బంగారు తెలంగాణ దిశగా మరో అడుగు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చెర్లలో 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనికి హైదరాబాద్ ఫార్మా సిటీగా నామకరణం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, పర్యావరణ హితంగా(ఎకో ఫ్రెండ్లీ) ఈ సిటీని నిర్మిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక్కడే ఫార్మా యూనివర్సిటీ, ఫార్మా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు.

-హైదరాబాద్ ఫార్మా సిటీలో యూనివర్సిటీ, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, టౌన్‌షిప్‌లు కూడా.. -ఎకో ఫ్రెండ్లీ , జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థ, అంతర్జాతీయ ప్రమాణాలు -అధికారులు, పారిశ్రామికవేత్తలతో కలిసి సీఎం ఏరియల్ సర్వే -సంతృప్తి వ్యక్తంచేసిన ఫార్మా బిగ్‌షాట్స్ -పనులు ప్రారంభించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి -రూ.30 వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం -70 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి: కేసీఆర్ -11 వేల ఎకరాల్లో ఏర్పాటుకు నిర్ణయం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ సిటీ జీరో లిక్విడ్ డిశ్చార్జి వ్యవస్థతో పనిచేస్తుందన్నారు. కాలుష్యం తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, పర్యావరణానికి ఏమాత్రం విఘాతం కలిగించబోమని ముఖ్యమంత్రి ప్రకటించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల, మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్‌లోని ప్రతిపాదిత ఫార్మాసిటీ స్థలాలను సీఎం ఏరియల్ సర్వే చేశారు. రెండు హెలికాప్టర్లలో సీఎం, అధికారుల బృందం, మరో రెండు హెలికాప్టర్లలో పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొన్నారు.
మధ్యాహ్నం 12.20 గంటలనుంచి 1.10 వరకూ సర్వే కొనసాగింది. అనంతరం సీఎం మాట్లాడుతూ ముచ్చెర్ల ప్రాంతం ఫార్మాసిటీకి అనుకూలమని ప్రకటించారు. ఇక్కడ 11వేల ఎకరాల్లో ఫార్మా సిటీని నిర్మిస్తామన్నారు. ఇందులో సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, వీటివల్ల ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 70వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఫార్మా సిటీ ఏర్పాటుకు సంబంధించిన అన్ని పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ముచ్చెర్లపై ఏకాభిప్రాయం.. బుధవారం ఏరియల్ సర్వే జరిపిన అనంతరం ఇటు సీఎం బృందం, అటు పారిశ్రామికవేత్తల బృందం కూడా ముచ్చెర్ల ప్రాంతం ఫార్మాసిటీకి అనువుగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు, హైవేకు సమీపంలో ఉండడం, నగరానికి కేవలం 29 కి.మీ. దూరంలోనే మంచి రవాణా సదుపాయాన్ని కలిగి ఉండడం పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది. నాగార్జునసాగర్ హైవేకు కేవలం 24 కి.మీ. దూరంలోనే ఉండడం అదనపు సదుపాయం. ఏరియల్ సర్వే సందర్భంగా ఎత్తయిన ప్రాంతానికి అందరినీ తీసుకెళ్లి చూపించారు. ఈ ప్రాంతానికి ఇప్పటికే రహదారి వసతి ఉంది.
ఫ్యాబ్‌సిటీ వరకు ఉన్న నీటి వసతిని ఇక్కడికి విస్తరించడం పెద్ద కష్టం కాదని టీఎస్‌ఐఐసీ అధికారులు వివరించారు. కాగా ఇక్కడి రహదారిని నాలుగు లైన్లకు విస్తరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సర్వే సందర్భంగా ముచ్చెర్లలో చూడాల్సిన ప్రాంతాల్లో హీలియం బెలూన్లను ఎగురేశారు. హెలికాప్టర్లను తక్కువ ఎత్తులోకి దించి వీక్షించారు. లొకేషన్ అడ్వాంటేజేస్‌ను ఫొటో ఎగ్జిబిషన్ల ద్వారా టీఎస్‌ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్, ఈడీ వెంకటనర్సింహారెడ్డి అందరికీ వివరించారు.
ఫార్మాసిటీతో పాటు టౌన్‌షిప్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదించారు. ఇక్కడికి సమీపంలోని మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్‌లో డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆధీనంలోని సుమారు 600 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కే ప్రదీప్‌చంద్ర టీ మీడియాకు తెలిపారు. పూర్తి స్థాయి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ముచ్చెర్లలోని 2700 ఎకరాలు, మీర్‌ఖాన్‌పేటలోని 1200 ఎకరాలు, ఇంకా అవసరమైతే కొద్ది దూరంలోనే మరో 5, 6 వేల ఎకరాలు అందుబాటులోకి తీసుకోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా మొదట్లో మెదక్ జిల్లాలో స్థలాన్ని కేటాయించాలన్న ఫార్మా పారిశ్రామికవేత్తలు ఆ ప్రతిపాదన కంటే ముచ్చెర్ల బాగుందని ఏకీభవించినట్లు అధికారులు చెప్తున్నారు.
విశ్వాసం కలిగించిన సీఎం సర్వే.. బుధవారం సీఎం కేసీఆర్ చేపట్టిన ఏరియల్ సర్వే పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చింది. పరిశ్రమలకు, పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామమని గతంలోనే చెప్పిన కేసీఆర్ ఆ దిశలో పారిశ్రామికవేత్తలను తనతో తీసుకెళ్లి పూర్తిస్థాయిలో నమ్మకం కలిగించారు. ఇక ముచ్చెర్ల ప్రాంతం హైదరాబాద్‌కు అతి సమీపంలో, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కేవలం 32కిలో మీటర్ల దూరంలో వేలాది ఎకరాలు ఒకే కారిడార్‌లో ఆమనగల్లు వరకు విస్తరించి ఉండటం, 11 నుంచి 12వేల ఎకరాలు ఫార్మాసిటీకి ఇవ్వడమే కాకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం వారిలో విశ్వాసం కలిగించింది.
మొత్తంగా ఏరియల్ సర్వే అనంతరం ఫార్మా పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. సీఎంతో పాటు ఏరియల్ సర్వేలో రవాణా శాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కే ప్రదీప్‌చంద్ర, టీఎస్‌ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి జీ నర్సింగ్‌రావు, ఏపీఐఐసీ ఈడీ వెంకటనర్సింహారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు శ్రీధర్, ప్రియదర్శిని, ఫార్మా పారిశ్రామికవేత్తలు బీ పార్థసారధిరెడ్డి, కే రత్నాకర్‌రెడ్డి(హెటిరో), కే సతీష్‌రెడ్డి(డాక్టర్ రెడ్డీస్), కే నిత్యానందరెడ్డి(అరబిందో), ఎం నారాయణ రెడ్డి(విర్కో), పీ ఈశ్వర్‌రెడ్డి(బీడీఎంఏ ఈడీ), ఎంఎస్‌ఎన్ రెడ్డి(ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్), సంతోష్(వీవీ మెడ్), డా.ఎస్ ఆనంద్(సాగర్ గ్రూప్), ఎం మోహన్‌రావు(సైనుడ్)లు పాల్గొన్నారు. శుక్రవారం పారిశ్రామిక వేత్తలతో మరో సమావేశం ఉంటుందని తెలిసింది.
పారిశ్రామికవేత్తలు ఓకే.. ఏరియల్ సర్వే విజయవంతమైంది. ఫార్మా పారిశ్రామికవేత్తలు కూడా ఆమోదించారు. గుట్టల్లోని మైదాన ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా ఫార్మా ఇండస్ట్రీస్‌కు బఫర్ జోన్ అనివార్యం. గుట్టలు ఉండడం వల్ల మొక్కల పెంపకం సులువవుతుంది. గ్రీన్ జోన్ ఏర్పాటు వల్ల కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుంది. మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మరో రెండు రోజుల్లో సంబంధిత శాఖలతో సమీక్ష ఉంటుంది. అప్పుడు ప్రాజెక్టు ఓ కొలిక్కి వస్తుంది. – కే ప్రదీప్‌చంద్ర, స్పెషల్ సీఎస్, పరిశ్రమల శాఖ
సిటీకి దగ్గర..చాలా అనుకూలం.. ఫార్మా సిటీ ఏర్పాటుకు ముచ్చెర్ల ఎంతో అనుకూలంగా ఉంది. మాకు సంతృప్తి కలిగింది. సీఎం కేసీఆర్ ఫార్మారంగాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రాంతంలో హ్యాబిటేషన్ కూడా లేకపోవడం వల్ల పరిశ్రమల స్థాపన పెద్ద కష్టం కాదు. సిటీకి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఉద్యోగులకు, రవాణాకు ఇబ్బంది ఉండదు. పెట్టుబడులు విస్తృతంగా వచ్చే అవకాశం ఉంది. – పీ ఈశ్వర్‌రెడ్డి, ఈడీ, బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్
సర్వే సాగిందిలా.. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టరులో బయలుదేరిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మధ్యాహ్నం 12.20గంటలకు ముచ్చర్ల సమీపంలో జమ్ములబావితండా వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలానికి చేరుకున్నారు. మరో మూడు హెలిక్యాప్టర్లలో పారిశ్రామిక వేత్తలు, రెవెన్యూ కార్యదర్శి బీఆర్ మీనా, టీఎస్‌ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు ఎల్ శ్రీధర్, ప్రియదర్శినితో పాటు జాయింట్ కలెక్టర్లు చేరుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి బృందం భూములకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పారిశ్రామిక వేత్తలతో కలిసి తిలకించింది.
మరో అరగంట పాటు ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలను కాలినడకన తిరిగి పరిశీలించింది. మధ్యాహ్నం 1.10గంటలకు ఏరియల్ సర్వే ప్రారంభమైంది. ఆయా భూములను గుర్తించడం కోసం అధికారులు పచ్చ(మహబూబ్‌నగర్), ఎర్ర(రంగారెడ్డి)జెండాలు ఉంచారు. ముచ్చెర్లలో చూడాల్సిన ప్రాంతాల్లో హీలియం బెలూన్లను ఎగురేశారు. హెలీకాప్టర్లను తక్కువ ఎత్తులోకి దించి వీక్షించారు.
ఆమనగల్లు మండలంలో డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు ఇచ్చిన 1643 ఎకరాలను కూడా ముఖ్యమంత్రి, పారిశ్రామిక వేత్తలు, ఉన్నత స్థాయి అధికారులు వీక్షించారు. తర్వాత ముచ్చర్ల ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్థలంలో పారిశ్రామిక వేత్తలతో కలిసి సీఎం బృందం భోజనాలు చేశారు. హెలిప్యాడ్ల ప్రాంతం నుంచి చుట్టు ప్రక్కల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు మినహా ఎవరికీ అనుమతి ఇవ్వలేదు.
పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత సీఎం పర్యటనకు పోలీసు అధికారులు కట్టుదిట్టమై భద్రతా ఏర్పాట్లు చేశారు. హెలిప్యాడ్ ప్రాంతానికి ఉన్న ఏకైక రోడ్డు మార్గం కడ్తాల్ నుంచి జమ్ములబావితండా వరకు అడుగడుగునా పోలీసులు మోహరించారు. జమ్ములబావితండా నుంచి హెలిప్యాడ్ స్థలం రెండు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. మీడియాను, ఇతర ప్రజా ప్రతినిధులను జమ్ములబావితండా వరకే అనుమతించారు. అరిచి గీపెట్టిన అడుగు ముందుకు వేయనీయలేదు. రంగారెడ్డి జిల్లా డీసీపీ రవివర్మ, సైబరాబాద్ కమీషనర్ సీవీ ఆనంద్ భద్రత ఏర్పాట్లు స్వయంగా చేపట్టారు. సీఎం రాక నేపథ్యంలో చుట్టు ప్రక్కల తండాలు, ప్రజా ప్రతినిధులు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఓబీ వ్యాన్లతో పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే వారెవరికీ అనుమతి దొరకలేదు.