-జవాబుదారీతనం కోసమే పురపాలకచట్టం -పట్టణీకరణకు అనుగుణంగా మౌలికవసతులు -ఘనవ్యర్థాల నిర్వహణకు పెద్దపీట -అసెంబ్లీలో నూతన పురపాలక బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్ -కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ట్రైలర్ చూసింది.. త్వరలో సినిమా చూపిస్తామని వ్యాఖ్య

పరిపాలనలో వినూత్న సంస్కరణలకు శ్రీకారంచుట్టి.. అధికార వికేంద్రీకరణలో ప్రజల్ని భాగస్వాములను చేయడం ద్వారా ఒక క్రమపద్ధతిలో ప్రణాళికాబద్ధంగా పట్టణాలను అభివృద్ధిచేసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం నూతన పురపాలక బిల్లును సభ ఆమోదం కోసం మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల డిమాండ్‌మేరకు కొత్తగా 68 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు, పలు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటుచేశామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. వేగంగా పట్టణీకరణ జరగటం పురోగతికి నిదర్శనమని పెద్దలు చెప్తారని.. పట్టణాల్లో జనాభా ఎక్కువగా నివసించినప్పుడే అవి ఆర్థికకేంద్రాలుగా విలసిల్లే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
తెలంగాణలో పట్టణ జనాభా 42.6% కాగా.. ఐదేండ్లలో ఇది యాభైశాతానికి చేరుకొనే ఆస్కారమున్నదన్నారు. పట్టణీకరణలో దేశంలోనే తెలంగాణ ఐదోస్థానంలో ఉన్నదని వివరించారు. సరికొత్త విధానాలు.. సంస్కరణలను తీసుకురావడం ద్వారా పట్టణ ప్రజలకు సేవచేయగలుగుతున్నామని తెలిపారు. కొన్ని గ్రామాలు, మండల కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసుకొని కొత్తగా 68 మున్సిపాలిటీలు చేసుకొన్నామని.. వీటికి అనుగుణంగా మౌలిక వసతుల్ని కల్పించేందుకు కృషిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ సభకు వెల్లడించారు. ప్రణాళికాబద్ధంగా పురోగతి ఉండాలి. దాని ప్రకారమే ప్రభుత్వపరంగా ప్రణాళికలు రూపొందించాం. అందులో భాగంగానే కొత్త మున్సిపాలిటీ చట్టం తెస్తున్నాం. కొత్త మున్సిపాలిటీ చట్టంలో పారదర్శకతతోపాటు జవాబుదారీతనం ఉన్నది. అని మంత్రి కేటీఆర్ వివరించారు. పురపాలకచట్టంపై చర్చ సందర్భంగా చట్టం గురించి ప్రత్యేకంగా వివరిస్తానని తెలిపారు. కొత్త చట్టం ప్రకారం ఓటేసిన ప్రజల పట్ల చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, కౌన్సిలర్లలో జవాబుదారీతనం పెరుగుతుందని, పాలక మండళ్లు పారదర్శకంగా సేవలందిస్తాయని చెప్పారు. టీఎస్‌ఐపాస్ మాదిరిగానే భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో సత్వరమే అనుమతుల్ని ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల వివరాలను మంత్రి కేటీఆర్ సభకు వివరించారు.
3.43 లక్షల ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు 68 మున్సిపాలిటీల్లో 3.43 లక్షల ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుతో రూ. 35 కోట్లు ఆదా అయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సత్వర అనుమ తుల మంజూరుకు డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అమల్లోకితెచ్చామని, టీయూఎఫ్‌ఐడీసీ పేరిట పట్టణాల్లో మౌలిక వసతుల్ని కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలు వంద శాతం ఓడీఎఫ్ స్థాయిని అందుకున్నాయని చెప్పారు. అన్ని మున్సిపాలిటీల్లో హరితహారం చేపడుతున్నామని.. కొత్త చట్టంలోనూ గ్రీన్ బడ్జెట్‌కు రూపకల్పన చేశామని తెలిపారు.
జోరుగా మంచినీటి సరఫరా పేదలకు సేవలందించడానికి పౌరసేవా కేంద్రాలు ఏర్పాటుచేశామని.. నగరాలు, పట్టణాల్లో మంచినీటి సరఫరాను పెంపొందించుకున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటుచేశామని, వీటిద్వారా కొత్త లే అవుట్లు, ఇండ్లకు అనుమతుల్ని పారదర్శకంగా అందజేస్తామన్నారు.

బాండ్ల ద్వారా రూ.495 కోట్ల సమీకరణ సీఎం కేసీఆర్ ఆలోచన.. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో వినూత్నరీతిలో మున్సిపల్ బాండ్ల ద్వారా రహదారుల అభివృద్ధికి ఇప్పటికే రూ.495 కోట్లను సమీకరించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కేంద్రం అభినందించి ప్రోత్సాహకంగా రూ.39 కోట్లను విడుదలచేసిందన్నారు. ఎస్సార్డీపీలో భాగంగా రూ.వెయ్యి కోట్లను ఖర్చుచేశామని.. మరో రూ.2400 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. 339 ఎకరాల్లో విస్తరించిన జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌లో క్యాపింగ్ పనులు 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు. త్వరలో 48 మెగావాట్ల విద్యుత్తును చెత్తనుంచి ఉత్పత్తి చేయాలనే ఆలోచనలున్నాయని మంత్రి కేటీఆర్‌చెప్పారు. నిర్మాణ వ్యర్థాలను రీసైకిల్ చేయడానికి ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. నగర పేదలకు వైద్యమందించేందుకు 106 బస్తీ దవాఖానలను ఏర్పాటుచేశామన్న మంత్రి కేటీఆర్.. విషజ్వరాలు, డెంగీ వంటివి ప్రబలుతుండటంతో వీటి సంఖ్యను పెంచుతామని తెలిపారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటుచేశామని, దురాక్రమణల్ని నిరోధించేందుకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ప్రారంభించామని చెప్పారు. మై జీహెచ్‌ఎంసీ వంటి యాప్‌ల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
రహదారులకు రూ.2,189 కోట్లు 2018-19లో హైదరాబాద్ రోడ్ల మెరుగుదల కు చేసిన ఖర్చు రూ.1,542 కోట్లు ఉంటే.. ఈసారి రూ.2,819 కోట్లు ఖర్చు చేయనున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మూసీ సుందరీకరణలో భాగంగా 1800 ఎంఎల్డీ మురుగు ఉత్పత్తి అవుతుంటే, 700 ఎంఎల్డీ మాత్రమే శుద్ధి చేయగలుగుతున్నామని చెప్పారు. రూ.1900 కోట్లతో భాగ్యనగర శివార్లలో 56 రిజర్వాయర్లను ఏర్పాటు చేశామన్నారు. 195 మానవరహిత మినీ యంత్రాలను ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ వాటర్‌బోర్డు ఎండీని అభినందించారని గుర్తుచేశారు. మెట్రో రైలు సదుపాయాన్ని శంషాబాద్ వరకూ అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఇప్పటివరకూ ట్రైలరే.. త్వరలో సినిమా.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ట్రైలర్ మాత్రమే చూసింది.. అతి త్వరలో సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సభలో రాజకీయాలు మాట్లాడొద్దనుకొన్నానని.. కానీ, కాంగ్రెస్ నాయకులు కెలికి మరీ కయ్యం పెట్టుకుంటున్నారని విమర్శించారు. గత 60 ఏండ్లలో నల్లగొండ ప్రజలకు విషతుల్యమైన నీటిని తాగించి వారి జీవితాన్ని ఛిద్రం చేశారన్నారు. వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, నల్లగొండ ప్రజలు చూస్తున్నారు.. కూర్చోండని హితవు పలికారు. 60 ఏండ్ల పాటు పాలించిన పార్టీ, ఐదేండ్లు పాలించిన తమతో పోల్చడమెందుకుని విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. కాళేశ్వరం మీద ఎన్ని కేసులు వేసినా.. కుటిలయత్నాలు చేసినా.. 45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ వాసులకు తాగునీటి సమస్యను శాశ్వతంగా దూరంచేస్తామన్నారు. చన్నై మాదిరి నీటి సమస్యను హైదరాబాద్‌కు ఎదురుకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ శాశ్వత ప్రాతిపదికన చర్యల్ని చేపట్టారని వివరించారు.