హైదరాబాద్ : పోలవరం ముంపు మండలాలను తెలంగాణలో ఉంచాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. మహేశ్వరం, బోధన్, జహీరాబాద్‌కు చెందిన ఇతర పార్టీల నేతలు కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లో.. ముంపు మండలాలను తెలంగాణలో ఉంచేందుకు పోరాడుతాం. పోలవరం డిజైన్ మార్చాల్సిందే. డిజైన్ మార్చే వరకు పోలవరం కట్టనివ్వం. అక్రమ ప్రాజెక్టులపై టీడీపీ వైఖరేంటి? పోలవరంపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల వైఖరేంటి?
ఉద్యోగులకు ఆప్షన్లు ఉండొద్దు. తెలంగాణ ఉద్యోగస్తులు తెలంగాణ ప్రభుత్వంలో.. ఆంధ్రా ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేయాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకే ఉండాలంటే నన్ను నిందించిన్రు. ఉద్యోగ పంపకాలపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వైఖరి చెప్పాలి. తెలంగాణలో టీడీపీ అవసరమా? మన తలరాతలు మనమే రాసుకోవాలి. తెలంగాణలో చంద్రబాబుకు డిపాజిట్ దక్కదు. చంద్రబాబు నెత్తినగొట్టుకున్నా టీడీపీ గల్లంతు కావడం ఖాయం. ఆంధ్రా పార్టీలను ఓడించాలి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.
టీఆర్‌ఎస్ అందరి సమస్యలు పరిష్కరిస్తదని ప్రజలు సంపూర్ణంగా నమ్ముతున్నారు. టీఆర్‌ఎస్ తప్ప వేరే పార్టీలు అధికారంలోకి వస్తే సమస్యలు తీరవు. కరెంట్ కోతలకు టీడీపీ, కాంగ్రెస్సే కారణం. మిగులు విద్యుత్‌ను సాధించుకోవాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వమే రావాలి. తెలంగాణలో ఉన్న ఆటో రిక్షా సహా కార్మికులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తాం. ఆటో రిక్షా కార్మికులకు పన్ను మినహాయిస్తాం. పోలీసులు, రవాణా శాఖ అధికారుల వేధింపులు లేకుండా చూస్తాం. 16 ఎంపీలను గెలుచుకుని కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా పోరాటి మన హక్కులు సాధించుకుందామని పిలుపునిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.