Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మెట్రోపై కుట్రలు సాగవు

హైదరాబాద్ నగరానికి తలమానికం కానున్న మెట్రో రైలుపై కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. ఆ కుట్రలను, తప్పుడు ప్రచారాన్ని తొక్కుకుంటూ మెట్రో రైలు ముందుకు సాగుతుందని స్పష్టంచేశారు. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, హైదరాబాద్‌లో భూ కబ్జాలు, పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ, మెట్రో రైలు అలైన్‌మెంట్ మార్పు తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది.

CM KCR Meet with all Party MLA's

-తప్పుడు ప్రచారాలను తొక్కుకుంటూ వెళ్తున్నది.. -అఖిలపక్ష భేటీలో సీఎం -అభివృద్ధిపై అఖిలపక్షం హర్షం -కీలక అంశాలపై ఏకాభిప్రాయం -హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు సమ్మతి -ఆకాశహర్మ్యాల నిర్ణయానికి మద్దతు -పేదల స్థలాల క్రమబద్ధీకరణకు ఆమోదం -కబ్జాలపై ఉక్కుపాదానికి సహకారం -మురికివాడల్లేని నగరంగా హైదరాబాద్ -బాసటగా నిలుస్తామన్న పార్టీల నేతలు -పలు అంశాలపై ప్రభుత్వానికి సూచనలు -హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది -మరో నగరంతో పోల్చాల్సిన అవసరం లేదు -హైదరాబాద్‌ను హైదరాబాద్‌లాగే అభివృద్ధి చేద్దాం -భూకబ్జాలు జరుగకుండా చట్టం -అఖిలపక్ష భేటీలో సీఎం కేసీఆర్ -ఈ నెల 16న మరోసారి అఖిలపక్ష సమావేశం ఈ అంశాలపై వివిధ పార్టీల నేతలు 4.40 గంటలపాటు కూలంకషంగా చర్చించారు. ప్రభుత్వం చేసిన పలు ప్రతిపాదనలపై ఆమోదం తెలిపారు. కొన్ని సలహాలు ఇచ్చారు. సభ్యులు చేసిన సూచనలను అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. కొందరు నాయకులు ప్రభుత్వం సంకల్పించిన ప్రాజెక్టులను వ్యతిరేకించిన నేపథ్యంలో, ఏం చేయాలన్న దానిపై మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

ప్రభుత్వం భూ కబ్జాల నియంత్రణకు కఠినమైన చట్టాన్ని రూపొందిస్తే సహకరిస్తామని అన్ని పార్టీల నాయకులు హామీ ఇచ్చారు. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు ఈ నెల 16న మరో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దానికి ముందుగానే భూముల సమగ్ర వివరాలను అందజేయనున్నారు.

ఈ సమావేశంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. నగరంలోని చారిత్రక ప్రాంతాలు, వారసత్వ ఆస్తులు, ప్రార్థనా మందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడిన చిహ్నాలు చెదిరిపోకుండా మెట్రోరైలు ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం భావిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు ముందుకు పోకుండా కొంత మంది కుట్రలు చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు. అలాంటి తప్పుడు ప్రచారాలను తొక్కుకుంటూ మెట్రో ప్రాజెక్టు శరవేగంగా ముందుకు పోతున్నదని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యంతరాలు వచ్చాయని, అందుకే మూడుచోట్ల అలైన్‌మెంట్ మార్చాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

అసెంబ్లీ ముందునుంచి కాకుండా అసెంబ్లీ వెనుకవైపు వెళ్లేవిధంగా, సుల్తాన్‌బజార్‌కు ఇబ్బంది రాకుండా ఉమెన్స్ కాలేజీ వెనుకవైపు నుంచి వెళ్లే విధంగా మెట్రో మార్గం మార్చే అంశాన్ని ముఖ్యమంత్రి సమావేశంలో వివరించారు. దీనికి అన్ని పార్టీల ప్రతినిధులు అంగీకరించారు. పాతబస్తీలో మెట్రోరైలు ప్రాజెక్టు రూట్ విషయంలో వచ్చిన అభ్యంతరాలను సమావేశంలో చర్చించారు. ప్రస్తుత రూట్ వల్ల జరిగే విధ్వంసాన్ని ముఖ్యమంత్రితో పాటు మెట్రోరైలు ప్రాజెక్టు అధికారులు వివరించారు. ఈ రూట్‌కు సంబంధించిన వివరాలను సమావేశంలో పాల్గొన్న సభ్యులకు మ్యాప్‌లతో సహా అందించారు.

హుస్సేన్‌సాగర్‌తో నగరానికి అదృష్టం సమావేశంలో తొలుత ముఖ్యమంత్రి హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన అంశాన్ని ప్రతిపాదించారు. ప్రపంచంలో మరే నగరానికి లేనటువంటి గొప్ప అవకాశం, అదృష్టం హుస్సేన్‌సాగర్‌వల్ల హైదరాబాద్‌కు కలిగిందన్నారు. హుస్సేన్‌సాగర్ మురికి కూపంగా తయారుకావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అందుకే ప్రభుత్వం హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించిందని సీఎం వివరించారు. తెలంగాణ అభివృద్ధికి, ఆర్థిక స్థితికి సంకేతంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే ప్రతిపాదనను కూడా ముఖ్యమంత్రి సమావేశంలో ప్రస్తావించారు.

వివిధ నాలాలనుంచి వచ్చే మురికినీరు హుస్సేన్‌సాగర్‌లోకి చేరడంవల్ల కాలుష్యకారకంగా తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు. గణేశ్ నిమజ్జనం, దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాల నిమజ్జనంవల్ల కూడా జల కాలుష్యం పెరిగిపోతున్నదని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా వినాయక్ సాగర్ నిర్మించే ఆలోచనను కూడా ముఖ్యమంత్రి వివరించారు.

హుస్సేన్‌సాగర్‌ను పూర్తిస్థాయిలో శుద్ధిచేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వానికి అండగా ఉంటామని వివిధ పక్షాల నాయకులు హామీ ఇచ్చారు. అలాగే హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించాలని అన్ని పార్టీల నాయకులు చెప్పారు. హైదరాబాద్‌ను సింగపూర్‌లా మార్చాలని కొందరు నేతలు ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇందుకు స్పందించిన సీఎం చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌కు ప్రపంచంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మరో సిటీతో పోల్చాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ను హైదరాబాద్‌గానే అభివృద్ధి చేద్దాం అని చెప్పారు.

పేదల స్థలాల క్రమబద్ధీకరణకు ఆమోదం ప్రభుత్వ భూముల కబ్జాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని అఖిలపక్షం హామీనిచ్చింది. బడాబాబులు ఆక్రమించుకున్న స్థలాలను స్వాధీనం చేసుకోవాల్సిందేనని ఏకాభిప్రాయం వ్యక్తంచేసింది. హైదరాబాద్‌లో చాలా మంది పేదలు పొట్టచేతబట్టుకుని వివిధ జిల్లాల నుంచి వచ్చి నివసిస్తున్నారని, వారు మురికివాడల్లో దయనీయ స్థితిలో ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో గుడిసెలు వేసుకున్న స్థలాన్ని ప్రభుత్వమే వారికి ఉచితంగా ఇవ్వాలని భావిస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు.

పేదల కోసం ప్రభుత్వమే బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తుందన్నారు. ఈ నిర్ణయం పట్ల అన్ని రాజకీయ పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో 80 నుంచి 125 గజాల వరకు వారి పేరిట పట్టాలు ఇవ్వాలని, ఉచితంగా క్రమబద్ధీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్థలాల క్రమబద్ధీకరణకు పేదలు పెట్టుకున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇందులోనే పేదల చేతుల్లో ఉన్న స్థలాలను హేతుబద్ధీకరించాలని సూచించడాన్ని అందరూ స్వాగతించారు. ఒకరికి 30 గజాలుంటే, మరొకరికి 120 గజాల వరకు ఉంది.

బస్తీలోని స్థలాలను ఏకీకృతం చేసి సమానంగా పంచే ఏర్పాట్లు చేయడం వల్ల పేదలందరికీ సమాన న్యాయం జరుగుతుందని అన్ని పార్టీల నాయకులు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. పెద్దలు ఆక్రమించుకున్న స్ధలాలు ఖాళీగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమబద్ధీకరించవద్దని సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, సున్నం రాజయ్య స్పష్టంచేశారు.

చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వాటిని కూడా క్రమబద్ధీకరించొద్దని కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం కింద అన్యాక్రాంతమైన భూముల వివరాలను నాయకులకు సీఎం కేసీఆర్ వివరించారు. రంగారెడ్డి జిల్లాలో 3200 ఎకరాలు, హైదరాబాద్ జిల్లాలో 1700 ఎకరాల వరకు ఇలాంటివి ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగర పరిధిలో వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని, వాటి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించదల్చుకుందని సీఎం పునరుద్ఘాటించారు. కబ్జాకు గురైనప్పటికీ ఖాళీగా ఉన్న భూముల విషయంలోనే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో మళ్లీ కబ్జాలు జరుగకుండా పటిష్ట చట్టాన్ని తీసుకురావాలన్న ప్రతిపాదన ఉందన్నారు.

రెండు జిల్లాల ఎమ్మెల్యేలతోనూ సమావేశం: కబ్జా భూముల క్రమబద్ధీకరణ, స్వాధీనం, పరిరక్షణవంటి అంశాలపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోనూ చర్చించాలని అన్ని పార్టీల నేతలు సీఎం కేసీఆర్‌ను కోరారు. దానికి సీఎం కూడా సానుకూలతను వ్యక్తంచేసినట్లు తెలిసింది. వక్ఫ్, దేవాదాయశాఖలకు చెందిన భూములైతే ఆ అధికారులతోపాటు మత గురువులు, పూజరుల అభిప్రాయాలను సేకరించడం ద్వారా ఇబ్బందులు తలెత్తవని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. రెండు రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కబ్జాకు గురైన భూములు, క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల సమగ్ర వివరాలను ప్రభుత్వం సేకరించనుంది.

వీటిని అన్ని పార్టీల కార్యాలయాలకు పంపిస్తారు. ఈ నెల 16న ప్రభుత్వం మళ్లీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. అప్పుడు ఆయా పార్టీలు ఇచ్చే సూచనలను, అభిప్రాయాలను క్రోడీకరించుకొని, స్థలాల క్రమబద్ధీకరణకోసం మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు ఓ రెవెన్యూ అధికారి టీ మీడియాకు తెలిపారు. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లనుంచి సేకరించిన వివరాలను సరిచూసుకొని పార్టీలకు సమర్పించనున్నట్లు ఆయన చెప్పారు.

భవిష్యత్తులో మళ్లీ కబ్జా అనే మాట వినపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. మురికివాడల్లేని నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఎమ్మెల్యే ప్రభుత్వానికి సహకరించాలని సమావేశంలో సీఎం కోరారు. వారి పరిధిలోని మురికివాడల్లో పేదల ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ, గుడిసెల చోట బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనవంటి అన్నింటిపైనా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని సూచించడంపై అఖిలపక్షం సానుకూలతను వ్యక్తం చేసింది.

సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారుడు పాపారావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, నిరంజన్ (కాంగ్రెస్),ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నర్సిరెడ్డి (టీడీపీ), అక్బరుద్దీన్ ఒవైసీ, జాఫ్రి (ఎంఐఎం), కే లక్ష్మణ్, జీ కిషన్‌రెడ్డి (బీజేపీ), తమ్మినేని వీరభద్రం, సున్నం రాజయ్య (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి, రవీంద్రకుమార్ (సీపీఐ), వేణుగోపాలాచారి, రాజేశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి (టీఆర్‌ఎస్), తాటి వెంకటేశ్వర్లు(వైఎస్సార్సీపీ), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్ అధికారులు నర్సింగరావు, ప్రదీప్‌చంద్ర, రేమండ్‌పీటర్, నాగిరెడ్డి, ఎస్‌కే జోషి, మీనా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు మీనా, శ్రీధర్, మెట్రోరైల్ ప్రాజెక్టు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అఖిలపక్షానికి హాజరుపై టీటీడీపీ తర్జనభర్జన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంగళవారం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకావడంపై తెలంగాణ టీడీపీ నేతలు ఎటూ తేల్చుకోలేకపోయారు. అఖిలపక్ష భేటీకి అనుమతి కోసం టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు.

సమావేశానికి ఎవరెవరు హాజరుకావాలి, భేటీలో ఏ విధమైన వాణి వినిపించాలనే విషయమై సూచనలు తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలనే పంపాలని ఒక నాయకుడు సూచించగా, పార్టీ తరఫున అధ్యక్షుడు వెళ్లాల్సిందేనని మరో నేత పేర్కొన్నారు. దీంతో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొనాలని బాబు సూచించారు. దీంతో వారిద్దరు సమావేశానికి హాజరయ్యారు. ఈ ఘటనతో తెలంగాణ టీడీపీ నేతల పరాధీనత మరోసారి స్పష్టమైందని కొందరు కార్యకర్తలు అంటున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.