Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నామినేటెడ్ జాతర..

-కార్పొరేషన్, దేవాదాయ, మార్కెట్ కమిటీ చైర్మన్ల భర్తీ -జాబితా రూపొందించాలని మంత్రులకు సీఎం ఆదేశం -గ్రామజ్యోతిలో అందరినీ భాగస్వాములు చేయండి -పార్టీ- ప్రభుత్వం సమన్వయంతోనే ప్రజల్లోకి పథకాలు -వచ్చే నెల మొదటివారంలో శాసనసభ సమావేశాలు -టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -తెలంగాణభవన్‌లో మూడు గంటలపాటు సమావేశం

KCR addressing in TRSLP meeting

గులాబీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పచ్చజెండా ఊపారు. ఈ నెలలోనే భారీ ఎత్తున నామినేటెడ్ జాతర ఉండబోతున్నదని స్పష్టమైన సంకేతాలిచ్చారు. గ్రామజ్యోతి పథకంపై తెలంగాణభవన్‌లో బుధవారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించి, పథకం అమలుపై దిశానిర్దేశం చేశారు.

పథకం తీరుతెన్నులు, ఎలా అమలు చేయాలి? రాష్ట్రంలోని అన్ని గ్రామాలను సమాంతరంగా ఎలా అభివృద్ధిపరచాలి? ముఖ్యంగా పార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవతో పథకాన్ని ఎలా విజయవంతం చేయాలి? అనే అంశాలపై సీఎం వారికి వివరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి ముఖాముఖి భేటీ జరిపారు. వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు సందేహాలను నివృత్తిచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ప్రత్యేక ఆహ్వానితులుగా జెడ్పీ అధ్యక్షులు కూడా సమావేశానికి హాజరయ్యారు.

పాత-కొత్త కలయికతో నామినేటెడ్ పోస్టుల భర్తీ! ఈనెల 15 తర్వాత మంచి రోజులు ఉన్నాయని, అప్పుడు కచ్చితంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు సీఎం ఈ సందర్భంగా చెప్పారు. మంచి రోజులకోసమే ఆగినట్లు తెలిపారు. పాత-కొత్త కలయికతో పోస్టుల భర్తీ ఉంటుందని సీఎం అన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 10, 12 కార్పొరేషన్లకు చైర్మన్లు, పాలకమండళ్లు ఏర్పాటు చేసుకుందామని, మరో 30-40 వరకు కార్పొరేషన్లపై ఏపీ ప్రభుత్వం కిరికిరి పెడుతున్నందున తర్వాత భర్తీ చేసుకుందామని చెప్పారు.

అదేవిధంగా దేవాదాయ కమిటీల ఏర్పాటు, మార్కెట్ కమిటీ చైర్మన్ల పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఇందులో రిజర్వేషన్ల ప్రాతిపదికన భర్తీ ఉంటుందని కూడా ఆయన సంకేతాలిచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు ఆయా జిల్లాల మంత్రులు జాబితాను రూపొందించాలని ఆదేశించినట్లుగా సమాచారం. పోస్టుల భర్తీలో 2001నుంచి పార్టీకోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని, అదేవిధంగా కొత్తగా వచ్చిన వారికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పారని తెలిసింది.

ప్రతి ఎమ్మెల్యే మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకోవాలి ఈనెల 17న వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో ప్రారంభించనున్న గ్రామజ్యోతి పథకం అమలుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచించారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని మండలాల్లో ఒకటి చొప్పున గ్రామాన్ని దత్తత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒక్కో ఎమ్మెల్సీ తన సొంత గ్రామం లేదా తన జిల్లాలోని ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్నారు. జడ్పీ చైర్మన్లు కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటే బాగుంటుందని సూచించారు.

ఈ గ్రామాల్ని మోడల్ గ్రామాల్లా అభివృద్ధి చేసి.. అదే సమయంలో సమాంతరంగా ఇతర గ్రామాల్ని కూడా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇందుకుగాను స్థానిక ప్రజాప్రతినిధులైన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచులను భాగస్వాములను చేయాలని చెప్పారు. వీరితో గ్రామసభ నిర్వహించి, గ్రామంలో సమస్యలు, అందుబాటులో ఉన్న నిధులు, ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాల్సిన సమస్యలు.. ఇలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. వీటన్నింటిలోనూ ప్రధానంగా ప్రజల్ని మమేకం చేయాలని చెప్పారు. ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయి? ఇంకెన్ని అవసరం? అనే అంశాలు పరిశీలించాలని, పారిశుద్ధ్యం వందశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మురుగునీటి వ్యవస్థను ఏర్పాటుచేసి, ఆ నీటిని గ్రామ శివారులో ఏర్పాటుచేసే ఒక పిట్‌లోకి మళ్లించాలని చెప్పారు. వీలైనంత వరకు శ్రమదానం ద్వారా ఈ పనులు చేపట్టాలని, అలా చేయలేని వాటికి నిధులు వినియోగించి పూర్తి చేయాలని వివరించారు. గ్రామంలో నిరక్షరాస్యులు ఎంతమంది ఉన్నారో గుర్తించి, గ్రామంలోని విద్యావంతులైన యువకులద్వారా వారికి సాయంత్రంపూట విద్య అందించాలన్నారు. ఆ గ్రామంలో ఎంతమందికి పింఛన్ వస్తున్నది? రేషన్ బియ్యం ఎంతమందికి అందుతున్నది? అనే వివరాలు సేకరించాలని కోరారు.

అర్హులైన వారికి ఎవరికైనా రాకుంటే వెంటనే వారికి అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి కే తారక రామారావు కూడా గ్రామజ్యోతిపై మాట్లాడారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు బిగాల గణేష్, గువ్వల బాలరాజు, శ్రీనివాస్‌గౌడ్, సతీశ్, బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, సంజీవరావు, ఎమ్మెల్సీ పూల రవీందర్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సీఎంతో వీరు ముఖాముఖి నిర్వహించినట్లు తెలిసింది.

అసెంబ్లీ తర్వాత చైనా పర్యటన అసెంబ్లీ సమావేశాలను వచ్చే నెలలో నిర్వహించుకుందామని సీఎం ఈ సమావేశంలో చెప్పారు. వారంపాటు సమావేశాలు నిర్వహించుకున్న తర్వాత తాను చైనా పర్యటనకు వెళతానని తెలిపారు. చైనాలో జరుగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు రావాలని కేసీఆర్‌కు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఇందుకోసం కేసీఆర్ వచ్చే నెల 10న హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు. దీంతో ఆ లోపే సమావేశాలు ముగించుకోవాల్సి ఉన్న రీత్యా వచ్చే నెల మొదటి వారంలోనే సమావేశాలు ఉంటాయని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రజల మనసు దోచుకుంటేనే పార్టీలకు మనుగడ గ్రామజ్యోతి పథకంపై ప్రసంగిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి పథకాల అమలు, వాటి ఫలితాలపై కాసేపు మాట్లాడినట్లు తెలిసింది. ఏ ప్రభుత్వ పథకాలైనా, ఎంత అద్భుతంగా రూపొందించినా అవి ప్రజలను ఒప్పించి, మెప్పించేలా ఉండాలన్నారు. అలాగైతేనే వాటి ఫలితాలు మంచిగా ఉంటాయని, లేకపోతే వీరే తీరుగ ఉంటాయని చెప్పారు. పార్టీ ఎంత పటిష్ఠంగా ఉన్నా.. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీకృతమైతేనే తదుపరి అధికారంలోకి వస్తారని అన్నట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలు ప్రజల మనసు దోచుకుంటేనే పార్టీలకు మనుగడ ఉంటుందని స్పష్టంచేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో 1989కంటే ముందు టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ నాయకత్వంలో పలు పథకాలు రూపొందించిందని, పార్టీ పటిష్ఠంగా ఉన్నప్పటికీ గెలవలేకపోయిందని సీఎం ఈ సందర్భంగా ఉదహరించారని సమాచారం. పార్టీలు ఎంత పటిష్టంగా ఉన్నా… ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఇందుకు ప్రభుత్వం, పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ దిశగా కృషి చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. రాష్ట్రంలో స్మార్ట్ సిటీల సంఖ్యను పెంచుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఇందుకు జాబితాను రూపొందించాలని సీఎం చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎక్కువ సంఖ్యలో స్మార్ట్ సిటీల ఎంపిక జరిగేలా చూసుకుందామని సీఎం అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.