హైదరాబాద్ నగర మేయర్ పీఠం తెలంగాణ ఉద్యమకారుడికి దక్కింది. 2002 నుంచి స్వరాష్ట్రంకోసం సాగిన సమరంలో లాఠీదెబ్బలు, జైలుశిక్షలు అనుభవించిన యోధుడు, చర్లపల్లి డివిజన్ టీఆర్‌ఎస్ కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ మేయర్ అయ్యారు. డిప్యూటీ మేయర్‌గా మరో యువ ఉద్యమకారుడు, బోరబండ టీఆర్‌ఎస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఎన్నికయ్యారు. ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ప్రశాంత వాతావరణంలో 25 నిమిషాల్లో ముగిసిన ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మజ్లిస్‌పార్టీ మద్దతు ప్రకటించగా సంఖ్యాబలం లేక ప్రతిపక్షాలు అభ్యర్థిని నిలుపలేదు. కాగా, కొత్త మేయర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు గురువారం ఉదయం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ప్రమాణం చేశారు.

-డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ -ఉద్యమకారుడికి విశ్వనగర పాలనా పగ్గాలు -టీఆర్‌ఎస్‌కు మజ్లిస్ మద్దతు.. పోటీ పెట్టని విపక్షాలు -ఏకగ్రీవంగా ఎన్నికలు.. 25 నిమిషాల్లో ప్రక్రియ పూర్తి -నేడు మేయర్ బాధ్యతల స్వీకరణ అనంతరం మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీతో పాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, లోక్‌సభ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితర 44మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు హాజరయ్యారు. వీరిలో 26మంది ఎమ్మెల్సీలు , 17మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 150 మంది కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 11 గంటలకు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జ, ఎన్నికల పరిశీలకుడు అశోక్‌కుమార్‌తో కలిసి కౌన్సిల్ హాలుకు చేరుకున్నారు. వివిధ పార్టీల కార్పొరేటర్లంతా తమ తమ స్థానాల్లో ఆసీనులైన తర్వాత కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత తెలుగులో ప్రమాణ స్వీకారం చేసే కార్పొరేటర్లు లేచి నిల్చొని తమతమ టేబుళ్లపై ఉంచిన ప్రమాణస్వీకార పత్రాలను చదివారు.

ఈ ప్రక్రియ పూర్తి కాగానే ప్రిసైడింగ్ అధికారి మేయర్ ఎన్నికల ప్రక్రియను చేపట్టారు. మేయర్ పదవికి చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ పేరును టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వెంకటేశ్వర కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవిత ప్రతిపాదించారు. మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ అంజయ్య బలపరిచారు. ప్రతిపక్షాలనుంచి ఎవరూ పోటీకి దిగకపోవడంతో రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు చెందిన అమీర్‌పేట్ డివిజన్ కార్పొరేటర్ శేషుకుమారి తమ పార్టీ తరఫున బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ పేరును ప్రతిపాదించారు. రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి దీనిని బలపర్చారు.మజ్లిస్ పార్టీ అహ్మద్‌నగర్ కార్పొరేటర్ అయోషా రుబీనా టీఆర్‌ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను తాము కూడా సమర్థిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పదవికి కూడా ఇతరులెవరూ పోటీకి దిగకపోవడంతో ఫసియుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్లకు ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జా గెలుపు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 25నిముషాల్లోనే పూర్తయింది.
అమరవీరుల స్థూపం వరకూ ర్యాలీ ఎన్నికలు పూర్తి కాగానే జై తెలంగాణ నినాదాలతో కౌన్సిల్ హాలు ప్రాంగణం మార్మోగింది. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిసి కార్పొరేటర్లు కాలి నడకన గన్‌పార్క్‌కు ర్యాలీగా తరలివెళ్లి అక్కడ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్‌లు నేరుగా సీఎంను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.
ప్రత్యేక అధికారి పాలనకు తెర… మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు పూర్తికావడంతో దాదాపు ఏడాదిన్నర కాలం పాటు సాగిన ప్రత్యేకాధికారి పాలనకు తెరపడింది. నిబంధనల ప్రకారం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు పూర్తయిన వెంటనే వారి పాలన మొదలైనట్టేనని అధికారులు తెలిపారు. అయితే వారు ఇంకా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది.
యువత ఆధ్వర్యంలో మెరుగైన పాలన-కమిషనర్ ఆకాంక్ష ఎన్నికలు ముగిసిన అనంతరం రామ్మోహన్, ఫసియుద్దీన్‌లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఛాంబర్‌కు వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా వారిరువురినీ అభినందించిన జనార్దన్‌రెడి మేయర్, డిప్యూటీ మేయరు సహా ఎక్కువశాతం యువతే కొలువుతీరడంపై సంతోషం వ్యక్తం చేశారు. యువత నేతృత్వంలో నగరానికి మెరుగైన పాలన అందుతుందని ఆకాంక్షించారు. అధికారులతో పాటు వివిధ శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు పాలకమండలికి తోడ్పాటు అందిస్తానని భరోసా ఇచ్చారు.
సీఎం కేసీఆర్‌ను కలిసిన మేయర్, డిప్యూటీ మేయర్ గ్రేటర్ హైదరాబాద్ నూతన మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభినందించారు. మేయర్‌గా ఎన్నికైన అనంతరం సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో కలిసిన వారు తమను ఈ పదవులకు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవెర్చాలని, నమ్మకాన్ని నిలబెట్టాలని సీఎం కేసీఆర్ వారికి సూచించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంత్రుల అభినందనలు: గ్రేటర్ హైదరాబాద్ నూతన మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా ఎంపికైన బాబా ఫసియుద్దీన్‌ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు అభినందించారు. సెక్రటేరియట్‌లో మంత్రులను కలిసి వారు తమ ఎన్నికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.