నాటి సంకల్పం.. నేటి కార్యరూపం
-3800 పంచాయతీల్లో గిరిజన రాజ్యం
-ఉద్యమ నేతగా గిరిజన పల్లెలకు గులాబీ దళపతి
-గిరిజనులతో ప్రత్యక్షంగా మాటామంతీ
-వారికి జరుగుతున్న అన్యాయంపై అవగాహన
-తండాలు, గూడేలు పంచాయతీలుగా మారాల్సిన ఆవశ్యకతను ఆనాడే గుర్తించిన సీఎం శ్రీ కేసీఆర్
-గిరిజనుల బతుకు మారేందుకు అప్పట్లో బీజం
-రాష్ట్ర ఏర్పాటు తర్వాత పక్కా చట్టం
తెలంగాణ సాధనే లక్ష్యంగా బయల్దేరిన నేత! రాజకీయ పోరాటాలతో విరామం లేని నాయకుడు! భావి తెలంగాణ సమగ్ర చిత్రాన్ని ముందునుంచి స్వప్నిస్తున్న మేధావి! ఉద్యమసమయంలో గిరిజన తండాలకు, గూడేలకు వెళ్లిన కేసీఆర్.. వాళ్లు పెట్టిన ముద్ద తిన్నారు. పొద్దున్నే లేచి.. ఊరివాళ్లలో ఒకడై.. బురద వీధుల్లోనే ఇంటింటికీ వెళ్లి కుశలమడిగారు! వాళ్ల కష్టాలను, గోసలను ఆలకించారు! స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలవుతున్నా.. ఎందుకు వీరికి ఇంకా కష్టాలు? ఘనంగా చెప్పుకొనే ప్రజాస్వామ్య దేశంలో వారికి ఏవీ ఆ ఫలాలు? వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేదెలా? అనేకానేక ఆలోచనలు! అప్పుడే ఆయన మనసులో నాటుకున్న బీజం.. గూడేలకు, తండాలకు స్వయంపాలనాధికారం! తెలంగాణ సాధించిన తర్వాత గూడేలు, తండాలను పంచాయతీలుగా మార్చుతానని అప్పుడే సంకల్పం తీసుకున్నారు! తెలంగాణ సాధించడమేకాదు.. సాధించుకున్న స్వరాష్ట్రంలో తాను స్వప్నించిన భావి తెలంగాణను సాకారం చేసే క్రమంలో గూడేలు, తండాలకు పంచాయతీ హోదా ఇచ్చి.. గిరిజనుడిని రాజును చేశారు!
డెబ్బై ఏండ్లకు పైబడ్డ స్వతంత్య్ర భారతదేశంలో ప్రజాస్వామ్య ఫలాలు అందని వర్గాలు ఎన్నో! జాబితా తీస్తే మొదట కనిపించేది గిరిజనులే! పేరుకు రిజర్వేషన్లు కల్పించినా.. తమ ఇలాకాలో తమ ప్రజలకు తామే ప్రతినిధులమన్న నిజమైన భావనను వారు అనుభవించింది ఎక్కడో వెతకాల్సిందే! కానీ.. వారికి నిజమైన ప్రజాస్వామ్యాన్ని చేరువ చేశారు గులాబీ దళపతి.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. విప్లవాత్మక చట్టంతో తండాలు, గూడేలకు ఆదివాసీ గ్రామపంచాయతీల హోదా కల్పించి తన సంకల్పాన్ని నెరవేర్చారు. నిజానికి గూడేలు, తండాలను పంచాయతీలుగా మార్చిన ఈ సందర్భానికి పునాది పడింది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలోనే! తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభించిన తర్వాత కేసీఆర్ తిరుగని ఊరులేదు.. అడుగుపెట్టని బాట లేదు. ఆ క్రమంలోనే దాదాపు అన్ని జిల్లాల్లోని గిరిజన పల్లెల్లో ఆయన పర్యటించారు. గిరిజనులను సభ పేరిటో, సమావేశం పేరిటో ఏదో ఒకో చోటికి పిలిపించుకుని నమస్తే చెప్పి వెళ్లిపోవడం కాకుండా.. స్వయంగా ఆదివాసీల గూడేలకు వెళ్లారు. తండాల బిడ్డలతో ముచ్చటించారు. అక్కడే రాత్రినిద్ర చేశారు. పొద్దున్నే వాళ్లతో కలిసి పిల్లా జెల్లా మొదలుకొని పండు ముసలి వరకు వారి గోస అడిగి తెలుసుకున్నారు. ఒక్కో గూడేనిది ఒక్కో యాతన అని గ్రహించారు. తండాలు, గూడేలు స్వయం సమృద్ధి చెందాలంటే వారి పాలన వారి చేతుల్లోనే ఉండాలని నిశ్చయానికి వచ్చారు. రాష్ట్రం వచ్చిన తర్వాత 3,800 గూడేలు, తండాలను పంచాయతీలుగా మార్చారు.
సంకల్పం.. నెరవేర్చే చిత్తశుద్ధి పాలకులు నిర్ణయం తీసుకోవాలంటే.. క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉండాలి. కష్టాలు పడుతున్న మనుషుల మనసులో తడి తెలిసి ఉండాలి. దానికి పరిష్కారం చూపే సంకల్పం ఉండాలి! ఆ సంకల్పాన్ని చిత్తశుద్ధితో నెరవేర్చే ధైర్యం ఉండాలి! వాటన్నింటినీ కలబోసి, గిరిజనుల కలలను సాకారం చేశారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. మెరుగైన విద్యాబోధన మొదలుకుని అన్ని రంగాల్లో గిరిజనులకు ఉపయోగపడే అనేకానేక నిర్ణయాలు తీసుకున్నారు. గిరిజనులు సహా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన అనేక కార్యక్రమాలను చేపట్టారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం, రీడిజైనింగ్ ఇందులోనివే! ఈ క్రమంలోనే తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో గిరిజనుల్లో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.