Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

లాయర్ల కోసం చట్టం

-న్యాయవాదులకు కవచంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
-వామనరావు దంపతుల హంతకులను వదిలిపెట్టం
-లాయర్లు, ఉద్యోగులు, విద్యావంతులు.. టీఆర్‌ఎస్‌ ఒక్కటే
-వంద కోట్లతో లాయర్ల సంక్షేమ ట్రస్ట్‌ ఎక్కడైనా ఉన్నదా?
-టీఆర్‌ఎస్‌ లేకుంటే.. టీకాంగ్రెస్‌, టీబీజేపీ ఉండేదా?
-అసత్యాలను, అర్ధసత్యాలను సమర్థంగా తిప్పికొట్టాలి
-కాంగ్రెస్‌, బీజేపీపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలోని న్యాయవాదులకు తెలంగాణ ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తుందని, వారి రక్షణకోసం ప్రత్యేక చట్టాన్నితెస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఇటీవల జరిగిన న్యాయవాద దంపతుల హత్యను కిరాతక చర్యగా అభివర్ణించారు. ఈ హత్యలతో సంబంధం ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టబోమని స్పస్టంచేశారు. టీఆర్‌ఎస్‌ లీగల్‌సెల్‌ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణభవన్‌లో న్యాయవాదుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ .. దేశంలో ఎక్కడా లేనివిధంగా లాయర్ల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎన్నో కార్యక్రమాలు అమలుచేసిన విషయాన్ని వివరించారు. సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

మీరూ, మేమూ వేరు కాదు
న్యాయవాదులకు టీఆర్‌ఎస్‌కు మధ్య అనుబంధం ఎంతో గొప్పది. 2010లో లాయర్లకు స్టాండింగ్‌ కౌన్సిళ్లలో, ఇతర అంశాల్లో మనకు న్యాయపరంగా దక్కాల్సిన వాటాపై అన్నీ బంద్‌ చేస్తుంటే నేనొచ్చిన. అదే సమయంలో కేసీఆర్‌ వచ్చి సీజేను కలిసి వెళ్లిన విషయం తెలిసిందే. ఎన్నో సందర్భాల్లో మీతో మేము.. మాతో మీరు కలిసి పనిచేశాం. జంతర్‌మంతర్‌లో వాటర్‌ కనాన్లతో ఉద్యమకారులపై దాడిజరిగినప్పుడు అందరికంటే ముందు మీరు నిలబడ్డారు. అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారు. రాష్ట్రం ఉన్నంతకాలం తెలంగాణ సమాజం లాయర్లను మర్చిపోదు. 2004లో కేసీఆర్‌ ఆదేశం మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అప్పటి సీఎం వైఎస్‌ఆర్‌ దగ్గరకు వెళ్లి తెలంగాణకు చెందిన వారిని అడ్వకేట్‌ జనరల్‌గా నియమించాలని కోరితే.. ‘నమ్మకస్తుడు’ కావాలె కదా.. అని అన్నారు. 2009-14 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా జైపాల్‌రెడ్డి ఉన్నప్పుడు కంచర్ల రామకృష్ణారెడ్డిని ఏజీగా నియమించాలని కోరితే.. సుదర్శన్‌రెడ్డిని నియమించారు. తెలంగాణ వచ్చిన తర్వాత రామకృష్ణారెడ్డి తొలి ఏజీ అయ్యారు. ఆ తర్వాత ప్రకాశ్‌రెడ్డి, ఇప్పుడు బీఎస్‌ ప్రసాద్‌ అయ్యారు. చరిత్రలో తొలిసారి బీసీని ఏజీగా నియమించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది. జూన్‌ 2న రాష్ట్రం ఏర్పడితే.. హైకోర్టు విభజన జరగటానికి ఐదేండ్లు పట్టింది. సీఎం కేసీఆర్‌ చాలాసార్లు ప్రధాని మోదీని కలిసి పదే పదే కోరిన తర్వాత కానీ రాష్ట్ర హైకోర్టు ఏర్పడలేదు.

ఆరున్నరేండ్లలో తెలంగాణకు నష్టం జరిగిందా?
తెలంగాణ ఆవిర్భావం తర్వాత రైతుకు లాభం జరిగిందా? నష్టం జరిగిందా? ఆలోచించండి. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్‌, రైతుబీమా, రైతులకు రుణవిముక్తి ఇవన్నీ గతంలో ఉన్నాయా? రైతు ఆత్మహత్యలు ఇప్పుడు ఉన్నాయా? గుండెమీద చేతులేసుకొని ఆలోచించాలి. పేదలకు చంద్రబాబు రూ.75 పింఛన్‌ ఇస్తే, వైఎస్సార్‌ రూ.200 ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ రూ.2,000 ఇస్తున్నారు. అప్పుడు 28 లక్షల మందికి పింఛన్‌ వస్తే, ఇప్పుడు 48 లక్షల మందికి అందుతున్నది. కల్యాణలక్ష్మి 9 లక్షల మందికి వచ్చింది. 945 గురుకుల పాఠశాలలు నెలకొల్పి ఇంగ్లిష్‌మీడియంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. చాలామంది పేదలకు విదేశీ స్కాలర్‌షిప్‌లు వస్తున్నాయి.

టీఆర్‌ఎస్‌ లేకుంటే మీ బతుకులకు టీ ఎక్కడిది?
టీఆర్‌ఎస్‌ లేకుంటే, కేసీఆర్‌ లేకుంటే బీజేపీ, కాంగ్రెస్‌లకు బతుకు ఎక్కడిది? ఇవాళఎవరు పడితే వారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు. సీఎం నేపథ్యాన్ని మరచిపోయి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తది. సబ్బండ వర్ణాల మద్దతుతో పోరాటం చేసి తెలంగాణ సాధించినారు. వాళ్ల తిట్లను దీవెనలుగా భావించిన గొప్ప వ్యక్తి కేసీఆర్‌. ఒక్కసారి ఆలోచనచేయండి. ఇయ్యాల కేసీఆర్‌ లేకపోతే.. టీఆర్‌ఎస్‌ లేకపోతే.. టీపీసీసీ ఎక్కడిది? టీబీజేపీ ఎక్కడిది? మీ బతుకులను పట్టించుకొన్నవాడెవడు?

న్యాయవాదులది కిరాతక హత్య
ఈ మధ్య ఇద్దరు లాయర్ల హత్య కిరాతకంగా జరిగిందని ఈ సమావేశంలో ఎవరైనా ప్రస్తావిస్తారునుకున్నా. కానీ ఎవరూ చెప్పలేదు. ఎందుకో అర్థం కాలేదు. బహిరంగంగా చెప్పుకోవాల్సిందే. అది చూసినప్పుడు మనిషన్నవాడు ఎవరైనా కదిలిపోతడు. ఈ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నది. ఈ హత్యల వెనుక ఉన్నా పట్టుకోవాలని ప్రభుత్వ పరంగా చెప్పినం. దాని వెనకాల ఉన్నది మా పార్టీ వాడని పోలీసులు తేల్చారు. వెంటనే వాడిని పార్టీనుంచి తీసేసినం. తప్పకుండా నేరస్థులను కఠినంగా శిక్షిస్తం. ఈ హత్య వెనుక టీఆర్‌ఎస్‌ పెద్దలున్నరని అంటున్నరు. మమ్మ ల్ని పచ్చిబూతులు తిడుతున్న కాంగ్రెస్‌ బీజేపీ వాళ్లనే పట్టించుకోవటంలేదు. న్యాయవాదులతో మాకేం పంచాయితీ.

త్వరలో లాయర్ల రక్షణ చట్టం
దేశానికే రోల్‌మోడల్‌గా అడ్వకేట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను తీసుకొస్తాం. సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి న్యాయవాదులకు రక్షణ కవచంగా ఉండే చట్టం తెస్తాం. చిల్లర మల్లర మాటలు పట్టించుకోకుండా.. సంఘటనలు జరిగినప్పుడు మా స్పందన చూడండి. తప్పుచేస్తే.. ఎవరినో దాచిపెట్టే ప్రయత్నంచేస్తే ఆగుతదా? ఇట్లాంటి ఘటనలను ముక్తకంఠంతో ఖండి స్తాం. ఎక్కువ బాధ్యతతో వ్యవహరిస్తాం. కొందరు స్టాండింగ్‌ కౌన్సిళ్లల్లో.. పీపీల్లో పదేండ్ల నుంచి తిష్టవేసుకొని ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకొంటాం.

టీఆర్‌ఎస్‌తోనే పీవీకి గుర్తింపు
పట్టభ్రదుల నియోజకవర్గం ఎన్నికల విషయంలో ఈసారి జాగ్రత్తలు తీసుకున్నాం. గత ఎన్నికల సమయంలో పార్టీపరంగా ఓట్ల నమోదు చేయలేదు. పోయినసారి నేను కూడా ఓటు నమోదు చేసుకోలేకపోయా. ఈసారి ఆలాంటి పొరపాటు జరగకుండా పెద్దఎత్తున అర్హులైన వారిని ఓటరుగా నమోదుచేయించాం. దీంతో ఓట్లసంఖ్య గణనీయంగా పెరిగింది. మన పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు, సానుభూతి పరులు, కార్యకర్తులు ఓటర్లుగా నమోదుచేసుకొన్నా రు. విద్యావంతులు ఏ ఎన్నికలైనా ఓటింగ్‌కు రారనే ప్రచారమున్నది. ఈసారి అలా కాకుండా చూడాలి. కొంత సమయం వెచ్చించి ఓటింగ్‌కు రావాలి. టీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై అభిమానమున్న ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.

పీవీ తెలంగాణ బిడ్డగా దేశానికి నాయకత్వం వహించిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి కి భారతరత్న ఇవ్వాలని, శతజయంతి ఉత్సవాలు చేయాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ వాళ్లు అధికారంలో ఉంటే వీటిలో ఏవీ జరిగేవి కావు. వాణీదేవి పీవీ బిడ్డ కావడమనేది అదనపు అర్హత. ఆమె ఆర్టిస్టు, లెక్చరర్‌. విద్యావేత్త. విద్యాసంస్థలను నిర్వహించిన వ్యక్తి. ఎమ్మెల్సీగా మన గొంతును వినిపించే వ్యక్తి. ప్రతిలాయర్‌ మరో ఐదుగురితో ఓటు వేయించాలి. మన ప్రభుత్వంపై ఉద్యోగులు విముఖం గా ఉన్నారని, నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని లేనిపోని ప్రచారంచేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 30 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాం. పోలీసుశాఖలో 32 వేలు, జెన్‌కో, పంచాయతీరాజ్‌లో అన్నీకలిపి 1.33 లక్షల ఉద్యోగాల భర్తీ చేశాం. ఇంకా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలున్నాయి. అవి కూడా మాకు తెలుసు. వాటినీ భర్తీచేస్తాం. మన ప్రత్యర్థులు కూడా ఏం చేశారో ఓటర్లకు చెప్పాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేండ్ల కాలంలో ఉమ్మడి ఏపీలో 24,048ఉద్యోగాలు మాత్రమే భర్తీచేసింది.

ఇందులో తెలంగాణకు వచ్చినవి 10 వేలు మాత్రమే. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 14,919 పరిశ్రమలకు అనుమతులిచ్చాం. 11వేల పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపుగా 14.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించగలిగాం. ఉద్యోగులకు అత్యధిక పీఆర్‌సీ ఇచ్చింది సీఎం కేసీఆరే. కొత్త పీఆర్‌సీ ఇవాల్సి ఉన్నది. ఎన్నికల తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వదంతులు వ్యాపింపచేయడంలో, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించడంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులు. న్యాయవాదులు ఆరు ఉమ్మడి జిల్లాల్లో పార్టీ తరుఫున ప్రచారంచేయాలని విజ్ఞప్తి చేసున్నాను.

రాంచందర్‌రావు ప్రశ్నించేవాడే అయితే..
రాష్ట్ర ప్రభుత్వంచేత న్యాయవాదుల సంక్షేమానికి వందకోట్ల నిధి పెట్టించింది తానేనని బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు అంటున్నరు. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలె. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఈ ఏడేండ్లల్లో న్యాయవాదులకు మోదీ చేసిన ఒక్క మంచి పని చెప్పు? ఇక్కడ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమున్నా వంద కోట్ల నిధిని పెట్టించే సత్తా ఉన్నప్పుడు.. నీ కేంద్రంతో మాట్లాడి.. మోదీతో మాట్లాడి న్యాయవాదులకు పదివేల కోట్లతో సంక్షేమనిధి పెట్టించు. ధైర్యం ఉంటే ఆ పనిచేయాలి? ఏమన్నా అంటే ప్రశ్నించే గొంతు అంటున్నడు. నిజంగా నీది ప్రశ్నించే గొంతైతే, విభజన చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌, మిషన్‌భగీరథ, మిషన్‌ కాకతీయకు నీతి ఆయోగ్‌చెప్పినా నిధులు ఇవ్వకపోతే నీ గొంతు ఎందుకు పెకలదు? జీడీపీ (గ్యాస్‌..పెట్రోల్‌..డీజీల్‌) పెరుగుతుంటే..గ్యాస్‌ సిలిండర్‌ ధర రెట్టింపు అయితే నీ గొంతు ఎందుకు ప్రశ్నించదు?

కేసీఆర్‌ నేతృత్వంలోనే లాయర్లకు గుర్తింపు
-రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే లాయర్లకు గుర్తింపు వచ్చిందని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆనేక పోరాటాల్లో ముందున్న లాయర్ల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్నారు. తెలంగాణతోపాటు దేశంలో అతికొద్ది రాష్ర్టాల్లోనే కమర్షియల్‌ కోర్టులున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ బుద్ధిజీవులుగా అన్ని విషయాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత న్యాయవాదులకు ఉన్నదని చెప్పారు. దేశ ఆర్థిక సర్వే వివరాల ప్రకారం తెలంగాణ అనేక రంగాల్లో ముందున్నదని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ న్యాయవాది గండ్ర మోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌గుప్తా, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, జీవన్‌రెడ్డి, ఉమ్మడి ఏపీ బార్‌ కౌన్సిల్‌ మాజీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన బార్‌ అధ్యక్ష కార్యదర్శులు, న్యాయవాదులు జయకర్‌, మధుసూదన్‌రావు, కే రాజిరెడ్డి, టీ భాస్కర్‌రావు, విక్రమ్‌దేవ్‌, బెక్కం జనార్దన్‌, రాజేందర్‌, సదానందం, శుభప్రద పటేల్‌, లలితారెడ్డి తదితరులు మాట్లాడారు.

వాణీదేవిని గెలిపిస్తాం
ఉన్నత విద్యావంతురాలైన సురభి వాణీదేవి గెలుపు కోసం తాము ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ముందుకుసాగుతామని న్యాయవాదులు ప్రకటించారు. ఆమె అభ్యర్థిత్వం ఖరారు కాగానే ఎన్నికల వాతావరణం మారిపోయిందన్నారు. నిష్కళంక వ్యక్తిత్వమున్న వాణీదేవిని టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌కు న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.
-మంత్రి కేటీఆర్‌కు భాషా పండిట్ల కృతజ్ఞతలు

స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పదోన్నతులన్నీ భాషాపండితులకే దక్కేలా జీవోలను సవరించడం పట్ల రాష్ట్రీయ పండిత పరిషత్తు (ఆర్‌యూపీపీ) నేతలు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రిని కలిసిన నేతలు.. సర్వీస్‌ రూల్స్‌ జీవో -11, 12ను సవరించి, కొత్తగా జీవో నంబర్‌ -2, 3ను జారీచేయడం పట్ల మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో ఆర్‌యూపీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్‌, నర్సింహులు, గిరిజారమణ, గోపాల్‌ తదితరులు ఉన్నారు.

కేసీఆర్‌తోనే లాయర్లకు గుర్తింపు
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే లాయర్లకు గుర్తింపు వచ్చింది. ఆనేక పోరాటాల్లో ముందున్న లాయర్ల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.
-ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.