.

ప్రజల ముంగిట ప్రగతి ఫలం
కూలిపోయేస్థితిలోఉన్న ఇండ్లు, ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం, దుర్గంధభరితమైన మురుగునీటి కాలువలు, ప్రమాదకరంగా పాడుబడిన బావులు, కిందకు వేలాడుతూ ప్రాణాలు తీసేలా విద్యుత్‌తీగలు తదితర గ్రామాల్లో నెలకొన్న సమస్యలన్నింటికీ పల్లె ప్రగతి పరిష్కారం చూపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన ఈ కార్యక్రమం పల్లెల రూపురేఖలను సమూలంగా మార్చివేసింది.

పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తున్నది. నూతన పంచాయతీరాజ్‌చట్టంతో గ్రామాలు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు, అభివృద్ధి ఫలాలు ప్రజల ముగింటకు చేరాయి. 2019 సెప్టెంబర్‌ 6న మొదటి విడుత పల్లె ప్రగతిని చేపట్టిన ప్రభుత్వం అక్టోబర్‌ 5వ తేదీవరకు 30 రోజులపాటు నిర్వహించింది. పంచాయతీలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం, విద్యుత్తు వెలుగులను నిరంతరాయంగా ప్రసరింపజేయడం, పచ్చదనం పెంపొందించడం, ఇంటింటికీ నల్లానీళ్లు అందించడం, చెత్త డంపింగ్‌యార్డుల ఏర్పాటు, వైకుంఠధామాల నిర్మాణం తదితర అంశాలను చేర్చి పల్లెప్రగతిని చేపట్టారు. 2020 జనవరి 2నుంచి 12వ తేదీ వరకు రెండోవిడుత పల్లెప్రగతి కొనసాగింది. రెండు విడుతల్లో భాగంగా చేపట్టిన చర్యలతో పల్లెలు ప్రగతి బాట పట్టాయి. ప్రస్తుతం పల్లె ప్రగతికి ముందు.. ఆ తర్వాత అన్నట్టుగా గ్రామాల్లో పరిస్థితులు మారిపోయాయి. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, నిధులు ఖర్చు, నిరంతర పర్యవేక్షణతో తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.

రైతు వేదికలు
గ్రామాల్లో రైతులు పంటల సాగు, అమ్మకంతోపాటు తమ సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించుకొనేందుకు ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. రైతుబంధు సమితుల సభ్యులు, గ్రామ రైతులతో చర్చించడానికి ఇవి వేదికలుగా ఉపయోగపడుతున్నాయి. వీటిని క్లస్టర్ల వారీగా నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతుల వేదికలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా దాదాపు అన్నింటి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చాయి.

10% బడ్జెట్‌తో ప్రకృతి వనం
పట్టణాల్లో పార్కుల మాదిరిగా పల్లెల్లోనూ ప్రకృతివనాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో పేర్కొన్నవిధంగా పంచాయతీలకు కేటాయించిన నిధుల్లో గ్రీన్‌బడ్జెట్‌ కింద ఖర్చుచేసే 10 శాతం నిధులను వీటికి ఉపయోగిస్తున్నారు. ఖర్చుచేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 19,470 ఆవాసాల్లో పల్లె పకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటివరకు 18,656 ఆవాసాల్లో పూర్తయ్యాయి. ఇందుకోసం గ్రామాల్లో భూములు ఇచ్చేందుకు కొందరు ముందుకొచ్చారు. ఇందులో చిన్నారులు ఆడుకొనే వస్తువులు, కూర్చునే బెంచీలు, తదితర ఏర్పాట్లు కూడా చేశారు.

అన్నిరోడ్లూ సీసీ
గ్రామాల్లో రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. ప్రతి వీధికీ సీసీ రోడ్డు నిర్మించారు. వీటికిరువైపులా డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టారు. రోడ్లతోపాటు, డ్రైనేజీ కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు.

పల్లెకు ‘పచ్చల హారం’
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారంతో పల్లెలు తెలంగాణకు పచ్చలహారంగా మారాయి. గ్రామాల బడ్జెట్‌లో పది శాతం (గ్రీన్‌ బడ్జెట్‌) ఇందుకోసం కేటాయించేలా చట్టం తెచ్చారు. మొక్కల సరఫరా కోసం గ్రామానికి ఒక నర్సరీని ఏర్పాటుచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 12,755 నర్సరీలను ఏర్పాటుచేశారు. ఈ నర్సరీల్లో 2020-21లో 18.13 కోట్ల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 17.84 కోట్ల మొక్కలను పెంచారు. 98 శాతం లక్ష్యాన్ని సాధించారు. గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్‌, కమ్యూనిటీ ప్లాంటేషన్‌, ఇన్‌స్టిట్యూషన్‌ ప్లాంటేషన్‌లో భాగంగా 2020-21లో 12.67 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించగా లక్ష్యాన్ని దాటి 13.87 కోట్లు నాటారు. వీటిల్లో 91 శాతం మొక్కలు బతికాయి. ప్రతి గ్రామానికి ఒక నర్సరీ ఉండే విధంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాలు అమలుచేస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌తోపాటుగా కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా ఆయా గ్రామాల ప్రజలు అడిగే మొక్కలను అందించడానికి వీలుగా వారి అభిరుచికి అనుగుణంగా మొక్కలను పెంచాలని ఆదేశించారు. ఒక్కో ఇంటికి ఐదారు మొక్కలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. మొక్కలు నాటడం, సంరక్షించడం బాధ్యతను పంచాయతీ పాలకవర్గాలకు అప్పగించడంతోపాటు, వాటికి నీరు పోసేందుకు గ్రామానికి ఒక ట్రాక్టర్‌, ట్యాంకర్‌ను ప్రభుత్వం అందజేసింది.

రైతు కల్లాలు
కోతల సమయంలో రైతులు తమ పంటను ఆరబెట్టుకొనేందుకు వీలుగా ప్రభుత్వం రైతు కల్లాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కల్లాలు ఏర్పాటుచేసుకొనేందుకు రైతులు ఉమ్మడి, వ్యక్తిగతంగా ముందుకొస్తే ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరుచేస్తున్నది. మొత్తం 93,875 కల్లాలు నిర్మించాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటికే 39,680 కల్లాల నిర్మాణం పూర్తయింది.

ఇంటింటికీ మిషన్‌ భగీరథ
మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని సరఫరా జరుగుతున్నది. వాటి నిర్వహణకు అయ్యే వ్యయాన్ని రాష్ట్రప్రభుత్వమే భరిస్తున్నది. ప్రతి గ్రామంలో మిషన్‌ భగీరథ ట్యాంక్‌ను నిర్మించడంతోపాటు, వీధుల్లో అక్కడక్కడా సామూహిక నల్లాలను కూడా ఏర్పాటుచేశారు.

ప్రశాంతంగా చివరి ప్రస్థానం
గ్రామాల్లో ఏవరైనా చనిపోతే దహన సంస్కారాలకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక వైకుంఠధామాన్ని నిర్మించింది. 12,769 గ్రామాల్లో వైకుంఠధామాలు మంజూరుచేయగా 12,695 గ్రామాల్లో పనులు మొదలయ్యాయి. ఒక్కో వైకుంఠధామంలో రెండు దహనవాటికలను నిర్మిస్తున్నారు. దీంతోపాటు, స్నానాలు చేయడానికి, బట్టలు మార్చుకోవడానికి కూడాఏర్పాట్లు చేస్తున్నారు. 6,500 పంచాయతీల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన వాటిల్లో పనులు తుదిదశకు చేరాయి. వీటన్నంటిని మార్చి నెలాఖరు కల్లా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

పొలిమేరల్లో డంపింగ్‌ యార్డులు
పట్టణాల్లో మాదిరిగా గ్రామాల్లోనూ చెత్త సేకరణ నిరంతరాయంగా జరుగుతున్నది. దీంతో గ్రామాల్లో చెత్త అనేదే కన్పించడంలేదు. డ్రైనేజీల నుంచి తీసిని మట్టి, చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్టర్‌ ట్రాలీ ద్వారా పంచాయతీ సిబ్బంది తరలిస్తున్నారు. ఈ చెత్తను మొత్తం ఒకచోట వేసేందుకు ప్రతి గ్రామం శివారుల్లో డంపింగ్‌ యార్డును ఏర్పాటుచేశారు. 12,760 గ్రామాల్లో డంపింగ్‌యార్డు పనులు పూర్తయ్యాయి. చెత్తను కంపోస్ట్‌గా తయారుచేస్తున్నారు.. 9,023 పంచాయతీల్లోని డంపింగ్‌యార్డుల్లో నుంచిఈ ప్రక్రియను ప్రారంభించారు. మిగిలిన పంచాయతీల్లోనూ కంపోస్ట్‌ తయారుచేయాలని అధికారులు పంచాయతీ పాలకవర్గాలను ఆదేశించారు.

విద్యుత్తు వెలుగుల మిరుమిట్లు
పల్లెలు విద్యుత్తు వెలుగులతో మిరిమిట్లు గొలుపుతున్నాయి. కొత్త స్తంభాల ఏర్పాటు, లూజుగా ఉన్న వైర్లను సరిచేయడం, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుతో గ్రామాల్లో విద్యుత్తు వ్యవస్థను పటిష్టంచేశారు. వీధిదీపాలకు పాత మీటర్లను తొలిగించి కొత్తవాటిని బిగించారు. వీధి దీపాలకు ఎల్‌ఈడీ లైట్లు వేశారు. విద్యుత్తు కనెక్షన్‌లేని అవాసాలు, ఇళ్లకు ప్రత్యేకంగా స్తంభాలు వేసి కొత్త కనెక్షన్లు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా రూ.400 కోట్లకు పైగా నిధులతో గ్రామాల్లో విద్యుత్తు వ్యవస్థను మెరుగుపర్చారు. మొత్తంగా నగరాల స్థాయిలో గ్రామాల్లోనూ విద్యుత్తు సరఫరా వ్యవస్థ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు.

పల్లె ప్రగతిలో చేపట్టిన అంశాలు
1. వైకుంఠధామాల నిర్మాణం
2. ట్రాక్టర్లు కొనుగోలు
3. పల్లె పకృతి వనాల ఏర్పాటు
4. డంపింగ్‌ యార్డుల నిర్మాణం
5. విద్యుత్‌ వ్యవస్థ మెరుగు పర్చడం
6. ఇండ్లనుంచి చెత్త సేకరణ
7. పారిశుద్ధ్యం మెరుగుపర్చడం
8. రైతు కల్లాల నిర్మాణం
9. రైతు వేదికల నిర్మాణం
10.ఊరికో నర్సరీ ఏర్పాటు
11.గ్రామాల్లో మొక్కల పెంపకం
12.పాడుపడ్డ బావుల పూడ్చివేత
13.కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇండ్ల కూల్చివేత
14.తడి, పొడి చెత్తను వేరే చేసేందుకు షెడ్స్‌ నిర్మాణం
15.ప్రతి గ్రామానికి నెలకు నిధుల విడుదల
16.గ్రీనరీకి గ్రామ బడ్జెట్‌లో10 శాతం కేటాయింపు
17.చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ
18.పాడుబడ్డ బోరు బావులను మూసివేయడం
19.ఎల్‌ఈడీ విద్యుత్తు దీపాల ఏర్పాటు

పల్లెల్లో నవోదయం పరిశుభ్రతే ప్రథమం
పల్లె ప్రకృతి వనాలు
19,470(మొత్తం ల‌క్ష్యం)
18,656(పూర్త‌యిన‌వి)
రైతు వేదికలు
2,601(మొత్తం ల‌క్ష్యం)
2,596(పూర్త‌యిన‌వి)
నర్సరీలు
12,755 (మొత్తం ల‌క్ష్యం)
12,755(పూర్త‌యిన‌వి)
ట్రాక్టర్లు,ట్రాలీ, ట్యాంకర్లు
12,769 (మొత్తం ల‌క్ష్యం)
12,769(పూర్త‌యిన‌వి)
డంపింగ్‌ యార్డులు
12,769 (మొత్తం ల‌క్ష్యం)
11,641(పూర్త‌యిన‌వి)
నర్సరీల్లో పెంచిన మొక్కలు
18.13 కోట్లు(మొత్తం ల‌క్ష్యం)
17.84 కోట్లు(పూర్త‌యిన‌వి)
నాటిన మొక్కలు
12.67 కోట్లు(మొత్తం ల‌క్ష్యం)
13.87 కోట్లు(పూర్త‌యిన‌వి)
వైకుంఠధామాలు
12,769 (మొత్తం ల‌క్ష్యం)
6,427(పూర్త‌యిన‌వి)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.