తెలంగాణ ఆడపడుచులకు త్వరలోనే రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వబోతున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటిదాకా వడ్డీ లేని రుణాల పరిమితి రూ.ఐదు లక్షల వరకే ఉందని, ఇపుడు దాన్ని రెట్టింపు చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ దిశగా కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, షాదీముబారక్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని హరీశ్‌రావు వివరించారు. హైదరాబాద్‌లో లక్ష మంది పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని ఆయన స్పష్టం చేశారు.

-హైదరాబాద్‌లో లక్ష డబుల్‌బెడ్‌రూం ఇండ్లు -పాలమూరు పథకంతో 24 గంటలు మంచినీరు -బాబు కుట్రలు కేసీఆర్ ముందు చెల్లవు మంత్రి తన్నీరు హరీశ్‌రావు -వేలమందితో టీఆర్‌ఎస్‌లో చేరిన కేకే కుమార్తె విజయలక్ష్మి -కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ : కేకే -అభివృద్ధికోసం అండగా ఉందాం: నాయిని బాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కేసీఆర్ ముందు చెల్లబోవని, పాలమూరు పథకాన్ని పూర్తి చేసి నగరానికి 24 గంటలు మంచినీరు అందించి తీరుతామని తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన వేలాదిమంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ కేకే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన హరీశ్‌రావు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ మీద నిరంతరం కుట్రలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ వాటిని సమర్థంగా తిప్పికొడతారని హెచ్చరించారు. కరెంటు అంశంమీద బాబు పారిశ్రామికవేత్తలను తప్పుదోవ పట్టించేందుకు విశ్వప్రయత్నాలు చేసినా వారు వాస్తవాలు గమనించి మన రాష్ర్టానికి క్యూ కడుతున్నారని తెలిపారు.
ఎండాకాలం కరెంటు చరిత్రే ఉమ్మడి రాష్ట్రంలో మహామహులు సీఎంలుగా పని చేసిన కాలంలో కూడా ఎండాకాలం హైదరాబాద్‌లోనూ 4-5 గంటల కరెంటు కోతలు ఉండేవన్నారు. కానీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈ ఎండాకాలం సీఎం కేసీఆర్ నిమిషంపాటు కోతలు లేకుండా కరెంటు సరఫరా చేశారన్నారు. మారుమూల ఆదిలాబాద్‌లోని గోండు గూడెంలో కూడా 24 గంటల కరెంటు సరఫరా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలనేవి ఉండబోవని మంత్రి స్పష్టం చేశారు.
ఆబిడ్స్‌కు చెందిన ఒక జనరేటర్ల కంపెనీ యజమాని తనను కలిసి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలు విని తెలంగాణలో కరెంటే ఉండదని భావించి భారీ ఎత్తున జనరేటర్లు తయారు చేసుకుంటే ఇవాళ వాటి ముఖం చూసే వారే లేకుండా పోయారని తెలిపాడని చెప్పారు. ఇక తెలంగాణలో కరెంటు కోతలుండవు, తమిళనాడుకు పోయి అమ్ముకో అని తాను చెప్పానని మంత్రి వివరించారు.
నీళ్లు రాకుండా బాబు కుట్ర ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబంతో సహా హైదరాబాద్‌లో ఉంటూ ఈ నగరానికే మంచినీళ్లు ఇవ్వవద్దని కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నాడని విమర్శించారు.24 గంటల కరెంటు సరఫరా చేసినట్టే 24 గంటల పాటు మంచినీళ్లు ఇవ్వాలని కేసీఆర్ సంకల్పిస్తే చంద్రబాబు ఇక్కడే ఉండి పరిపాలన సాగిస్తూ దానికి అడ్డుపడుతున్నాడని అన్నారు. వద్దు పొమ్మని ప్రజలు అంటున్నా ఆయన ఇక్కడే ఉంటానంటున్నారని, కేసీఆర్ హైదరాబాద్‌లో అభివృద్ధి చేపడుతుంటే చంద్రబాబుకు ఇక్కడినుంచి వెళ్లబుద్ధి కావడం లేదని చమత్కరించారు. సిద్దిపేటలా అభివృద్ది చేస్తా స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఎన్బీటీ నగర్, ఎన్బీనగర్, ఖాజానగర్, భోళా నగర్, శ్రీరాంనగర్ బస్తీలను దత్తత తీసుకున్నానని ఈ బస్తీలను తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేటలా అభివృద్ధి చేస్తానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. బస్తీలో మహిళా భవన్, లైబ్రరీ, జిమ్ తదితర సౌకర్యాలను కల్పిస్తామన్నారు. మంచినీటి సమస్య పరిష్కారానికి మరిన్ని నిధులు అందిస్తామన్నారు.
తెలంగాణ అంటేనే కేసీఆర్. టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని ఎంపీ కే కేశవరావు అన్నారు. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. ఎన్బీటీనగర్లోని ఇండ్ల రెగ్యులరైజేషన్‌కు ఉన్న అడ్డంకులను తొలగించే బాధ్యత తనదేనని కేకే హామీ ఇచ్చారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు ఏ దేశంలోనూ లేడన్నారు. హరితహారం కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌కు అందరం సహకరించాలన్నారు.
టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్ని అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆయన తన వైఖరి మార్చుకోకుండా హద్దులు మరిచి మాట్లాడితే పాలమూరుకు వచ్చి తరిమికొడతానని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన విజయలక్ష్మి సీఎం కేసీఆర్‌ను వరమిచ్చే దేవుడిగా అభివర్ణించారు. ఆయన నాయకత్వంలో బంజారాహిల్స్‌ను బంగారు బంజారాహిల్స్‌ను తయారు చేసుకుందామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు మన్నె గోవర్దన్‌రెడ్డి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు ఎన్బీటీనగర్‌లోని కేకే నివాసం నుంచి తెలంగాణ భవన్ వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు వెయ్యిమంది మహిళలు కూడా ఇందులో పాల్గొన్నారు. గద్వాల విజయలక్ష్మి పోరాటం వల్ల ప్రైవేట్ స్కూళ్లలో తమ పిల్లలకు వెయ్యేసి రూపాయల ఫీజులు తగ్గించారని వారు తెలిపారు. ఎంతోకాలంగా ఎవరూ పట్టించుకోని హైటెన్షన్ వైర్ల సమస్య సీఎం కేసీఆర్, హరీశ్‌రావు చొరవతో తొలగిపోతున్నదని వారు తెలిపారు. అలాగే బస్తీలో మంచినీటి సమస్యను తీర్చేందుకు కోట్లాది రూపాయల నిధులు వచ్చాయని పార్టీలో చేరిన ఎన్బీటీనగర్ బస్తీవాసులు తెలిపారు.