Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నేతకు నిధులేవి?

-చేనేత, జౌళి రంగానికి చేయూత ఏదీ?
-కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌,
-ఐఐహెచ్‌టీ మంజూరు చేయాలి
-పవర్‌లూం అప్‌గ్రేడ్‌కు నిధులివ్వాలి
-కేంద్ర మంత్రులు నిర్మల, గోయల్‌కు
-రాష్ట్ర చేనేత, జౌళి మంత్రి కేటీఆర్‌ లేఖ

‘సబ్‌కా సాత్‌. సబ్‌కా వికాస్‌’ అంటున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం.. తెలంగాణపై వివక్ష చూపుతున్నది. సిరిసిల్ల ఎమ్మెల్యేగా, చేనేత జౌళిశాఖ మంత్రిగా మెగా పవర్‌లూం క్లస్టర్‌ మంజూరు చేయాలని ఏడేండ్లుగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోలేదు.

స్థానిక ఎంపీగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాజకీయాలు మాని రాష్ట్రానికి మెగా పవర్‌లూం క్లస్టర్‌, చేనేత సమూహాలకు క్లస్టర్లు, ఇండియన్‌ టెక్స్‌టైల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ తీసుకురావాలి. దేశానికి అత్యధిక ఆదాయం ఇస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నా, రాష్ర్టానికి వసతులు సమకూర్చడంలో కేంద్రం తీవ్ర వివక్ష చూపుతున్నది.

–సిరిసిల్లలో మంత్రి కే తారకరామారావు

తెలంగాణలో చేనేత, జౌళి రంగానికి చేయూతనందించేందుకు నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్రంలోని నేత కార్మికుల సంక్షేమం, చేనేత, జౌళి పరిశ్రమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేయూత అందించాలన్నారు. ఇదే అంశంపై గతంలోనూ లేఖ రాసినట్టు గుర్తుచేశారు. రాజకీయాలు మాని నేత పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని రాష్ట్ర బీజేపీ ఎంపీలకు సూచించారు. వరంగల్‌ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రులను మంత్రి కేటీఆర్‌ కోరారు. 1,200 ఎకరాల్లో టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఫైబర్‌ టు ఫ్యాషన్‌ విధానంలో నిర్మిస్తున్నామని లేఖలో తెలిపారు. ఈ పార్కులో మౌలిక సదుపాయాల కోసం రూ.897.92 కోట్లు మంజూరు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మాన్యుఫాక్చరింగ్‌ రీజియన్స్‌ ఫర్‌ టెక్స్‌టైల్‌ అండ్‌ అపారెల్‌ సెక్టార్‌ (ఎంఆర్‌టీఏ)కు తుది రూపు ఇవ్వాలని, ఈ విధానానికి ఆమోదం తెలిపితే కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ దాని పరిధిలోకి వస్తుందని తెలిపారు.

సిరిసిల్లలో మెగా పవర్‌లూం క్లస్టర్‌
సిరిసిల్లలో మెగా పవర్‌లూం క్లస్టర్‌ను మంజూరు చేయాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.49.84 కోట్లు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.993.65 కోట్లు అని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే అత్యధికంగా రూ.756.97 కోట్లు భరిస్తున్నదని తెలిపారు. ప్రాజెక్టులో మౌలిక సదుపాయాలు, ఆధునీకరణ, విస్తరణ, మార్కెట్‌ డెవలప్‌మెంట్‌, కెపాసిటీ బిల్డింగ్‌, ప్రాజెక్టు మానిటరింగ్‌, వీవింగ్‌, అపారెల్‌ పార్క్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తదితర విభాగాలు ఉంటాయని చెప్పారు. దీని ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, వర్కర్‌ టు ఎంటర్‌ప్రెన్యూర్‌ స్కీం అమలు చేస్తున్నామని వెల్లడించారు.

ఐఐహెచ్‌టీని మంజూరు చేయండి
తెలంగాణకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని మంజూరు చేయాలని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఐఐహెచ్‌టీ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉండటంతో ఆ రాష్ర్టానికి వెళ్లిందన్నారు. తెలంగాణకు హ్యండ్లూమ్‌ టెక్నాలజీలో డిప్లొమా కోర్సు అందించే విద్యా సంస్థ లేదని గుర్తుచేశారు. ఐఐహెచ్‌టీని మంజూరు చేస్తే దానికి అవసరమైన స్థలం, భవనం పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్క్‌లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.


బీఎల్‌సీలను మంజూరు చేయండి..

తెలంగాణ రాష్ట్రానికి నేషనల్‌ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ (ఎన్‌హెచ్‌డీపీ) బ్లాక్‌ లెవెల్‌ హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌ (బీఎల్‌సీ)లను మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. 5 క్లస్టర్‌లను మంజూరు చేయాలని రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదంతో కేంద్రానికి పంపించామని లేఖలో తెలిపారు. వీటికి రూ.20.82 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని, వీటి ద్వారా దాదాపు మూడు వేల మంది లబ్ధిపొందుతారని వివరించారు. కేంద్రం వద్ద మరో ఎనిమిది క్లస్టర్లు రూ.7.20 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు కోసం ఎదురుచూస్తున్నాయని గుర్తు చేశారు. చేనేత కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఎన్‌హెచ్‌డీపీ పథకాన్ని మరో ఐదేండ్లు కొనసాగించాలన్నారు. నేషనల్‌ టెక్స్‌టైల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ హ్యాండ్లూమ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఏటీయూఎఫ్‌ పథకానికి బ్యాంకు ఫైనాన్స్‌తో సంబంధం లేకుండా మినహాయింపు ఇవ్వాలని, రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే టెక్స్‌టైల్‌ కంపెనీల కోసం ఏటీయూఎఫ్‌ నిబంధనలను మార్చాలన్నారు. ప్రస్తుతం 50 శాతం ఉన్న బ్యాంకు రుణాన్ని ఐదు శాతానికి పరిమితం చేయాలని చెప్పారు.

పవర్‌లూంలను అప్‌గ్రేడ్‌ చేయండి
రాష్ట్రంలోని పవర్‌లూంలను అప్‌గ్రేడ్‌ చేయడానికి కేంద్రం చేయూతనివ్వాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఇన్‌-ఎస్‌ఐటీయూ పథకం కింద పవర్‌లూంలను అప్‌గ్రేడ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్‌గ్రేడ్‌ చేయడానికి అవసరమైన నిధుల్లో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో 13,886 పవర్‌లూంలు ఉంటే, ఇందులో 80 శాతం సిరిసిల్లలోనే ఉన్నాయని చెప్పారు. వీటి అప్‌గ్రేడ్‌కు కేంద్ర వాటాగా రూ.13.88 కోట్లు అవసరమవుతాయని వెల్లడించారు. పవర్‌ లూంలను అప్‌గ్రేడ్‌ చేసే వరకు ఇన్‌ -ఎస్‌ఐటీయూ పథకాన్ని కొనసాగించాలని లేఖలో సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.