-రూ.1,314 కోట్లతో 1,533 కొత్త పరిశ్రమలు -కాలుష్య నియంత్రణకు విజిలెన్స్ కమిటీ -భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో 1,533 కొత్త పరిశ్రమలు వచ్చినట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం మెదక్ జిల్లా పాశమైలారంలోని కిర్బీ, అరబిందో, టెక్స్‌టైల్ పార్కులను సందర్శించి పరిశ్రమల యాజమాన్యాలతో సమీక్షించారు. అనంతరం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో పరిశ్రమల యాజమాన్యాలు, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో రూ.1,314 కోట్లతో 1,533 కొత్త పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నట్లు చెప్పారు. ఈ పరిశ్రమల ఏర్పాటువల్ల 28 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. సమైక్య రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్ సమస్య ఉండేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశ్రమలకు కరెంట్ కోతలు లేకుండా అందిస్తున్నారన్నారు. పరిశ్రమల ఏర్పాటు ఎంత ముఖ్యమో కాలుష్యాన్ని నియంత్రించడం కూడా అంతే ముఖ్యమన్నారు.
స్వలాభం కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంటుందన్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వమే కామన్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పాశమైలారంలో 60 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా వాటిలో కేవలం 5 మాత్రమే కొనసాగడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములిచ్చినా పరిశ్రమలు ఏర్పాటు చేయకుంటే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంపై విజిలెన్స్ కమిటీని ఏర్పాటుచేసి కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు కొత్తగా వచ్చే పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా అక్టోబర్ 15వ తేదీ నుంచి స్కిల్ డెవలప్‌మెంట్‌లో వెయ్యి మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారన్నారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ రోనాల్డ్ రాస్‌లు పాల్గొన్నారు.