-ఎండ తీవ్రత, ఎన్నికల కోడ్ దృష్ట్యా నాలుగు వేల మంది ప్రతినిధులకే అవకాశం -పార్టీ శ్రేణులు సహృదయంతో సహకరించాలి -రెండేళ్ల అభివృద్ధి-సంక్షేమంపై ప్లీనరీలో లోతైన చర్చ -ప్రతినిధులు 26 సాయంత్రమే ఖమ్మం చేరుకోవాలి -రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్

టీఆర్‌ఎస్ 15 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఈనెల 27న జరగనున్న పార్టీ ప్లీనరీ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ ప్లీనరీలో గత రెండేండ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై లోతైన, సుదీర్ఘ చర్చ ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజల వద్దకు చేర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చిస్తామని చెప్పారు. తెలంగాణభవన్‌లో ఆదివారం ఉదయం ఎంపీ బాల్క సుమన్, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ప్లీనరీ 27వ తేదీన ఉదయం 10 గంటలకు మొదలవుతుందని, సాయంత్రం బహిరంగ సభ ఉంటుందని ఆయన వివరించారు. పాల్గొనే ప్రతినిధులంతా 26వ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకే ఖమ్మంకు చేరుకోవాలని, సంబంధిత మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుల సారథ్యంలో ఉండాలని కోరారు. ఈ దఫా ప్లీనరీకి నాలుగు వేల మంది సుశిక్షితులైన ప్రతినిధులను మాత్రమే అహ్వానిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎండల తీవ్రత, ఖమ్మంలో ఎన్నికల కోడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఆహ్వానం అందినవారు గొప్ప, రాని వారు తక్కువ అనే భావన పెట్టుకోవద్దని కోరారు.
ఎన్నికల కోడ్ ఉన్నందున వసతుల కల్పన కష్టమని, ప్రభుత్వ స్థలాన్ని కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఉందని, కార్యకర్తలు, నాయకులంతా అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మండల పార్టీ అధ్యక్షుల వంటి వారినే ఆహ్వానించామని, ఈ మేరకు వారికి ఫొటోలతో సహా గుర్తింపు కార్డులు పంపిణీ చేశామని చెప్పారు. ప్లీనరీ తర్వాత జిల్లాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
దేశంలోనే నంబర్‌వన్ పార్టీగా … టీఆర్‌ఎస్‌ను దేశంలో నంబర్‌వన్ పార్టీగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని ఈటల తెలిపారు. పార్టీ విధానాలను, ప్రభుత్వ పథకాలను రూపొందించటంలో కేసీఆర్‌కు విశేష అనుభవం ఉందన్నారు. ఉద్యమ సమయంలో అకుంఠిత దీక్షతో కలిసి వచ్చిన కార్యకర్తలు, నేతలను ఇప్పుడు ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు రాజకీయ శిక్షణ తరగతుల్ని మున్ముందు నిర్వహించబోతున్నామన్నారు. పాలనాపరమైన అంశాలపై పూర్తి పట్టు వచ్చినందున ఇపుడు పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నామని అన్నారు. పార్టీ మ్యానిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి 90 శాతం హామీలను అమలు చేయటంతో పాటు మ్యానిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా అమలు చేస్తున్న పార్టీ దేశంలో టీఆర్‌ఎస్ ఒక్కటేనని ఆయన తెలిపారు.
టీఆర్‌ఎస్ అంటే… తిరుగులేని రాజకీయ శక్తి తెలంగాణలో టీఆర్‌ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని ఎంపీ బాల్క సుమన్ అభివర్ణించారు. పాలనలో దేశంలోనే ఇతర రాష్ర్టాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని, పార్టీగా కూడా ఆదర్శంగా నిలుస్తుందన్నారు.