సమైక్య పాలనలో తెలంగాణలో కుట్రపూరితంగా చెరువుల విధ్వంసం జరిగింది. ఆ చెరువులను కాపాడాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టాం అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఆదివారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో చెరువుల పునరుద్ధరణపై ఏర్పాటు చేసిన జెడ్పీ ప్రత్యేక జనరల్ బాడీ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

-మిషన్ కాకతీయతో 46వేల చెరువుల పునరుద్ధరణ -సాగర్ ఆయకట్టు రెండోపంటకు నీరు -భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు -రాష్ట్రమొచ్చినా ప్రాజెక్టులపై కుట్ర ఆగట్లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఐదేండ్లలో రూ.27వేల కోట్లతో 46 వేల చెరువులను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ఆయా చెరువుల్లో 265 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవడంతో 26లక్షల ఎకరాలకు సాగునీరందించే అవకాశముందన్నారు. ఈ పథకం పూర్తిస్థాయిలో విజయవంతం చేస్తే రాష్ట్రంలో మరో నాగార్జునసాగర్ నిర్మించుకున్నంత బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లవుతుందన్నారు.
నల్లగొండ జిల్లావ్యాప్తంగా 4,762 చెరువులు ఉండగా వాటిలో మొదటి దశలో 952 చెరువులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. వచ్చే ఏడాది మే నెలలోపు పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. తొలిరోజు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిదులతో మమేకమై ఊరంతా మంగళవాయిద్యాలు, బతుకమ్మలు, హారతులతో చెరువు వద్దకు వెళ్లి అందరూ శ్రమదానం చేయాలని సూచించారు.
వ్యవసాయాధికారులు అన్ని చెరువుల్లో మట్టిని రైతుల పొలాలకు తరలించే ప్రయత్నం చేయాలన్నారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు మండల స్థాయిలో సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు మిషన్ కాకతీయపై అవగాహన కల్పించాలని, వాళ్లు గ్రామస్థాయిలో అందరికీ అవగాహన కల్పించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే లా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్‌ఆర్‌ఐలు ముందుకు వచ్చి సొంత ఖర్చులతో చెరువులను పునరుద్ధరిస్తే ఆ చెరువుకు వారు సూచించిన పేరు పెడతామని ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆదిలాబాద్‌లో చెరువుల కట్టలు తెగి విధ్వంసం జరిగిందని, మరమ్మతులు చేయాలని ఇక్కడి ప్రజలు కోరగా మీ చెరువులకు మరమ్మతులు చేస్తే మాకెలా నీళ్లొస్తాయి అని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ఆ విధంగా సీమాంధ్రులు కుట్రలు పన్నినందునే ఇన్నాళ్లూ నీటి విషయంలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద రెండో పంటకు 45 టీఎంసీల నీరు అందిస్తామని ప్రకటించారు. అయితే ఆరుతడి పంటలకు మాత్రమే ఆన్ అండ్‌ఆఫ్ సిస్టమ్‌లో నీరు విడుదల చేస్తామని తెలిపారు. లిఫ్టులను మరమ్మతులు చేయాల్సి ఉన్నందున వాటి కింద మాత్రం నీళ్లు ఇవ్వడం లేదన్నారు. ఈ సందర్భంగా అందరు డీఈలతో ఎస్టిమేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం కుట్రలు పన్నడం ఆపడం లేదని దుయ్యబట్టారు. పాలమూరు-రంగారెడ్డి, జూరాల-పాకాల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం సర్వే కోసం నిధులు కేటాయిస్తే ఆ ప్రాజెక్టులను ఆపాలని కుట్రలు పన్ని అటు కేం ద్రం, ఇటు కృష్ణాబోర్డు వద్ద పేచీలు పెడుతున్నారని విమర్శించారు.