-పట్టభద్రుల సమస్యలు తీరుస్తా -మొదటి ప్రాధాన్యత ఓటేసి ఆశీర్వదించండి -ఇతర పార్టీలకు ఓటేస్తే వృథా అయితది.. -పీవీ ఘనతను మరింత చాటుదాం -టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి -పాలమూరు జిల్లాలో మంత్రులతో కలిసి విస్తృత ప్రచారం

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని పట్టభద్రులకు వివరించి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. దేవరకద్రలో ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా, మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న,ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు అభ్యర్థి సురభి వాణీ దేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అరవై ఏండ్లలో జరుగని అభివృద్ధి సీఎం కేసీఆర్ ఆరేండ్లలో చేసి చూపించారని అన్నారు.
అనంతరం అభ్యర్థి సురభి వాణీదేవి మాట్లాడుతూ ఏండ్లుగా విద్యారంగంలోని సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందిందనడాకి విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధే ఉదాహారణ అన్నారు. మా తండ్రి పీవీ దేశం గర్వపడేలా పనిచేశారని.. మీరందరూ ఆశీర్వదించి ఓట్లేసి నన్ను శాసనమండలికి పంపిస్తే.. సభలో మీ గొంతుకను అవుతానని హమీ ఇచ్చారు. ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు.