వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
ఆశించినమేర వర్షాలు కురవడంతో రైతులకు గురువారం నుంచి ఏడుగంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వర్నిలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు సకాలంలో కురవడంతో శ్రీశైలం ప్రాజెక్టుతోపాటు ఇతర జలాశయాలు నిండాయన్నారు. జలాశయాలు నిండడంతో ఆయకట్టు కింద బోర్లకు విద్యుత్ వినియోగం తగ్గిందన్నారు. పంటలను కాపాడే దశలో నిజాంసాగర్ నీటిని విడుదల చేయడంతో ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా చేరిందన్నారు. దీంతో ఖరీఫ్‌పంటలకు ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. రైతులు అప్పులతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రభుత్వం స్పందించి రుణమాఫీ చేసిందన్నారు. ఇచ్చినమాట ప్రకారం కట్టుబడి మాఫీ చేస్తే, పట్టాలులేని భూములకు సైతం రుణమాఫీ ప్రకటించాలని ఓ సీమాంధ్ర పత్రిక ప్రచురించడం హాస్యాస్పదమన్నారు. భూములు లేకుండా కొందరు బోగస్ పాసుపుస్తకాలపై రుణాలు పొందారని వారికి రుణమాఫీ వర్తించదని తేల్చిచెప్పారు.