Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా…పల్లా నామినేషన్

నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ స్థానంనుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రముఖ విద్యావేత్త పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలుచేశారు. నల్లగొండ కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పీ సత్యనారాయణరెడ్డికి అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్ పత్రాలు అందజేశారు. -డిప్యూటీ సీఎం, మంత్రులు, పలువురు నేతల హాజరు -నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ -రాజేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమని నేతల ధీమా -ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లు గల్లంతు చేయాలని పిలుపు

Palla-Rajeshwar-Reddy-filed-Nomination

నామినేషన్ వేసే సమయంలో రాజేశ్వర్‌రెడ్డి వెంట డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, జీ జగదీశ్‌రెడ్డి ఉన్నారు. అంతకు ముందు కలెక్టరేట్ వరకూ జరిగిన భారీ ర్యాలీలో పార్లమెంటరీ కార్యదర్శులు గాదరి కిశోర్‌కుమార్, జలగం వెంకట్రావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, జడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ధర్మారెడ్డి, టీఆర్‌ఎస్ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల అధ్యక్షులు బండా నరేందర్‌రెడ్డి, దిండిగాల రాజేందర్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతోపాటు మూడు జిల్లాల నుంచి పలువురు టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భారీ ర్యాలీతో నామినేషన్‌కు.. నామినేషన్ సందర్భంగా నల్లగొండ పట్టణంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్ర ఓటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీ కాలేజీ మైదానంనుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. సుమారు 3గంటల పాటు 10వేల మందికి పైగా పట్టభద్రులు పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కళాకారుల ఆట పాటలు, డప్పు నృత్యాలు, మహిళల కోలాటాలతో ర్యాలీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోయింది. వీధులన్నీ టీఆర్‌ఎస్ శ్రేణుల వాహనాలు, జన సందోహంతో నిండిపోయాయి.

ముందుగా ఎన్జీ కాలేజీ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి మంత్రి హరీశ్‌రావు, గాదరి కిశోర్, అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పూల మాల వేసి ర్యాలీ ప్రారంభించారు. తర్వాత క్లాక్‌టవర్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం వద్ద డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల, పలువురు నేతలు నివాళి అర్పించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, కాసోజు శంకరమ్మ, అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి ముందుకు సాగారు. మంత్రులు, నాయకులు ఓపెన్ టాప్ వాహనంలో శ్రేణులకు అభివాదం చేస్తుండగా.. భాస్కర్ టాకీస్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. పోలీసులు అనేక చోట్ల వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరువలో జన సందోహాన్ని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, మంత్రులు మాట్లాడారు.

మెజార్టీయే లక్ష్యం.. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపు ఖాయమే అయినా.. భారీ మెజార్టీపైన దృష్టి సారించాలని నాయకులు పార్టీ శ్రేణులకు, పట్టభద్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నదని వారు అన్నారు. ఎమ్మెల్సీలుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత అతి త్వరలోనే లక్ష ఉద్యోగాలతో ఉద్యోగ మేళా ప్రారంభం కానుందని తెలిపారు.

పల్లా విజయం నల్లేరుపై నడేకనని కడియం అన్నారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మండలి ఎన్నికల్లో గెలుపు ముమ్మాటికీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిదేనన్నారు. తెలంగాణ ప్రజలను గుండెలను బీజేపీ గాయపర్చిందని విమర్శించారు. తెలంగాణను అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని మంత్రి హరీశ్ ధ్వజమెత్తారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇప్పటి నుంచే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా పిలుచుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు.

విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ శాసన మండలి ఎన్నికల్లో ఇతర పార్టీలకు డిపాజిట్లు దక్కనివ్వొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడి సాధించిన పార్టీకే పట్టం కట్టాలని కోరారు. ఇతర పార్టీలకు అసలు ఓట్లు అడిగే హక్కులేదని అన్నారు. రాష్ర్టాభివృద్ధి తట్టుకోలేక కపట బుద్ధితో కుట్రలు చేస్తూ.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న ప్రతిపక్షాలకు ఈ ఎన్నికతో బుద్ధి చెప్పాలని జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ద్రోహ పార్టీలకు- తెలంగాణకు, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడ్డ పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. మూడు జిల్లాలతో అనుబంధం కలిగిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం పట్టభద్రుల అభివృద్ధికి మలుపు అవుతుందని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తన విజయానికి సహకరించి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని పట్టభద్రులకు సూచించారు. టీఆర్‌ఎస్ స్థాపించిన నాటి నుంచీ పార్టీ వెంటే నడుస్తున్న మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, పట్టభద్రులు ఈ ఎన్నికలోనూ అదే మద్దతు కొనసాగించాలని కోరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.