-భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాలు
-జిల్లాలో రూ. 30 కోట్లతో 659 ఎకరాల పంపిణీ
-సాగుకు యోగ్యమైన భూమినే అందించాం
-ఇచ్చిన భూమిని అమ్ముకుంటే నేరమవుతుంది
-లబ్ధిదారులకు భూమి పట్టాల పంపిణీ
-రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

సమైక్య రాష్ట్రంలో నిరు పేద దళితులకు రాళ్లు.. రప్పలున్న భూములను పంచారు. ఆ భూములను చూసుకమురుసుడే అయింది తప్పా.. పంటలు పండించింది లేదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలైన దళితులు కూలీలుగా ఉండొద్దని.. వారంతా రైతులుగా ఉండాలనే సంకల్పంతో భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. భూమి ఇచ్చిన మొదటి ఏడాది సాగుకు పెట్టుబడులను ఇస్తున్న ఘనత కూడా రాష్ట్ర సర్కారుదేనని, జిల్లాలో ఇప్పటి వరకు 659 ఎకరాలను 279 దళిత కుటుం బాలకు అందించగా, సుమారుగా రూ. 30 కోట్లు వెచ్చించి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
శుక్రవారం సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట మండలం ఇమాంబాద్, నంగునూరు మండలం రాంపూర్, పాలమాకుల గ్రామాలకు చెందిన భూమిలేని దళితులకు భూ పట్టాలను పంపిణీ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని మూడు మండలాలతో పాటు మున్సిపాలిటీలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. చిన్నకోడూరు మండలంలో జమీన్‌బందీ కింద రైతులకు పట్టాలను అందజేశారు. అనంతరం ఆయా మండలాల్లో జరిగిన సమావేశాల్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దళితులకు సాగుకు యోగ్యమైన భూమిని ఇచ్చి వారిని అన్ని విధాలా ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఒక్కో ఎకరాకు సుమారుగా రూ. 13.50 లక్షల వరకు ఖర్చు చేసి భూములను ఇస్తున్నట్లు , వీరికి ఇచ్చేటువంటి భూమిని పూర్తిగా చదును చేసి, బోరు మోటారు బిగించి పంపిణీ చేస్తున్నట్లు మం త్రి స్పష్టం చేశారు. సిద్దిపేట మండలం ఇమాంబాద్‌కి చెందిన 13 మంది దళిత కుటుంబాలకు 29.09 ఎకరాల భూమిని, కోటి 42 లక్షల 48 వేల 500లు, నంగునూరు మండలంలో రాంపూర్, పాల మాకుల గ్రామాలకు చెందిన 32 మందికి 71 ఎకరాల 8 గుంటల భూమిని రూ. 3 కోట్ల 56 లక్షలు వెచ్చించి పంపిణీ చేశామని మంత్రి వివరించారు.
నిరుపేద కూలీలు ఈ భూమిని సద్వినియోగం చేసుకుని మంచి పంటలను పండించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. వీరందరికీ కూడా భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే కాకుండా కాగి తం, పహాణీలు తదితర వాటన్నింటినీ కూడా ఇవాళ దళిత కుటుంబాలకు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ భూమిలో డ్రిప్, స్పింక్లర్లు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందన్నారు. చిన్నకోడూరు మండలంలో జమీన్‌బందీ కింద 606 దరఖాస్తులు రాగా 509 పరిష్కార మయ్యాయని, 97 దరఖాస్తులు వివిధ కారణాల రీత్యా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
హరితహారం కింద గ్రామానికి 40 వేల మొక్కలు
హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రతి గ్రామానికి వివిధ రకాల మొక్కలను సుమారు 40 వేల వరకు పంపిణీ చేస్తామని మంత్రి వివరించారు. ప్రతి ఇంటా పెంచడంతో పాటు రోడ్ల వెంట కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఆ కుటుంబ యజమానులదే అన్నారు. ఇప్పటికే మండల స్థాయి అధికారుల బృందం గ్రామాల వారీగా ఇంటింటికీ వెళ్లి ఏ ఇంటికి ఎన్ని మొక్కలు ఏ రకమైనవి కావా లో సర్వే చేస్తున్నారన్నారన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి వెంట జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి, ఎంపీపీలు జాప శ్రీకాంత్‌రెడ్డి, ఎర్ర యాదయ్య, కూర మాణిక్యరెడ్డి, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, జడ్పీటీసీలు నముండ్ల కమల రామచంద్రం, గ్యార వజ్రవ్వ, తహసీల్దార్లు ఎన్‌వై గిరి, పరమేశం, వెంకటేశ్వర్లు, ఎంపీడీవోలు భిక్షపతి, ప్రభాకర్, సమ్మిరెడ్డి ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.