-సీఐఐ రాష్ట్ర చాప్టర్ తొలి వార్షికోత్సవంలో సీఎం కేసీఆర్ పిలుపు రాష్ట్రంలో పరిశ్రమల సంస్కృతి పెరగాలని ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం మేకిన్ తెలంగాణ నినాదం తీసుకుందామని పిలుపునిచ్చారు. దీనికి ముఖ్యమైన విద్యుత్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు వేగంగా విస్తృత స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉందని తెలిపారు. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణాలో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలంగాణ చాప్టర్ మొదటి వార్షికోత్సవ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొత్త కొత్త అవిష్కరణలను అందిపుచ్చుకుని.. అత్మవిశ్వాసంతో అడుగులేస్తున్నాం. అభివృద్ధిలో త్వరలోనే గుజరాత్‌ను మించిపోగలం అని కేసీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ల్యాండ్‌బ్యాంక్, తగినంత విద్యుత్, నీటిలభ్యత, అవినీతిరహిత అధికారయంత్రాంగమనే నాలుగు అంశాలు దోహదం చేస్తాయని తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ నాలుగు అంశాలు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

రాష్ట్రంలో పరిశ్రమల అనుమతుల జారీకి ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా సింగిల్‌విండో అనుమతులను తీసుకువచ్చామని వివరించారు. ఆఫీసులకు తిరగకుండా.. మధ్యవర్తుల పని లేకుండా ఈ విధానం ఉంటుందని తెలిపారు. స్వయంగా తానే దానిని పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. సీఎంవోలో చేజింగ్‌సెల్ ఏర్పాటుచేశాం. దరఖాస్తుచేస్తే 15 రోజుల్లోనే అనుమతులు రావాలి. శంషాబాద్ విమానాశ్రయానికే ప్రొటోకాల్ ఆఫీసర్ వచ్చి.. స్వాగతం పలికి నేరుగా నా వద్దకే తీసుకువస్తారు. క్లియరెన్స్ సర్టిఫికెట్లను ఎన్వలప్ కవర్‌లోపెట్టి నేనే స్వయంగా అందజేస్తా అని సీఎం చెప్పారు. టీఎస్ ఐపాస్‌ను జాతీయస్థాయి పారిశ్రామికవేత్తల సమక్షంలో త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ప్రపంచంలో చాలా సింగిల్‌విండోలున్నాయి కదా.. వాటికి.. తెలంగాణ సింగిల్ విండోకు తేడాలేంటని చాలా మంది అడుగుతున్నారు.
వాటికన్నీ గ్రిల్సే ఉన్నాయి. తెలంగాణ సింగిల్‌విండోకు గ్రిల్స్‌లేవని చెప్పిన అని తెలిపారు. టౌన్‌ప్లానింగ్ విభాగం అక్రమాలకు నెలవుగా మారిపోయింది. రియల్‌ఎస్టేట్ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు గ్రామపంచాయితీలు స్థానిక సంస్థల నుంచి అనుమతులు తీసుకోనక్కరలేకుండా చర్యలు తీసుకుంటున్నాం. బ్యూరోక్రసీ అవినీతిరహిత వ్యవస్థగా మారాలి. పరిశ్రమల కల్చర్ పెరగాలి. మేక్ ఇన్ తెలంగాణగా తీర్చిదిద్దుతాం అని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పరిశ్రమల స్థాపనకు రాయితీలివ్వమని కేంద్రాన్ని అడిగామని, ఎక్సైజ్, పన్ను రాయితీని కల్పించమని కోరుతామని సీఎం తెలిపారు.
వందేండ్ల వరకూ కరెంటు సమస్యలుండవ్ నేను కేసీఆర్‌ను చెబుతున్నా. మే, జూన్.. ఈ రెండుమాసాలాగితే పరిశ్రమలకు విద్యుత్ కోతలుండవు. కొనుగోలు చేసైనా విద్యుత్‌ను అందిస్తాం. వందేండ్ల వరకూ కరెంట్ కొరత లేకుండా విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది అని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు అభయమిచ్చారు. తెలంగాణలో పారిశ్రామికరంగం గురించి చర్చ వచ్చినప్పుడు ముందుగా మాట్లాడేది విద్యుత్‌కొరత గురించే. ఈ మధ్యే విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటే ఆయన కొన్ని విషయాలు నాతో పంచుకున్నారు. బెంగళూరు నగరం చాలా ఇరుకుగా అయ్యింది. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడానికి 3 గంటల సమయం పడుతున్నది. మా కార్యకలాపాలను హైదరాబాద్‌కు విస్తరిస్తాం.. దీంతో 5 వేల ఉద్యోగాలు ఇక్కడ కల్పిస్తాం అని చెప్పిన్రు. మీ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఏమిటనీ ఆరా తీసిన్రు. ఎవరు కలిసినా విద్యుత్ గురించే అడుగుతున్నరు.
ఈ సమస్య కూడా త్వరలోనే పరిష్కారం కాబోతున్నది అని తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తయితే విద్యుత్ కొరత అనే మాటే ఉండదని స్పష్టం చేశా రు. నేను గ్యారెంటీగా చెబుతున్నా 24 గంటల పాటు విద్యుత్‌ను అందిస్తాం. మే నెలాఖరు నుంచి పవర్‌కట్ అనేదే ఉండదు. మొత్తంగా తెలంగాణలో విద్యుత్ ఉత్ప త్తి 2018 నాటికి 20,633 మెగావాట్లను చేరుకుంటుం ది. ఛత్తీస్‌గఢ్ నుంచి 2 వేలతోపాటు మరో 2 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌కూడా అందుబాటులోకి వస్తుం ది. కాబట్టి వందకు వందశాతం కరెంట్ అనేది సమస్యకాబోదు. సమస్య ఉంటే ఫిర్యాదు చేయడానికి టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తాం అని సీఎం వివరించారు.
20 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ రాష్ట్రం పారిశ్రామికవృద్ధి సాధించటానికి ఎన్నో అనుకూలతలున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఇరవై లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉందని తెలిపారు. ఇప్పటికిప్పుడు లక్షన్నర ఎకరాల భూమి పరిశ్రమలకివ్వడానికి సిద్ధంగా ఉంది. చైనాలోని షాంఘై నగరంలో ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తరహాలో మన దగ్గర కూడా హార్డ్‌వేర్‌పార్కు నిర్మించేందుకు ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తున్నాం.
శంషాబాద్ విమానాశ్రయానికి 15 నిమిషాల ప్రయాణదూరంలో రాచకొండ వద్ద 35 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తాం. ఇక్కడే ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు చేసే అలోచన ఉంది. ఈ ప్రాంతంలోనే సినిమాసిటీ కూడా ఏర్పాటు చేయనున్నాం. కందుకూరు మండలంలో 11 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని, టౌన్‌షిప్‌లను ఏర్పాటుచేస్తాం. మొదటగా మన రాష్ట్రంలోనే అంతర్జాతీయ స్థాయి ఫార్మా యూనివర్సిటీని నెలకొల్పుతాం అని తెలిపారు. హైదరాబాద్‌లోని భూముల ధరలు ముంబై.. ఢిల్లీలాంటి మెట్రోపాలిటన్‌నగరాలే కాదు నాగపూర్ కన్నా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి అనుకూలతలున్న రాష్ట్రం మరెక్కడా ఉండదు అని కేసీఆర్ చెప్పారు.
వాటర్‌గ్రిడ్ నుంచి పరిశ్రమలకు 10 శాతం వాటా.. వాటర్‌గ్రిడ్ పథకంనుంచి పరిశ్రమలకు 10% నీటిని ఇవ్వనున్నాం. అదీ వినియోగించుకోవడానికి వీలైన ట్రీటెడ్ వాటర్. ఈ ప్రాజెక్టును రెండున్నర సంవత్సరాల్లో పూర్తిచేస్తాం. ప్రపంచంలోనే ఇంత పెద్ద నెట్‌వర్క్ ఎక్కడా లేదు. దీనికోసం హడ్కో 10 వేల కోట్లు, నాబార్డ్ 3 వేలకోట్లు, జిందాల్ 10వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కొరియాకు చెందిన కేర్‌వాటర్ సంస్థ సైతం సహకారాన్ని అందిస్తామంది. వాటర్‌గ్రిడ్‌లో ఫోర్‌టేబుల్ డ్రికింగ్‌వాటర్ ట్యాప్‌లను ప్రతీ ఇంటికి అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం అని సీఎం తెలిపారు.
పారిశ్రామికవేత్తలంతా బ్రాండ్ అంబాసిడర్లే.. తెలంగాణలోని పారిశ్రామికవేత్తలంతా రాష్ర్టానికి బ్రాండ్ అంబాసిడర్లేనని రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభివర్ణించారు. పారిశ్రామికవేత్తలుగా ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపవచ్చని, సమస్యలు విన్నవించవచ్చని చెప్పారు. బంగారు తెలంగాణ, హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయడంలో అందరం భాగస్వామ్యమవుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, టీఎస్‌ఐఐసీ చైర్మన్, ఎండీ జయేశ్‌రంజన్, సీఐఐ తెలంగాణ చాప్టర్ చైర్‌పర్సన్ వనిత దాట్ల, సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ రాజశ్రీపతి, మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, సీఐఐ వైస్‌చైర్మన్ నృపేందర్‌రావు, క్రెడాయ్ అధ్యక్షుడు సీ శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.