-టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాలకు నేడే భూమిపూజ -29 జిల్లాల్లో ఒకేసారి శంకుస్థాపన -దసరానాటికి పూర్తిచేయాలని కేసీఆర్ ఆదేశం -సంస్థాగతంగా మరింత బలోపేతం దిశగా మరో అడుగు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్రంలో మరింత బలపడటానికి మరో అడుగు ముందుకు వేస్తున్నది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అత్యధికంగా ప్రజాప్రతినిధులను కలిగిన ఉన్న పార్టీగా గుర్తింపు పొందిన టీఆర్‌ఎస్ సంస్థాగతంగా పటిష్ఠం కావడానికి ప్రతి జిల్లాలో శాశ్వత కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నది. ఈ మేరకు సోమవారం 29 జిల్లాల్లో ఒకేసారి పార్టీ కార్యాలయ నిర్మాణాలకు శంకుస్థాపన జరుగనున్నది. ఇందుకోసం అన్ని జిల్లాల్లో ప్రభుత్వం నుంచి ఎకరం చొప్పున స్థలాన్ని టీఆర్‌ఎస్ కొనుగోలుచేసింది. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి రాష్ట్ర పార్టీ నుంచి ఒక్కో జిల్లాకు రూ.60 లక్షలు కేటాయించారు. వచ్చే దసరానాటికి కార్యాలయాలను ప్రారంభించుకోవాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ లక్ష్యంగా నిర్దేశించారు. పార్టీ కార్యాలయాల శంకుస్థాపనకు పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
శంకుస్థాపన ఏర్పాట్లపై నాయకులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎప్పటికప్పుడు సమీక్షించారు. భూమిపూజను సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో పూర్తిచేయనున్నారు. పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, పార్టీ సీనియర్ నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. పార్టీ కార్యాలయాల నమూనాను సీఎం త్వరలో ఎంపిక చేస్తారు. మంత్రులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల శంకుస్థాపన చేస్తారు. మిగతా ప్రాం తాల్లో కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్లు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి భూమిపూజ నిర్వహిస్తారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే కార్యాలయం నిర్మాణమైంది. హైదరాబాద్, వరంగల్ రూరల్ జిల్లా పార్టీ కార్యాలయాలకు స్థలాలను అన్వేషిస్తున్నారు. వనపర్తి జిల్లా కార్యాలయానికి ఇప్పటికే శంకుస్థాపన పూర్తిచేశారు.