Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మక్క రైతులపై..కేంద్రం పిడుగు

-జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణ
-రిజిస్ట్రేషన్‌ చట్టంలో స్వల్ప మార్పులు
-నాలా చట్టానికీ సవరణ
-అన్నదాతకు శరాఘాతంగా కేంద్రం నిర్ణయాలు
-ఆందోళన వ్యక్తంచేసిన రాష్ట్ర మంత్రిమండలి
-సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయాలు
-యాసంగిలోనూ మక్క వద్దు
-దేశంలో అవసరానికి మించి నిల్వలు
-మక్కజొన్న రైతుకు శాపంగా కేంద్రం నిర్ణయం
-కొంపముంచనున్న కొత్త మార్కెటింగ్‌ చట్టాలు
-ఇతర రాష్ర్టాల్లో తక్కువ ధరకే మక్కల అమ్మకం
-సీఎం కేసీఆర్‌తో సమావేశంలో వ్యవసాయ నిపుణులు, అధికారుల అభిప్రాయం
-మంత్రి మండలి నిర్ణయాలు
-మక్కల సాగుపై రైతులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి
-కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వ్యవసాయ రంగానికి గొడ్డలిపెట్టు
-నాలా చట్ట సవరణకు ఆమోదం
-రిజిస్ట్రేషన్‌ చట్టంలో సవరణలు
-జీహెచ్‌ఎంసీ పాలక మండలిలో మహిళలకు 50% ప్రాతినిథ్యం
-వార్డుల రిజర్వేషన్‌పై జీహెచ్‌ఎంసీ చట్టసవరణకు ఆమోదం
-ఆన్‌లైన్‌లో ఆస్తుల నమోదు మరో 10 రోజులపాటు పొడిగింపు
-హెచ్‌ఎండీఏ పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌పై క్యాబినెట్‌లో చర్చ

కేంద్రం నిర్ణయం మక్కజొన్న రైతుకు గొడ్డలిపెట్టు.. భవిష్యత్‌లో మక్కలకు మద్దతు ధర లభించడం కష్టమేనని రాష్ట్ర క్యాబినెట్‌ ఆందోళన వ్యక్తంచేసింది.. రాష్ట్ర రైతులు మక్కసాగుకు దూరంగా ఉండటమే ఉత్తమని అభిప్రాయపడింది. కరోనా నేపథ్యంలో యాసంగి మాదిరిగానే వానకాలం ధాన్యం కొనుగోళ్లను గ్రామాల్లోనే చేపట్టాలని, ఇందుకోసం 6వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. వ్యవసాయరంగం, జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణ, భూములు, రిజిస్ట్రేషన్‌ చట్టంలో మార్పులపై శనివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్‌ పలు నిర్ణయాలు తీసుకున్నది. ఆందోళన వ్యక్తంచేసిన రాష్ట్ర మంత్రిమండలి

మక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రాకుండాపోవడానికి కేంద్ర నిర్ణయాలే కారణమని రాష్ట్ర మంత్రిమండలి ఆందోళన వ్యక్తంచేసింది. దేశంలో వ్యవసాయరంగానికి కేంద్ర నిర్ణయాలు గొడ్డలిపెట్టుగా మారాయని పేర్కొన్నది. మక్కజొన్న సాగు విషయంలో రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చింది. దేశంలో అవసరానికి మించి మక్కజొన్న నిల్వలున్నప్పటికీ, దేశ రైతాంగ ప్రయోజనాలను విస్మరించి ఇతరదేశాల నుంచి 5 లక్షల టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలనుకొనే కేంద్రం ఆలోచన పట్ల క్యాబినెట్‌ విస్మయం వ్యక్తంచేసింది. సంప్రదాయంగా మక్కజొన్న పంటను సాగుచేసే తెలంగాణ రైతుకు కనీస మద్దతుధర రాకుండాపోయే గడ్డుకాలం ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేసింది. విశ్వ విపణిలో మక్కజొన్నల నిల్వలు ప్రజావసరాలకు మించి ఉండటంతోపాటు, కేంద్ర నిర్ణయాల నేపథ్యంలో మక్కజొన్నసాగు చేస్తే ఎవరూ కొనలేని పరిస్థితి నెలకొన్నదని తెలిపింది. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. వ్యవసాయం, జీహెచ్‌ఎంసీ, భూములకు సంబంధించిన పలు అంశాలపై క్యాబినెట్‌ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకొన్నారు. సమావేశం నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా జరిగింది. సమావేశంలో వ్యవసాయరంగం, రెవెన్యూ చట్టంపై చర్చ జరిగింది. ధరణి వెబ్‌పోర్టల్‌కు సంబంధించి అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లు, రబీ వ్యవసాయ ప్రణాళిక తదితర అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. కరోనా సమయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా గ్రామాల్లోనే ధాన్యం సేకరించిన విధంగానే.. వానకాలంలోనూ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. ఇందుకోసం 6 వేల ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని సూచించింది. కొనుగోలు కేంద్రాలను ఎన్నిరోజులైనా నిర్వహించాలని, చివరి గింజవరకూ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రైతాంగం గాబరాపడాల్సిన అవసరం లేదని, ధాన్యాన్ని గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని సూచించింది.

మక్కజొన్న సాగు తెలంగాణ రైతులకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని.. వానకాలం మాదిరిగానే యాసంగిలోనూ ఆ పంట సాగుకు దూరంగా ఉండడమే ఉత్తమమని వ్యవసాయరంగ నిపుణులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు వివరించారు. విదేశాల నుంచి మక్కలు దిగుమతి చేసుకోవాలనే కేంద్రం నిర్ణయం, తీసుకువచ్చిన నూతన మార్కెటింగ్‌ చట్టాలు మక్క రైతు పాలిటశాపంగా మారనున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మక్క రైతుకు మద్దతు ధర అసాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో మక్కల సాగు, మార్కెటింగ్‌ అంశంపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులు, నిపుణుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

కేంద్రం చట్టాలతో రైతుకు కష్టాలు
దేశంలో ప్రస్తుతం అవసరానికి మించిన మక్కలు అందుబాటులో ఉన్నప్పటికీ కేంద్రం విదేశాల నుంచి 5 లక్షల టన్నుల మక్కలను దిగుమతి చేయాలని నిర్ణయించడం మక్కజొన్న రైతులను అగాథంలోకి నెట్టివేసిందని వ్యవసాయరంగ నిపుణులు పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు మక్కజొన్న రైతును మరింత కష్టాల్లోకి నెట్టుతాయని సీఎం కేసీఆర్‌కు వివరించారు. దేశంలో ప్రస్తుతం 2.42 కోట్ల టన్నుల మక్కలు మాత్రమే అవసరం కాగా.. 3.53 కోట్ల టన్నుల లభ్యత ఉన్నదని పేర్కొన్నారు. 1.11 కోట్ల టన్నుల నిల్వలు అదనంగా ఉన్నాయని, దీనికి తోడు వానకాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 4.10 కోట్ల టన్నుల పంట మార్కెట్లోకి విడుదలవుతుందని వివరించారు. దీంతో వచ్చే సంవత్సరానికి అవసరమైన నిల్వలు కూడా ఉంటాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల నుంచి మక్కలు దిగుమతి చేయాలని కేంద్రం నిర్ణయించడం మక్కజొన్న రైతుల పరిస్థితిని మరింత దిగజారుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మక్కలకు మద్దతు ధర అసాధ్యమని సీఎం కేసీఆర్‌కు వివరించారు.

కోళ్ల వ్యాపారులు మన మక్కలు కొంటలేరు
తెలంగాణలో మక్కజొన్న రైతులకు సరైన ధర ఇప్పించాలనే ఉద్దేశంతో, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కోళ్ల పరిశ్రమ వ్యాపారులతో వ్యవసాయశాఖ చర్చలు జరిపిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సీఎంకు వివరించారు. అయితే బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాల్లో కోళ్ల దాణా అతి తక్కువ ధరకే లభిస్తున్నందున తెలంగాణలో పండిన మక్కజొన్నలు కొనడానికి కోళ్ల వ్యాపారులు సుముఖంగా లేరని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగం యాసంగిలో మక్కజొన్న సాగుచేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శి స్మితా సబర్వాల్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, సివిల్‌ సైప్లె కమిషనర్‌ అనిల్‌కుమార్‌, అగ్రికల్చర్‌ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, పౌరసరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

ధరణిలో ఆన్‌లైన్‌ దరఖాస్తుపలు చట్టాలకు సవరణలు
వ్యవసాయభూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చేక్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగానికి గురికాకుండా చూసేందుకు ఇటీవలి నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు సూచించింది. ధరణి పోర్టల్‌ ద్వారా సంబంధిత వివరాలను అందచేస్తూ ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తూ, భూ మార్పిడిని సులభతరం చేస్తూ.. చట్టసవరణకు మంత్రిమండలి నిర్ణయించింది. రిజిస్ట్రేషన్‌ చట్టంలో స్వల్ప సవరణలకు ఆమోదం.

రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ గడువును పదిరోజుల పాటు (అక్టోబర్‌ 20) పొడిగిస్తూ నిర్ణయం.
హెచ్‌ఎండీఎ పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ విధానంపై క్యాబినెట్‌ చర్చించింది.
జీహెచ్‌ఎంసీలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు
జీహెచ్‌ఎంసీ పరిధిలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లను

రిజర్వ్‌ చేయడానికి సంబంధించిన కీలకమైన చట్టానికి తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గత ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) ద్వారా మహిళలకు 50 శాతం సీట్లను రిజర్వ్‌ చేశారు. దీనికి ఇక పూర్తిస్థాయిలో చట్టబద్ధత కల్పించారు. దీంతోపాటు పురపాలక చట్టం ద్వారా వార్డు కమిటీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా ప్రతీ డివిజన్‌లో పాలనను మరింతమెరుగపర్చేందుకు, అభివృద్ధి పనుల్లో ప్రజా భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు డివిజన్లవారీగా నాలుగు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కమిటీలో 25 మంది ఉంటారు. వీరు స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులకు సలహాలు, సూచనలు ఇస్తారు. భవిష్యత్‌తరాలకు పచ్చదనం అందించేందుకు ప్రత్యేకంగా గ్రీన్‌బడ్జెట్‌ను ఏర్పాటుచేస్తారు. ప్రతీ డివిజన్‌ కార్పొరేటర్‌కు తప్పనిసరిగా మొక్కల పరిరక్షణకు సంబంధించిన బాధ్యతలు అప్పగిస్తారు. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీలో ఈ తరహా ఏర్పాటులేదు. కొత్తగా చేసే చట్టసవరణలో ఇవన్నీ ఉంటాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.