Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కేంద్రంలో గుణాత్మకమార్పు కోసమే పొలికేక

-కేంద్రంలో గుణాత్మకమార్పు కోసమే పొలికేక
-చౌకీదార్లు, టేకేదార్లు వద్దు.. జిమ్మేదార్లు, ఇమాందార్లు కావాలే
-జైకిసాన్ నినాదాన్ని విధానంగా మార్చిన కేసీఆర్
-సంక్షేమ పథకాలను దేశానికి పరిచయం చేసిన తెలంగాణ
-ఢిల్లీలో కొట్లాడే దమ్మున్నోళ్లు గులాబీ సైనికులే
-ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయండి
-గంభీరావుపేట బహిరంగసభలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-చేవెళ్ల, పరిగిలో కేటీఆర్ రోడ్‌షోలు

దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పొలికేక పెడుతున్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటువేస్తే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. దేశంలో కావాల్సింది చౌకీదార్లు, టేకేదార్లు కాదని.. జిమ్మేదార్లు, ఇమాందార్లు అని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దేశానికి సంక్షేమ పథకాలను పరిచయం చేస్తే వాటిని కేంద్రంలో బీజేపీ, ఆంధ్రాలో చంద్రబాబు కాపీకొట్టి అమలుచేస్తున్నారని విమర్శించారు. గరీబీహఠావో అంటూ నలభై ఏండ్లనాటి నానమ్మ నినాదాన్ని నేడు రాహుల్‌గాంధీ మళ్లీ చెప్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవాచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వకపోవడంతో రాష్ట్రప్రభుత్వమే వ్యయం భరించాల్సి వస్తున్నది. 16 ఎంపీ సీట్లు గెలిచి సత్తాచాటితే జాతీయహోదా సాధించడంతోపాటు కేంద్రం నుంచి 90శాతం నిధులు పొందవచ్చన్నారు. కేంద్రం తో కొట్లాడి నిధులు తెచ్చుకునే దమ్మూ, ధైర్యం గులాబీ సైనికులకే ఉన్నదన్నారు. ఆగంకావద్దని, ఆలోచించి కారు గుర్తుకే ఓటేసి 16 సీట్లు గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా జరిగిన బహిరంగసభలో కేటీఆర్ ప్రసంగించారు.

జైకిసాన్ నినాదాన్ని విధానంగా మార్చినం
దేశంలో ప్రధానమైన వ్యవసాయరంగాన్ని ఇప్పటివరకు ప్రభుత్వాలన్నీ నిర్లక్ష్యం చేశాయని.. జై కిసాన్ అంటూ నినాదాలకే జాతీయపార్టీలు పరిమితమయ్యాయని కేటీఆర్ మండిపడ్డారు. రైతుబిడ్డ కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక మొట్టమొదటగా రైతులకు రుణమాఫీచేశారని గుర్తుచేశారు. మరోసారి రూ.24 వేల కోట్లు రుణమాఫీ చేయబోతున్నారని వెల్లడించారు. ఎద్దేడిసిన యవుసం.. రైతేడిసిన రాజ్యం బాగుండదు అనే ఉద్దేశంతో జైకిసాన్ నినాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని వివరించారు. ఎకరాకు రూ.8 వేల పెట్టుబడిసాయం అందజేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. దానిని రూ.10 వేలకు పెంచిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని నకలుకొట్టి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నదంటే.. కేసీఆర్‌కు ప్రజలపై ఉన్న ఆలోచన, చిత్తశుద్ధి తెలుస్తున్నదని అన్నారు. ఇలాంటి దమ్మున్న ముఖ్యమంత్రికి 16 సీట్లు గెలిపించి చేతిలో పెడితే దేశంలో కీలకపాత్ర పోషించి తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలకు కార్పొరేట్‌స్థాయిలో ప్రభుత్వం వైద్య సేవలందిస్తున్నదని కేటీఆర్ చెప్పారు. పేదింటి ఆడపడుచు వివాహానికి మేనమామ కట్నంగా కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి రూ.లక్షానూటా పదహారు ఇస్తున్నారని తెలిపారు. ఆసరా పింఛన్లు 65 సంవత్సరాల నుంచి 57 ఏండ్లకే కుదించడంతో అదనంగా మరో 8 లక్షలమందికి రానున్నాయని, పెంచిన పింఛన్ డబ్బులు మే నుంచి ఇవ్వనున్నట్టు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందంటూ కేటీఆర్ ఉర్దూలో ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా 120 మైనార్టీ గురుకులాలు ఏర్పాటుచేసినట్టు చెప్పారు.

మీ ఆకాంక్ష నెరవేరుస్తా..
సాగునీరు లేక బీళ్లుగా మారిన భూములకు ఆరునెలల్లో గోదావరి జలాలు అందిస్తానని కేటీఆర్ ఉద్ఘాటించారు. మధ్యమానేరు నీటితో మల్కపేట రిజర్వాయర్ నింపి, అక్కడినుంచి సింగసముద్రం, దమ్మన్నపేట చెరువు నుంచి ఎగువ మానేరుకు ఎత్తిపోతల ద్వారా నీరు వ స్తుందన్నారు. మెట్టప్రాంత రైతుల ఆకాంక్షను నెరవేరుస్తానని హామీఇచ్చారు. ఆదాయాన్ని పెంచాలె.. పేదలకు పంచాలె అనే నినాదంతో ముందుకువెళుతున్నామన్నారు. వినోద్‌కుమార్‌ను భారీమెజార్టీతో గెలిపించాలని కోరారు.

బీజేపీకి చెప్పుకోదగ్గ పథకాలేవి? : ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్
కేంద్రంలో ఐదేండ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ చెప్పుకోదగ్గ పథకాలేవీ ప్రవేశపెట్టలేదని.. నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. తెలంగాణ లో మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు.. ఇలా చెప్పుకొంటూపోతే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు వందల సంఖ్యలో ఉన్నాయని చెప్పారు. జాతీయపార్టీలుగా చెప్పుకొనే కాంగ్రెస్, బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటువేసే పరిస్థితి లేదని.. ఆ పార్టీలకు వందసీట్లు కూడా రావన్నారు. సమావేశంలో ఎ మ్మెల్సీ భానుప్రసాదరావు, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి బస్వవరాజు సారయ్య, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.