– ఏప్రిల్ 24లోపు అన్నిస్థాయిల్లో కమిటీలు పూర్తి – అదేరోజు ఎల్బీ స్టేడియంలో విస్తృతస్థాయి సమావేశం – అదే నెల 27న పెరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ – షెడ్యూల్ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు ఘనంగా ముగిసిందని.. ఇక ముమ్మరంగా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాల్సి ఉందని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. అనుకున్న గడువులోగా అంచనాలను మించి 50 లక్షల సభ్యత్వాలు నమోదైనట్లు పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో సోమవారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. అన్ని నియోజకవర్గాల నుంచి సభ్యత్వాల నమోదుపై ఆన్‌లైన్‌లో సమాచారం పంపాలని పార్టీ నేతలను ఆదేశించినట్లుచెప్పారు.
ఇప్పటివరకు 38 లక్షల సభ్యత్వాల వివరాలలను కంప్యూటరీకరించినట్లు చెప్పారు. ఒక్కో సభ్యత్వం నమోదుకు 15 నిమిషాల వ్యవధి పడుతుందని… అందుకే ప్రక్రియ కొంత నెమ్మదిగా కొనసాగుతున్నదని అన్నారు. ప్రతి సభ్యుడికి ప్రమాద బీమా వర్తింపజేసేలా నిర్ణయం తీసుకున్నామని.. ఆపద సమయంలో సభ్యుడి కుటుంబానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే దానికి ప్రథమ ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. ఈనెల 24 నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ మొదలవుతుందన్న ముఖ్యమంత్రి.. ఆ మేరకు షెడ్యూలు ప్రకటించారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు గ్రామ, అనుబంధ కమిటీల ఎన్నికలు జరుగుతాయి. వీటి నిర్వహణకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను స్టీరింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. అదేవిధంగా వచ్చే నెల 6 నుంచి 12వ తేదీ వరకు ఆరు రోజుల పాటు మండల, అనుబంధ సంఘ ఎన్నికలు నిర్వహిస్తాం. ఆ తర్వాత జిల్లా కమిటీల ఎన్నికలను ఒకట్రెండు రోజుల నిర్వహించాలని అనుకుంటున్నాం. ఐదు జిల్లాల చొప్పున రెండు రోజుల పాటు చేపట్టే అవకాశమున్నది అని పేర్కొన్నారు. వచ్చే నెల 24వ తేదీ వరకు కమిటీలు పూర్తవుతాయని… అదే రోజు ఎల్బీ స్టేడియంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేరోజు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని సీఎం తెలిపారు. వచ్చే నెల 27న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో పార్టీ భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. అందులో ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టనున్న వాటిపై సమీక్షిస్తామన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంపై సమీక్ష అంతకుముందు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించిన ఆయన.. పార్టీ నిర్మాణ ప్రక్రియ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఆ తర్వాత పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు వచ్చిన సర్వేల వివరాలు పార్టీ ప్రజాప్రతినిధులకు చెప్పిన ఆయన.. ప్రచారం ఎలా సాగుతుందనే దానిపై చర్చించారు. ముఖ్యంగా ఆరు జిల్లాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న దరిమిలా మిగిలిన నాలుగు జిల్లాల నాయకులు, ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్లి పని చేయాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27 వరకు ఉంటాయని సీఎం అన్నట్లు తెలిసింది.
అదేవిధంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు, సర్కారు పనితీరుపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సీఎం ప్రజాప్రతినిధులకు సూచించినట్లు సమాచారం. ఈ వివరాలను వచ్చే నెల 24వ తేదీ వరకు సమర్పిస్తే దానిపై విస్తృత స్థాయి సమావేశంలో చర్చిద్దామని సీఎం అన్నట్లు తెలిసింది. సభ్యత్వ నమోదుపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, టీఆర్‌ఎస్ కార్యాలయ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు.