నల్లగొండ జిల్లా ప్రజల దుఃఖం నాకు తెల్సినంతగా మరెవ్వరికీ తెల్వదు. దేశపతి శ్రీనివాస్, నేను ఎనిమిది రోజుల పాటు ఇక్కడే పడుకుని, గ్రామ గ్రామాన తిరిగి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నాం.

నల్లగొండ బాధను, దుఖాన్ని గుండెల్లో పెట్టుకున్నా. చూడు చూడు నల్లగొండ అనే పాట నేను దేశపతి కల్సి రాసినం. నల్లగొండ జిల్లానుంచి ఫ్లోరైడ్ రక్కసిని పారదోలాలని నిర్ణయించినం. అందుకే మునుగోడులో వాటర్‌గ్రిడ్ పైలాన్ ఏర్పాటుచేశాం. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. డబుల్ బెడ్‌రూమ్‌లను ప్రభుత్వమే కట్టి ఇస్తుంది. ఒక్క పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు వస్తయని ఎప్పుడైనా అనుకున్నామా? ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వకుంటే ఓట్లు అడగనన్న మొగోడు ఉన్నాడా? నల్లగొండ జిల్లాలో ఒక నాయకుడున్నాడు.
ఉత్తమ్‌కుమార్‌కాదు ఉత్తర కుమారుడు. స్కీమ్ మొదలు పెట్టకముందే ఆయనకు అవినీతి కనబడిందట. అలా బతికేటోళ్ళు కాబట్టి అన్నీ వాళ్లకు అలాగనే కనిపిస్తాయి. పచ్చకామెర్లోడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో వారికి శంకరగిరి మాన్యాలు కనిపిస్తున్నాయి. కాళ్ళకింద భూమి కదిలిపోయినట్లు, భవిష్యత్తు అంధకారం అయ్యినట్లు వాళ్ళకు కనిపిస్తుంది. ఆంధ్రా ముఖ్యమంత్రులకు సంచులు మోసి బతికిన మీరు.. మీకు జీవితంలో ఇలాంటి ఆలోచనలు వచ్చినయా? ఉద్యమంలో పనిచేసిన యువకులు నేడు మంత్రులుగా, కార్యదక్షులుగా తమ అలోచనలకు రూపం ఇస్తున్నారు. వారికి (కాంగ్రెస్) చిల్లర రాజకీయాలు తప్ప ప్రగతి పథం కనిపించదు.
వచ్చే నాలుగేండ్లలో ప్రజలకు నాలుగు పైసలు కూడా ఖర్చులేకుండా వాటర్‌గ్రిడ్ పథకాన్ని అందించి తీరుతాం. కృష్ణా, గోదావరి నదీజలాలతో తెలంగాణ ఆడబిడ్డల కాళ్లు తడుపుతాం. నేను ఎంత జగమొండినో మీకు తెలుసు. ఏదైనా పట్టుపట్టానంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టను. ప్రపంచంలో, దేశంలో ఏ రాష్ట్రంలో వాటర్‌గ్రిడ్‌లాంటి పథకంలేదు. ఇంతటి మంచి కార్యాన్ని చేస్తుంటే కొందరు నాయకులు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నరు. అలాంటోళ్ళను ప్రజలు నిలదీయాలి. వాటర్‌గ్రిడ్ పథకం అమలుకు హడ్కో రుణంకోసం పోతే మెచ్చుకుని మరీ రూ.10వేల కోట్ల అప్పు ఇచ్చారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమం లేదని మెచ్చుకుని, అవసరమైతే మరో ఐదారు వేల కోట్లు అదనంగా ఇచ్చేందుకు సమ్మతించారు.
జగదీశ్ నాకు కుడిభుజం: విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి నాకు కుడిభుజం. 2001 సంవత్సరంనుంచి ఉద్యమంలో నాకు కుడిభుజంగా ఉన్నాడు. 24 గంటలు కరెంటు కోసం ఆహోరాత్రులు కష్టపడి పనిచేస్తున్నడు. పొట్టిగుంటడు.. సన్నగుంటడు.. కానీ ఆయనే కరెంటు తెచ్చిండు. ఈ రోజు మీకు కరెంటు కోతలు లేకుండా ఇరవై నాలుగు గంటలు ఉందంటే అది ఆయన కృషే.