మిషన్ కాకతీయ కార్యక్రమం అమలులో విప్లవాత్మక మార్పులు విజయవంతంగా తీసుకువచ్చామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తక్కువ సమయంలోనే అద్భుతంగా అమలు చేశామన్నారు. టెండర్లు కూడా పిలవకముందే మిషన్ కాకతీయపై కమిషన్ కాకతీయ అని కొందరు ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేసినా ప్రజలనుంచి వచ్చిన స్పందనతో వాళ్ల నోళ్లు మూతపడ్డాయన్నారు. కిందిస్థాయి ఇంజినీరునుంచి మంత్రివరకు అహర్నిశలు శ్రమించడంతోపాటు అన్నివర్గాల వారు సహకారాన్ని అందించడంద్వారానే మిషన్ కాకతీయ మొదటి దశ విజయవంతమైందన్నారు.
-అందరి సహకారంతోనే మొదటిదశ విజయవంతం
-పారదర్శకత, రైతుల సహకారంతో వెయ్యికోట్ల ఆదా
-ప్రజల స్పందనతో ప్రతిపక్షాల నోళ్లు మూతపడినయి
-మిషన్ కాకతీయ రెండో దశ-సమాలోచనలు వర్క్‌షాప్‌లో మంత్రి హరీశ్‌రావు
కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో సోమవారం మిషన్ కాకతీయ రెండో దశ – సమాలోచనలు వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. మిషన్ కాకతీయకు జేఎన్‌టీయూ ఆడిటోరియం అచ్చొచ్చిందన్నారు. ఇదే వేదికపై సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఆ తర్వాత చరిత్రలో ఎన్నడూలేని విధంగా అద్భుత విజయాన్ని సాధించిందన్నారు. దేశవిదేశాల నుంచి ప్రశంసలు వచ్చాయని చెప్పారు.
ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు, వివిధ శాఖలు, మీడియా, కవులు, కళాకారులు అన్నివర్గాల వారు సహకరించడంతోనే ఇది సాధ్యమైందంటూ అందరికీ కృతజ్ఙతలు తెలిపారు. ఉమ్మడిరాష్ట్రంలో ఐదేండ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల్లో చిన్న నీటి వనరులకు రూ.1400 కోట్లు కేటాయిస్తే… తెలంగాణ ప్రభుత్వంలో కేవలం ఒకే ఒక్క ఏడాదిలో రూ.2,237 కోట్లు కేటాయించడం విశేషమన్నారు.సీఎం కేసీఆర్ చిన్ననీటి వనరులకిచ్చే ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు.
వెయ్యి కోట్ల ప్రజాధనం ఆదా… సామాన్యుడుగానీ, అమెరికాలో ఉన్న ఎన్నారైలుగానీ మా ఊరి చెరువుకు ఎంత కేటాయించారు, ఎంత పని అయింది… ఇలా అన్ని వివరాల్ని క్షణాల్లో చూసుకునేలా ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ద్వారా పారదర్శకంగా టెండర్ల నిర్వహణ పూర్తి చేశామన్నారు. ఇతర రాష్ర్టాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంకు సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. రైతులు ఇది తమకోసం అని భావించినందునే స్వచ్ఛందంగా పూడికను పొలాల్లో వేసుకున్నారని, తద్వారా రూ.400 కోట్లు ఆదా అయ్యాయన్నారు. టెండర్లలో సరాసరి 22 శాతం తక్కువకు కోట్ చేయడంతో రైతుల ద్వారా ఆదా అయిన దానితో కలుపుకొని వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు మిగిలాయని పేర్కొన్నారు.

ఆర్థిక శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు… గతంలో చెరువు తెగిందంటే దాని మరమ్మతులు మొదలయ్యేందుకు ఏడాది పట్టేదని, ఇప్పుడు నెలలోపలే అన్ని ప్రక్రియలు పూర్తయి, పనులు కూడా మొదలవుతున్నాయంటే ఆ ఘనత కేవలం తెలంగాణ ఆర్థిక శాఖకు దక్కిందన్నారు. కొన్ని సందర్భాల్లో ఉదయం పంపితే సాయంత్రానికి జీవోలు వచ్చిన దాఖలాలు ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయకు ఈ రోజే యాదగిరిగుట్ట ఆలయ అర్చకులు ఒకరోజు వేతనాన్ని ప్రకటించి రెండోదశను ఆశీర్వదించారన్నారు. 48 సంస్థలు, వ్యక్తులు 30 చెరువులను దత్తత తీసుకొని… రూ.8.31 కోట్ల విలువైన పునరుద్ధరణ పనులు చేపట్టారన్నారు. ఎన్నారైలు చాలామంది ముందుకొస్తుండటంతో మిషన్ కాకతీయ అకౌంట్‌కు నేరుగా డబ్బులు వచ్చేందుకుగాను నిబంధనల ప్రకారం కేంద్రంనుంచి అనుమతి తీసుకున్నామని, సెక్షన్ 80జీ కింద ఆదాయపు పన్ను మినహాయింపునకు అనుమతి కేంద్ర పరిశీలనలో ఉందని అన్నారు.
మొదటిదశకు నాబార్డు రూ.379 కోట్లు ఇవ్వగా రెండో దశకు రూ.390 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్-ఆర్ కింద 182 చెరువులకు రూ.125 కోట్లు ఇచ్చిందని, గిరిజన సంక్షేమ శాఖ నుంచి టీఎస్‌ఎఫ్ కింద రూ.210 కోట్లు ఇవ్వడంతో పాటు ఈసారి బడ్జెట్‌లో రూ.2083 కోట్లు కేటాయించామన్నారు. కార్యక్రమానికి వచ్చిన అభినందనలు, ప్రశంసల్ని కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. చైనాలోని బ్రిస్క్‌బ్యాంక్ చైర్మన్, నీతిఆయోగ్ చైర్మన్ సరస్వతి జైన్, రాష్ట్ర గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్ ఇలా చాలామంది పేర్లను ఉదహరించారు. మిచిగాన్ యూనివర్సిటీ విద్యార్థులు మిషన్ కాకతీయపై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. ఈ నేపథ్యంలో మనపై బాధ్యత మరింత పెరిగిందంటూ ఇంజినీర్లలో ఉత్సాహాన్ని నింపారు.
అనుభవంతో మరింత పదును… మిషన్ కాకతీయ మొదటి దశ అనుభవాల్ని క్రోడీకరించుకొని రెండోదశను మరింత ప్రభావయుతంగా నిర్వహించుకుందామని ఇంజినీర్లకు మంత్రి పిలుపునిచ్చారు. నెల, నెలన్నరలో కొత్తగా 411 మంది ఇంజినీర్లు రానున్నారని, మరో 300 మంది ఎంపిక కోసం సీఎం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అనుమతిచ్చారని తెలిపారు. మొదటి దశలో 112 మంది రిటైర్డ్ ఇంజినీర్ల సేవలు తీసుకున్నామని, ఈసారి అవసరమైతే 200 మందిని తీసుకుందామన్నారు. జనవరి ఏడో తేదీ నాటికి రెండోదశలో 50% చెరువుల పనులు మొదలు కావాలని.. జనవరి 22వ తేదీనాటికి వందశాతం చెరువుల పనులు మొదలుకావాలని స్పష్టంచేశారు. వీలైతే ఆలోగానే పనులు మొదలుపెట్టవచ్చన్నారు.
సూర్యుడిపై ఉమ్మేయడమే: మంత్రి ఈటల మిషన్ కాకతీయ ద్వారా ఇంజినీర్లు గొప్ప సామాజిక బాధ్యతను భుజాన వేసుకున్నారని, ఈ కార్యక్రమాన్ని విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేయడమేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఏదైనా ఒక పెద్దకార్యక్రమంలో ఒకటీ, రెండు కాదు… పది శాతం వరకు లోటుపాట్లు ఉన్నా తప్పేంలేదన్నారు. ప్రజలకు 90% కంటే ఎక్కువ ప్రయోజనం చేకూరడమే ప్రధానమని చెప్పారు. మిషన్ కాకతీయవర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఈటల.. రాష్ట్రంలో అమలైన పథకాల్లో మిషన్ కాకతీయ మంచి పేరు సంపాదించిందని, ఆతర్వాత మానవత్వాన్ని ఆవిష్కరించిన సన్నబియ్యం సరఫరాకు కూడా మంచిపేరు వచ్చిందన్నారు.
రాజకీయ వ్యవస్థ ప్రణాళికలు రూపొందిస్తుందని, దాన్ని అమలు చేసి, నిర్మించే బాధ్యత ఇంజినీర్లపై ఉందన్నారు. తెలంగాణకు పాలించే సత్తా ఉందా, ఆ రాజకీయ వ్యవస్థ ఉందా… అంటూ 57 ఏండ్లలో అనేక అవమానాల్ని భరించామన్నారు. కానీ ఒకటిన్నరేండ్లలో తెలంగాణ ప్రభుత్వానికి, టీఆర్‌ఎస్‌కు ఆ నైపుణ్యం, ఆ సత్తా ఉండటమే కాదు… తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం కూడా ఉందని ప్రపంచానికి తెలిసిందన్నారు. 50 ఏండ్ల దుర్మార్గం, అరాచకాల్ని ఏడాదిలో పోగొడతామనే ఆశ ఎవరికీ లేదని.. కనీసం ఆ దిశగా అడుగు పడిందా అనేది ముఖ్యమన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల గూడు చెదిరితే… పాలకుల గూడు చెదురుతుందని ముందునుంచి నమ్ముతున్నందున ఈ ప్రభు త్వం చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.17వేల కోట్ల రైతుల రుణాల్ని మాఫీ చేసిందన్నారు.
ఇంజినీర్లకు చేతినిండా పని.. రాజకీయ నాయకులకు ప్రజలనుంచి స్పందన లేకపోతే ఎలా హింస ఉంటుందో ఇంజినీర్లకు పని లేకపోతే అంత హింస ఉంటుందని మంత్రి ఈటల అన్నారు. మంత్రి హరీశ్ గాలికంటే వేగంగా పనిచేస్తారని, పండుగలు, పబ్బాలు లేకుండా ఆయన పనిలో నిమగ్నమవుతారని కొనియాడారు. ప్రతిరోజు సోమవారమే అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారని గుర్తుచేశారు. మంచి వర్షాలు పడి చెరువులు కళకళలాడాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ హరితహారం కింద 230 కోట్ల మొక్కల్ని నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చే హామీలు చూసి.. ఇవి సాధ్యమా అని చాలా మంది అనుకుంటారని, కానీ ఆయన ప్రతిరోజు ఆర్థికశాఖ బ్యాలెన్స్ షీట్ తెప్పించుకొని పరిశీలిస్తారని ఈటల తెలిపారు. ఈసారి వర్షాలు సరిగా లేనందున ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రమే చెరువులు నిండాయని మంత్రి అన్నారు. రెండోదశలో కరువు జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించి, రెట్టింపు ఉపాధి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.