Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నాటి పశువులకాపరి.. నేటి ఉపముఖ్యమంత్రి

వంశపారంపర్యంగా రాజకీయాలు చేసిన కుటుంబం కాదాయనది.. పశువులకాపరి జీవితం నుంచి పాలనా పగ్గాలు చేపడతానని ఆయన కలలో కూడా అనుకోలేదు.. ఆ మాటకొస్తే మొదట్లో ఆయన ఐ హేట్ పాలిటిక్స్ అన్నారు! ఎంతోమంది ఆయనను రాజకీయాల్లోకి రావాలని కోరినా సున్నితంగా తిరస్కరించారు! కానీ కాలం తెచ్చిన మార్పులతో మమేకమై రాజకీయాల్లోకి వచ్చారు! ఆయనే తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య! తనకు చిన్నప్పుడు ఓనమాలు దిద్దించిన వెంకమ్మ టీచర్ మొదలు తన జీవితాన్నితీర్చిదిద్దిన ఎంతోమంది ఆచార్యులను గుర్తుచేసుకున్నారు..

Rajaiah

మాది వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని దళితవాడ. నాన్న వెంకటయ్య, అమ్మ లక్ష్మి. ఒక తమ్ముడు, నలుగురు చెల్లెండ్లు. అత్యంత నిరుపేద కుటుంబం. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిపాస్తులు కానీ పేరుప్రఖ్యాతలు కానీ లేని నేపథ్యం మాది. మా నాన్న పాలేరు. మాసొంతూరు తాటికొండ (స్టేషన్‌ఘన్‌పూర్ మండలం). మా ఇంటిపేరు మారపాక. మా పూర్వీకులు వచ్చి స్టేషన్‌ఘన్‌పూర్‌లో స్థిరపడటం వల్ల మా ఊరిపేరే ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. నేను మా ఇంటికి తొలిచూలును. మా అమ్మమ్మ వాళ్లింట్లో (రాజవరం) పుట్టాను. మా అమ్మమ్మ వేములవాడ రాజన్న భక్తురాలు. అందుకే నాకు ఆయన పేరుపెట్టారు.

 

 

పశువులకాపరి నుంచీ..

నాతోటి వాళ్లంతా బడికి పోతుంటే నేను మా వంశపారంపర్యంగా వస్తున్న పశువులను కాసే పనికి దిగిన. ఆ రోజుల్లో ఒక్క పశువు కాస్తే ఒక్క రూపాయి ఇచ్చేవారు. అట్లా నేను 31పశువులను కాసేవాడిని. ఏ తండ్రైనా తన కొడుకు బాగా చదువుకోవాలని అనుకుంటాడు. కానీ పరిస్థితుల ప్రభావం, ఆర్థికభారం వల్ల మా నాన్న నన్ను బడికి పంపడానికి ఇష్టపడలేదు. అట్లా అనేక కష్టాలు పడి 13నెలలు పశువులు కాశాను.

నేను పశువులు కాస్తున్నా నా దృష్టంతా బడిమీదనే. నా ఆలోచనను గమనించిన ఇరుగుపొరుగు మా నాన్నకు చెప్పడంతో ఎట్లాగో అట్లా నన్ను బడికి పంపాడాయన. ఊళ్లో నాలుగోతరగతి వరకు బాలికల పాఠశాలలోనే చదివా. నాకు బాగా గుర్తు.. నాచేత ఓనమాలు దిద్దించిన నా మొదటి టీచర్ వెంకమ్మ. ఐదోతరగతి అయిపోయిన తర్వాత మళ్లీ పశువులకాపరి గిరి. అప్పుడూ నా మనసంతా బడిమీదనే. సహజంగా బడికి వెళ్లకుంటే తండ్రులు కొడతారు. కానీ మా నాన్న.. నేను బడికి పోతానంటే కొట్టేవాడు(పరిస్థితులు అట్లాంటివి). నేను బాగా చదువుతానని ఇంద్రసేనారెడ్డి అనే టీచర్‌కు తెలుసు. ఆయన చేను పక్కనే రామలింగయ్య అనే ఆసామి దగ్గర పాలేరుగా పనిచేసేవాడు మా నాన్న. అప్పుడు ఒక్కసారి ఇంద్రసేనారెడ్డి సార్ మా నాన్న దగ్గరికొచ్చి అరె వెంకటి నీ కొడుకు బాగా చదివి డాక్టరో, ఇంజనీరో అవుతాడని అనుకుంటే నువ్వేమో పశువులను కాయిస్తున్నావా అని అనడం .. ఆ మాటలను ఆ పక్కనే ఉన్న నేను వినడం నామీద నాకు నమ్మకం కలిగించాయి. అంతే అప్పటినుంచి చదువుకోవాలని గట్టి నిశ్చయానికొచ్చా.

నా పట్టుదల చూసి మా నాన్నకు నన్ను బడికి పంపక తప్పని పరిస్థితి ఏర్పడింది. అట్లా నా చదువు మళ్లీ మొదలైంది. అట్లా ఒకరకంగా నా జీవితాన్ని ఇంద్రసేనారెడ్డి సార్ మాటలు మలుపు తిప్పాయనుకోవచ్చు. ఆయనంటే అప్పుడు అందరికీ హడల్. కొట్టేవారు. గుంజీలు తీయించేవారు. తొడపాశం పెట్టేవారు. హైస్కూల్‌లో వరదారెడ్డి అనే సార్, అప్పుడు హెడ్‌మాస్టర్‌గా ఉన్న ఇమాన్యూయెల్.. వీళ్ల ప్రభావం చిన్నతనంలో నా మీద బాగా పడింది. నేను 8వతరగతిలో ఉన్నప్పుడు మా పెద్ద చెల్లె పెళ్లి చేశాం. ఎండాకాలమంతా కూలీపనిచేస్తే రూ.200 వచ్చాయి. దాంతో మా పెద్ద చెల్లె పెళ్లి చేశాం.

ఐదోతరగతిలోనే జై తెలంగాణ

నేను ఐదోతరగతిలో ఉన్నప్పుడు 1969తెలంగాణ ఉద్యమం వచ్చింది. నిజానికి తెలంగాణ ఉద్యమం అంటే ఏమిటో తెలియని వయసది. అందరిలాగే మేమూ జై తెలంగాణ అంటూ రోడ్లమీద పడ్డాం. లాఠీదెబ్బలు తిన్నా. ఓసారి విజయవాడ నుంచి వచ్చే ప్యాసింజర్ రైలును అడ్డుకునేందుకు రైలు పట్టాలకున్న బోల్ట్‌లను తొలగించాం. ఆనాడు పోలీసులు తరిమితే రెండు మూడు కిలోమీటర్లు ఉరికి ఓ పశువుల కొట్టంలో దాక్కున్నాం. చీకటిపడ్డాక, అక్కడ ఎవ్వరు లేరని నిర్ధారించుకున్న తర్వాతే ఇంటికి వెళ్లిపోయాను. అట్లా నేను విద్యార్థిగా ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామినయ్యాను.

నాన్నే నా కొడుకులా..

నిజానికి మా నాన్నకు నేను కొడుకుగా కంటే తండ్రిగానే వ్యవహరించాను. ఇంటికి పెద్దవాడిని కాబట్టి నాన్న బరువును నేనే మోశాను. నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు రెండో చెల్లె పెళ్లి అయింది. నా పెళ్లి ఖర్చులకని మా మామ ఐదువేల రూపాయలు ఇస్తే వాటితో నా రెండో చెల్లె పెళ్లి చేశాను. ఆ తర్వాత నా ప్రాక్టీస్ మీద మూడో చెల్లె పెళ్లి, నాలుగో చెల్లె పెళ్లి చేశాను. విద్యార్థిగా ఉన్నప్పటినుంచే కాదు ఇప్పటికి అప్పు అంటే నాకు భయం. నేను ఎప్పుడూ అప్పు చేయలేదు. కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్న రోజుల్లో వేపపుల్లతోనే పళ్లు తోమేవాడిని. పాథాలజీ పరీక్షకు ముందు రీడింగ్ రూమ్‌లో చదువుకుంటుంటే ఒక పుస్తకంలో రూ.20 దొరికాయి(అవి ఆ పుస్తకాన్ని నాకంటే ముందు చదివినవారివి అయిఉంటాయి).

అప్పుడు నా సంతోషానికి అవధుల్లేవు. అదో గొప్ప జ్ఞాపకం. హౌస్‌సర్జన్‌గా ఉన్నప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టాను. నిజానికి హౌస్‌సర్జన్‌గా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయడాన్ని ప్రొఫెసర్లు ఎవరూ ఇష్టపడరు. చదువుమీద శ్రద్ధ తగ్గుతుందని వారి అభిప్రాయం. నా పరిస్థితి తెలిసిన ప్రొఫెసర్లు నన్ను అర్థం చేసుకున్నారు. నాతోటి విద్యార్థులు మాత్రం రాజయ్య పాస్ కావడం కష్టమనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యేలా అందరికంటే ఎక్కువ మార్కులతో నేనే ముందున్నాను.

రెండు ఉద్యోగాలను వదిలి

ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నేను మాథమెటిక్స్ బాగా చేస్తాను. తొమ్మిదోతరగతిలో ఉన్నప్పుడే ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేసేవాడిని. టెన్త్‌లో నాది కాంపోజిట్ మాథ్స్. చిన్నప్పుడు ఇంద్రసేనారెడ్డి సార్ అన్న మాటల్లో అయితే నేను ఇంజనీర్ కావాలని, లేదంటే డాక్టర్ కావాలి. నేను మాథ్స్‌లో పర్‌ఫెక్ట్‌గా ఉన్నాను కనుక ఇంజనీర్ అవుదామనుకున్నాను. అయితే మా కజిన్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. నేను ఇంటర్మీడియట్ ఎంపీసీలో జాయిన్ అయిన తర్వాత మూడు నెలలకు ఆయన నాదగ్గరికొచ్చి మన వంశంలో నేను ఇంజనీర్‌ను అవుతున్నాను నువ్వు బాగా చదువుతావు కాబట్టి డాక్టర్ అవ్వు అన్నాడు అంతే ఆ మాటతో నా గ్రూప్ మారింది. డాక్టర్‌నయ్యాను. కేఎంసీలో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 1984లో ట్రైబల్ మెడికల్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో పోస్టింగ్. జీతం రూ.3200.

అప్పుడే ఎంఎస్(ఈఎన్‌టీ)లో సీటు వచ్చింది. అప్పటికి నేను ప్రాక్టీస్‌లో ఉన్నాను కనుక పీజీ చేస్తే బాగుంటుందని ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక సంవత్సరం తర్వాత ఈఎన్‌టీలో జాయిన్ అయ్యాను. దాంట్లో ఎందుకో నాకు సంతృప్తి కలగకపోతే పిల్లల డాక్టర్ కావాలని డీసీహెచ్ చేశాను. 1987లో ఏపీపీఎస్ ద్వారా ఖమ్మం జిల్లా వైరా దగ్గర ఉన్న పెద్దభూపతిలో అసిస్టెంట్ సివిల్ సర్జన్ జాబ్ వచ్చింది. ప్రాక్టీస్ బాగానే నడుస్తుంది. అటా ఇటా అనే డైలామాలో కొంతకాలం పనిచేసి చివరికి ప్రైవేట్ ప్రాక్టీస్‌కే మొగ్గు చూపాను. అప్పటికే నేను జనరల్ ఫిజిషియన్‌ని. పిల్లల వైద్యుణ్ణి.

చాలా మందికి ఫ్యామిలీ డాక్టర్‌గా ఉన్నాను. ఐదారు నర్సింగ్‌హోమ్‌లలో పనిచేస్తూనే వరంగల్ కాకతీయ థియేటర్ దగ్గర, కాశిబుగ్గలో రెండు ప్రైవేట్ క్లినిక్‌లు నడుస్తున్నాయి. కన్న ఊరుకు సేవ చేయాలని ప్రతి ఆదివారం, బుధవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో వైద్యం అందించేవాడిని. ఇదే క్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఉచిత వైద్యశిబిరాలకు శ్రీకారం చుట్టాను. వైద్యశిబిరాలంటే నలుగురైదుగురు డాక్టర్లు, ప్రభుత్వ మందులు సరఫరాచేసే పద్ధతి కాదు. అన్ని నేనొక్కడినే సమకూర్చుకునేవాడిని. వైద్యశిబిరంలో ఉదయం ప్రజలకు వైద్యం, ఆరోగ్యం పట్ల అవగహన కల్పించి మధ్యాహ్నం వైద్యసేవలు చేసేవాడిని. నా సర్వీస్‌ను అందరూ మెచ్చుకున్నారు.

అప్పట్లో నన్ను అందరూ జూనియర్ కొలంబో అనేవారు. సరిగ్గా అదే సమయంలో 1994లో దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు దాస్యం ప్రణయ్‌భాస్కర్‌ను తీసుకుని నాదగ్గరికొచ్చి నువ్వు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. అట్లాగే బండారు దత్తాత్రేయ కూడా ఆహ్వానించారు. సున్నితంగా కుదరదని చెప్పాను. ఐహేట్ పాలిటిక్స్ అని అన్ననప్పుడు. వారి ఆహ్వానం వెనుక స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ స్థితే కారణం. 1978నుంచి అప్పటిదాకా స్థానికులెవరు ఎమ్మెల్యే కాలేదు. నా వైద్య సేవలకు గుర్తింపుగా జిల్లాస్థాయిలో పంచరత్న, నవరత్న అవార్డులు ఇచ్చారు. డాక్టర్ ఇన్ సోషల్ స్టడీస్‌లో జాతీయస్థాయిలో భారత్ గౌరవ్ అవార్డు వచ్చింది. న్యూఢిల్లీలో దానిని ప్రదానం చేశారు. 1997లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోనియాగాంధీ వద్దకు తీసుకెళ్లారు.

అప్పుడామే ప్లీజ్ డూ కమ్ ఇన్ టూ పాలిటిక్స్ అని ఆహ్వానించారు. 1999లో మొదటిసారిగా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. 4465ఓట్ల తేడాతో కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయాను. 2004లో మళ్లీ ఓటమి పాలయ్యా. 2008ఉప ఎన్నికల్లోనూ గెలవలేదు. ఆ ఎలక్షన్స్ అప్పుడు నేను నామినేషన్ వేసిన రెండు రోజులకే మా నాన్న చనిపోయాడు. 2009లో నాలుగు పార్టీలు మహాకూటమిగా ఉన్నా… అప్పటికే మూడుస్లారు నేను ఓటమిపాలయినా కూడా వాటన్నింటినీ అధిగమించి 11600ఓట్ల మెజార్టీతో విజయం సాధించాను. సరిగ్గా 3నెలల17 రోజులకే వైఎస్ మరణించారు. ఆ తర్వాత నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అప్పుడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకన్నా ముందు నేనే జై తెలంగాణ అని నినదించాను. అప్పటినుంచి ఏనాడూ తెలంగాణ అంశంపట్ల వెనక్కి తిరిగిచూడలేదు.

రచ్చబండను రద్దుచేసుకున్న తొలి కాంగ్రెస్ ఎమ్మెల్యేను. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులందరు నా ఫోటోకు పూలదండ వేశారు. మిగతా ఎమ్మెల్యేలకు చెప్పుల దండలు వేశారు. అది మరిచిపోలేని దృశ్యం. 2009డిసెంబర్ నుంచి నా రాజీనామాను ఆమోదింపచేసుకునేదాకా నాలుగుసార్లు రాజీనామా చేశాను. తెలంగాణ మలి ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా ఎత్తుకుని టీఆర్‌ఎస్ పార్టీలో చేరాను.

ఎంఆర్‌పీఎస్ ఉద్యమంలో..

ఈదురుమూడిలో ఎంఆర్‌పీఎస్ ఉద్యమం మొదలైంది. తెలంగాణ ప్రాంతంలో ఒక ఎస్సీ మాదిగ డాక్టర్‌గా నా జాతి హక్కుల కోసం ముందునిలబడ్డాను. నా కులాన్ని నేను గొప్పగా చెప్పుకున్నాను. ఆత్మగౌరవం కోసం నేను పోరాడాను. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. జిల్లాలో పిల్లల వైద్యానికి సంబంధించి ఒక్క నర్సింగ్‌హోమ్ లేదు. దీన్ని గమనించి నేను క్రాంతి చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్‌ను ప్రారంబించా. నాదగ్గరికి గోదావరినది దాటి పేషెంట్లు వచ్చేవారు.

ఆదిలాబాద్, కరీంనగర్, ఛత్తీస్‌గడ్, ఖమ్మం, నల్గొండ నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా పేషెంట్లు వచ్చేవారు. డాక్టర్ శ్రీరాంరెడ్డి, డాక్టర్ నర్సింహారెడ్డి ఇట్లా అనేక మంది అగ్రకుల వైద్యులను దాటి నాదగ్గరికి పేషెంట్లు వచ్చేది. అప్పటికే నేను ఎంఆర్‌పీఎస్ ఉద్యమంలో పెద్దమ్మగడ్డలో ఒక సభ పెడితే అక్కడికి వెళ్లాను. నేనొక మాదిగ డాక్టర్‌ను. నా కులం తెలిసిన తర్వాతే నాదగ్గరికి రండి లేకపోతే చావండి అంటూ ఉద్వేగంగా ప్రసంగించాను. అటువంటి ఆత్మైస్థెర్యం నాది.

నా భారతిదే భారం

నేను ఎంబీబీఎస్‌లో ఉండగా నాకు ఫాతిమామేరీతో పెళ్లి అయింది. నేను ఆమెను భారతి అని పిలుచుకుంటాను. మాపెళ్లప్పుడు ఆమె 10వతరగతి. ఆ తర్వాత ఆమె కష్టపడి ఇంటర్, డిగ్రీ, ఎంఏ, ఎంఎల్‌ఎస్‌ఈ చదివింది. ఇప్పుడు లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నది. నా ఈ ఎదుగుదల వెనుక ఆమే కారణం. నేనిప్పటికి కనీసం బట్టలు కూడా కొనుక్కోను. అన్నీ ఆవిడే చూసుకుంటుంది. పిల్లల చదువు నుంచి మొదలుపెడితే ఇంటి వ్యవహారమంతా ఆమెకే తెలుసు. నాకు అప్పంటే భయమని చెప్పాను కదా నాకు బదులు ఆమె అప్పులు తెస్తుంది. వాటిని తీరుస్తుంది. నాకు ఇంటి వ్యవహారంతో పనిలేదు. పిల్లలిద్దర్లూ డాక్టర్లే. ఒకరు డాక్టర్ క్రాంతిరాజ్, మరొకరు డాక్టర్ విరాజ్.

కేసీఆర్ ఆహ్వానం.. ఆదేశం

నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్‌గారు నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఆదేశానికి, అభిమానానికి, విధేయతకు అత్యంత పాత్రుడినయ్యాను. నామీద ఉన్న నమ్మకంతో కేసీఆర్‌గారు 87నియోజకవర్గాల్లో నన్ను తిప్పారు. తెలంగాణ ఉద్యమంలో పూర్తిస్థాయిలో మమేకం చేశారు. ఉన్నతమైన త్యాగం, ఉత్తమమైన క్వాలిఫికేషన్స్, తెలంగాణలో ఎక్కువగా ఉన్న కుల బలం.. వీటికితోడు నేను వైద్యవృత్తిలో కమిట్‌మెంట్‌తో పనిచేయడం ఇట్లాంటి అంశాలు నాకు కలిసొచ్చాయి. అందుకే ఆయన అందరిముందూ(ఎన్నికలు అయిపోయిన తర్వాత)వైద్య ఆరోగ్యశాఖ మా రాజయ్య చూస్తడు అన్నారు.

అప్పుడే నాకు మంత్రి పదవి కన్‌ఫర్మ్ అని అర్థమైంది. అయినా సరే ఒక్కసారి గుర్తుచేద్దామని ఆశావాహులమైన 13మందిమి ఆయన దగ్గరికి వెళితే రాజయ్య ఎందుకు టెన్షన్ పడుతున్నావు నీ శాఖ నీకే ఉంటది. కానీ రేపటి తర్వాత చెప్పలేం అని అందరిముందు అని రాజయ్య నువ్వు లోపలికిరా అన్నారు. అప్పుడు నాకు మంత్రి పదవి ఉండకపోవచ్చు అనిపించింది. ఇష్టమైన వాళ్లను నచ్చచెప్పే పనిలో భాగంగా నన్ను లోపలికి పిలుస్తున్నారేమో అనుకున్నాను.

లోపలికి పోయిన తర్వాత నిన్ను డిప్యూటీ సీఎంను చేస్తున్నాను. మీ ఆవిడకు కూడా ఈ విషయం చెప్పొద్దు. శత్రువులు చాలా మంది ఉంటారు అని పెద్దలు కేసీఆర్‌గారు అన్నారు. ఆ క్షణం నా సంతోషానికి అవధుల్లేవు. గుండెనిండా ఆనందం బయటికి చెప్పుకోలేని మథనం. మొత్తంగా మా నాయకుడు కేసీఆర్ అన్నమాట నిలుపుకున్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలి. పునర్నిర్మాణంలో కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధనలో నా శాఖ తెలంగాణకు ఒక మణిహారం కావాలి.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.