Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మా మ్యానిఫెస్టోను కాపీ కొట్టారు

రూపాయిలో ముప్పావలా మింగుడే కాంగ్రెస్ తరహా అభివృద్ధి జనానికి దక్కింది పావలాయే అలాంటి అభివృద్ధి మాకు చేతకాదు అధికారంలోకొచ్చేది టీఆర్‌ఎస్సే మా మ్యానిఫెస్టో వందశాతం అమలుచేస్తాం. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.

KCR 13-04-14

-అవకాశాలురాని వారికి తొలి విడతలో ఎమ్మెల్సీలు -బీసీలకు టీఆర్‌ఎస్సే ఎక్కువ టికెట్లు ఇచ్చింది -విలేకరుల సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు -వాతావరణం మనకే అనుకూలం -16 ఎంపీ సీట్లు గెలిచినా ఆశ్చర్యం లేదు -విస్తృతంగా జనంలోకి మ్యానిఫెస్టో -గృహ నిర్మాణం అంశంపై కేంద్రీకరించండి -అభ్యర్థుల సమావేశంలో గులాబీ దళపతి

ప్రజల చేతిలో పావలా పెట్టి.. ముప్పావలా తమ జేబుల్లోకి వేసుకునే కాంగ్రెస్ నేతల తరహా అభివృద్ధి తమకు చేతకాదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కేసీఆర్‌ను తిట్టడమే వారి ప్రచారంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. తమ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో 20 జిల్లాలు చేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులు.. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ తన మ్యానిఫెస్టోను నూటికి నూరుశాతం అమలు చేసితీరుతుందని కేసీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణకు కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ తరఫున అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జిలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు. కొత్తగా వినియోగిస్తున్న త్రీడీ హాలోగ్రాఫిక్ టెక్నాలజీపై నాయకులకు కేసీఆర్ విపులంగా వివరించారు. సమావేశం అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ వాళ్లు రోజూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ను తిట్టడమే వారి ప్రచారంగా మారింది. ఇక జయరాం రమేశ్ అనేటాయన జీవితంల సర్పంచ్‌గా కూడా గెల్వలే. ఖబర్దార్. పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నడు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో కలిపిందే ఈయన. ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగా వద్దన్నదీ ఈయనే. ఏపీ భవన్‌ను తెలంగాణకే ఇవ్వాలని అడిగితే అది చిన్న విషయం అన్నాడు. అది మనకు చిన్న విషయమా? ఈ అంశాల మీద ప్రజలు నిలదీయాలి అన్నారు.

పిచ్చికూతలు వద్దు. నోరు మూసుకో.. అని జైరాంను హెచ్చరించారు. తమకంటే ముందే మ్యానిఫెస్టో విడుదల చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు.. తాము మ్యానిఫెస్టో విడుదల చేశాక, తమ దాన్ని కాపీ కొట్టారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణలో 20 జిల్లాలు చేస్తామనే అంశాన్ని చేర్చడాన్ని ప్రస్తావించిన ఆయన.. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందే ఈ తెలంగాణ జిల్లాల సంఖ్యను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ఏదైనా చేయడానికి చిత్తశుద్ధి ఉండాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హామీలు అమలు చేయడానికి 8లక్షల కోట్లు కావాలని పొన్నాల అంటున్నారు. పొన్నాలవంటి నేతలకు స్వతంత్రంగా ఆలోచించే జ్ఞానం లేదు. వాళ్ల అభివృద్ధి లెక్కలు కరెక్టే.

పావలా ప్రజలకు పెట్టి, ముప్పావలా జేబులో వేసుకుంటారు. ఇలాంటి అభివృద్ధి మాకు రాదు అని అన్నారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలుకు విజ్డమ్ ఆఫ్ ఎకానమీ కావాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రాధమ్యాల ఆధారంగా తమ పథకాలు ఉంటాయని చెప్పారు. ఇన్నాళ్లూ అధికారంలో ఉండి ప్రజల ముందు నవ్వులపాలు అయ్యారని, పాలించేవారికి తాబేదార్లుగా ఉన్నారుగానీ ఏనాడూ పాలించలేదని, అందుకే తమ మ్యానిఫెస్టో వారికి తమాషాగా ఉందని అన్నారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను 100శాతం అమలు చేసి తీరుతం. రిటైర్డ్ ఐఏఎస్‌లు, మేధావులతో చర్చించాకే ఈ పథకాలు పెట్టాం. అంత ఆషామాషీగా పథకాలు రూపకల్పన చేయలేదు. 100శాతం టీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాదు. ఆచరణకు సాధ్యమైన హామీలనే టీఆర్‌ఎస్ ఇచ్చింది. ఇచ్చిన హామీలను అమలు చేసి చూపుతం అని పునరుద్ఘాటించారు.

13న కరీంనగర్‌లో సభ ఈ నెల 13న కరీంనగర్, 14న నల్గొండ, 15న నిజామాబాద్‌లో బహిరంగ సభలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామని కేసీఆర్ తెలిపారు. ఆ తరువాత నియోజకవర్గాలవారీగా పర్యటనలు ఉంటాయన్నారు. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా త్రీడీ హాలోగ్రాఫిక్ టెక్నాలజీని వినియోగిస్తున్నాం. ఈ టెక్నాలజీ ద్వారా వచ్చే ప్రసంగాల్లో కొన్ని రికార్డు, కొన్ని లైవ్ ఉంటాయి. ఈ టెక్నాలజీతో దాదాపు 700 సభలు నిర్వహిస్తాం. 85 నియోజకవర్గాల్లో నా పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. సాయంత్రం సమయంలో హెలికాప్టర్, ఉదయం సమయంలో రోడ్డు మార్గంలో తిరుగుతాను. ఈ నెల 16 నుండి ముమ్మరంగా ప్రచారం ప్రారంభిస్తున్నాం.

హాలోగ్రాఫిక్ టెక్నాలజీతో హైదరాబాద్‌లోనే దాదాపు 200 సభలు నిర్వహిస్తున్నాం. మండల, మున్సిపాలిటీల పరిధిలో హాలోగ్రాఫిక్ టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకోవాలని భావిస్తున్నాం అని కేసీఆర్ వివరించారు. ఎన్నికల ప్రచారంలో ఇతర ప్రాంతాల్లో పర్యటించేందుకు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ ముందుకొచ్చారని, నాయిని నర్సింహారెడ్డి, కేకే హైదరాబాద్‌లో ఉండి మానిటరింగ్ చేస్తారని అన్నారు. పార్టీకి ఉన్న నలుగురు ఎమ్మెల్సీలు కూడా జిల్లాలకు వెళ్లి ప్రచారం చేస్తారని తెలిపారు. పోటీలో లేని నాయకులు జిల్లాలకే పరిమితమై ప్రచారం చేస్తారని చెప్పారు. అధికారంలోకి వస్తామని చంద్రబాబు పగటికలలు కంటున్నాడని, అధికారంలోకి వచ్చే పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనని అన్నారు. త్రీడీ టెక్నాలజీ ప్రచారం కోసం ఇప్పటికే ఐదుకోట్లు ఖర్చుచేశామని, మొత్తం ఎంతవుతుందో లెక్కలు వేసి చెబుతామని తెలిపారు.

ఎన్నికలన్నప్పుడు అన్ని పార్టీల అధ్యక్షులు ప్రచారం చేస్తారని, అలాగే కాంగ్రెస్ ప్రచారానికి సోనియాగాంధీ వస్తుండవచ్చని అన్నారు.

ఆశావహులకు ఎమ్మెల్సీ పట్టం ప్రస్తుత ఎన్నికల్లో టికెట్లు రాని నాయకులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార సరళి, చేపట్టాల్సిన కార్యక్రమాలు వాటి తీరుతెన్నులపై ఈ సమావేశంలో చర్చించినం. అన్ని పార్టీల కంటే ఎక్కువగా బీసీలకు టీఆర్‌ఎస్ 30 సీట్లు ఇచ్చింది. అంటే బలహీనవర్గాలకు 55శాతం వరకూ ఇచ్చాం. మిగిలిన వర్గాలకు 45శాతం ఇచ్చాం. ఇక బీసీనే సీఎం చేస్తానన్న టీడీపీ 15-16స్థానాలు మాత్రమే ఇచ్చింది. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపే ధ్యేయంగా 90శాతం మందికి టికెట్ ఇచ్చింది. వీరంతా ఉద్యమంలో, టీఆర్‌ఎస్‌లో దీర్ఘకాలంగా కొనసాగుతున్నవారే. ఇక 5-10 శాతం కొత్తవారికి ఇచ్చాం.

పార్టీకి కొన్ని రాజకీయ నిర్ణయాలుంటాయి. గెలుపుకోసం కొందరికి అవకాశం ఇచ్చాం. కొందరు నాయకులు పెద్ద మనసుతో సహకరించారు. రెబల్స్ కూడా ఉపసంహరించుకుంటామని చెప్పారు. వారందరికీ ధన్యవాదాలు. వరంగల్ జిల్లా పరకాలలో రెబల్‌గా నామినేషన్ వేసిన భిక్షపతి కూడా కష్టపడి పనిచేసిన వ్యక్తి. రాములునాయక్, కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవర మల్లప్పవంటివారు చాలా మంది ఉన్నారు. హూజూర్‌నగర్ టికెట్ ఆశించిన శివారెడ్డి.. శంకరమ్మ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. టికెట్ రానివాళ్లు మనసు బాధపెట్టుకోకుండా పనిచేస్తున్నారు. వీరందరికీ మొదటి వరుసలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తాం.

టీఆర్‌ఎస్‌కి వచ్చే ఎమ్మెల్యే స్థానాలతో 20-24 ఎమ్మెల్సీలు గెలిపించుకునే అవకాశం ఉంది. ముందుగా వీరికి ఇచ్చాకే ఇతరులకు ఎమ్మెల్సీ ఇస్తాం. ఏ రాజకీయ పార్టీ కూడా అడిగిన అందరికీ టికెట్ ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో గతంలో కంటే తక్కువ వివాదాలతోనే టీఆర్‌ఎస్ ఉంది అని కేసీఆర్ అన్నారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు, టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్, పొలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్ పాల్గొన్నారు.

అంతా మనకే అనుకూలం తెలంగాణలో ప్రస్తుత వాతావరణం మొత్తం మనకే అనుకూలంగా ఉందని, ఎన్నికల్లో 16 ఎంపీసీట్లు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంతకు ముందు తెలంగాణ భవన్‌లో అభ్యర్థులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జిల సమావేశంలో కేసీఆర్ అన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్ పట్ల సానుకూలంగా ఉన్నారని, తప్పకుండా టీఆర్‌ఎస్‌కే అధికారం దక్కుతుందని చెప్పారని తెలిసింది.

టీఆర్‌ఎస్ 16 ఎంపీ సీట్లు సాధించడం ద్వారా ముస్లింల రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం దొరుకుతుందని తెలిపారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు రాబోయే ఐదేళ్లలో 50వేల కోట్లు ఖర్చుచేస్తామని హామీ ఇచ్చినందున దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు, బడుగు బలహీన వర్గాలకు గృహనిర్మాణం వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ వినియోగిస్తున్న హాలోగ్రాఫిక్ టెక్నాలజీతో ఏర్పాటు చేసే సభలను అభ్యర్థులు విరివిగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి రోజు రెండు మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నుండి హాలోగ్రాఫిక్ సభలు ప్రారంభం అవుతాయని, అందుకు అభ్యర్థులు ప్రధాన కూడళ్లను గుర్తించాలని కోరినట్లు తెలిసింది. ఏ పార్టీకీ తెలంగాణలో ఎక్కువ అవకాశాలు లేవని, సర్వేల్లో టీఆర్‌ఎస్‌కే ఎక్కువ బలం వస్తోందని చెప్పినట్లు సమాచారం.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.