-ఐటీ సంస్థల స్థాపనకు సహకారమందిస్తాం
-అనేక అంశాల్లో దేశానికి రాష్ట్రం దిక్సూచి
-తాగు, సాగునీరు, కరెంట్ కష్టాలకు చెక్
-విద్య, వైద్యరంగాలపై సీఎం కేసీఆర్ దృష్టి
-కరీంనగర్ పర్యటనలో మంత్రి కేటీఆర్
-ఐటీ టవర్‌కు ప్రారంభోత్సవం

కరోనా తర్వాత ఐటీ విస్తరణకు అనేక అవకాశాలు ఉన్నాయి. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ ఎన్నారైలకు మాతృభూమికి సేవచేసే అవకాశం కల్పిస్తున్నాం. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు ముందుకొస్తే సహకరిస్తాం. కరీంనగర్‌లో టీ హబ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేస్తాం.
– ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు

హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన ఐటీని అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పారు. వివిధదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలకు మాతృభూమికి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని.. రాష్ట్రంలో ఐటీ సంస్థలను స్థాపించేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కొవిడ్ తర్వాత కొత్త రంగాలు, కొత్త అవకాశాలు తప్పకుం డా వస్తాయని.. ఈ మేరకు భవిష్యత్ విస్తరణకు యోచిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రతిరోజూ తాగునీటిని అందిస్తున్న కరీంనగర్ కార్పొరేషన్ రాష్ట్రంలో అన్ని పట్టణాలకు ఆదర్శమని అన్నారు. మంగళవారం మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కేటీఆర్ కరీంనగర్‌లో పర్యటించారు. కరీంనగర్‌లో ఏర్పాటుచేసిన ఐటీ టవర్‌ను, రూ.109 కోట్లతో చేపట్టిన ప్రతిరోజూ తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. మానే రు వాగుపై ఏర్పాటుచేసిన తీగలవంతెన పనులను, కలెక్టరేట్ వద్ద స్మార్ట్‌సిటీ రోడ్లను పరిశీలించారు. కలెక్టరేట్‌లో నగరపాలక సంస్థకు చెందిన పారిశుధ్య నూతన వాహనాలను ప్రారంభించి, విపత్తు నిర్వహణ విభాగం ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు ఆరోవిడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
కరీంనగర్‌లో టీ హబ్ ప్రాంతీయ కార్యాలయం

హైదరాబాద్ తర్వాత కరీంనగర్‌లో అతిపెద్ద ఐటీ టవర్‌ను ఏర్పాటుచేశామని కేటీఆర్ చెప్పారు. 83 వేల చదరపు అగుడుల విస్తీర్ణంలో నిర్మించిన ఐటీ టవర్‌లో 15 కంపెనీలకు స్థలం కేటాయించినట్టు తెలిపారు. ఐటీ కంపెనీల్లోనే కాకుండా.. పిల్లల్లో నైపుణ్య శిక్షణ పెంచేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ప్రాంతీయకేంద్రాన్ని కరీంనగర్‌లో ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఐటీ టవర్‌లో టీ హబ్ ప్రాంతీయకేంద్రాన్ని సైతం ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. పలువురికి రిక్రూట్‌మెంట్ పత్రాలను అందించా రు. డిమాండ్‌ను బట్టి కరీంనగర్‌లో మరో ఐటీటవర్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జనవరి వరకు అద్దె ఉండబోదని హామీ ఇచ్చిన ఆయన.. స్థానిక అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.
అన్ని పట్టణాలకు ఆదర్శం కావాలి

‘కేసీఆర్ జలం.. ఇంటింటికీ వరం’ పేరిట ప్రతిరోజూ మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించి న కేటీఆర్.. శాతవాహన వర్సిటీలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. రూ.109 కోట్లతో పూర్తిచేసిన ఈ పథకం 2048 వరకు పట్టణంలో పెరిగే విస్తీర్ణం, జనాభా, నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిందన్నారు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం పరిధిలో అర్బన్ లంగ్‌స్పేస్ పార్కు ఏర్పాటుకోసం 80 ఎకరాల భూమిని మంజూరుచేయించి కరీంనగర్‌కు అద్భుత అసెట్‌ను అందిస్తామని హామీఇచ్చారు.
ఇక విద్య, వైద్యంపై దృష్టి
మౌలిక రంగాలపై దృష్టిపెట్టిన ప్రభుత్వం ఆరేండ్లలో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నదని కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ పట్టుదల, ప్రజల ఆశీర్వాదంతో స్వల్ప సమయంలోనే తాగునీరు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో దేశం మొత్తానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఇక విద్య, వైద్యరంగాలపై సీఎం దృష్టి పెట్టినట్టు చెప్పారు. ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి’లా మార్చేందుకు కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల, సీతారామ ప్రాజెక్టులను వాయువేగంతో నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ పోలీస్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఎకరం స్థలంలో అభివృ ద్ధి చేసిన మినీ ఫారెస్ట్‌ను కేటీఆర్ సందర్శించారు.
కేసీఆర్ జలం, ఇంటింటికీ వరం: మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్‌లో మంగళవారం నుంచి ప్రతిరోజూ మంచినీటిని సరఫరా చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇలా సరఫరా చేస్తున్న తొలి కార్పొరేషన్ కరీంనగర్ కావడం గర్వకారణంగా ఉన్నదన్నారు. ఈ నెల 24న కేటీఆర్ పుట్టినరోజు ఉన్నదని, మంచినీటి పథకం ప్రారంభోత్సవాన్ని ఆయన జన్మదిన కానుకగా భావిస్తున్నామన్నారు. త్వరలోనే 24/7 మంచినీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్ సునీల్‌రావు ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ విజయ, సుడా చైర్మన్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.