-పథకాలు బాగున్నాయి.. సీఎం కేసీఆర్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ప్రశంసలు కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ.. దేశ ప్రథమపౌరుడి ప్రశంసలు కూడా అందుకున్నట్లు తెలియవచ్చింది. భేష్.. బాగా చేస్తున్నారు. శేఖర్.. యూ ఆర్ డూయింగ్ వెల్ అంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యమంత్రి కేచంద్రశేఖర్‌రావును అభినందించినట్లు తెలిసింది. క్రమశిక్షణ, పకడ్బందీ ప్రణాళిక, మొక్కవోని దీక్ష, పక్కాగా అమలు చేస్తున్న పథకాలపై ప్రజల స్పందనను ఈ కితాబు ప్రతిఫలిస్తున్నదని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. మంగళవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందుకు హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతసేపు ప్రత్యేకంగా రాష్ట్రపతితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలపై రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేయడమేకాకుండా.. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా బాగా చేస్తున్నారు. మంచి సేవలందిస్తున్నారు అంటూ కితాబిచ్చినట్టు తెలుస్తున్నది. నా దగ్గరికి వచ్చిన చాలా మందిని తెలంగాణ కొత్త రాష్ట్రం.. ఎలా ఉందని అడిగాను. చాలా బాగా చేస్తున్నారు. పథకాలు బాగున్నాయంటూ అందరూ నాకు చెప్పారు అని ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సీఎం కేసీఆర్‌తో అన్నట్టు సమాచారం. మంత్రుల టీం కూడా బాగుంది. తెలంగాణ కొత్త రాష్ట్రం అనే ఫీలింగ్ కూడా కనపడటం లేదు.
కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను అదేస్థాయిలో ముందుకు తీసుకెళ్ళేందుకు మీరు చేస్తున్న కృషి, ప్రణాళికలు బాగున్నాయి… గో అహెడ్..! అంటూ రాష్ట్రపతి భుజంతట్టారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతితో ప్రత్యేక సమావేశం ముగిసి బయటకు వచ్చిన సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పలువురు మంత్రివర్గ సహచరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సార్ (రాష్ట్రపతి) చాలా హ్యాపీగా ఉన్నారు అంటూ సంతోషాన్ని పంచుకున్నట్టు సమాచారం. వాస్తవానికి మంగళవారంనాటి తేనీటి విందు సమయంలో ఏపీకి చెందిన మంత్రుల బృందం, ఏపీ సీఎస్ ఐవైఆర్ క్రిష్ణారావు తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదులు చేశారు.
శాంతియుతంగా ఉండనివ్వడం లేదని, సాగునీరు, విద్యుత్ విషయంలో వివాదాలు సృష్టిస్తున్నారని, హైదరాబాద్‌పై తమకు కూడా హక్కు ఉందని, సెక్షన్ 8ను అమలు చేయాలని, గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం అజమాయిషీ చేస్తూ తీవ్ర ఇబ్బందులు కల్పిస్తున్నదని.. ఇలా అనేక ఫిర్యాదులతో రాష్ట్రపతిని కలిశారు. వీటిపై రాష్ట్రపతి.. ఎప్పటిలాగే చూస్తాను అన్నట్టు తెలిసింది.
ఇదే సమయంలో తనతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమైనప్పుడు మాత్రం.. తనకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ప్రశంసలు కురిపించడం గమనార్హం. నిజానికి వర్షాకాలం విడిది నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి రాష్ట్రపతి ప్రణబ్‌ను రెండు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దాదాపు ప్రతిరోజూ కలుస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ర్టాల మధ్య తలెత్తుతున్న వివాదాలు, దానికి కారణాలు.. నోటుకు ఓటు వ్యవహారంలో చంద్రబాబు బృందం వ్యవహారం, తెలంగాణ ఏసీబీ చట్ట ప్రకారం చేస్తున్న దర్యాప్తు తదితర అంశాలన్నింటినీ పూసగుచ్చినట్టుగా రాష్ట్రపతికి నరసింహన్ వివరిస్తూనే ఉన్నట్టు సమాచారం.
దీనితోపాటు తన వద్దకు వచ్చిన ప్రముఖుల నుంచి కూడా రాష్ట్రపతి పరిస్థితులపై ఆరా తీసినట్లు తెలిసింది. తనకు వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించుకునే సీఎంను రాష్ట్రపతి ప్రశంసించారని అంటున్నారు. పైగా తన పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అతిథి మర్యాదలు, యాదగిరిగుట్ట అభివృద్ధికోసం చేస్తున్న ప్రణాళికలు, ముందుచూపును స్వయంగా చూసిన రాష్ట్రపతి తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేస్తుందనే సంకేతాలను బలంగా పంపించినట్టు భావిస్తున్నారు. సుమారు పది రోజులపాటు హైదరాబాద్‌లో గడిపిన రాష్ట్రపతికి అన్ని వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో సంతృప్తి చెందినట్టు పలువురు ప్రజాప్రతినిధులు చెప్పుకోవడం గమనార్హం.
ఘనంగా వీడ్కోలు.. సుమారు 10 రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం విడిదిలో ఉల్లాసంగా గడిపిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం ఉదయం హకీంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు, శాసనసభాపతి మధుసూధనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ తదితర ఉన్నతాధికారులు ప్రణబ్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.
వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. అంతకు ముందు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఫొటోలతో కూడిన ఆల్బమ్‌ను, వెండి నెమలి ప్రతిమను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు బహూకరించారు. ఆల్బంలోని ఫోటోలను రాష్ట్రపతి ఆసక్తిగా తిలకించారు. రాష్ట్రపతికి ప్రతి ఒక్కరూ పుష్పగుచ్ఛం అందిస్తూ వీడ్కోలు పలికారు. ప్రత్యేక విమానం వరకు గవర్నర్, సీఎం కేసీఆర్‌లు వెళ్ళి వీడ్కోలు పలికి వచ్చారు.