Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మిషన్‌తో 40% ఖర్చు ఆదా

మిషన్ కాకతీయ పనులు కొంత ఆలస్యంగా మొదలైనా మంచి ఫలితాలే వచ్చాయి. రూ.2500 కోట్లు ఖర్చుపెట్టి ఎనిమిది వేల చెరువుల్లో విజయవంతంగా పూడిక తీశాం. తొలిఏడాది చేపట్టిన చెరువుల్లో 1 నుంచి 35 శాతం వరకు తక్కువకే పనులు పూర్తయ్యాయి. దీంతో 20 శాతం డబ్బు ఆదా అయ్యింది. దాదాపు రెండు కోట్ల ట్రాక్టర్ల పూడిక మట్టిని రైతులే స్వయంగా పొలాల్లోకి తరలించుకోవడంతో మరో 20 శాతం ఖర్చు కలిసి వచ్చింది. ఈ విధంగా ప్రభుత్వానికి 40 శాతం ఆదా అయ్యింది అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వివరించారు. -రూ.వెయ్యి కోట్లతో మండలానికో గోదాం నిర్మాణం

Harish Rao press meet in warangal

-అన్యాయం జరిగితే నదుల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తాం -భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం వరంగల్ జిల్లా పరకాలలో 2012 ఉప ఎన్నిక సందర్భంగా నమోదైన కేసులో కోర్టు వాయిదా కోసం హరీశ్‌రావు వరంగల్ కోర్టుకు హాజరయ్యారు. తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాలు మిషన్ కాకతీయపై అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. మిషన్ కాకతీయకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదని, అవినీతి జరిగిందని, కమీషన్లు దండుకున్నారని రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ రాగానే విత్తనాలు, ఎరువుల కోసం రైతులు బారులు తీరేవాళ్లని, పోలీసులు లాఠీచార్జి చేసేవారని.. అలాంటి పరిస్థితులు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఐదు వేల మెట్రిక్ టన్నులు నిల్వ ఉండేలా రూ.వెయ్యి కోట్లతో గోదాములు నిర్మించనున్నట్లు తెలిపారు. మక్కలు, వరి ధాన్యాన్ని తేమబారిన పడకుండా నియంత్రించేందుకు పంజాబ్‌లో అనుసరిస్తున్న విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. పంజాబ్ మార్కెట్‌లో విజయవంతమైన మాయిశ్చర్ మిషన్‌ను వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో అందుబాటులోకి తేనున్నామని వెల్లడించారు.

వరంగల్, హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్, మెదక్ జిల్లాలోని ఒంటిమామిడి సహా మరో కూరగాయల మార్కెట్‌లో కోల్ట్‌స్టోరేజీలు నిర్మిస్తామన్నారు. దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారన్నారు. జాతీయస్థాయిలో నదుల అనుసంధానంపై చర్చలు సాగుతున్నాయని, తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వినయభాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, జిల్లా, పార్టీ రూరల్, అర్బన్ జిల్లా అధ్యక్షులు రవీందరరావు, నరేందర్, జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.