-నడ్డా.. ఇది తెలంగాణ అడ్డా -కులమతాలపేరిట చిచ్చుపెడుతున్న బీజేపీ -కాళేశ్వరం ప్రాజెక్టుపైనా ఏడుపు ఎందుకు? -మా పథకాలే కాపీ కొట్టి మాపై విమర్శలా? -ఆయుష్మాన్ భారత్ పథకం ఓ బక్వాస్ స్కీం -కూకట్‌పల్లి నియోజకవర్గ సమావేశంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణ అడ్డాలో బీజేపీ నడ్డా నాటకాలు నడువబోవని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఘాటుగా వ్యాఖ్యానించారు. కర్ణాటకలో వేసిన పన్నాగాలు, నాటకాలు తెలంగాణలో సాగబోవని స్పష్టంచేశారు. అధికారం మత్తులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సహకరించాల్సింది పోయి.. ప్రాజెక్టుపై ఏడుస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవుపలికారు. సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గ డివిజన్, బూత్‌స్థాయి టీఆర్‌ఎస్ కమిటీ సభ్యుల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రం బాగుపడుతుంటే, తెలంగాణ పొలాలు పచ్చగా ఉంటే బీజేపీ, కాంగ్రెస్‌లకు నచ్చడం లేదన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే నచ్చని బీజేపీ.. మతాలు, కులాల పేరిట చిచ్చు పెట్టి, ఆ చలిమంటల్లో రాజకీయంగా లాభం పొందాలని చూస్తున్నదని మండిపడ్డారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా చదివి వెళ్లిపోయారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్కటంటే ఒక్కటీ సరిగా మాట్లాడని జేపీ నడ్డా.. తన పేరును పచ్చి అబద్ధాల అడ్డాగా మార్చుకోవాలని ఎద్దేవాచేశారు.
తెలంగాణ పథకాలను కాపీకొట్టిన కేంద్రం తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలను కేంద్రప్రభుత్వం కాపీకొట్టిందని కేటీఆర్ తెలిపారు. రైతుబంధును పీఎం కిసాన్‌గా మార్చారని, మిషన్ భగీరథను నకలుకొట్టి జల్‌శక్తి అభియాన్ అంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. చేతనైతే తెలంగాణ సంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలుచేసి చూపాలన్నారు. కేంద్రం అమలుచేస్తున్న ఆయుష్మాన్ భారత్.. ఓ బక్వాస్ స్కీం అని కొట్టిపారేశారు. దానికన్నా ఆరోగ్యశ్రీ పథకమే మంచిదని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో ఏడాదికి రూ.12 వేల కోట్లు పింఛన్లుగా ఇస్తున్నామని, ఇందులో కేంద్రం రూ.200 కోట్లు ఇచ్చి.. మొత్తం తానే ఇస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయంగా ఎదగాలంటే మంచిపనులు చేసి ఎదగాలే తప్ప ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదని బీజేపీ నేతలకు హితవుపలికారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు తప్ప హైదరాబాద్ అభివృద్ధికి గత ఐదేండ్లలో మోదీ ప్రభుత్వం చేసిందేమీలేదని స్పష్టంచేశారు. ఐదేండ్లలో ఒక్కరోజైనా కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి రాలేదన్న కేటీఆర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదక్షత, పనితీరుకు ఇది నిదర్శనమని అన్నారు.

కాళేశ్వరంపైనా ఏడుపా! నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేసుకోవడానికే తెలంగాణ సాధించుకున్నామని కేటీఆర్ చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కొత్త రాష్ట్రంలో చేపడితే సహకరించాల్సింది పోయి.. ప్రాజెక్టుపై ఏడుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వచ్చిందే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకోవడానికని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కేటీఆర్ వివరించారు. మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసుచేస్తే కేంద్రం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
మిషన్ కాకతీయను నీతి ఆయోగ్ ప్రశంసించిందని గుర్తుచేస్తూ.. కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రశంసలు బీజేపీ నేతలకు కనబడుతలేవా అని నిలదీశారు. పదకొండు రాష్ర్టాల నుంచి మంత్రులు, అధికారులు తెలంగాణకు వచ్చి, అధ్యయనం చేసి నేర్చుకున్నారని గుర్తుచేశారు. అవినీతి అంటూ గొంతు చించుకుంటున్న నేతలకు దమ్ముంటే.. ఆధారాలను ప్రజాక్షేత్రంలో పెట్టాలని సవాలు విసిరారు. గతంలో కాంగ్రెస్ నేతలు ఇలానే మాట్లాడారని, ఒకాయన కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గడ్డం తీయనని చెప్పారని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది కానీ ఆయన గడ్డం అలాగే ఉన్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
టీఆర్‌ఎస్‌కు ప్రాణవాయువు కార్యకర్తలే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల సభ్యత్వంతో టీఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయశక్తిగా మారిందని కేటీఆర్ అన్నారు. క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలే టీఆర్‌ఎస్‌కు బలమని చెప్పారు. ఎగిరెగిరిపడుతున్న బీజేపీ నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారం, కుట్రలను టీఆర్‌ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణను బంగారు తెలంగాణగా, హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేయడం టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కూకట్‌పల్లి పరిధిలో కార్పొరేటర్ల సంఖ్య పెంచే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.

నడ్డా వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ మంత్రులు టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను బీజేపీ దేశమంతా కాపీ కొడుతున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచి బీజేపీ ఎగిసి పడుతున్నదని, ఆ పార్టీని చూసి భయపడేవారు ఎవరూలేరని చెప్పారు. ఐదేండ్లలో రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీకి లేదన్నారు. యువనేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ మరింత బలోపేతమవుతుందని చెప్పారు. మరో 20 ఏండ్లు కేసీఆరే సీఎం అని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో దమ్మున్న సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును కట్టే సత్తా కేసీఆర్‌కే ఉన్నదని నిరూపితమైందని చెప్పారు. తెలంగాణ తరహాలో సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. దమ్ముంటే తెలంగాణ సంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలుచేసి చూపాలన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను తప్ప మరెవర్నీ నమ్మే పరిస్థితిలేదని స్పష్టంచేశారు.
మంత్రి శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేవాళ్లు ఎవరూలేరని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి విషయంలో ఏ వేదిక మీద అయినా చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. ఏది పడితే ఆది మాట్లాడితే ఊరుకోబోమని బీజేపీ నేతలను హెచ్చరించారు. షెడ్యూల్ ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతాయని, గతంకంటే టీఆర్‌ఎస్‌కు అదనంగా ఐదు సీట్లు వస్తాయని చెప్పారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీలు కే నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, యువజన విభాగం నాయకులు పాటిమీది జగన్మోహన్‌రావు, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.